విద్యా బాలన్ రాయని డైరీ
పిక్చర్ పోయింది. నో రిగ్రెట్స్. నాకు బాగుంది. ఎయిటీస్‌లో రావలసిన మూవీ అన్నారు. నిరూపారాయ్ అండ్ హర్ స్టైల్ ఆఫ్ సినిమా అన్నారు. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు. ఎన్ని అననివ్వండి, వేస్ట్ ఆఫ్ లవ్ అనగలమా?! అసలు లవ్ లేకనే కదా.. జీవితంలో ఇంతింత వేస్టేజీ.
డర్టీ పిక్చర్ ఒక టేస్ట్. కహానీ ఒక టేస్ట్. హమారీ అధూరి కహానీ.. అదీ ఒక టేస్ట్. అన్‌ఫినిష్డ్ మౌన రాగం! ‘ష్.. అబ్బా.. భరించలేం’ అనుకుంటూ థియేటర్ బయటికి వచ్చి గుండె నిండా గాలి పీల్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. లోపలే ఉండిపోయినవాళ్లని తలచుకుంటూ ‘అంత ఉబ్బ రింపులో ఎలా కూర్చున్నారబ్బా’ అని ఆశ్చర్యపోవడం మాత్రం ఇన్‌సెన్సిబుల్. లేచి వెళ్లిపోయే హక్కు ఉన్నట్లే.. కూర్చుని ఉండిపోయే హక్కు.
ఉదయం అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటున్నాను. ‘చీరలో నువ్వు భలే ఉంటావోయ్’ అన్నారు సిద్ధార్థ వెనగ్గా వచ్చి. ఆయనకే కాదు, చీరలో నాక్కూడా నేను భలే ఉంటాను. ఐ వాజ్ బార్న్ టు వేర్ ఎ శారీ. చీర నాకు ఒంటికి చుట్టుకున్నట్టు ఉండదు. మనసుకు కట్టుకున్నట్టు ఉంటుంది.
‘కానీ విద్యా.. చీరలో మీరు ఔట్‌డేటెడ్‌గా కనిపిస్తున్నారేమో ఎప్పుడైనా ఆలోచించారా..’ అని ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు ఒకరిద్దరైనా అంటుంటారు. చీర లెస్ మోడర్న్ అని, లెస్ గ్లామరస్ అని, ఎప్పుడూ ఇలా చీర కట్టుకుని కనిపిస్తే గ్లామర్ రోల్స్ రావని వారి ఉద్దేశం కావచ్చు. చిన్నగా నవ్వుతాను. ‘చీరలో మీరు సూపర్‌గా ఉన్నారండీ’ అంటారు ఇంకెవరో అటువైపుగా వెళుతూ. నాకు తెలుసు అది నా చిరునవ్వు అందం కాదు. నా చీర అందం. నా చిరునవ్వుకి నా చీర తెచ్చిపెట్టిన అందం. స్క్రీన్ మీద చీర ఎప్పుడు ఔట్‌డేట్ అయిందో నాకు తెలీదు. స్త్రీని ఎప్పటికీ అప్‌డేట్‌గా ఉంచేది మాత్రం చీరొక్కటే. ఇంకో డ్రెస్‌కు ఆ శక్తి లేదు.
మనుషుల జడ్జ్‌మెంట్స్ ఒకోసారి చాలా క్రూయల్‌గా ఉంటాయి. ఎలా ఉన్నా, ఎలా లేకున్నా ఏదో ఒకటి అనేస్తారు. సినిమాల్నైనా అంతే, మనుషుల్నైనా అంతే. ఆడవాళ్లనైతే వాళ్ల అప్పియరెన్స్‌తో జడ్జ్‌చేసి పారేస్తారు. అక్కడ బాగోలేదని, ఇక్కడ బాగోలేదనీ, ఇలా ఉంటే బాగుండేదని, అలా లేకుంటే బాగుండేదనీ. తిండి లేక చచ్చిపోయినట్టు... గ్లామర్ కోసం సమాజం పడి చచ్చిపోతున్నట్టుగా ఉంటాయి వీళ్ల మాటలు!
అందానికి డెఫినిషన్స్ ఏమిటి? డెకరేషన్స్ ఏమిటి? ఎవరు ఎలా ఉంటే అదే అచ్చమైన అందం. అచ్చమైన దాన్ని ‘అందం’గా సొసైటీ యాక్సెప్ట్ చెయ్యలేకపోవచ్చు. వదిలేయడమే. షేక్స్‌పియర్ టు రోబీ ఠాగోర్... ఎంతమంది ఎన్ని రాయలేదూ! వాళ్లెంత పువ్వుల్లాంటి కల్పనలు అల్లినా... రియాలిటీనే కదా ఆ సొగసైన అల్లికలను పట్టి ఉంచేది. రియాలిటీలో అందం ఉంది. రియాలిటినీ అంగీకరించడంలోనూ అందం ఉంది.
మాధవ్ శింగరాజు