‘లింగా’ సమస్య మళ్లీ మొదటికి?
చెన్నై : కొలిక్కి వచ్చిందనుకున్న లింగా చిత్ర సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టపరిహారంగా రూ.10కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ డబ్బును నష్టపోయిన వారికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లింగా చిత్ర చెంగల్‌పట్టు ఏరియా డిస్ట్రిబ్యూటర్ మన్నన్, ఉత్తర, దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణమూర్తి, నెల్లై ఏరియా డిస్ట్రిబ్యూటర్ రూపన్ సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్రానికిగానూ చెంగల్‌పట్టు ఏరియాకు ఏడున్నర కోట్లు, ఆర్కాడు ఏరియాకు నాలుగు కోట్లు, నెల్లై ఏరియాకు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపా రు. మొదట్లో నష్టపరిహారం చెల్లించాలంటూ బయ్యర్లు గగ్గోలు పెట్టి, ఇప్పుడు కట్ట పంచాయితీ చేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లతో చర్చించకుండా తిరుపూర్ సుబ్రమణియన్ ఏకపక్ష నిర్ణయాలతో కట్ట పంచాయితీ చేయరాదని సూచించారు.
ఇంతకు ముందు రజనీ నటించిన పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారని తెలిపా రు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లింగా చిత్ర నష్టాల్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలనడం ఎంతమాత్రమూ సమంజసం కాదని పేర్కొన్నారు. నష్టపరిహారాన్ని సక్రమం గా పంచాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు.