ఇంకా మూస ధోరణిలోనే..
భారతీయ సినిమాల్లో మహిళా పాత్రలు ఇంకా మూస ధోరణిలోనే సాగుతున్నాయని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేర్కొంది. పరిణీత, పా, ద డర్టీ పిక్చర్, కహానీ వంటి సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విద్యాబాలన్‘బాబీ జాసూస్’ చిత్రంలో కూడా భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. ఈ నటితో సినిమా చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే అటు కథా రచయితల్లోనూ, దర్శకుల్లోనూ కథానాయిక పాత్రను కొత్తగా తీర్చదిద్దాలనే ఆలోచన వస్తోంది. అంతగా విద్య తనదైన నటనతో మహిళా పాత్రలకు గుర్తింపు తెస్తోంది.
‘భారతీయ చిత్రాల్లో మహిళా పాత్రల మూస ధోరణి మారాలి. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మారుతుందనే విశ్వాసం నాకుంది. అయితే మహిళల పాత్రను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనే తపన పరిశ్రమలో చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కేవలం 5 శాతం మంది మాత్రమే ఇలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. మిగతా 95 శాతం మంది మహిళ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండానే సినిమాను పూర్తి చేసేస్తున్నారు.
బాబీ జాసూస్‌లో నా పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో నేను ఎంత సీరియస్‌గా ఉంటానో అంతే స్టయిలిష్‌గా కూడా ఉంటాను. ఈ పాత్ర కోసం నేను ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. అయినా చాలా మంది షెర్లాక్ హోమ్స్‌ను గుర్తుకు తెచ్చావంటున్నారు. పాత్ర స్వరూపసభావాలకు అనుగుణంగా నటించేందుకు మాత్రమే ప్రయత్నించాను. పరిధి దాటి ఇతర విషయాలపై దృష్టి పెట్టలేదు. బహుశా అందుకే నా పాత్ర అంతగా ఆదరణ పొందుతుందేమో. అయితే మహిళా పాత్రలను కూడా విభిన్నంగా తీర్చిదిద్దినప్పుడే ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తుందనే విషయాన్ని దర్శకులు దృష్టిలో ఉంచుకోవాల’ని పేర్కొంది.