అచ్చమైన స్వచ్ఛమైన సినిమా ఇది
అచ్చమైన స్వచ్ఛమైన సినిమా ఇది
Published Tue, Dec 17 2013 12:49 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
‘‘పల్లెటూరి స్వచ్ఛత, బావామరదళ్ల సరసం, గోదావరి వెటకారం, చక్కని హాస్యం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు... వీటన్నిటి కలగలుపే ‘ఉయ్యాలా జంపాలా’. అచ్చమైన స్వచ్చమైన సినిమా ఇది’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్ పి. తో కలిసి నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’.
రాజ్‌తరుణ్, ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేమ్ అవిక జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సన్నీ ఎం.ఆర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.సురేష్‌బాబు, నాగచైతన్య ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శరత్‌మరార్, జెమినీ కిరణ్‌లకు అందించారు. ఈ సందర్భంగా వీడియో విజువల్స్ ద్వారా నాగార్జున మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం యువతరానికి బాగా నచ్చే సినిమా ఇది. సినిమా నచ్చి మాతో సురేష్‌బాబు కూడా కలిశారు.
కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది’’అని నమ్మకం వ్యక్తం చేశారు. కథ కల్పితమైనప్పటికీ పల్లెటూళ్లలో తాను చూసిన కొన్ని పాత్రలను ప్రేరణగా తీసుకొని ఈ కథను అల్లానని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ఊరిని ఒకసారి చూడాలనుకుంటారని దర్శకుడు చెప్పారు. ముచ్చటైన సినిమా ఇదని అక్కినేని అమల తెలిపారు. ప్రేమతో సినిమా చేస్తేనే ఇలాంటి సినిమాలొస్తాయని నాగచైతన్య చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నాని, సుమంత్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీరెడ్డి తదితరులు మాట్లాడారు.
Advertisement