బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసి ందే. ఈ నేపథ్యంలోనే ఉయ్యాలవాడకు చెందిన దాదాపు ఏడు కుటుంబాలు లక్ష్మి నేతృత్వంలో ఇక్కడికి చేరుకున్నాయి. తమ కుటుంబసభ్యులకు కొణిదెల ప్రొడక్షన్స్ సభ్యులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఒప్పందం కూడా చేసుకున్నారన్నారు. అయితే శనివారం రాత్రి హీరో రామ్‌చరణ్ మేనేజర్ అభిలాశ్ ఫోన్ చేసి, ఇక్కడికి రావద్దని కథపై తమకెలాంటి హక్కులు లేవని చెప్పడంతో తాము అవాక్కయ్యామన్నారు. తమ నిరసన వ్యక్తం చేసేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. తమ కథను వాడుకోవడమే కాకుండా తమ ఆస్తులను కూడా వాడుకున్నారన్నారు. కథ విషయంలో తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇంటి ముందున్న సామగ్రిని నాశనం చేశారని ఆరోపించారు.
మార్చి 11న చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఏడు కుటుంబాలకు చెందిన 22 మందిని పిలిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రామ్‌చరణ్ న్యాయం చేస్తానని మాటిచ్చారని, అయితే మధ్యవర్తులు కొందరు అందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సిబ్బంది వారితో మాట్లాడి తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఆ కుటుంబాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఇదిలా ఉండగా ఈ విషయంలో ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించాయని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సైరా నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment