సిల్క్‌స్మితపై మరాఠీ సినిమా!
రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శృంగార సామ్రాజ్ఞి సిల్క్‌స్మిత. తన కైపు కళ్లతో సినీ ప్రపంచాన్ని ఏలగలిగినా... వాస్తవ ప్రపంచం మాత్రం ఆమెకు కన్నీరే మిగిల్చింది. ‘సినీ రంగుల ప్రపంచంలో ఎలా బతకకూడదు’ అనేదానికి నిలువెత్తు సాక్ష్యం సిల్క్ స్మిత జీవితం. ఆమెది ఫెయిల్యూర్ స్టోరీనే అయినా, ఇప్పుడదే పలువురు నిర్మాతలకు సక్సెస్‌ఫుల్ స్టోరీగా నిలిచింది.
హిందీలో ‘డర్టీ పిక్చర్’, మలయాళంలో ‘క్లైమాక్స్’, కన్నడంలో ‘సిల్క్ సక్కత్ మగా’ అన్నవి స్మిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు. ఇవన్నీ సదరు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.ఇప్పుడు సిల్క్ జీవితం మరాఠీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమీర్‌ఖాన్ అనే దర్శకుడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా చేయడానికి సన్నాహాలు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి సమీర్‌ఖాన్ మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ ‘సిల్క్’ జీవితంపై వచ్చిన ఏ సినిమాలోనూ ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేదు. నేను చేయనున్న సినిమాలో సిల్క్ స్మిత జీవితంలోని అన్ని కోణాలూ ఉంటాయి.
రంగుల ప్రపంచంలో ఆమె పడిన కష్టాలు, సినీలోకంలో చీకటి కోణాలు, చాలామందికి తెలియని సిల్క్ స్మితలోని పాజిటీవ్ కోణం, విధితో పోరాటలేక ఆమె ప్రాణాలు తీసుకున్న తీరు... ఇవన్నీ నా సినిమాలో ఉంటాయి. మరాఠీ భాషలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటిలో చాలా ధైర్యంగా తెరపై దృశ్యాలు చూపే సినిమా ఇదే. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తా’’ అన్నారు.