The Dirty Picture
-
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్‌కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్‌ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్‌కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్‌ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్‌ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
‘క్లైమాక్స్ చూసి అమ్మ ఏడ్చేసింది’
ముంబై: ఎప్పుడూ చీరకట్టులో నిండుగా కనిపించే విద్యాబాలన్.. ‘డర్టీ పిక్చర్’ వంటి సినిమా చేస్తారని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. విద్య సైతం ఇలాగే అనుకున్నారట. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఆ కథతో తన దగ్గరికి వచ్చినపుడు ఆశ్చర్యపోయారట. అయితే ఆర్టిస్టుగా తనపై ఉన్న తనకు ఉన్న నమ్మకంతో ఓకే చేశారట. ఆమె నమ్మకం నిజమైంది. ‘సిల్క్’ స్మిత పాత్రలో జీవించిన విద్య నటనా కౌశల్యానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. నిర్మాతపై కాసుల వర్షం కురిపించారు. 2011లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేగాక, విద్యకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, సిల్క్‌గా విద్యను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు గానీ, మరి ఆమె కుటుంబ సభ్యులు ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఎలా స్పందిస్తారోనన్న అంశం తన మనసును మెలిపెట్టిందట. ఈ విషయాల గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన విద్యా బాలన్.. ‘‘మనం చేసే పని సరైందే అయితే కచ్చితంగా మనకు మద్దతు లభిస్తుంది. మీకొక విషయం చెబుతాను. డర్టీ పిక్చర్ స్క్రీనింగ్ జరుగుతున్నపుడు, మా అమ్మానాన్న ఎలా స్పందిస్తారోనన్న భయం వెంటాడింది. కానీ సినిమా చూసి బయటకు రాగానే నాన్న చప్పట్లు కొట్టారు. ‘‘ఈ సినిమాలో ఎక్కడా నా కూతురు కనిపించనేలేదు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ అయితే క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంది. తెర మీద నా పాత్ర చనిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. నిజానికి, సెక్సీగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి ఒక సన్నని గీత ఉంటుంది. ఏదైమేనా ఆర్టిస్టుగా నాలోని భిన్న కోణాన్ని పరిచయం చేసేందుకు అవకాశం ఇచ్చిన డర్టీ పిక్చర్ టీంకు ధన్యవాదాలు’’అని విద్యా బాలన్ గత జ్ఞాపకాలు పంచుకున్నారు. చదవండి: ఫోటోలకు ఫోజులు.. బ్యాలెన్స్ తప్పిన కృతి! -
నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి
కోల్‌కతా: బాలీవుడ్ నటి ఆర్య బెనర్జీ గత వారం కోల్‌కతాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన బెనర్జీ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది హత్య కాదని అనారోగ్య సమస్యల కారణంగా బెనర్జీ మృతి చెందినట్లు తాజాగా ఫోరెన్సిక్ నివేధికలో వెల్లడైంది. బెనర్జీ కొంతకాలంగా కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఫోరెన్సిక్ నివేధికలో వైద్యలు ధృవికరించారు. కాగా దీనిపై కోల్‌కతా పోలీసు జాయింట్ కమిషనర్ మురళీధర్ శర్మ మాట్లాడుతూ.. ‘నటి ఆర్య బెనర్జీది హత్య కాదు. హత్య జరిగినట్లు ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటన స్థలంలోనే ఫోరెనిక్స్ నిపుణులు మృతదేహం శాంపుల్స్ సెకరించారు. అయితే తను చనిపోయిన సమయంలో బెనర్జీ పొట్టలో ఆల్కహాల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు’ అని ఆయన తెలిపారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి) ఆర్యబెనర్జీ జోధ్‌పూర్‌లోని తన అపార్టుమెంటులో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం బెనర్జీ ఇంటి పనిమనిషి వచ్చి తలుపు కొట్టడంతో ఆమె ఎంతకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసుల తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి బెనర్జీ తన గదిలో బెడ్‌పై మృతి చెంది కనిపించారు. కాగా బెనర్జీ ప్రముఖ దివంగత సితార విద్వాంసుడు పండిత్ నిఖిల్ బెనర్జీ కూతురు. ఆమె దక్షిణాది ప్రముఖ నటి సిల్క్‌స్మిత జీవికథ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. అంతేగాక హిందీలో పలు సినిమాల్లో నటిస్తూనే ముంబైలో మోడల్‌గా రాణిస్తున్నారు. -
కోల్‌కతా:ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి
-
‘ది డర్టీ పిక్చర్’ నటి అనుమానాస్పద మృతి
కోల్‌కతా: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. -
సిల్క్ బాలన్
సిల్క్ అంటే పట్టు... పట్టు దారం పంటితో కొరికినా దొరకదు... బయటికి మృదువుగా కనపడ్డా పట్టులో ఉన్న బలం అలాంటిది! విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’లో సిల్క్ స్మిత పాత్రను జీవించారంటారు. పాత్రను దారంలా పెనవేసుకున్నారు... కాదు.. కాదు.. కుట్టినట్టుగా కనపడ్డారు. సంప్రదాయ చీరకట్టులో కనిపించే విద్యాబాలన్... అలాంటి పాత్రను ఎలా చేయగలిగారు? ‘దటీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సిల్క్’ త్వరలో విడుదల కానున్న ‘కహానీ-2’లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇందులో నా పేరు దుర్గారాణీ సింగ్. మంచిదానిలా కనిపించినా లోపల క్రిమినల్ని. సాదాసీదా అమ్మాయిలా కనిపించే ఆ అమ్మాయి ఎందుకు క్రిమినల్ అనిపించుకుంది? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. అంటే.. మీ స్వభావానికి విరుద్ధంగా ఉన్న పాత్ర చేశారన్న మాట! కరెక్ట్‌గా చెప్పారు. పైకి నేను మామూలు అమ్మాయిని. లోపల కూడా అంతే. నా స్వభావానికి విరుద్ధంగా ఉన్న పాత్రలు చేయడం సవాల్ అనిపిస్తుంది. అలాంటి పాత్రలను ఇష్టంగా చేస్తా. మిగతా పాత్రలను ఇష్టపడనని కాదు. పవర్ఫుల్ రోల్స్ అయితే పండగ చేసుకుంటాను. నిజజీవితంలో కూడా మీరు పవర్ఫుల్ లేడీ అనిపిస్తుంది. ఎదుర్కొన్న పరిస్థితులు, పరిసరాలు మిమ్మల్ని అలా చేశాయా? నా కుటుంబమే నన్నలా చేసింది. నాకూ, మా అక్కకూ అమ్మానాన్న చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ‘మీరు మీరుగా ఉండండి’ అని మా చిన్నప్పుడే నాన్నగారు అన్నారు. మా మీద ఒత్తిడి ఉండేది కాదు. ఎప్పుడైతే ఇంట్లో కావల్సినంత స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడు ఎలాంటి భయమూ ఉండదు. ‘ఏం చేసినా సిన్సియర్‌గా చేయండి. ఎవరికీ హాని చేయొద్దు. ముక్కు సూటిగా ఉండండి’ అని అమ్మానాన్న అన్నారు. ఆ మాటలను పాటించాం. అందుకే నేను సినిమాల్లో, అక్క అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లో సక్సెస్ కాగలిగాం. సౌత్‌లో ప్రూవ్ చేసుకుని హిందీకి వెళ్లిన హీరోయిన్లే ఎక్కువ. మీలా ఇక్కడ ఏమీ చేయకుండా హిందీకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. అది ఆ దేవుడి దయ. మా అమ్మానాన్నల ఆశీర్వాదం. మీరన్నట్లు డెరైక్ట్‌గా నార్త్‌లో సక్సెస్ అయిన సౌత్ గాళ్స్ చాలా చాలా తక్కువ. నేను హీరోయిన్ అవుతానన్నప్పుడు మా అమ్మానాన్న ఇష్టపడలేదు. ఇక్కడ మోసగాళ్లు ఉంటారనీ, జాగ్రత్తగా ఉండకపోతే జీవితం పాడైపోతుందనీ భయపడ్డారు. నా ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. సినిమా పరిశ్రమ గురించి మేం ఏదైతే విన్నామో అలాంటిదేమీ నాకు జరగలేదు. నాతో మర్యాదగా నడుచుకుంటున్న వ్యక్తి కూడా వేరేవాళ్లతో మాత్రం అమర్యాదగా నడుచుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. దాంతో ఎదుటి వ్యక్తి ప్రవర్తన మనం ఎలా ఉన్నామనేదాని మీదే ఆధారపడి ఉంటుందని అర్థమైంది. ‘మా కూతురు తెలివైనది. తను మేనేజ్ చేసుకోగలదు’ అని నా పేరెంట్స్‌కి నమ్మకం కుదిరింది. దాంతో నన్ను నీడలా వెంటాడలేదు. మీ పేరులోనే ‘విద్య’ ఉంది. చదువులో బెస్ట్ అనుకోవచ్చా? సోషియాలజీలో ఎం.ఎ. చేశాను. ఎబౌ యావరేజ్ స్టూడెంట్‌ని. ‘ఫస్ట్ రాకపోయినా ఫర్వాలేదు. ఈ ఇంట్లో ఉండాలంటే డిగ్రీ చేయాల్సిందే. ఉద్యోగం అనేది ఏ వయసులోనైనా చేయొచ్చు. ఏ వయసులో పడితే ఆ వయసులో స్కూల్‌కి, కాలేజీకి వెళ్లడానికి కుదరదు’ అని అమ్మానాన్న అన్నారు. చదువు ముఖ్యం అని నాకూ తెలుసు కాబట్టే, చదువుకున్నా. మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని మీ బాడీ లాంగ్వేజ్, మాటలు చూస్తే అనిపిస్తోంది. అమ్మాయిలకు మీరు రోల్ మోడల్ అనొచ్చు! థ్యాంక్యూ. ‘నేను మంచిదాన్ని’ అని మనం అందర్నీ కన్విన్స్ చేయలేం. చేయడానికి ప్రయత్నిస్తే జీవితం నరకం అవుతుంది. ఉదాహరణకు ఒక గదిలో పది మంది ఉన్నారనుకోండి. ఆ పది మందిలో ఇద్దరు బాగా, మరో ఇద్దరు చెడుగా, ఇంకో ఇద్దరు మిగతావాళ్లెలా మాట్లాడతారో అందుకు తగ్గట్టుగా... ఇలా మాట్లాడుతుంటారు. అందుకే ఎవరి మాటలనీ మనం పట్టించుకో కూడదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఎదుటి వ్యక్తుల కోసం మారకూడదు. మన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ‘ఈ అమ్మాయి ఇంతే’ అని మిగతావాళ్లు కూడా ఫిక్సయిపోతారు. దీనికో ఉదాహరణ. మీ డ్రెస్సింగ్. బాలీవుడ్లో డ్రెస్సులపరంగా విమర్శలు ఎదుర్కొని... చివరకు ‘విద్యా డ్రెస్సింగ్ సూపర్’ అని ఫిక్స్ చేయగలిగారు? (గట్టిగా నవ్వేస్తూ) అప్పట్లో నన్ను విమర్శించనివాళ్లు లేరు. పార్టీలకు ఎలా రావాలో తెలియదని నాకు వినపడేలా మాట్లాడుకునే వాళ్లు. ఆ మాటలను మనసులో పెట్టుకుని, జనాల కోసం డ్రెస్సులు వేసుకుని వెళితే, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నంత ఆత్మవిశ్వాసంతో కనిపించలేను. ఎవరేం అనుకున్నా ఫరవాలేదని నా స్టైల్‌ని నేను ఫాలో అయ్యా. ఈరోజు అందరూ ‘నీ డ్రెస్సింగ్ హుందాగా ఉంటుంది. సూపర్’ అంటున్నారు. అదే ఆ రోజు విమర్శలకు భయపడి మార్చుకుని ఉంటే, ఈరోజు ‘నేను విద్యాబాలన్’ అనే విషయాన్ని మరచిపోయి, జనాల కోసం బతుకుతూ ఉండేదాన్నేమో. విమర్శలను మనసుకు ఎక్కించుకోరా? నేను చాలా ‘సెన్సిటివ్’. కోపం, ఏడుపు త్వరగా వచ్చేస్తాయ్. మనం మనలా ఉంటే ఎందుకు విమర్శిస్తున్నారు? అని బాధ పడతాను. అయితే నాలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే.. నా ఫీలింగ్స్‌ని బయట పెట్టను. వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఎమోషన్స్‌ని కంట్రల్ చేసుకునే నేర్పు వచ్చేసింది (నవ్వుతూ...). మీకో విషయం చెబుతా. మన మూడ్ బాగాలేదనుకోండి.. దాన్ని వేరే వాళ్లపై ఎందుకు ప్రదర్శించాలి? కొంతమంది మూడ్ బాగున్నప్పుడు బాగుం టారు. బాగా లేనప్పుడు చిరాకు పడతారు. నాకది ఇష్టం ఉండదు. ఎదుటి వ్యక్తులతో నేను మాట్లాడే మాటలకు నా మూడ్‌తో సంబంధం ఉండదు. మీరు ‘డర్టీ పిక్చర్’ చేస్తారని ఎవరూ ఊహించలేదు. అంత హాట్‌గా నటించడం రిస్క్ అనిపించలేదా? నేనే ఊహించలేదు. ఆర్టిస్ట్‌గా నా మీద నాకు ఎలాంటి డౌటూ లేదు. అందుకే డెరైక్టర్ మిలన్ లూథ్రియా ఈ కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోలేదు. అయితే నన్నిలా ఊహించుకున్నందుకు మాత్రం ఆశ్చర్యపోయాను. ఇంత డిఫరెంట్ రోల్‌ని ఎవరూ ఇవ్వలేదు. పైగా, ‘మీరు చేస్తే ఈ సినిమా ఉంటుంది. లేకపోతే లేదు’ అన్నారు. డెరైక్టర్ అంత నమ్మిన ప్పుడు ఆర్టిస్ట్‌గా నేను కాదనలేకపోయాను. చీరకట్టులో నిండుగా కనిపించే మీరు అరకొర దుస్తుల్లో కనిపిస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని భయపడలేదా? సిల్క్ స్మితగానా... నేనా? అనుకున్నాను. రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను కూడా. కానీ, ఇంత డిఫరెంట్ రోల్ రాదని ఒప్పుకున్నాను. ఒక పాత్రను నేనెంత సిన్సియర్‌గా చేస్తానో చెప్పడానికి ఆ సినిమా ఓ ఎగ్జాంపుల్. ఆ సిన్సియార్టీని అందరూ అంగీకరించారు. మీలాంటి పబ్లిక్ పర్సనాల్టీలు ఏం చేసినా న్యూసే. అదెలా అనిపిస్తుంది? సెలబ్రిటీల జీవితం గురించి మాట్లాడాలని అందరికీ ఉంటుంది. తప్పులూ ఒప్పులూ కనిపెడతారు. ఇలాంటివి ఉంటాయని ఆర్టిస్ట్ అయినప్పుడే ఊహించా. అందుకని నా గురించి చెడు మాట్లాడినప్పుడు ‘ఇది సహజం’ అనుకుని సర్ది చెప్పుకుంటా. ఎందుకంటే పబ్లిక్‌లో నేను కనిపించగానే ఆత్మీయంగా మాట్లాడతారు. ఉత్సాహంగా ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతారు. మన గురించి లేనిపోనివి ప్రచారం చేసేవాళ్లల్లో వీళ్లూ ఉంటారని విసుగు ప్రదర్శించాననుకోండి ఆ కొన్ని క్షణాల విసుగును జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకే నేను బ్యాడ్ మూడ్‌లో ఉన్నా ఓపికగా మాట్లాడతాను. మీ ఫీలింగ్స్‌ను ఎవరితో షేర్ చేసుకుంటారు? చిన్నప్పుడు అమ్మానాన్న. ఇప్పుడు సిద్ధార్థ్ (విద్యాబాలన్ భర్త). మా అక్క-బావ. వీళ్లే నా బలం. నేను పెద్దగా చదవను. సిద్ధార్థ్ చదివి, ‘మన గురించి ఇలాంటి న్యూస్‌లు వస్తున్నాయ్’ అని చెబితేనే తెలుస్తుంది. నేను మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను. ఆయన మాత్రం ఫుల్ సెలైంట్. జస్ట్ అలా గమనిస్తూ ఉంటారు. మీరేమో తమిళ్ పొన్ను (అమ్మాయి), సిద్ధార్థ్‌గారు పంజాబీ ముండె (అబ్బాయి). మీ జీవితం ఎలా ఉంది? (నవ్వుతూ) ఇటు తమిళ్, అటు పంజాబీ - రెండు సంప్రదాయాలూ ఫాలో అవుతాం. మా ఇంట్లో ‘సెక్యులర్’ వాతావరణం ఉంటుంది. వంటకాలు మాత్రం మహరాష్ట్రియన్ స్టైల్లో ఉంటాయ్. మా అత్తగారు బాగా వంట చేస్తారు. మావ గారు అయితే ఇంకా. సౌత్ డిషెస్‌లో మీకు నచ్చేవి? దోసె, ఇడ్లీ, కారప్పొడులు, అప్పడం, సాంబార్, పాలడప్రదమన్ (కేరళ స్టైల్ పాయసమ్), మొళగూట్టల్ పచ్చడి (కేరళ స్టైల్ పచ్చడి), సేమియా పాయసమ్... అన్నీ ఇష్టం. ముంబైలో మా అత్తగారి ఇంటి నుంచి అమ్మగారి ఇల్లు ఐదు నిమిషాల దూరమే. ఎప్పుడనిపిస్తే అప్పుడు అమ్మగారింటికి వెళ్లిపోయి, ఫుల్లుగా లాగించేస్తాను. చీరల్లో మీరు హుందాగా ఉంటారు. మొదటిసారి ఎప్పుడు కట్టుకున్నారు? ఐదేళ్ల వయసులో కట్టుకున్నా. మా అమ్మగారు, పిన్ని, ఇంకా మా కుటుంబంలో ఉన్న ఆడవాళ్లు కాంచీవరం, మైసూర్ సిల్క్, కాటన్ శారీస్ కట్టడం చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకూ చీరలంటే బోల్డంత ఇష్టం. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే చీరలకు మించిన మంచి డ్రెస్ లేదని నా అభిప్రాయం. సల్మాన్, ఆమిర్, షారుఖ్ ఖాన్.. వీళ్లతో సినిమాలు చేయలేదేం? వాళ్లతో చేయలేదనే బాధ లేదు. ఎందుకంటే నేను మంచి మూవీసే చేస్తున్నా. ఒకవేళ ఏదైనా ఖాన్ సరసన యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా, నాకు స్ట్రాంగ్ రోల్ ఉంటేనే చేస్తా. ఈ మోడ్రన్ ప్రపంచంలో మహిళలు ఎలా ఉండాలి? వాళ్లను వాళ్లు గౌరవించుకోవాలి. మీ మైండ్, బాడీ మీద మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఎవరూ మిమ్మల్ని డిక్టేట్ చేసే రైట్ ఇవ్వకూడదు. మీ స్వేచ్ఛను మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. హుందాగా ఉండాలి. ఫైనల్లీ... తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు? మంచి కథ, పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను. - డి.జి. భవాని -
విద్యా బాలన్ రాయని డైరీ
పిక్చర్ పోయింది. నో రిగ్రెట్స్. నాకు బాగుంది. ఎయిటీస్‌లో రావలసిన మూవీ అన్నారు. నిరూపారాయ్ అండ్ హర్ స్టైల్ ఆఫ్ సినిమా అన్నారు. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు. ఎన్ని అననివ్వండి, వేస్ట్ ఆఫ్ లవ్ అనగలమా?! అసలు లవ్ లేకనే కదా.. జీవితంలో ఇంతింత వేస్టేజీ. డర్టీ పిక్చర్ ఒక టేస్ట్. కహానీ ఒక టేస్ట్. హమారీ అధూరి కహానీ.. అదీ ఒక టేస్ట్. అన్ఫినిష్డ్ మౌన రాగం! ‘ష్.. అబ్బా.. భరించలేం’ అనుకుంటూ థియేటర్ బయటికి వచ్చి గుండె నిండా గాలి పీల్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. లోపలే ఉండిపోయినవాళ్లని తలచుకుంటూ ‘అంత ఉబ్బ రింపులో ఎలా కూర్చున్నారబ్బా’ అని ఆశ్చర్యపోవడం మాత్రం ఇన్సెన్సిబుల్. లేచి వెళ్లిపోయే హక్కు ఉన్నట్లే.. కూర్చుని ఉండిపోయే హక్కు. ఉదయం అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటున్నాను. ‘చీరలో నువ్వు భలే ఉంటావోయ్’ అన్నారు సిద్ధార్థ వెనగ్గా వచ్చి. ఆయనకే కాదు, చీరలో నాక్కూడా నేను భలే ఉంటాను. ఐ వాజ్ బార్న్ టు వేర్ ఎ శారీ. చీర నాకు ఒంటికి చుట్టుకున్నట్టు ఉండదు. మనసుకు కట్టుకున్నట్టు ఉంటుంది. ‘కానీ విద్యా.. చీరలో మీరు ఔట్డేటెడ్గా కనిపిస్తున్నారేమో ఎప్పుడైనా ఆలోచించారా..’ అని ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు ఒకరిద్దరైనా అంటుంటారు. చీర లెస్ మోడర్న్ అని, లెస్ గ్లామరస్ అని, ఎప్పుడూ ఇలా చీర కట్టుకుని కనిపిస్తే గ్లామర్ రోల్స్ రావని వారి ఉద్దేశం కావచ్చు. చిన్నగా నవ్వుతాను. ‘చీరలో మీరు సూపర్‌గా ఉన్నారండీ’ అంటారు ఇంకెవరో అటువైపుగా వెళుతూ. నాకు తెలుసు అది నా చిరునవ్వు అందం కాదు. నా చీర అందం. నా చిరునవ్వుకి నా చీర తెచ్చిపెట్టిన అందం. స్క్రీన్ మీద చీర ఎప్పుడు ఔట్‌డేట్ అయిందో నాకు తెలీదు. స్త్రీని ఎప్పటికీ అప్డేట్గా ఉంచేది మాత్రం చీరొక్కటే. ఇంకో డ్రెస్‌కు ఆ శక్తి లేదు. మనుషుల జడ్జ్మెంట్స్ ఒకోసారి చాలా క్రూయల్‌గా ఉంటాయి. ఎలా ఉన్నా, ఎలా లేకున్నా ఏదో ఒకటి అనేస్తారు. సినిమాల్నైనా అంతే, మనుషుల్నైనా అంతే. ఆడవాళ్లనైతే వాళ్ల అప్పియరెన్స్‌తో జడ్జ్చేసి పారేస్తారు. అక్కడ బాగోలేదని, ఇక్కడ బాగోలేదనీ, ఇలా ఉంటే బాగుండేదని, అలా లేకుంటే బాగుండేదనీ. తిండి లేక చచ్చిపోయినట్టు... గ్లామర్ కోసం సమాజం పడి చచ్చిపోతున్నట్టుగా ఉంటాయి వీళ్ల మాటలు! అందానికి డెఫినిషన్స్ ఏమిటి? డెకరేషన్స్ ఏమిటి? ఎవరు ఎలా ఉంటే అదే అచ్చమైన అందం. అచ్చమైన దాన్ని ‘అందం’గా సొసైటీ యాక్సెప్ట్ చెయ్యలేకపోవచ్చు. వదిలేయడమే. షేక్స్పియర్ టు రోబీ ఠాగోర్... ఎంతమంది ఎన్ని రాయలేదూ! వాళ్లెంత పువ్వుల్లాంటి కల్పనలు అల్లినా... రియాలిటీనే కదా ఆ సొగసైన అల్లికలను పట్టి ఉంచేది. రియాలిటీలో అందం ఉంది. రియాలిటినీ అంగీకరించడంలోనూ అందం ఉంది. మాధవ్ శింగరాజు -
అయితే ఏంటి?
దక్షిణాది శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో రూపొందిన ది డర్టీ పిక్చర్ చిత్రంలో నటించి యావత్ భారత సినీ పరిశ్రమకు ఈ భామ షాక్ ఇచ్చారు. తాజాగా రజనీ, శ్రీదేవి లాంటివారిని ఆలోచనలో పడేసేలా పెద్ద షాక్ ఇచ్చారు. హిందీలో తెరకెక్కి న మేహు రజనీకాంత్ చిత్ర టైటిల్ తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ రజనీ కాంత్ కోర్టు కెళ్లి చిత్ర విడుదలపై స్టే తీసుకొచ్చారు. అదే విధంగా నటి శ్రీదేవి తన పేరుతో రామ్‌గోపాల్ వర్మ చిత్రం తెరకెక్కించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన సినిమా పేరు మార్చుకోక తప్పలేదు. అలాంటిదిప్పుడు తెలుగులో వేర్ ఈజ్ విద్యాబాలన్ పేరుతో ఒక తెలుగు చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్, జ్యోతిసత్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస దర్శకుడు. ఈ చిత్ర టైటిల్ ఉపయోగించడానికి నటివిద్యాబాలన్ అనుమతి తీసుకున్నారా? అన్న ప్రశ్నకు ఈ దర్శకుడేమన్నారో చూడండి. ఈ చిత్రంలో నటి విద్యాబాలన్‌ను అవమానించే సన్నివేశాలు ఉండవు. అయినా ఆమె పేరు చుట్టూనే కథ తిరుగుతుంది. దీని కోసం విద్యాబాలన్ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు అన్నారు. ఇదే ప్రశ్నపై నటి విద్యాబాలన్ స్పందిస్తూ నా పేరుతో ఒక తెలుగు చిత్రం రూపొందుతోందన్న విషయం నా చెవికి చేరింది. అయితే ఏంటి? ఆ చిత్రానికి నా పేరు పెట్టడం వలన నాకెలాంటి భయం లేదు. అని ఈ విషయాన్ని విద్యాబాలన్ చాలా స్పోర్టివ్‌గా తీసుకోవడం పరిశ్రమలో చాలామంది పరి పరి విధాలుగా గుసగుస లాడుకుంటున్నారు. -
సిల్క్స్మితపై మరాఠీ సినిమా!
రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శృంగార సామ్రాజ్ఞి సిల్క్‌స్మిత. తన కైపు కళ్లతో సినీ ప్రపంచాన్ని ఏలగలిగినా... వాస్తవ ప్రపంచం మాత్రం ఆమెకు కన్నీరే మిగిల్చింది. ‘సినీ రంగుల ప్రపంచంలో ఎలా బతకకూడదు’ అనేదానికి నిలువెత్తు సాక్ష్యం సిల్క్ స్మిత జీవితం. ఆమెది ఫెయిల్యూర్ స్టోరీనే అయినా, ఇప్పుడదే పలువురు నిర్మాతలకు సక్సెస్ఫుల్ స్టోరీగా నిలిచింది. హిందీలో ‘డర్టీ పిక్చర్’, మలయాళంలో ‘క్లైమాక్స్’, కన్నడంలో ‘సిల్క్ సక్కత్ మగా’ అన్నవి స్మిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు. ఇవన్నీ సదరు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.ఇప్పుడు సిల్క్ జీవితం మరాఠీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమీర్‌ఖాన్ అనే దర్శకుడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా చేయడానికి సన్నాహాలు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి సమీర్‌ఖాన్ మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ ‘సిల్క్’ జీవితంపై వచ్చిన ఏ సినిమాలోనూ ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేదు. నేను చేయనున్న సినిమాలో సిల్క్ స్మిత జీవితంలోని అన్ని కోణాలూ ఉంటాయి. రంగుల ప్రపంచంలో ఆమె పడిన కష్టాలు, సినీలోకంలో చీకటి కోణాలు, చాలామందికి తెలియని సిల్క్ స్మితలోని పాజిటీవ్ కోణం, విధితో పోరాటలేక ఆమె ప్రాణాలు తీసుకున్న తీరు... ఇవన్నీ నా సినిమాలో ఉంటాయి. మరాఠీ భాషలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటిలో చాలా ధైర్యంగా తెరపై దృశ్యాలు చూపే సినిమా ఇదే. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తా’’ అన్నారు. -
‘డర్టీ పిక్చర్’ చేయలేను
డర్టీ పిక్చర్ వంటి సినిమా చేసే ధైర్యం తనకు లేదంది బెబో. ఆ సినిమాలో విద్యాబాలన్ చక్కగా చేసిందని కితాబునిచ్చింది బాలీవుడ్ జీరో సైజ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్. అయినా కమర్షియల్ సినిమాలంటేనే తనకు చాలా ఇష్టమంది. కెరీర్లో ‘దేవ్’, ‘చమేలీ’, ‘ఓంకార’ వంటి సినిమాలు చేశాను కదా అని చెప్పింది. తన అత్తగారు షర్మిలా ఠాగూర్ కూడా ‘అమర్ ప్రేమ్’, ‘మౌసమ్’ చిత్రాల్లో వేశ్య పాత్ర పోషించిన సంగతి గుర్తు చేసింది. -
నాకు బాగానే ఇచ్చారు...!
ముంబై: సినీ పరిశ్రమలో తనకు లభించే పారితోషికం విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేవని, అందరూ ‘బాగానే ఇచ్చార’ని బాలీవుడ్ భామ కరీనాకపూర్ చెప్పింది. పారితోషికం చెల్లింపు విషయంలో వివక్ష ఉన్నట్లు విద్యా బాలన్, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు ఆరోపిస్తుండగా, కరీనా కపూర్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘నాకు బాగానే చెల్లిస్తారు. నాకెటువంటి ఫిర్యాదులు లేవు. పెద్ద బడ్జెట్ సినిమా అయితే వారు కొంత ఎక్కువగా ఇస్తారు. అందరికీ ఒకేలా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదు కదా’’ అని కరీనా వ్యాఖ్యానించింది. ‘‘నటులు ఎవరికి వారే ప్రత్యేకం అన్నది నా అభిప్రాయం. ఉదాహరణకు, ‘ది డర్టీ పిక్చర్’ సినిమా నేనెప్పుడూ చేయలేను. అంత ధైర్యం, సాహసం నాకు లేవు. కానీ గోల్మాల్-3 సినిమాలో పాత్ర నాకు సవాలు వంటిది. ‘సింగం’ చిత్రంలో భాగస్వామిని కావడం నాకు గర్వకారణం. ఒకరితో ఒకరు పోల్చుకోవడం సరికాదు’’ అని కరీనా పేర్కొంది. కానీ, పారితోషికం విషయంలో ఇదే కరీనా రెండేళ్ల క్రితం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. డర్టీ పిక్చర్ సినిమాలో పాత్రకు గాను విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు లభించినప్పుడు స్పందిస్తూ, ‘భారతీయ సినీ పరిశ్రమలో నటీమణులకు ఓ కొత్త భవిష్యత్తు గోచరిస్తోంది’ అని పేర్కొంది. అలాగే, నటీనటులకు సమానస్థాయిలో పారితోషికం లభించేందుకు పోరాటం చేస్తానని కూడా కరీనా ప్రకటించింది. కరీనా ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘సింగం రిటర్న్స్’లో నటిస్తోంది. సైఫ్‌ఖాన్ వివాహం అయిన ఈ 33 ఏళ్ల నటి వాణిజ్య చిత్రాల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతోంది. ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ వంటి కుటుంబ కథాచిత్రాల్లోనూ నటించిన కరీనా, నిన్నటితరం నటీమణులు పర్వీన్ బాబీ, జీనత్ అమన్ పెళ్లయిన తరువాత కూడా నటించి మెప్పించారని చెప్పింది. -
ఇంకా మూస ధోరణిలోనే..
భారతీయ సినిమాల్లో మహిళా పాత్రలు ఇంకా మూస ధోరణిలోనే సాగుతున్నాయని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేర్కొంది. పరిణీత, పా, ద డర్టీ పిక్చర్, కహానీ వంటి సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విద్యాబాలన్‘బాబీ జాసూస్’ చిత్రంలో కూడా భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. ఈ నటితో సినిమా చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే అటు కథా రచయితల్లోనూ, దర్శకుల్లోనూ కథానాయిక పాత్రను కొత్తగా తీర్చదిద్దాలనే ఆలోచన వస్తోంది. అంతగా విద్య తనదైన నటనతో మహిళా పాత్రలకు గుర్తింపు తెస్తోంది. ‘భారతీయ చిత్రాల్లో మహిళా పాత్రల మూస ధోరణి మారాలి. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మారుతుందనే విశ్వాసం నాకుంది. అయితే మహిళల పాత్రను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనే తపన పరిశ్రమలో చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కేవలం 5 శాతం మంది మాత్రమే ఇలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. మిగతా 95 శాతం మంది మహిళ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండానే సినిమాను పూర్తి చేసేస్తున్నారు. బాబీ జాసూస్‌లో నా పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో నేను ఎంత సీరియస్‌గా ఉంటానో అంతే స్టయిలిష్‌గా కూడా ఉంటాను. ఈ పాత్ర కోసం నేను ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. అయినా చాలా మంది షెర్లాక్ హోమ్స్‌ను గుర్తుకు తెచ్చావంటున్నారు. పాత్ర స్వరూపసభావాలకు అనుగుణంగా నటించేందుకు మాత్రమే ప్రయత్నించాను. పరిధి దాటి ఇతర విషయాలపై దృష్టి పెట్టలేదు. బహుశా అందుకే నా పాత్ర అంతగా ఆదరణ పొందుతుందేమో. అయితే మహిళా పాత్రలను కూడా విభిన్నంగా తీర్చిదిద్దినప్పుడే ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తుందనే విషయాన్ని దర్శకులు దృష్టిలో ఉంచుకోవాల’ని పేర్కొంది. -
నా ఆత్మకథకు అనుమతించను
సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయాల ను కూడా ప్రజలు భూతద్దంలో చూస్తారు. అదివారి తప్పుకాదు. సెలబ్రెటీల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అది. సంచలన తారగా పేరుగాంచిన నయనతార సినీ, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ప్రేక్షకుడు తహతహలాడుతాడు. అలాంటి ఆమె ఆత్మకథను రాయడానికి, కథకు డు, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు ఆసక్తి కనబరచకుండా ఉంటా రా? అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే నయనతార అందుకు అంగీకరిస్తారా? ఆ మధ్య దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ బాలీవుడ్లో ది డర్టీపిక్చర్ పేరుతో తెరకెక్కి కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. నటుడు శింబు, దర్శకడు, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాను ప్రేమాణం పెటాకులైన సంగతి తెలిసిం దే. అయినా నేటికీ నయనతార క్రేజీ హీరోయిన్నే. ప్రస్తుతం ఆమె మాజీ ప్రియుడు శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇలా అదృష్ట, దురదృష్ట సంఘటనల సంగమమే నయన జీవితం. అలాంటి జీవిత కథను రాయడానికి ఒక కథకుడు ముందుకొచ్చారు. అయితే నయనతార ఆయనకు అనుమతివ్వలేదని సమాచారం. మరో యువ దర్శకుడు కూడా నయనతార ఆత్మకథను తెరకెక్కించడానికి ఆసక్తి చూపగా ఆయనకి నయన నో చెప్పేశారు. ఇంతకు ముం దు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా తన ఆత్మకథను తెరకెక్కించడానికి అనుమతి నిరాకరించిన విష యం తెలిసిందే. -
కథ ఒకటే... సీరియళ్లు అనేకం!
టీవీ ప్రముఖురాలు ఏక్తా కపూర్ అనగానే టీవీలోని ఏడుపులు పెడబొబ్బల సీరియళ్ళు, అత్తా కోడళ్ళ కథలే గుర్తుకొస్తాయి.‘సెక్స్, లవ్ ఔర్ ధోకా’, ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ లాంటి సినిమాలతో తరచూ వార్తల్లోకి వస్తున్న ఏక్తా సర్వసాధారణంగా సుదీర్ఘమైనఇంటర్వ్యూలు ఇవ్వరు. పెపైచ్చు, ఎంతటి ప్రశ్నకైనా మూడు ముక్కల్లో జవాబు తేల్చేస్తారు. ఆ చెప్పే సమాధానం కూడా ఇట్టే ఊహించగలిగే రీతిలో ఉంటుంది. అలాంటి ఏక్తా తాజాగా ఓ మాట ఒప్పుకున్నారు. తాను తీసే టీవీ సీరియళ్ళలో చాలా వాటి కథలు దాదాపు ఒకేలా ఉంటాయని అంగీకరించారు. తప్పనిసరి విజయసూత్రమైన కుటుంబ కథల ఫార్ములాతోనే సీరియళ్ళు తీస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారం ప్రసారం ప్రారంభం కానున్న తన తాజా టీవీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ప్రమోషన్లో పాల్గొంటూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా తన మీద వస్తున్న విమర్శలను ఒక రకంగా ఒప్పుకున్నారు. అయితే, ‘‘కథలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కానీ, మనం వాటిని చెప్పే తీరు వల్ల ఆ కథలు కొత్తగా కనిపిస్తాయి. అలాగే, అందులోని పాత్రల వల్ల కూడా కొత్తదనం వస్తుంది. కానీ, పాత కథనే విభిన్నంగా కనిపించేలా తెరకెక్కించడం అంత తేలికేమీ కాదు’’ అని ఏక్తా చెప్పారు. ఒకప్పటి ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్ టి.ఆర్.పి.ల కోసం టీవీ కథలను సాగదీస్తానంటూ నిజాయతీగా చెప్పారు. ‘‘నా సీరియళ్ళలో కొన్ని ఆరేడేళ్ళు నడిచినవి కూడా ఉన్నాయి. వీక్షకులకు నచ్చిన సీరియల్ వీలుంటే 20 ఏళ్ళు నడపమన్నా, నాకు ఓ.కె’’ అని ఏక్తా వ్యాఖ్యానించింది. జేన్ ఆస్టెన్ రచన ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా తాజా సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ను నిర్మిస్తున్నారామె. ‘‘ఏ సీరియల్ అయినా హిట్టవ్వాలంటే పాత్ర చిత్రణ చాలా ముఖ్యం. ఆ పాత్రలను పోషిస్తున్న నటీనటులు వాటిలో పూర్తిగా జీవించాలి. అప్పుడు ఆ సీరియల్ జనాకర్షణీయంగా వస్తుంది’’ అని ఏక్తా ముక్తాయించారు. తీస్తున్న కథలే తీస్తూ, బుల్లితెరపై విజయం సాధిస్తున్న ఆమె మాటలు మన సీరియల్ దర్శక, రచయితలు పైకి ఒప్పుకోని నిజాలు కదూ! -
అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!
లైఫ్ బుక్ నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను. సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని. ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది. నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి. - విద్యాబాలన్ -
షకీలాగా అంజలి?
సంచలన శృంగార తార షకీలా జీవిత చరిత్ర వెండితెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు నటి సిల్క్ స్మిత జీవితం బాలీవుడ్లో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొంది ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఇక నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళంలో ఈమె సూపర్ నటి అని చెప్పక తప్పదు. షకీలా నటించిన శృంగార భరిత చిత్రాలకు విశేష ఆదరణ ఉండేది. బయ్యర్లు కొనడానికి పోటీ పడేవాళ్లు. ఇతర భాషల్లో అనువాద హక్కులకు మంచి డిమాండ్ ఉండేది. షకీలా చిత్రం విడుదలవుతుందంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల విడుదలను వాయిదా వేసుకునేవారు. ఒక వేళ పోటీగా, విడుదల చేసినా ఆ చిత్రాలకు కలెక్షన్లు ఉండేవి కావు. దీంతో అక్కడి నటులు కొందరు షకీలాపై కుట్రపన్ని కేరళ నుంచి బయటకు పంపించేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో నివశిస్తున్న షకీలా తమిళం, తెలుగు భాషల్లో హాస్యభూమికను పోషిస్తున్నారు. జీవిత చరిత్ర రాసుకున్నారు షకీలా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇందులో ఆమె వ్యక్తి గత విషయాలు, సినిమా సంగతులు, తానెదుర్కొన్న కిష్టపరిస్థితులు, సినిమా వ్యక్తులు తనను ఎలా వాడుకున్నారు? తదితర విషయాలను పరిపూర్ణంగా ఈ పుస్తకంలో రాసుకున్నారు. ఇంకా మార్కెట్లోకి విడుదల కాని షకీలా జీవిత చరిత్రపై ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఇలాంటి కథతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రం తెరకెక్కడానికి అంగీకరించరాదంటూ నటి షకీలాకు బెదిరింపులు కూడా మొదలయ్యాయట. అయినా ఇలాంటి వాటికి భయపడేది లేదంటున్నారట ఈ శృంగార తార. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షకీలా పాత్రకు నటి అంజలి చక్కగా నప్పుతారని చిత్ర దర్శక నిర్మాతలు భావించడంతో ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. సిల్క్ స్మిత జీవిత కథలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకోవడంతో నటి అంజలి కూడా షకీలా పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది.