
ఉరియడి–2 చిత్రం మిమ్మల్ని సంతోషపరచకపోవచ్చునేమో గానీ కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని ఆ చిత్ర నిర్మాత నటుడు సూర్య అన్నారు. వర్ధమాన నటుడు, దర్శకుడు విజయకుమార్ చేసిన తొలి ప్రయత్నం ఉరియడి. ఆ చిత్రం మంచి విమర్శనలతో పాటు, కమర్శియల్‌గానూ హిట్ అయి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో దానికి సీక్వెల్‌గా ఉరియడి–2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోనూ తనే కథానాయకుడిగా నటించారు.
నిర్మాణ బాధ్యతలను మాత్రం నటుడు సూర్య చేపట్టారు. ఆయన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్‌వసంత సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక సత్యం సినీ థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను ఆవిష్కరించిన నటుడు సూర్య మాట్లాడుతూ ఉరియడి చిత్రం విడుదలై నాలుగైదేళ్లు కావస్తున్నా విజయకుమార్ తదుపరి చిత్రం ఇంత వరకూ తెరపైకి రాకపోవడానికి కారణం ఏమటనే ప్రశ్న తలెత్తవచ్చునన్నారు.
తను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ రంగంలోకి వచ్చి విజయం సాధించారని అన్నారు. అందుకు కారణం ఆయనలోని నిజాయితీ అని పేర్కొన్నారు. ఈ ఉరియడి 2 చిత్రం కూడా విజయకుమార్ నిజాయితీగా తీసిన కథా చిత్రం అని అన్నారు. చిత్రంలోనూ తను వాస్తవాలనే చర్చించారని చెప్పారు. అలాంటి చిత్రానికి తాను నిర్మాత కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఎవరినీ సంతోషపరచకపోయినా, కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని సూర్య చెప్పారు.
దీనికి ఆనంద్‌వసంత సంగీతాన్ని అందించారని, ఇందులో ఆయన రెండు పాటలను కూడా పాడడం విశేషం అన్నారు. ఇకపైకూడా ఆయన పనయనం తమ సంస్థలో కొనసాగుతుందని అన్నారు. ఉరియడి–2 చిత్రం సమకాలీన రాజకీయాలను చర్చించే కథాంశంతో కూడినదిగా తెలుస్తోంది. సమాజంలో సామాజిక న్యాయం మరుగున పడినప్పుడు అన్ని అవకతవకలు జరుగుతాయని, మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని, హక్కుల కోసం పోరాడడం మన బాధ్యత. రాజకీయాల్లో మన ప్రమేయం ఉండాలని, లేకుంటే రాజకీయాలు తమ జీవితంలో తలదూరుస్తాయని చెప్పే చిత్రంగా ఉరియడి–2 చిత్రం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రాన్ని మే 5న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment