కథ ఒకటే... సీరియళ్లు అనేకం!
టీవీ ప్రముఖురాలు ఏక్తా కపూర్ అనగానే టీవీలోని ఏడుపులు పెడబొబ్బల సీరియళ్ళు, అత్తా కోడళ్ళ కథలే గుర్తుకొస్తాయి.‘సెక్స్, లవ్ ఔర్ ధోకా’, ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ లాంటి సినిమాలతో తరచూ వార్తల్లోకి వస్తున్న ఏక్తా సర్వసాధారణంగా సుదీర్ఘమైనఇంటర్వ్యూలు ఇవ్వరు. పెపైచ్చు, ఎంతటి ప్రశ్నకైనా మూడు ముక్కల్లో జవాబు తేల్చేస్తారు. ఆ చెప్పే సమాధానం కూడా ఇట్టే ఊహించగలిగే రీతిలో ఉంటుంది. అలాంటి ఏక్తా తాజాగా ఓ మాట ఒప్పుకున్నారు.
తాను తీసే టీవీ సీరియళ్ళలో చాలా వాటి కథలు దాదాపు ఒకేలా ఉంటాయని అంగీకరించారు. తప్పనిసరి విజయసూత్రమైన కుటుంబ కథల ఫార్ములాతోనే సీరియళ్ళు తీస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారం ప్రసారం ప్రారంభం కానున్న తన తాజా టీవీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ప్రమోషన్‌లో పాల్గొంటూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా తన మీద వస్తున్న విమర్శలను ఒక రకంగా ఒప్పుకున్నారు. అయితే, ‘‘కథలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కానీ, మనం వాటిని చెప్పే తీరు వల్ల ఆ కథలు కొత్తగా కనిపిస్తాయి.
అలాగే, అందులోని పాత్రల వల్ల కూడా కొత్తదనం వస్తుంది. కానీ, పాత కథనే విభిన్నంగా కనిపించేలా తెరకెక్కించడం అంత తేలికేమీ కాదు’’ అని ఏక్తా చెప్పారు. ఒకప్పటి ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్ టి.ఆర్.పి.ల కోసం టీవీ కథలను సాగదీస్తానంటూ నిజాయతీగా చెప్పారు. ‘‘నా సీరియళ్ళలో కొన్ని ఆరేడేళ్ళు నడిచినవి కూడా ఉన్నాయి. వీక్షకులకు నచ్చిన సీరియల్ వీలుంటే 20 ఏళ్ళు నడపమన్నా, నాకు ఓ.కె’’ అని ఏక్తా వ్యాఖ్యానించింది.
జేన్ ఆస్టెన్ రచన ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా తాజా సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ను నిర్మిస్తున్నారామె. ‘‘ఏ సీరియల్ అయినా హిట్టవ్వాలంటే పాత్ర చిత్రణ చాలా ముఖ్యం. ఆ పాత్రలను పోషిస్తున్న నటీనటులు వాటిలో పూర్తిగా జీవించాలి. అప్పుడు ఆ సీరియల్ జనాకర్షణీయంగా వస్తుంది’’ అని ఏక్తా ముక్తాయించారు. తీస్తున్న కథలే తీస్తూ, బుల్లితెరపై విజయం సాధిస్తున్న ఆమె మాటలు మన సీరియల్ దర్శక, రచయితలు పైకి ఒప్పుకోని నిజాలు కదూ!