ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు? | Trivikram Srinivas birthday today | Sakshi
Sakshi News home page

ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు?

Published Fri, Nov 6 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు?

ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు?

ఇవాళ త్రివిక్రమ్ పుట్టినరోజు
 
‘అతడు’ - తెలుగు సినిమా రచయితల విలువను కోటి రూపాయలకు చేర్చిన మాటల మాంత్రికుడు. ‘ఖలేజా’ ఉన్న దర్శకుడు.
 ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లా విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి. మా చెల్లి మల్లీశ్వరి - నువ్వు నాకు నచ్చావ్! నువ్వే కావాలి! మన్మథుడా అంటే... అత్తారింటికి దారేది అని మర్యాదగా పెళ్ళి చేసుకున్న మంచివాడు. (మా చెల్లి సీతారామశాస్త్రి గారి తమ్ముడు శ్రీరామ్ గారి కూతురు చిన్నూ... త్రివిక్రమ్ భార్య).

1997 -98 మధ్యకాలంలో నేను దర్శకుడు జయంత్ సి. పారాన్జీ గారి దగ్గర అసోసియేట్‌గా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ‘బావగారూ బావున్నారా’ సినిమాలో అర్జంట్‌గా ఒక సీను మార్చి రాయాల్సి వచ్చింది. తెల్లారితే షూటింగు. ముందు రోజు గురువులు పరుచూరి బ్రదర్స్ ఇద్దరూ అందుబాటులో లేరు. చివరికి వాళ్ళ శిష్యుడైన పోసాని కృష్ణమురళితో రాయించమని నన్ను ఆదేశించారు. పోసాని గారింటికి వెళ్ళి, మొత్తం కథంతా రెండు గంటలు చెప్పాను. ఆయన విని, రేపు పొద్దున్న ఆరింటికి వచ్చి పట్టుకెళ్ళిపొమ్మన్నారు. ‘సరే’ అని వచ్చేశాను. పొద్దున్న వెళితే, నన్ను ‘వెయిట్ చేయ’మన్నారు. ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్న ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ కోసం! ఓ అరగంట తరువాత వచ్చారు - చేతిలో ముప్ఫై పేజీల స్క్రిప్టుతో.

 ‘ఒక్క సీను రాయమంటే, సగం సినిమా రాశారేమిటి మాస్టారూ? ‘ఏమో! పోసాని గారు రాత్రికి రాత్రి అర్జంటుగా కావాలని కథ చెప్పారు. కథలో నేను ఎక్కడి నుంచి మార్పులు చేయాలనుకున్నానో, అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా రాసేశాను’ అన్నారు. అప్పటి వరకూ నాకు తెలిసి అలా రాయగలిగింది - పరుచూరి గోపాలకృష్ణ గారొకరే! చివరికి, మొత్తం చదివి, అందులో నుంచి పనికొచ్చేవి జయంత్ గారికి చెప్పాను. ఒక పెద్ద ప్రొడ్యూసర్ - త్రివిక్రమ్‌ని పరిచయ్ చేయమని అడిగితే, పంజగుట్టలోని ఆయన రూమ్‌కి తీసుకెళ్ళాను. బ్లాంక్ చెక్ ఆయన చేతిలో పెట్టారు - సినిమా రాయమని. అది 2001లో! ఈ రోజు వరకు త్రివిక్రమ్ ఆ చెక్ వాడలేదు... వాళ్ళకి సినిమా చేయలేదు. కానీ... ఫ్రెండ్లీగా దర్శకుడు దశరథ్‌కి ‘సంతోషం’లో ఒక సీన్, దర్శకుడు షిండే గారికి ‘నిన్నే ప్రేమిస్తా’ - మొత్తం సినిమా రాసి పెట్టారు తక్కువ పారితోషికానికే! అప్పట్లో సునీల్‌నీ, త్రివిక్రమ్‌నీ - ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూడలేకపోయేవాళ్ళం. ఈ రోజుకీ తన పంజగుట్ట గదిని అలాగే ఉంచుకున్న త్రివిక్రమ్ లాంటి నిరాడంబరుణ్ణి తెలుగు సినీ పరిశ్రమలో ఇంకొకరిని నేను చూడలేదు.

ఈయన బయట పరిచయం ఉన్నవాళ్ళతో బోల్డన్ని కబుర్లు చెబుతారు. జోకులు పేలుస్తారు. తన సినిమాల్లో హీరోల్లాగే సెటైర్లేస్తారు. ఎడ్యుకేట్ చేస్తారు. మైకు ముందు మాత్రం పెద్దగా మాట్లా డరు. ఎప్పుడైనా మాట్లాడితే - ఆ మధ్య ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి గురించి మాట్లాడినట్టు విస్ఫోటనం చెందుతారు.  ‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి’ లాంటి పాత తరం భావజాలాలేవీ లేని ఆధునిక యువకుడు. ఏ ఎత్తులో ఉంటే, ఆ ఎత్తులో నుంచి ప్రపంచాన్ని తనదైన శైలిలో చూసే పర్వతారోహకుడు.

2001 - 02 మధ్య కాలంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారింట్లో త్రివిక్రమ్‌కీ, శాస్త్రి గారి తమ్ముడి కూతురికీ నిశ్చితార్థం. ఈయన పీటల మీద కూర్చొని ఉన్నారు. పెళ్ళి కూతురింకా రాలేదు. నన్ను చూడగానే - పీటల మీద నుంచి లేచొచ్చి, ‘మీతో అర్జంట్‌గా మాట్లాడా’లని నన్ను కారులో అన్నపూర్ణా స్టూడియో రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టించి, నాకు క్లాసు పీకారు. అది కూడా తనకు సంబంధించిన విషయం కాదు. నా కోసం... నా కెరీర్ కోసం! ‘పోసాని గారి కథ చిరంజీవి గారు బావుందంటే, మీరు బాలేదన్నారట! మీకెందుకు? మెగాస్టార్ ఒప్పుకున్న కథను బాలేదని, మీకు వచ్చిన అంత మంచి డెరైక్షన్ అవకాశం పోగొట్టుకోకండి. ఒప్పుకొని ఎలా బాగుచేయాలో ఆలోచించండి.

చిరంజీవి గారితో సినిమా చేయాలని మనందరి డ్రీమ్ కదా! మీకు ఆ ఛాన్స్ ముందు వస్తే మీరెలా వదులుకుంటారు’ అని నాకు పదే పదే చెప్పారు. ‘మీరు రాస్తారా మాటలు. ఇప్పుడే వెళ్ళి ఒప్పేసుకుంటా’ అన్నాను. నన్ను మూర్ఖంగా ఆలోచించవద్దని చాలా చెప్పారు. ఆ టైమ్‌లో నాకు అలా చెప్పడం ఆయనకు అవసరం లేదు. అయినా హితబోధ చేశారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్క్ హయత్ హోటల్‌లో ఓ రెండు గంటలు గడిపాను. అదే త్రివిక్రమ్. మేము కూర్చున్న స్థలం మారింది కానీ, మనిషి మారలేదు! ఆతడి మమత తీరలేదు!!

భీమవరం నుంచి వైజాగెళ్లి ఆంధ్రా యూని వర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన యువ కుడు హైదరాబాదొచ్చి సినీ పరిశ్రమలో కాలూనుకోవడం కోసం నానాకష్టాలూ పడి ట్యూషన్లు చెప్పి, అసిస్టెంట్ రైటర్‌గా పోసాని గారి దగ్గర పనిచేసి, ‘స్వయంవరం’తో కొంత పేరు సంపాదించినా, వెంటనే మరో సినిమా రాసెయ్యకుండా గ్యాప్‌లో కృష్ణవంశీ గారి ‘సముద్రం’కి అసోసియేట్‌గా చేరి, డెరైక్షన్ నేర్చు కుంటూ ‘చిరునవ్వుతో’ కథ రాసి, అది రామ్‌ప్రసాద్ గారి దర్శకత్వంలో సూపర్‌హిట్టయ్యాక, ‘నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ వరకూ అప్రతిహతంగా హిట్లిచ్చిన రచయితగా ఎదగడం మామూలు విషయం కాదు.

లగడపాటి శ్రీధర్‌గారు నిర్మాతగా నా దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా ఓ కథ అనుకున్నాం. అదే - తర్వాత దర్శకుడిగా ఆయన మొదటి సినిమా - ‘నువ్వే నువ్వే’.  ఇద్దరికీ తలో పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. బయట కొచ్చాం. ఓ నెల ఇబ్బంది లేదనుకున్నాం. ‘మంచి చెప్పులు కొనుక్కుందాం మాస్టారూ!’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఏడెనిమిది వేల రేంజ్‌లో రెండు జతలు సెలక్ట్ చేశారు. ‘సార్! డబ్బులన్నీ అయిపోతే మళ్లీ వెతుక్కోవాలి. కష్టం కదా!’ అన్నా. ‘సంపాదిద్దాం సార్! ఇవే దాచుకుని నెలంతా ఉన్నా, తర్వాతి నెల కోసం ఆలోచించాలి కదా! రేపటి కోసం ఆలోచిద్దాం. ఇవ్వాళ ఖర్చు పెట్టేద్దాం! ముందు మనం మనకిష్టమైంది చేశామనుకోండి... మంచి థాట్స్ అవే వస్తాయి’ అన్నారాయన. నాకు జ్ఞానోదయం అయింది.

2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు - ఏవిఎస్ గారినీ, ఇంకొందరినీ కూర్చోపెట్టి ఎన్నికల్లో చెయ్యాల్సిన యాడ్స్ గురించి చర్చిస్తున్నారు. ‘రోజూ పార్టీ ఆఫీసుకు వందల ఉత్తరాలు వస్తున్నాయి - ఈ సారి యాడ్స్‌నీ, బ్రోచర్‌నీ, స్పీచెస్‌నీ త్రివిక్రమ్‌తో రాయించుకోమని! ఎవరయ్యా త్రివిక్రమ్?’ అని అడిగారు.

నిజమే! ఎవరయ్యా త్రివిక్రమ్? మొన్న ఎన్నికల్లో కూడా సాక్షాత్తూ పవన్‌కల్యాణ్  కూడా ‘జనసేన’ ప్రారంభోత్సవం స్పీచ్‌లో ‘నా వెనక త్రివిక్రమ్ హస్తం లేదు’ అని క్లారిఫై చెయ్యాల్సి వచ్చింది. ఇంతకీ... ఎవరయ్యా త్రివిక్రమ్? ఎవరిదైనా ప్రమేయం ఉంటే, వారి గురించి మాట్లాడుకుంటారు. అది సహజం. ప్రమేయం లేదని కూడా వారి గురించి మాట్లాడడం అసాధారణం. అదయ్యా త్రివిక్రమ్..!!
 అభిమానులు కోట్ల మంది ఉన్నా తన సినిమాల ద్వారా వారిని పలకరి స్తారే గానీ, సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పరు. ఆహ్వానాలు కొన్ని వందలున్నా ఆత్మీయులను కలుస్తారే గానీ ఏ ఫంక్షన్‌కీ అడుగుపెట్టరు. ఫోన్‌లో కూడా ఎవ్వరికీ అందరు - అంత ఈజీగా. కానీ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. ‘ఇంత ఒత్తిడిలో కూడా ఇంత కంట్రోల్డ్‌గా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావయ్యా మిత్రమా’ అని అడిగితే యోగా గురువులా ‘చిరునవ్వే’ సమాధానంగా చెప్తారు.

త్రివిక్రమ్ గురించి రాస్తానని గడచిన పుట్టినరోజుకే చెప్పాను ‘సాక్షి’ వారికి. ఆ అవకాశం ఈసారి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
 బాపు గారిని నేను ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ చేసినపుడు ఆయనకి ఈతరంలో అభిమాన దర్శకులు ఇద్దరే అని చెప్పారు- త్రివిక్రమ్, రాజమౌళి. జీవితంలో కొంతకాలం ఈ ఇద్దరితోనూ ప్రత్యేకంగా మంచి అనుబంధం కలిగినవాడిని. నేను కాకపోతే వీళ్ల గురించి నేను తప్ప అథెంటిక్‌గా ఎవరు రాస్తారు? అని నా అభిప్రాయం.

త్రివిక్రమ్ గురించి రాయాలన్న నా కోరికకి కారణం ఆయన్ని పొగడడం కాదు. నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడం! కెరీర్ మొదలైన రోజులు గుర్తు చేసుకొని, మళ్లీ రిజొనవేట్ అవ్వడం కోసం! పంజగుట్ట గదిలో మొదటి టీవీ కొన్నరోజుల నుంచి, ఆడియో సీడీలు విన్నరోజుల నుంచి- తిన్న బిర్యానీలు, చూసిన సినిమాలు, చర్చించుకున్న సినిమాలు, స్టార్లు, జీవిత విశేషాలు, గడిపిన తెల్లారగట్టలు, మధ్యరాత్రులు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు - సీతారామశాస్త్రి గారింట్లో పాటల కోసం వెయిటింగుల మధ్య నడిచిన సంభాషణలు, ఉద్బోధలు, ప్రవచనాలు, ఉత్ప్రేరకాలు - అన్నీ ఉప్పెనలా గుర్తుకొచ్చిన ఈ శుభవేళ... పుట్టినరోజు మీదైనా, మళ్లీ పుట్టినరోజు నాది కూడా మిత్రమా!

సభాముఖంగా శతాధిక శుభాభినందనలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి! తెలుగు సినిమాకు వన్నెతెచ్చిన మహాను భావుల ఎత్తుకు  మీరూ ఎదుగుతారు. మీరందుకే పుట్టారు. ఇది నిజం... ఇది తథ్యం. 

మీ
వి.ఎన్. ఆదిత్య, దర్శక, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement