Khaleja
-
జైలుకు వెళ్లడానికి కారణం ఇదే.. 14 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ప్రముఖ నిర్మాత
టాలీవుడ్లో కొమరంపులి, ఖలేజా వంటి బిగ్ చిత్రాలను నిర్మాత సింగనమల రమేష్‌బాబు తాజాగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఒక కేసు విషయంలో దాదాపు 70 రోజుల పాటు జైలులో కూడా ఆయన ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు ఎందుకొచ్చారు..? అనే విషయం గురించి ఆయన ఇలా చెప్పారు. ''నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది' అని నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు . ‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు.. మీపై కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా.భవిష్యత్‌లో సినిమాల్లో కొనసాగుతారా ? నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని.. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్‌గానూ చేస్తాను.మీ మీద కేసు పెట్టింది ఎవరు..? వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా..? నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు.అగ్ర హీరోల చిత్రాలను నిర్మించి నష్టపోయారా? అప్పట్లో సినిమాలు ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్ది నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా.అసలు మీపై పెట్టిన కేసు ఏమిటి..?రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం మోపారు. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి. మీ స్టొరీనే సినిమా కథలా వుంది.. సినిమా చేసే అవకాశం ఉందా ? వెబ్ సిరీస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్లు పెట్టొచ్చు. అయితే, నా కథ ఎవరు చూస్తారు(నవ్వుతూ)ఫైనాన్స్ బిజినెస్ ఎంత లాభదాయకం ? మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న గారి నుంచి అది నాకు వచ్చింది. ఐతే సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని బయట అంటున్నారు. ఈ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠం ? 24 క్రాఫ్ట్స్ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి.ఖలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు ఒక పార్టనర్ కావడానికి కారణం ? కాదండీ.., నా డబ్బుతో ఆయన సినిమా పూర్తి చేశారు. కష్టాల్లో వున్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్‌గా వున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ? కథనే నా హీరో. కథని నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్ద సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని వుంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వుండే అవకాశం వుంది. -
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలతో రూ.100 కోట్ల నష్టం: టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఏర్పాటు ప్రెస్మీట్లో మాట్లాడిన నిర్మాత మహేశ్ బాబు ఖలేజా, పవన్ కల్యాణ్ కొమరం పులి చిత్రాల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలతో వచ్చిన నష్టం గురించి ఆయన వెల్లడించారు.కొమరం పులి, ఖలేజా లాంటి చిత్రాలతో భారీగా నష్టపోయినట్లు సింగనమల రమేశ్ వెల్లడించారు. ఆ రోజుల్లో కేవలం ఏ సినిమా అయినా ఏడాదిలోపే పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించడంలో ఎక్కువ టైమ్ తీసుకొవాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఆలస్యమవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని రమేశ్ అన్నారు. ఈ రెండు సినిమాలతో నష్టపోయినా నాకు.. ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి అయ్యో పాపం అని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో జనవరి 31 2025న రమేష్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. అందువల్లే ఆయన తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. కొమరం పులి, ఖలేజా సినిమాల పైన 100 కోట్లు నష్టపోయాను.హీరోలు కనీసం 'అయ్యో పాపం' అని కూడా అనలేదు- Singanamala Ramesh (Producer and Film Financier) pic.twitter.com/6KQtgFCaBZ— idlebrain.com (@idlebraindotcom) February 5, 2025 -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్‌కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్‌గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
డేవిడ్ వార్నర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయ సినిమాలపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వార్నర్ ఇప్పటికే చాలా సినిమాల్లోని డైలాగులు, పాటలు, డ్యాన్స్‌లను అనుకరించాడు. అయితే ఈ మధ్యన ఇలాంటి వాటికి కాస్త గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా మళ్లీ మెరిశాడు. ఖలేజా సినిమాలోని మహేష్ బాబు గెటప్‌తో కనిపించిన వార్నర్.. అభిమానులకు ఒక పజిల్ విసిరాడు.''నేను ఏ హీరో గెటప్‌లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం'' అని క్యాప్షన్ జత చేశాడు. ఇక తెలుగు సినిమా అభిమానులైతే వార్నర్ ఏ గెటప్‌లో ఉన్నాడో వెంటనే చెప్పేస్తారు కానీ మిగతా వాళ్లకు కొంచెం కష్టమే. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అభిమానులు మాత్రం వార్నర్ వీడియోపై వినూత్న కామెంట్స్ చేశారు.''చాలా గ్యాప్ వచ్చింది.. ఇంతకాలం ఏమైపోయావు.. వార్నర్ భయ్యా''.. ''ఎన్నాళ్లకెన్నాళ్లకు డేవిడ్ వార్నర్''.. ఒక అభిమాని మాత్రం .. ''నేను మహేశ్ బాబు ఫ్యాన్‌ను.. ఇప్పుడు చూస్తున్నది వార్నర్ బాబు''ను అంటూ పేర్కొన్నారు. ఇక టీమిండియాతో టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న ఇరుజట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు ముందు టీమిండియా, ఆస్ట్రేలియాలకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) చదవండి: అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? రొనాల్డో చేసిన పనికి యువతి మొహం మాడిపోయింది! -
ఖైదీ, అనగనగా ఒకరోజు, ఓయ్-గమ్యం..
కథలను హీరో చెప్తాడు. హీరోయిన్ చెప్తుంది. కేరెక్టర్ ఆర్టిస్ట్ చెప్తాడు. కాని ఒక్కోసారి రోడ్ కూడా చెప్తుంది.కథ రోడ్ మీద నడుస్తుంది. రోడ్ కథలో పాత్ర అవుతుంది. హాలీవుడ్లో రోడ్ మూవీస్ ప్రత్యేకమైనవి.మన దేశంలో అలాంటి కథలు తక్కువ. కాని తీసిన రోడ్ మూవీస్ ప్రేక్షకులకు నచ్చాయి. నల్లరోడ్డు మీద తెల్ల అక్షరాలతో చెక్కిన కథలు ఇవి. మనిషి ప్రయాణం చేస్తాడు. ఒక్కోసారి తెలిసిన గమ్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి తెలియని లక్ష్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి భౌతిక ప్రయాణం చేస్తాడు. మరోసారి ఆత్మిక ప్రయాణం చేస్తాడు. ఒక ప్రయాణంలో పరులను తెలుసుకుంటాడు. ఒక ప్రయాణంలో తనను తాను కనుక్కుంటాడు. ఈ మొత్తం ప్రయాణాల్లో ఎవరు తోడు ఉన్నా ఎవరు లేకపోయినా తప్పక ఉండే పాత్ర ఒకే ఒక్కటి.æరోడ్డు. ఆ రోడ్డుకు కథంతా తెలుసు లేదా అదే కథంతా మనకు చెప్తుంటుంది. ఖైదీ పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఆ రోజు విడుదలవుతాడు కార్తి. సాయంత్రం బస్సెక్కి అనాథ శరణాలయంలో ఉన్న కూతురిని మరుసటిరోజు ఉదయం కలవాలి. కాని అతడి వాలకం చూసి పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అప్పటికే పోలీసులు మరోచోట దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకొని ఎస్.పి.ఆఫీస్‌లో దాచి ఉంటారు. వాటి కోసం మాదక ద్రవ్యాల ముఠా ఆ రాత్రి ఎస్.పి. ఆఫీస్ మీద దాడి చేయాలనుకుంటుంది. పోలీస్ ఆఫీసర్లందరూ ఒకచోట పార్టీ చేసుకుంటుంటే వారు తాగే మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుంది ముఠా. ఆ మద్యం తాగి ఆఫీసర్లు చావు బతుకుల్లోకి వెళతారు. ఒక్క ఆఫీసరే మద్యం తాగక స్పృహలో ఉంటాడు. అతనికి గత్యంతరం లేక కార్తిని సాయం కోరతాడు. మీడియాకు తెలియకుండా పోలీసులందరికీ వేరే ఊరిలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించాలి. అలాగే ఎస్.పి. ఆఫీస్ మీద జరిగే దాడిని ఎదుర్కోవాలి. ఈ రెంటి కోసం మాత్రమే కాకుండా తన కూతురు కోసం కూడా కార్తి చేసే ప్రయాణమే ‘ఖైదీ’. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆరేడు గంటల్లో జరిగే ఈ కథను ఎంతో బిగువుగా చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దుర్మార్గం తన లక్ష్యాన్ని చేరే లోపల మంచే తన గమ్యానికి చేరుతుందని ఈ కథ చెబుతుంది. మానవోద్వేగాలు బయల్పడాలంటే మనిషికి ఒక గట్టి ప్రయాణం తగలాలని చెబుతుందీ సినిమా. నిమజ్జనంతో మొదలయ్యి... తెలుగులో ‘రోడ్డు ప్రయాణం’ ప్రధానాంశంగా వచ్చిన సినిమాలలో ‘నిమజ్జనం’ (1979) ను మొదట చెప్పుకోవాలి. ఇందులో మామగారి అస్తికలు గంగలో నిమజ్జనం చేయడానికి భర్తతోపాటు ఎడ్లబండిలో బయలు దేరుతుంది శారద. ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న రైలుస్టేషన్కి ఎడ్లబండిలో ప్రయాణం చేయాలి. కాని బండివాడు శారద మీద కన్నేస్తాడు. అస్తికల కుండ నేల జారేలా చేసి భర్తను అది వెతుక్కుంటూ వెళ్లేలా చేసి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం ఆమె ఎవరితోనూ చెప్పుకోలేక గంగలో నిమజ్జనం సమయంలో నీట మునిగి ప్రాణాలు వదులుతుంది. తిరుగు ప్రయాణంలో ఒక్కడే వచ్చిన భర్తను చూసి బండివాడు భార్య గురించి వాకబు చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతాడు. పాపభీతితో, పశ్చాత్తాపంతో బండివాడు తాను చేసిన తప్పు ఒప్పుకొని ప్రాణం వొదులుతాడు. నాగార్జున ‘చైతన్య’– వర్మ ‘అనగనగా ఒకరోజు’ ప్రతాప్‌పోతన్ తీసిన ‘చైతన్య’ తెలుగులో పూర్తిస్థాయి రోడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో మద్రాసు నుంచి గోవా వరకు ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో దొంగలు, స్మగ్లర్లు, పోలీసులు, హీరో, హీరోయిన్ అందరూ ఉంటారు. అయితే సరైన కథాంశమే లేదు. ఆ తర్వాత వచ్చిన ఎస్.వి. కృష్ణారెడ్డి ‘గన్ షాట్’(1996) ఒక సైకో నుంచి తప్పించుకోవడానికి హీరో అలీ చేసే రోడ్డు ప్రయాణం కూడా నిరాశ పరిచింది. కాని రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ హిట్టయ్యింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఒకరోజులో ఎన్ని అనూహ్య సంఘటనలు ఎదుర్కొందనేది కథ. శ్రీదేవి, వెంకటేశ్‌ల ‘క్షణక్షణం’ కూడా రోడ్ మూవీనే. సంబంధం లేని చోరీ కేసులో తామే నిందితులమని భావించి వీరు అడవుల్లోకి పారిపోతారు. ఆ తర్వాత సిటీకి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణాల మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఓయ్– గమ్యం తాను ప్రేమించిన అమ్మాయి కేన్సర్ వల్ల మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నదని తెలిసిన అబ్బాయి ఆమె తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న కోరికలు కొన్నింటిని తీర్చడానికి ఆమెను తీసుకొని ప్రయాణం మొదలుపెడతాడు. సిద్ధార్థ, షామిలి నటించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కాని క్రిష్ తన తొలి సినిమాగా తీసిన రోడ్ మూవీ ‘గమ్యం’ ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందింది. ఒక ధనిక కుర్రవాడు శర్వానంద్ తన ప్రియురాలిని వెతుక్కుం టూ చేసే ప్రయాణం ఈ కథ. ఈ ప్రయాణంలో అతడు నిజమైన భారతదేశాన్ని కనుగొంటాడు. జనం ఎలా ఉన్నారో చూస్తాడు. ప్రజల కోసం అడవుల్లో ఉండి పని చేయడం కన్నా ప్రజల మధ్య ఉండి పని చేయడం మంచిదని గ్రహిస్తాడు. క్రిష్‌కు పేరు తెచ్చిన రోడ్ మూవీ ఇది. ఖలేజా త్రివిక్రమ్ తీసిన రోడ్ మూవీ ‘ఖలేజా’ కల్ట్ మూవీగా నిలిచింది. రిలీజైనప్పుడు కన్నా టీవీల్లో ఇది ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ‘గమ్యం’ ను పోలిన కథతో తయారైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మనిషి విలువలతో ప్రయాణం చెయ్యాలని చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ కోసం సఫలమైన ప్రయాణం చేయాలని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చెబుతుంది. ఒక పిల్లవాడితో ఏర్పడిన అనుబంధంతో విలన్ భరతం పట్టడానికి సాయితేజ్ చేసిన ప్రయాణమే ‘సుప్రీమ్’. ముగింపు: కథలన్నీ కంచికి చేరతాయని పెద్దల మాట. ఆ కంచికి చేరడంలో కొన్ని కథలు రోడ్డు మీద జారిపోయి ఉంటాయి. కంచికి పోతూ పోతూ మనకూ తారసపడుతూ ఉంటాయి. అందువల్ల మంచి కథ కోసం రోడ్డు మీద పడి వాటిని పట్టుకోవడంలో తప్పులేదు. రోడ్డుతోపాటు జరిగే ఈ సినీ ప్రయాణం కొనసాగాలి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు?
ఇవాళ త్రివిక్రమ్ పుట్టినరోజు ‘అతడు’ - తెలుగు సినిమా రచయితల విలువను కోటి రూపాయలకు చేర్చిన మాటల మాంత్రికుడు. ‘ఖలేజా’ ఉన్న దర్శకుడు. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లా విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి. మా చెల్లి మల్లీశ్వరి - నువ్వు నాకు నచ్చావ్! నువ్వే కావాలి! మన్మథుడా అంటే... అత్తారింటికి దారేది అని మర్యాదగా పెళ్ళి చేసుకున్న మంచివాడు. (మా చెల్లి సీతారామశాస్త్రి గారి తమ్ముడు శ్రీరామ్ గారి కూతురు చిన్నూ... త్రివిక్రమ్ భార్య). 1997 -98 మధ్యకాలంలో నేను దర్శకుడు జయంత్ సి. పారాన్జీ గారి దగ్గర అసోసియేట్‌గా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ‘బావగారూ బావున్నారా’ సినిమాలో అర్జంట్‌గా ఒక సీను మార్చి రాయాల్సి వచ్చింది. తెల్లారితే షూటింగు. ముందు రోజు గురువులు పరుచూరి బ్రదర్స్ ఇద్దరూ అందుబాటులో లేరు. చివరికి వాళ్ళ శిష్యుడైన పోసాని కృష్ణమురళితో రాయించమని నన్ను ఆదేశించారు. పోసాని గారింటికి వెళ్ళి, మొత్తం కథంతా రెండు గంటలు చెప్పాను. ఆయన విని, రేపు పొద్దున్న ఆరింటికి వచ్చి పట్టుకెళ్ళిపొమ్మన్నారు. ‘సరే’ అని వచ్చేశాను. పొద్దున్న వెళితే, నన్ను ‘వెయిట్ చేయ’మన్నారు. ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్న ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ కోసం! ఓ అరగంట తరువాత వచ్చారు - చేతిలో ముప్ఫై పేజీల స్క్రిప్టుతో. ‘ఒక్క సీను రాయమంటే, సగం సినిమా రాశారేమిటి మాస్టారూ? ‘ఏమో! పోసాని గారు రాత్రికి రాత్రి అర్జంటుగా కావాలని కథ చెప్పారు. కథలో నేను ఎక్కడి నుంచి మార్పులు చేయాలనుకున్నానో, అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా రాసేశాను’ అన్నారు. అప్పటి వరకూ నాకు తెలిసి అలా రాయగలిగింది - పరుచూరి గోపాలకృష్ణ గారొకరే! చివరికి, మొత్తం చదివి, అందులో నుంచి పనికొచ్చేవి జయంత్ గారికి చెప్పాను. ఒక పెద్ద ప్రొడ్యూసర్ - త్రివిక్రమ్‌ని పరిచయ్ చేయమని అడిగితే, పంజగుట్టలోని ఆయన రూమ్‌కి తీసుకెళ్ళాను. బ్లాంక్ చెక్ ఆయన చేతిలో పెట్టారు - సినిమా రాయమని. అది 2001లో! ఈ రోజు వరకు త్రివిక్రమ్ ఆ చెక్ వాడలేదు... వాళ్ళకి సినిమా చేయలేదు. కానీ... ఫ్రెండ్లీగా దర్శకుడు దశరథ్‌కి ‘సంతోషం’లో ఒక సీన్, దర్శకుడు షిండే గారికి ‘నిన్నే ప్రేమిస్తా’ - మొత్తం సినిమా రాసి పెట్టారు తక్కువ పారితోషికానికే! అప్పట్లో సునీల్‌నీ, త్రివిక్రమ్నీ - ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూడలేకపోయేవాళ్ళం. ఈ రోజుకీ తన పంజగుట్ట గదిని అలాగే ఉంచుకున్న త్రివిక్రమ్ లాంటి నిరాడంబరుణ్ణి తెలుగు సినీ పరిశ్రమలో ఇంకొకరిని నేను చూడలేదు. ఈయన బయట పరిచయం ఉన్నవాళ్ళతో బోల్డన్ని కబుర్లు చెబుతారు. జోకులు పేలుస్తారు. తన సినిమాల్లో హీరోల్లాగే సెటైర్లేస్తారు. ఎడ్యుకేట్ చేస్తారు. మైకు ముందు మాత్రం పెద్దగా మాట్లా డరు. ఎప్పుడైనా మాట్లాడితే - ఆ మధ్య ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి గురించి మాట్లాడినట్టు విస్ఫోటనం చెందుతారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి’ లాంటి పాత తరం భావజాలాలేవీ లేని ఆధునిక యువకుడు. ఏ ఎత్తులో ఉంటే, ఆ ఎత్తులో నుంచి ప్రపంచాన్ని తనదైన శైలిలో చూసే పర్వతారోహకుడు. 2001 - 02 మధ్య కాలంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారింట్లో త్రివిక్రమ్‌కీ, శాస్త్రి గారి తమ్ముడి కూతురికీ నిశ్చితార్థం. ఈయన పీటల మీద కూర్చొని ఉన్నారు. పెళ్ళి కూతురింకా రాలేదు. నన్ను చూడగానే - పీటల మీద నుంచి లేచొచ్చి, ‘మీతో అర్జంట్‌గా మాట్లాడా’లని నన్ను కారులో అన్నపూర్ణా స్టూడియో రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టించి, నాకు క్లాసు పీకారు. అది కూడా తనకు సంబంధించిన విషయం కాదు. నా కోసం... నా కెరీర్ కోసం! ‘పోసాని గారి కథ చిరంజీవి గారు బావుందంటే, మీరు బాలేదన్నారట! మీకెందుకు? మెగాస్టార్ ఒప్పుకున్న కథను బాలేదని, మీకు వచ్చిన అంత మంచి డెరైక్షన్ అవకాశం పోగొట్టుకోకండి. ఒప్పుకొని ఎలా బాగుచేయాలో ఆలోచించండి. చిరంజీవి గారితో సినిమా చేయాలని మనందరి డ్రీమ్ కదా! మీకు ఆ ఛాన్స్ ముందు వస్తే మీరెలా వదులుకుంటారు’ అని నాకు పదే పదే చెప్పారు. ‘మీరు రాస్తారా మాటలు. ఇప్పుడే వెళ్ళి ఒప్పేసుకుంటా’ అన్నాను. నన్ను మూర్ఖంగా ఆలోచించవద్దని చాలా చెప్పారు. ఆ టైమ్‌లో నాకు అలా చెప్పడం ఆయనకు అవసరం లేదు. అయినా హితబోధ చేశారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్క్ హయత్ హోటల్లో ఓ రెండు గంటలు గడిపాను. అదే త్రివిక్రమ్. మేము కూర్చున్న స్థలం మారింది కానీ, మనిషి మారలేదు! ఆతడి మమత తీరలేదు!! భీమవరం నుంచి వైజాగెళ్లి ఆంధ్రా యూని వర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన యువ కుడు హైదరాబాదొచ్చి సినీ పరిశ్రమలో కాలూనుకోవడం కోసం నానాకష్టాలూ పడి ట్యూషన్లు చెప్పి, అసిస్టెంట్ రైటర్‌గా పోసాని గారి దగ్గర పనిచేసి, ‘స్వయంవరం’తో కొంత పేరు సంపాదించినా, వెంటనే మరో సినిమా రాసెయ్యకుండా గ్యాప్‌లో కృష్ణవంశీ గారి ‘సముద్రం’కి అసోసియేట్‌గా చేరి, డెరైక్షన్ నేర్చు కుంటూ ‘చిరునవ్వుతో’ కథ రాసి, అది రామ్‌ప్రసాద్ గారి దర్శకత్వంలో సూపర్‌హిట్టయ్యాక, ‘నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ వరకూ అప్రతిహతంగా హిట్లిచ్చిన రచయితగా ఎదగడం మామూలు విషయం కాదు. లగడపాటి శ్రీధర్‌గారు నిర్మాతగా నా దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా ఓ కథ అనుకున్నాం. అదే - తర్వాత దర్శకుడిగా ఆయన మొదటి సినిమా - ‘నువ్వే నువ్వే’. ఇద్దరికీ తలో పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. బయట కొచ్చాం. ఓ నెల ఇబ్బంది లేదనుకున్నాం. ‘మంచి చెప్పులు కొనుక్కుందాం మాస్టారూ!’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఏడెనిమిది వేల రేంజ్లో రెండు జతలు సెలక్ట్ చేశారు. ‘సార్! డబ్బులన్నీ అయిపోతే మళ్లీ వెతుక్కోవాలి. కష్టం కదా!’ అన్నా. ‘సంపాదిద్దాం సార్! ఇవే దాచుకుని నెలంతా ఉన్నా, తర్వాతి నెల కోసం ఆలోచించాలి కదా! రేపటి కోసం ఆలోచిద్దాం. ఇవ్వాళ ఖర్చు పెట్టేద్దాం! ముందు మనం మనకిష్టమైంది చేశామనుకోండి... మంచి థాట్స్ అవే వస్తాయి’ అన్నారాయన. నాకు జ్ఞానోదయం అయింది. 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు - ఏవిఎస్ గారినీ, ఇంకొందరినీ కూర్చోపెట్టి ఎన్నికల్లో చెయ్యాల్సిన యాడ్స్ గురించి చర్చిస్తున్నారు. ‘రోజూ పార్టీ ఆఫీసుకు వందల ఉత్తరాలు వస్తున్నాయి - ఈ సారి యాడ్స్నీ, బ్రోచర్నీ, స్పీచెస్నీ త్రివిక్రమ్‌తో రాయించుకోమని! ఎవరయ్యా త్రివిక్రమ్?’ అని అడిగారు. నిజమే! ఎవరయ్యా త్రివిక్రమ్? మొన్న ఎన్నికల్లో కూడా సాక్షాత్తూ పవన్‌కల్యాణ్ కూడా ‘జనసేన’ ప్రారంభోత్సవం స్పీచ్‌లో ‘నా వెనక త్రివిక్రమ్ హస్తం లేదు’ అని క్లారిఫై చెయ్యాల్సి వచ్చింది. ఇంతకీ... ఎవరయ్యా త్రివిక్రమ్? ఎవరిదైనా ప్రమేయం ఉంటే, వారి గురించి మాట్లాడుకుంటారు. అది సహజం. ప్రమేయం లేదని కూడా వారి గురించి మాట్లాడడం అసాధారణం. అదయ్యా త్రివిక్రమ్..!! అభిమానులు కోట్ల మంది ఉన్నా తన సినిమాల ద్వారా వారిని పలకరి స్తారే గానీ, సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పరు. ఆహ్వానాలు కొన్ని వందలున్నా ఆత్మీయులను కలుస్తారే గానీ ఏ ఫంక్షన్‌కీ అడుగుపెట్టరు. ఫోన్లో కూడా ఎవ్వరికీ అందరు - అంత ఈజీగా. కానీ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. ‘ఇంత ఒత్తిడిలో కూడా ఇంత కంట్రోల్డ్‌గా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావయ్యా మిత్రమా’ అని అడిగితే యోగా గురువులా ‘చిరునవ్వే’ సమాధానంగా చెప్తారు. త్రివిక్రమ్ గురించి రాస్తానని గడచిన పుట్టినరోజుకే చెప్పాను ‘సాక్షి’ వారికి. ఆ అవకాశం ఈసారి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. బాపు గారిని నేను ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ చేసినపుడు ఆయనకి ఈతరంలో అభిమాన దర్శకులు ఇద్దరే అని చెప్పారు- త్రివిక్రమ్, రాజమౌళి. జీవితంలో కొంతకాలం ఈ ఇద్దరితోనూ ప్రత్యేకంగా మంచి అనుబంధం కలిగినవాడిని. నేను కాకపోతే వీళ్ల గురించి నేను తప్ప అథెంటిక్‌గా ఎవరు రాస్తారు? అని నా అభిప్రాయం. త్రివిక్రమ్ గురించి రాయాలన్న నా కోరికకి కారణం ఆయన్ని పొగడడం కాదు. నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడం! కెరీర్ మొదలైన రోజులు గుర్తు చేసుకొని, మళ్లీ రిజొనవేట్ అవ్వడం కోసం! పంజగుట్ట గదిలో మొదటి టీవీ కొన్నరోజుల నుంచి, ఆడియో సీడీలు విన్నరోజుల నుంచి- తిన్న బిర్యానీలు, చూసిన సినిమాలు, చర్చించుకున్న సినిమాలు, స్టార్లు, జీవిత విశేషాలు, గడిపిన తెల్లారగట్టలు, మధ్యరాత్రులు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు - సీతారామశాస్త్రి గారింట్లో పాటల కోసం వెయిటింగుల మధ్య నడిచిన సంభాషణలు, ఉద్బోధలు, ప్రవచనాలు, ఉత్ప్రేరకాలు - అన్నీ ఉప్పెనలా గుర్తుకొచ్చిన ఈ శుభవేళ... పుట్టినరోజు మీదైనా, మళ్లీ పుట్టినరోజు నాది కూడా మిత్రమా! సభాముఖంగా శతాధిక శుభాభినందనలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి! తెలుగు సినిమాకు వన్నెతెచ్చిన మహాను భావుల ఎత్తుకు మీరూ ఎదుగుతారు. మీరందుకే పుట్టారు. ఇది నిజం... ఇది తథ్యం. మీ వి.ఎన్. ఆదిత్య, దర్శక, రచయిత -
ప్రిన్స్ ఖలేజా