నాకు బాగానే ఇచ్చారు...!
ముంబై: సినీ పరిశ్రమలో తనకు లభించే పారితోషికం విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేవని, అందరూ ‘బాగానే ఇచ్చార’ని బాలీవుడ్ భామ కరీనాకపూర్ చెప్పింది. పారితోషికం చెల్లింపు విషయంలో వివక్ష ఉన్నట్లు విద్యా బాలన్, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు ఆరోపిస్తుండగా, కరీనా కపూర్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘నాకు బాగానే చెల్లిస్తారు. నాకెటువంటి ఫిర్యాదులు లేవు. పెద్ద బడ్జెట్ సినిమా అయితే వారు కొంత ఎక్కువగా ఇస్తారు. అందరికీ ఒకేలా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదు కదా’’ అని కరీనా వ్యాఖ్యానించింది. ‘‘నటులు ఎవరికి వారే ప్రత్యేకం అన్నది నా అభిప్రాయం. ఉదాహరణకు, ‘ది డర్టీ పిక్చర్’ సినిమా నేనెప్పుడూ చేయలేను.
అంత ధైర్యం, సాహసం నాకు లేవు. కానీ గోల్‌మాల్-3 సినిమాలో పాత్ర నాకు సవాలు వంటిది. ‘సింగం’ చిత్రంలో భాగస్వామిని కావడం నాకు గర్వకారణం. ఒకరితో ఒకరు పోల్చుకోవడం సరికాదు’’ అని కరీనా పేర్కొంది. కానీ, పారితోషికం విషయంలో ఇదే కరీనా రెండేళ్ల క్రితం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. డర్టీ పిక్చర్ సినిమాలో పాత్రకు గాను విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు లభించినప్పుడు స్పందిస్తూ, ‘భారతీయ సినీ పరిశ్రమలో నటీమణులకు ఓ కొత్త భవిష్యత్తు గోచరిస్తోంది’ అని పేర్కొంది.
అలాగే, నటీనటులకు సమానస్థాయిలో పారితోషికం లభించేందుకు పోరాటం చేస్తానని కూడా కరీనా ప్రకటించింది. కరీనా ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘సింగం రిటర్న్స్’లో నటిస్తోంది. సైఫ్‌ఖాన్ వివాహం అయిన ఈ 33 ఏళ్ల నటి వాణిజ్య చిత్రాల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతోంది. ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ వంటి కుటుంబ కథాచిత్రాల్లోనూ నటించిన కరీనా, నిన్నటితరం నటీమణులు పర్వీన్ బాబీ, జీనత్ అమన్ పెళ్లయిన తరువాత కూడా నటించి మెప్పించారని చెప్పింది.