సిల్క్ బాలన్ | special story to vidya balan | Sakshi
Sakshi News home page

సిల్క్ బాలన్

Published Sat, Nov 26 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

సిల్క్ బాలన్

సిల్క్ బాలన్

సిల్క్ అంటే పట్టు... పట్టు దారం పంటితో కొరికినా దొరకదు... బయటికి మృదువుగా కనపడ్డా పట్టులో ఉన్న బలం అలాంటిది!
విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’లో సిల్క్ స్మిత పాత్రను జీవించారంటారు. పాత్రను దారంలా పెనవేసుకున్నారు...
కాదు.. కాదు.. కుట్టినట్టుగా కనపడ్డారు. సంప్రదాయ చీరకట్టులో కనిపించే విద్యాబాలన్...
అలాంటి పాత్రను ఎలా చేయగలిగారు? ‘దటీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సిల్క్’

త్వరలో విడుదల కానున్న ‘కహానీ-2’లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఇందులో నా పేరు దుర్గారాణీ సింగ్. మంచిదానిలా కనిపించినా లోపల క్రిమినల్‌ని. సాదాసీదా అమ్మాయిలా కనిపించే ఆ అమ్మాయి ఎందుకు క్రిమినల్ అనిపించుకుంది? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.

అంటే.. మీ స్వభావానికి విరుద్ధంగా ఉన్న పాత్ర చేశారన్న మాట!
కరెక్ట్‌గా చెప్పారు. పైకి నేను మామూలు అమ్మాయిని. లోపల కూడా అంతే. నా స్వభావానికి విరుద్ధంగా ఉన్న పాత్రలు చేయడం సవాల్ అనిపిస్తుంది. అలాంటి పాత్రలను ఇష్టంగా  చేస్తా. మిగతా పాత్రలను ఇష్టపడనని కాదు. పవర్‌ఫుల్ రోల్స్ అయితే పండగ చేసుకుంటాను.

నిజజీవితంలో కూడా మీరు పవర్‌ఫుల్ లేడీ అనిపిస్తుంది. ఎదుర్కొన్న పరిస్థితులు, పరిసరాలు మిమ్మల్ని అలా చేశాయా?
నా కుటుంబమే నన్నలా చేసింది. నాకూ, మా అక్కకూ అమ్మానాన్న చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ‘మీరు మీరుగా ఉండండి’ అని మా చిన్నప్పుడే నాన్నగారు అన్నారు. మా మీద ఒత్తిడి ఉండేది కాదు. ఎప్పుడైతే ఇంట్లో కావల్సినంత స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడు ఎలాంటి భయమూ ఉండదు. ‘ఏం చేసినా సిన్సియర్‌గా చేయండి. ఎవరికీ హాని చేయొద్దు. ముక్కు సూటిగా ఉండండి’ అని అమ్మానాన్న అన్నారు. ఆ మాటలను పాటించాం. అందుకే నేను సినిమాల్లో, అక్క అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లో సక్సెస్ కాగలిగాం.

సౌత్‌లో ప్రూవ్ చేసుకుని హిందీకి వెళ్లిన హీరోయిన్లే ఎక్కువ. మీలా ఇక్కడ ఏమీ చేయకుండా హిందీకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు..
అది ఆ దేవుడి దయ. మా అమ్మానాన్నల ఆశీర్వాదం. మీరన్నట్లు డెరైక్ట్‌గా నార్త్‌లో సక్సెస్ అయిన సౌత్ గాళ్స్ చాలా చాలా తక్కువ. నేను హీరోయిన్ అవుతానన్నప్పుడు మా అమ్మానాన్న ఇష్టపడలేదు. ఇక్కడ మోసగాళ్లు ఉంటారనీ, జాగ్రత్తగా ఉండకపోతే జీవితం పాడైపోతుందనీ భయపడ్డారు. నా ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. సినిమా పరిశ్రమ గురించి మేం ఏదైతే విన్నామో అలాంటిదేమీ నాకు జరగలేదు. నాతో మర్యాదగా నడుచుకుంటున్న వ్యక్తి కూడా వేరేవాళ్లతో మాత్రం అమర్యాదగా నడుచుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. దాంతో ఎదుటి వ్యక్తి ప్రవర్తన మనం ఎలా ఉన్నామనేదాని మీదే ఆధారపడి ఉంటుందని అర్థమైంది. ‘మా కూతురు తెలివైనది. తను మేనేజ్ చేసుకోగలదు’ అని నా పేరెంట్స్‌కి నమ్మకం కుదిరింది. దాంతో నన్ను నీడలా వెంటాడలేదు.

మీ పేరులోనే ‘విద్య’ ఉంది. చదువులో బెస్ట్ అనుకోవచ్చా?
సోషియాలజీలో ఎం.ఎ. చేశాను. ఎబౌ యావరేజ్ స్టూడెంట్‌ని. ‘ఫస్ట్  రాకపోయినా ఫర్వాలేదు. ఈ ఇంట్లో ఉండాలంటే డిగ్రీ చేయాల్సిందే. ఉద్యోగం అనేది ఏ వయసులోనైనా చేయొచ్చు. ఏ వయసులో పడితే ఆ వయసులో స్కూల్‌కి, కాలేజీకి వెళ్లడానికి కుదరదు’ అని అమ్మానాన్న అన్నారు. చదువు ముఖ్యం అని నాకూ తెలుసు కాబట్టే, చదువుకున్నా.

మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని మీ బాడీ లాంగ్వేజ్, మాటలు చూస్తే అనిపిస్తోంది. అమ్మాయిలకు మీరు రోల్ మోడల్ అనొచ్చు!
థ్యాంక్యూ. ‘నేను మంచిదాన్ని’ అని మనం అందర్నీ కన్విన్స్ చేయలేం. చేయడానికి ప్రయత్నిస్తే జీవితం నరకం అవుతుంది. ఉదాహరణకు ఒక గదిలో పది మంది ఉన్నారనుకోండి. ఆ పది మందిలో ఇద్దరు బాగా, మరో ఇద్దరు చెడుగా, ఇంకో ఇద్దరు మిగతావాళ్లెలా మాట్లాడతారో అందుకు తగ్గట్టుగా... ఇలా మాట్లాడుతుంటారు. అందుకే ఎవరి మాటలనీ మనం పట్టించుకో కూడదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఎదుటి వ్యక్తుల కోసం మారకూడదు. మన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ‘ఈ అమ్మాయి ఇంతే’ అని మిగతావాళ్లు కూడా ఫిక్సయిపోతారు.

దీనికో ఉదాహరణ. మీ డ్రెస్సింగ్. బాలీవుడ్‌లో డ్రెస్సులపరంగా విమర్శలు ఎదుర్కొని... చివరకు ‘విద్యా డ్రెస్సింగ్ సూపర్’ అని ఫిక్స్ చేయగలిగారు?
(గట్టిగా నవ్వేస్తూ) అప్పట్లో నన్ను విమర్శించనివాళ్లు లేరు. పార్టీలకు ఎలా రావాలో తెలియదని నాకు వినపడేలా మాట్లాడుకునే వాళ్లు. ఆ మాటలను మనసులో పెట్టుకుని, జనాల కోసం డ్రెస్సులు వేసుకుని వెళితే, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నంత ఆత్మవిశ్వాసంతో కనిపించలేను. ఎవరేం అనుకున్నా ఫరవాలేదని నా స్టైల్‌ని నేను ఫాలో అయ్యా. ఈరోజు అందరూ ‘నీ డ్రెస్సింగ్ హుందాగా ఉంటుంది. సూపర్’ అంటున్నారు. అదే ఆ రోజు విమర్శలకు భయపడి మార్చుకుని ఉంటే, ఈరోజు ‘నేను విద్యాబాలన్’ అనే విషయాన్ని మరచిపోయి, జనాల కోసం బతుకుతూ ఉండేదాన్నేమో.

విమర్శలను మనసుకు ఎక్కించుకోరా?
నేను చాలా ‘సెన్సిటివ్’. కోపం, ఏడుపు త్వరగా వచ్చేస్తాయ్. మనం మనలా ఉంటే ఎందుకు విమర్శిస్తున్నారు? అని బాధ పడతాను. అయితే నాలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే.. నా ఫీలింగ్స్‌ని బయట పెట్టను. వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఎమోషన్స్‌ని కంట్రల్ చేసుకునే నేర్పు వచ్చేసింది (నవ్వుతూ...). మీకో విషయం చెబుతా. మన మూడ్ బాగాలేదనుకోండి.. దాన్ని వేరే వాళ్లపై ఎందుకు ప్రదర్శించాలి? కొంతమంది మూడ్ బాగున్నప్పుడు బాగుం టారు. బాగా లేనప్పుడు చిరాకు పడతారు. నాకది ఇష్టం ఉండదు. ఎదుటి వ్యక్తులతో నేను మాట్లాడే మాటలకు నా మూడ్‌తో సంబంధం ఉండదు.

మీరు ‘డర్టీ పిక్చర్’ చేస్తారని ఎవరూ ఊహించలేదు. అంత హాట్‌గా నటించడం రిస్క్ అనిపించలేదా?
నేనే ఊహించలేదు. ఆర్టిస్ట్‌గా నా మీద నాకు ఎలాంటి డౌటూ లేదు. అందుకే డెరైక్టర్ మిలన్ లూథ్రియా ఈ కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోలేదు. అయితే నన్నిలా ఊహించుకున్నందుకు మాత్రం ఆశ్చర్యపోయాను. ఇంత డిఫరెంట్ రోల్‌ని ఎవరూ ఇవ్వలేదు. పైగా, ‘మీరు చేస్తే ఈ సినిమా ఉంటుంది. లేకపోతే లేదు’ అన్నారు. డెరైక్టర్ అంత నమ్మిన ప్పుడు ఆర్టిస్ట్‌గా నేను కాదనలేకపోయాను.

చీరకట్టులో నిండుగా కనిపించే మీరు అరకొర దుస్తుల్లో కనిపిస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని భయపడలేదా?
సిల్క్ స్మితగానా... నేనా? అనుకున్నాను. రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను కూడా. కానీ, ఇంత డిఫరెంట్ రోల్ రాదని ఒప్పుకున్నాను. ఒక పాత్రను నేనెంత సిన్సియర్‌గా చేస్తానో చెప్పడానికి ఆ సినిమా ఓ ఎగ్జాంపుల్. ఆ సిన్సియార్టీని అందరూ అంగీకరించారు.

మీలాంటి పబ్లిక్ పర్సనాల్టీలు ఏం చేసినా న్యూసే. అదెలా అనిపిస్తుంది?
సెలబ్రిటీల జీవితం గురించి మాట్లాడాలని అందరికీ ఉంటుంది. తప్పులూ ఒప్పులూ కనిపెడతారు. ఇలాంటివి ఉంటాయని ఆర్టిస్ట్ అయినప్పుడే ఊహించా. అందుకని నా గురించి చెడు మాట్లాడినప్పుడు ‘ఇది సహజం’ అనుకుని సర్ది చెప్పుకుంటా. ఎందుకంటే పబ్లిక్‌లో నేను కనిపించగానే ఆత్మీయంగా మాట్లాడతారు. ఉత్సాహంగా ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతారు. మన గురించి లేనిపోనివి ప్రచారం చేసేవాళ్లల్లో వీళ్లూ ఉంటారని విసుగు ప్రదర్శించాననుకోండి ఆ కొన్ని క్షణాల విసుగును జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకే నేను బ్యాడ్ మూడ్‌లో ఉన్నా ఓపికగా మాట్లాడతాను.

మీ ఫీలింగ్స్‌ను ఎవరితో షేర్ చేసుకుంటారు?
చిన్నప్పుడు అమ్మానాన్న. ఇప్పుడు సిద్ధార్థ్ (విద్యాబాలన్ భర్త). మా అక్క-బావ. వీళ్లే నా బలం. నేను పెద్దగా చదవను. సిద్ధార్థ్ చదివి, ‘మన గురించి ఇలాంటి న్యూస్‌లు వస్తున్నాయ్’ అని చెబితేనే తెలుస్తుంది. నేను మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను. ఆయన మాత్రం ఫుల్ సెలైంట్. జస్ట్ అలా గమనిస్తూ ఉంటారు.

మీరేమో తమిళ్ పొన్ను (అమ్మాయి), సిద్ధార్థ్‌గారు పంజాబీ ముండె (అబ్బాయి). మీ జీవితం ఎలా ఉంది?
(నవ్వుతూ) ఇటు తమిళ్, అటు పంజాబీ - రెండు సంప్రదాయాలూ ఫాలో అవుతాం. మా ఇంట్లో ‘సెక్యులర్’ వాతావరణం ఉంటుంది. వంటకాలు మాత్రం మహరాష్ట్రియన్ స్టైల్‌లో ఉంటాయ్. మా అత్తగారు బాగా వంట చేస్తారు. మావ గారు అయితే ఇంకా.

సౌత్ డిషెస్‌లో మీకు నచ్చేవి?
దోసె, ఇడ్లీ, కారప్పొడులు, అప్పడం, సాంబార్, పాలడప్రదమన్ (కేరళ స్టైల్ పాయసమ్), మొళగూట్టల్ పచ్చడి (కేరళ స్టైల్ పచ్చడి), సేమియా పాయసమ్... అన్నీ ఇష్టం. ముంబైలో మా అత్తగారి ఇంటి నుంచి అమ్మగారి ఇల్లు ఐదు నిమిషాల దూరమే. ఎప్పుడనిపిస్తే  అప్పుడు అమ్మగారింటికి వెళ్లిపోయి, ఫుల్లుగా లాగించేస్తాను.

చీరల్లో మీరు హుందాగా ఉంటారు. మొదటిసారి ఎప్పుడు కట్టుకున్నారు?
ఐదేళ్ల వయసులో కట్టుకున్నా. మా అమ్మగారు, పిన్ని, ఇంకా మా కుటుంబంలో ఉన్న ఆడవాళ్లు కాంచీవరం, మైసూర్ సిల్క్, కాటన్ శారీస్ కట్టడం చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకూ చీరలంటే బోల్డంత ఇష్టం. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే చీరలకు మించిన మంచి డ్రెస్ లేదని నా అభిప్రాయం.

 సల్మాన్, ఆమిర్, షారుఖ్ ఖాన్.. వీళ్లతో సినిమాలు చేయలేదేం?
వాళ్లతో చేయలేదనే బాధ లేదు. ఎందుకంటే నేను మంచి మూవీసే చేస్తున్నా. ఒకవేళ ఏదైనా ఖాన్ సరసన  యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా, నాకు స్ట్రాంగ్ రోల్ ఉంటేనే చేస్తా.

ఈ మోడ్రన్ ప్రపంచంలో మహిళలు ఎలా ఉండాలి?
వాళ్లను వాళ్లు గౌరవించుకోవాలి. మీ మైండ్, బాడీ మీద మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఎవరూ మిమ్మల్ని డిక్టేట్ చేసే రైట్ ఇవ్వకూడదు. మీ స్వేచ్ఛను మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. హుందాగా ఉండాలి.

ఫైనల్లీ... తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు?
మంచి కథ, పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను.

 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement