బాలీవుడ్ సినిమా జడ బిగువుగా వేసుకుంది. కొంగు దోపింది. కథల రంగంలోకి కాలు మోపింది. సినిమా రాజ్యాన్ని ఏలడానికి రాణి కదిలివచ్చింది. ఇప్పటి దాకా హీరోలకే టిక్కెట్లు తెగుతాయి అనుకునే వాళ్లకు పురుషాహంకారం తెగుద్ది. 2019లో హీరోయినే వసూల్ రాణి. రాబోయేవన్నీ ఆమె ఆట్రాక్షన్సే.
స్క్రీన్ మీద మొదట హీరో పేరు పడుతుంది. తర్వాత హీరోయిన్ పేరు. ప్రేక్షకులు హీరో పోస్టర్‌ని చూసి థియేటర్‌కు వస్తారు. హీరోయిన్ ఎవరైనా పర్లేదు. కథను హీరో నడుపుతాడు. హీరోయిన్ పాటల వరకూ పక్కన ఉంటే చాలు. మనది మగవాళ్ల సమాజం అంటారు కాబట్టి సినిమా కథలు కూడా మగవాళ్ల ఆధారంగానే తిరుగుతుంటాయి. పరిశ్రమలో గాని, ప్రేక్షకుల భావజాలంలోగాని పురుష కేంద్రిత ఇగోనే కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల హీరోయిన్ ముందు వరుసలో నిలబడి కథ చెప్పడం గతంలో అరుదుగా ఉండేది. ‘మదర్ ఇండియా’, ‘సీతా అవుర్ గీతా’, ‘దామిని’ లాంటి సినిమాలు హిందీలో గతంలో వచ్చాయి. కానీ ఆ వరుస కొనసాగలేదు. ప్రాబ్లమ్ ఏమిటంటే హీరోయిన్ లీడ్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ని ఆ తర్వాత ఏ హీరో బుక్ చేయడానికి ఇష్టపడడనే అభిప్రాయం ఉంది. సమస్య ఎందుకు అని అలాంటి పాత్రలు వేయడానికి హీరోయిన్‌లు కూడా కొంచెం వెనకడుగు వేసేవారు. కానీ గత ఇరవై ఏళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరిగాయి. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘ఇంగ్లిష్ వింగ్లిష్’... ఇవన్నీ ఘన విజయం సాధించాయి. కంగనా రనౌత్ వంటి వారు ‘క్వీన్’ వంటి సినిమాని అతి సులువుగా భుజాల మీద మోసి హీరో డేట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పని లేదు... మంచి కథ ఉంటే హీరోయిన్‌లు సినిమాను హిట్ చేయగలరు అని నిరూపించారు. పరిశ్రమ, ప్రేక్షకులు కూడా క్రమంగా ఇలాంటి సినిమాలకు రెడీ అవుతున్నారు. ‘నీర్‌జా’, ‘మామ్’, ‘పింక్’లాంటి సినిమాలు గత ఒకటి రెండు సంవత్సరాలలో వస్తే 2019లోనూ కొన్ని స్త్రీ ఆధారిత సినిమాలు రానున్నాయి. వాటి వివరాలు.
ఝాన్సీ కీ రాణి
ఝాన్సీ రాణి అసలు పేరు ఎవరికీ తెలియకపోయినా ఝాన్సీ రాణి అందరికీ తెలుసు. బిడ్డను వీపుకు కట్టుకుని బ్రిటిష్ వారితో పోరాడిన ఈమె కథ పల్లెపల్లెకు సుపరిచితం. ఇలాంటి నాయకుడు చరిత్రలో ఉండి ఉంటే ఈసరికి ఎప్పుడో సినిమా వచ్చి ఉండేది. కానీ స్త్రీ కావడంతో ఇంత కాలం పట్టింది. స్త్రీ ఆధారిత సినిమాలు జనాదరణ పొందుతుండటంతో అందరూ గౌరవించే ఝాన్సీ రాణి కథ తెర మీద రూపుదిద్దుకుంది. ఈ ప్రయత్నంలో ఒక తెలుగువాడు క్రిష్ దర్శకుడిగా పాలుపంచుకోవడం ఆనందించాల్సిన విషయం. ప్రతిభావంతురాలైన నటి కంగనా రనౌత్ ఈ ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకొని కష్టపడటం వల్ల కూడా సినిమా బాగా వచ్చి ఉంటుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. క్రిష్ మొదలెట్టిన ‘మణికర్ణిక’ చిత్రాన్ని చివర్లో కంగనా పూర్తి చేశారు. నటించి, దర్శకత్వం కూడా వహించడం వల్ల ఇది స్త్రీ శక్తి సంపూర్ణంగా పాలుపంచుకున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగులోనూ అనువాదం అయింది.
యాసిడ్ బాధితురాలు
‘పద్మావత్’ సినిమాలో నటించినందుకు దీపికా పదు కోన్ ముక్కు, చెవులు కోస్తామని కొందరు ఆవేశపరులు కామెంట్ చేశారు. ఆ సినిమాలో ఆమె నటించిన పాత్ర ఆదరణ ఎలా ఉన్నా ఆమె ఎంచుకున్న తర్వాతి పాత్ర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె పోషించనున్నది ఒక యాసిడ్ బాధితురాలి పాత్రను. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తయారు కానుంది. 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ అటాక్ ఎదుర్కొన్నారు లక్ష్మి. కానీ ఎంతో ధైర్యంతో జీవితంలో నిలబడ్డారు. యాసిడ్ కాల్చింది నా శరీరాన్నే కానీ ఆత్మవిశ్వాసాన్ని కాదు అంటూ యాసిడ్ బాధితుల కోసం ఎన్‌జీవో నడుపుతున్న లక్ష్మి జీవితం స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని మరింత మందికి చేరువయ్యేలా ఈ సినిమా చేయనున్నారు దీపిక. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. యాసిడ్ బాధితురాలిగా కనిపించడం కోసం దీపిక ప్రోస్థటిక్ మేకప్‌ను ఉపయోగించనున్నారు. ‘చప్పాక్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకురాలు. ఆలియా భట్ లీడ్ రోల్‌లో ఇంతకుముందు మేఘనా తీసిన ‘రాజీ’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘చప్పాక్’పై భారీ అంచనాలున్నాయి.
తొలి పైలట్
శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ది ఒక సినిమా వయసు. సాధారణంగా ఈ వయసు హీరోయిన్లు గ్లామర్ వేషాల కోసం పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నించాలి. కాని జాన్వీ కపూర్ తన రెండవ సినిమాగా ఒక బయోపిక్‌ను ఎంచుకుని తాను భిన్నం అని సంకేతం ఇచ్చారు. భారతదేశానికి మొదటి ఫిమేల్ పైలట్ అయిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తయారవుతున్న సినిమాలో ఆమె నటించనున్నారు. గుంజన్ కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికులను శిబిరాల్లో చేర్చడంలో కీలక పాత్ర పోషించారట. జాన్వీ ఈ పాత్ర కోసం పైలట్ క్లాసులకు హాజరవుతూ, గుంజన్‌ని కలసి మాట్లాడుతున్నారట. కరణ్ జోహార్ ఈ చిత్రనిర్మాత.
బ్యాడ్మింటన్ స్టార్
బ్యాట్‌ని కూడా కత్తిలా ఝళిపించవచ్చు అని నిరూపించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. మన హైదరాబాద్ స్టార్ సైనా ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తి. సక్సెస్ శిఖరానికి చేరాలంటే ఘనమైన కుటుంబాల్లో పుట్టాల్సిన అవసరం లేదనీ శ్రీమంతులే దానిని సాధించగలరని అనుకునేవారికి సైనా విజయం ఓ కనువిప్పు. అందుకే సైనా కథ బాలీవుడ్‌ని ఆకర్షించింది. ఈ చిత్రంలో సైనాగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం శ్రద్ధా శ్రద్ధగా రోజుకు నాలుగైదు గంటల పాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాదే ఈ చిత్రం రిలీజ్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు చిత్రదర్శకుడు అమోల్ గుప్తా.
పోలీస్ ఆఫీసర్
శివానీ శివాజి అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ‘మర్దానీ’ చిత్రంలో కనిపించారు రాణీ ముఖర్జీ. చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమంగా చిన్నపిల్లలను రవాణా చేయడం) అనే కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. రాణీ ముఖర్జీయే కథానాయిక. సెకండ్ పార్ట్‌లో ఏ అంశాన్ని డీల్ చేస్తారో వేచి చూడాలి. ‘మర్దానీ 2’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.
మోటివేషనల్ స్పీకర్
బాలీవుడ్‌లో చాలా గ్యాప్ తర్వాత ప్రియాంకా చోప్రా చేస్తున్న చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’. మోటివేషనల్ స్పీకర్ ఐషా చౌదరి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఐషా చౌదరిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ కనిపించనున్నారు. జైరా తల్లిగా ప్రియాంక నటిస్తారు. సోనాలీ బోస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. వివాహం తర్వాత ప్రియాంక ఫస్ట్ రిలీజ్ ఇదే అవుతుంది. అలాగే ఆమె తల్లి పాత్ర చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
పోర్న్ స్టార్
నటి షకీలా జీవితం అంతా ఎత్తుపల్లాల మయం. తెలుగు ప్రాంతంలో పుట్టి కేరళలో సంచలనం సృష్టించారు. అంత సక్సెస్ తర్వాత కూడా సాధారణ జీవితం గడుపుతున్న ఈ నటి జీవితం వెండితెరకు ఎక్కుతోంది. షకీలా పాత్రలో రీచా చద్దా కనిపిస్తారు. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రీచా బరువు కూడా పెరిగారు. ‘‘బయోపిక్ అంటే అన్నీ నిజాలే చెప్పాలి. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయి’’ అని ఆ మధ్య షకీలా పేర్కొన్నారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
ఇద్దరు.. ముగ్గురు... అందరూ
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే దాదాపు సోలో హీరోయిన్ నటిస్తారు. అయితే ఇద్దరు ముగ్గురు కథానాయికలు ముఖ్యపాత్రల్లో వస్తున్న సినిమాలు కూడా ప్రస్తుతం ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ సినిమాలో కొంకణా సేన్ శర్మ, భూమి ఫడ్నేకర్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బాలాజీ టెలి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలంక్రితా శ్రీవత్సవ్ దర్శకుడు. అలాగే ‘మణికర్ణిక’ తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లోనూ కనిపిస్తారు కంగనా రనౌత్. ‘పంగా’ అనే టైటిల్‌తో కబడ్డీ ఆట బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా చేస్తున్నారు కంగనా. అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. నటి తాప్సీ. నటి భూమీ ఫడ్నేకర్‌లు ప్రొఫెషనల్ షూటర్స్ చంద్రూ తోమర్, ప్రకాషీ తోమర్ కథను సినిమాగా చెప్పడానికి సిద్ధమయ్యారు. గన్ షూటింగ్ మాత్రమే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ యాసను కూడా నేర్చుకుంటున్నారట ఈ కథానాయికలు. వచ్చే నెల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మార్స్ మిషన్ విజయవంతంగా జరపడానికి కారణమైన లేడీ ఇంజనీర్స్ కథను ‘మిషన్ మంగళ్’ ద్వారా చెప్పనున్నారు. విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యామీనన్ ముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో అక్షయ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.
ఇన్‌పుట్స్: గౌతమ్ మల్లాది
Comments
Please login to add a commentAdd a comment