ప్రేక్షకుల ఆనందమే నాకు కొండంత బలం
‘‘కళలను ఎంతో అభిమానిస్తాను. కళాకారులను ప్రోత్సహించి అభినందించడం గొప్ప అదృష్టం. అందుకే ‘టీయస్సార్’ అవార్డులను స్టార్ట్ చేశాం. అవార్డు గ్రహీతల ఎంపిక విషయంలో సొంత నిర్ణయాలకు తావు లేకుండా ప్రజాభిప్రాయాన్నే అంతిమ తీర్పుగా జ్యూరీ సభ్యులు పాటించారు’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘టీయస్సార్’ జాతీయ అవార్డుల వేడుక ఈ నెల 8న విశాఖపట్నంలో జరగనుంది. విజేతల పేర్లు ప్రకటించేందుకు గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘టీయస్సార్ అవార్డులు జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలవాలనేది నా కల. తెలుగువారికి జాతీయ స్థాయిలో గౌరవం లభించాలి.
తెలుగువారు ఇంత పెద్ద ఫంక్షన్ చేసారే అని హిందీవాళ్లు ఆశ్చర్యపోవాలి. ఈ అవార్డుల్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రేక్షకులు కొన్ని ఎంపిక చేయగా, మరికొన్ని అవార్డులను జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. మంచి సినిమాల సంఖ్య పెరగడంతో ఈసారి అవార్డుల సంఖ్య పెరిగింది. ఈ ప్రోగ్రామ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఇబ్బందిపడకుండా నిమిషాల వ్యవధిలో అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సుబ్బిరామిరెడ్డికి డబ్బు ఎలా వస్తుందని కొందరు అనుకుంటారు. రాత్రికి రాత్రే నేను ధనవంతుణ్ని కాలేదు. 50 ఏళ్లకు పైగా అన్ని రంగాల్లో వ్యాపారవేత్తగా కష్టపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు మనసు రావాలి, ఏకాగ్రత కుదరాలి, కృషి ఉండాలి. అప్పుడే చేయగలం. ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూసి, ఎంజాయ్ చేస్తారు. వారి ఆనందమే నాకు కొండంత శక్తిని ఇస్తుంది’’ అని అన్నారు. జ్యూరీ సభ్యులు రఘురామ కృష్ణమ్‌రాజు, బి.గోపాల్, ఆర్.వి ప్రసాద్, పింకీరెడ్డి, విక్రమ్ పాల్గొన్నారు.