గీతాలావిష్కరణలో తారం ఉదయమాగిరదు
ఒక వ్యక్తి జీవిత పోరాటంగా తెరకెక్కిన చిత్రం తారం ఉదయమాగిరదు. విశేషం ఏమిటంటే ఈ చిత్ర కథకుడు, నిర్మాత, కథానాయకుడు ఐఎస్‌ఎస్.ఆంతోని నిజ జీవిత ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ఇది. ఆర్థికసమస్యలతో పోరాడే కథానాయకుడి గెలుపునకు కారణం తన తల్లిదండ్రులా? కట్టుకున్న భార్యనా?బంధువులా, లేక స్నేహితులా? అన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న తారం ఉదయమాగిరదు చిత్రాన్ని హృదయం ఫిలింస్ పతాకంపై రాజీ. ఐఎస్‌ఎస్.ఆంతోని నిర్మిస్తున్నారు. ఆస్టిక్.అరుణ్.జి కథనం, మాటలను అందించిన ఈ చిత్రానికి బాబు రాజేంద్రన్ దర్శకత్వ బాధ్యతలను నిర్విహ ంచారు.బీఆర్‌కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్ర ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు.
ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం సంగీత దర్శకుడు బీఆర్‌కే మలయాళంలో పలు చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడని తెలిపారు. ఇందులోని అమ్మ పాట పాడినప్పుడు తాను తనకు తెలియకుండా కంటతడి పెట్టానని చెప్పారు. చిత్రంలోని పాటలన్నీ బాగా వచ్చాయని, చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిత్ర పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాత ఐఎస్‌ఎస్.ఆంతోని మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాత్రలకు చెందిన వారు 70 శాతం జీవించే ఉన్నారని తెలిపారు.ఈ చిత్ర నిర్మాణానికి తన భార్య సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. చిత్రంలో పాటలు చాలా సహజత్వంతో కూడుకుని, వినసొంపుగా ఉన్నాయని మరో అతిథి అభిరామి రామనాథన్ పేర్కొన్నారు.