
ఆ సినిమాతో వారసురాళ్ల తెరంగేట్రం?
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాను యువ హీరో టైగర్ ష్రాఫ్తో చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ హిట్ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ పార్ట్లో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉండగా.. రెండో భాగంలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో ఉండబోతున్నారు. హీరో పాత్రకి టైగర్ ష్రాఫ్ ఎంపిక కాగా.. హీరోయిన్ల వేట మొదలైంది.
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్, శ్రీదేవి కూతురు జాన్వి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసే అవకాశాలున్నాయట. అదే విషయమై వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్ వారసురాళ్లను ఇంట్రడ్యూస్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే నూతన నటీనటుల పరిచయంపై ఓ ట్రేడ్ అనలిస్ట్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిర్మాణ సంస్థలు ఓ స్టార్ హీరోయిన్తో సినిమా చేయడం కంటే ఓ నూతన తారను పరిచయం చేయడమే సేఫ్ అన్నారు. సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయం పక్కన పెడితే.. కొత్త తారలతో కుదుర్చుకునే ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాల వరకు నిర్మాణ సంస్థకు రాబడి వస్తూనే ఉంటుందట.
ఉదాహరణకు ఏదైనా ఓ నిర్మాణ సంస్థ కొత్తవారిని పరిచయం చేయాలనుకుంటే.. ముందే వారితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది. వచ్చే ఐదేళ్ల వరకు వారి సంపాదనలో 20% సదరు నిర్మాణ సంస్థకు చెల్లిస్తూ ఉండాలి. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ప్రకటనలు, లైవ్ షోలు, డ్యాన్స్ షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వేటిలో పాల్లొన్నా సరే.. వాటి నుంచి వచ్చిన సంపాదనలో 20% మాత్రం వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిందేనట. ప్రముఖ దర్శక, నిర్మాత అయిన ఆదిత్య చోప్రా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారట.
కాగా 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ద్వారా బాలీవుడ్కి పరిచయమైన అలియా భట్, సిద్ధార్ధ్, వరుణ్ ధావన్ ల నుంచి ఇప్పటికే కోట్ల రూపాయలు ఆ నిర్మాణ సంస్థకు అంది ఉంటాయన్నది ఆసక్తికర విషయం. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 విషయానికొస్తే.. జాన్వి, సారాలు ఈ సినిమా ద్వారా తెరకు పరిచయమవుతారా లేదా అన్నది చూడాలి.