చెట్ల చుట్టూ తిరగడం అంత ఈజీ కాదు!
‘‘సెలబ్రిటీ స్టేటస్ చాలా గొప్పది కాబట్టి, నేను ఆర్టిస్ట్ కాలేదు. స్టార్స్ లైఫ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా కాలేదు. నటన అనేది నా జీన్స్‌లోనే ఉంది. అందుకే ఎంతో మక్కువతో ఆర్టిస్ట్ అయ్యాను’’ అని శ్రుతీహాసన్ అన్నారు. గ్లామర్, డీ-గ్లామర్ రెండు పాత్రలనూ ఒకే రకంగా చూస్తానని శ్రుతి చెబుతూ - ‘‘మీకు గ్లామరస్ రోల్స్ ఇష్టమా? డీ-గ్లామరా అని ఎవరైనా నన్నడిగితే నాకేం చెప్పాలో తెలియదు. ఎందుకంటే నేను నటిని. ఏ పాత్ర అయినా నాకు ఒకటే. ‘గ్లామరస్ క్యారెక్టర్స్ చాలా ఈజీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు’ అని కొంతమంది చాలా తేలికగా మాట్లాడతారు.
ఏ పాత్రకైనా ఎంతో కొంత కష్టపడాల్సిందే. చెట్ల చుట్టూ తిరగడం అనుకున్నంత ఈజీ కాదు. దానికి కూడా టాలెంట్ ఉండాలి. గ్లామరస్‌గా కనిపించడం అంత సులువు కాదు. అందుకే గ్లామరస్ క్యారెక్టర్స్‌ని చిన్న చూపు చూడకూడదు. నా మటుకు నేను పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. ఎంత అందంగా కనిపించడానికైనా ఓకే. అలాగే, పాత్ర డిమాండ్ చేస్తే అంద విహీనంగా కనిపించడానికి కూడా నేను రెడీయే’’ అన్నారు.