Saira Narasimha Reddy
-
సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్ ట్వీట్
బ్లాక్ బాస్టర్ హిట్ సైరా నరసింహారెడ్డి చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్ ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గా కృతజ్ఙతలు తెలిపారు. ‘బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ క్రూ, ఏ బ్రిలియంట్ టీం, థ్యాంక్యూ వన్ అండ్ ఆల్’ అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాను రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేశారు. Best EXPERIENCE !! Best CAST!! & A BRILLIANT team!! A year since #SyeRaa released. Thank you one and all.@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #MahatmaGandhi pic.twitter.com/dQJcR5rVRA — Ram Charan (@AlwaysRamCharan) October 2, 2020 స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సురేందర్ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన చిరంజీవికి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఆ సినిమా కోసమే ఆ లుక్! -
దేశభక్తిని రగిలించే చిత్రం ‘సైరా’
సాక్షి, న్యూఢిల్లీ: దేశభక్తిని రగిలించే చిత్రాల కొరతను సైరా నరసింహారెడ్డి తీర్చగలుగుతుం దని భావిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. జాతీయ భావాన్ని పెంపొందించే చిత్రాలు తగ్గిపోయాయని, ఇలాంటి తరుణంలో ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమాను అందించడం సంతోషకరమ న్నారు. వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలస పాలకుల దుర్మార్గాలను, అరాచకాలను చక్కగా తెరకెక్కించారని, అంతర్గత కలహాలు, స్వార్థం వల్లే గతంలో మనం స్వాతంత్య్రాన్ని కోల్పోయామన్న సందేశం చిత్రంలో ఇమిడి ఉందన్నారు. ఇంతటి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత రామ్‌చరణ్, చిత్రా న్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్‌రెడ్డిని అభినందించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ‘మనమిద్దరం రాజకీ యాలు వదిలేశాం.. ఇక ముందు మీరు ఇలాంటి మరెన్నో చిత్రాల్లో నటించి ప్రజలను రంజింపజేయాలి’ అని చిరంజీవికి సలహా ఇచ్చినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. సంతోషంగా ఉంది సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రజల మన్ననలు పొందడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఉపరాష్ట్రపతి ఈ చిత్రాన్ని వీక్షించడం ఎంతో సంతృíప్తినిచ్చిందన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలిసి ‘సైరా’ను వీక్షించాలని చిరంజీవి కోరనున్నట్టు తెలిసింది. -
సైరా నాకో పుస్తకం
‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా రియలిస్టిక్‌గా ఉండాలి. గ్రాండియర్‌గా ఉండాలనుకున్నాను. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయడం నాకు చాలా టఫ్ అనిపించింది. కథను జెన్యూన్‌గా చెప్పాం. పరుచూరి బ్రదర్స్ ఈ కథ చెప్పగానే శక్తివంతమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారే కనిపించారు. చిరంజీవిగారితో ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా హార్డ్‌వర్క్ కూడా కొంత హెల్ప్ చేసిందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పిన విశేషాలు. ►ధృవ’ సినిమా తర్వాత ‘నాన్నగారితో సినిమా చేస్తావా?’ అని రామ్ చరణ్ అన్నాడు. స్టైలిష్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి గురించి మాట్లాడుకున్నాం. చిరంజీవిగారు నరసింహారెడ్డి జీవితంతో సినిమా చేద్దాం అనగానే నేను ఓకే చెప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి నాకు పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లి నరసింహారెడ్డి ఎంత పెద్ద వీరుడో తెలుసుకున్నాను. ఇంత పెద్ద సినిమా చేయాలంటే మానసికంగా ధృడంగా ఉండాలనుకున్నా. ఆ తర్వాత నరసింహారెడ్డిగారి గురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు, గెజిట్స్, బుర్రకథల గురించి పరిశోధన చేశాను. వాటిలో నరసింహారెడ్డిగారి గురించి ఉన్న పాయింట్స్ నన్ను టచ్ చేశాయి. వాటి ద్వారా నేను తయారు చేసిన కథను పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గరకు తీసుకువెళ్లాను. బాగుందన్నారు. ఆ తర్వాత చిరంజీవిగారి వద్దకు వెళ్లాను. నెలలోనే వచ్చారేంటీ? అని చిరంజీవిగారు షాక్ అయ్యారు. నేను వెళ్తున్న దారి సరైందో కాదో అని తెలుసుకోవడానికి ఓ రెండు గంటలు చిరంజీవిగారికి కథ చెప్పాను. ఆయన నన్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. అలా ‘సైరా’ ప్రయాణం మొదలైంది. ► ఎప్పుడైనా ఓ కథ పుట్టాలంటే ఓ ప్రేరణ కలగాలి. కథలో విషయం మొదలు నుంచి చివరి వరకు స్పష్టంగా ఉండేందుకు ఆ ప్రేరణ ఉపయోగపడుతుంది. పరుచూరి బ్రదర్స్ కథ రాశారు. అది ఒక వీరుడి కథ. అది వారి దృష్టి కోణంలో ఉంది. బ్రిటీషర్లు నరసింహారెడ్డిని ఓ దొంగలా ఎలా చిత్రీకరించాలనుకున్నారనే విషయం కాకుండా.. ప్రాణత్యాగం చేసిన అలాంటి వీరుణ్ణి మనం ఎలా చూడాలి? అనే కోణంలో నా స్క్రిప్ట్‌ను రాసుకున్నాను. ఆ దృష్టి కోణంలో ‘సైరా’ ఉంటుంది. ►చిరంజీవిగారి అనుభవం మాకు ఉపయోగపడింది. కొన్ని చర్చల్లో మనతో కన్విన్స్ కానప్పుడు నలుగురు రైటర్స్‌ను పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. ‘సైరా’ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. చరణ్ కోసం సినిమాలో ఓ క్యారెక్టర్‌ను అనుకున్నాం. కానీ సినిమా నిడివి పెరుగుతుందని ఆ క్యారెక్టర్‌ను అసలు షూటే చేయలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. అందుకే బయోపిక్ కాదు అంటున్నాం. ►సీన్ దర్శకుడికి నచ్చిందా? లేదా? షాట్ కరెక్ట్‌గా వస్తుందా? లేదా అని పరిశీలించుకుంటూ అమితాబ్ బచ్చన్, చిరంజీవిగార్లు దర్శకులు చెప్పింది చేసుకుంటూ వెళ్తుంటారు. అందుకే వారు మెగాస్టార్స్. బడ్జెట్ గురించి ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఒక వీరుడి కథ చెబుతున్నాం. ఇంతమంది స్టార్స్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. మా సినిమాలోని స్టార్స్ అందరూ గొప్పవారు కాబట్టే చేయగలిగాను. ఇందులో నా గొప్పతనం లేదు. సినిమా విలువ వారికి తెలుసు. ►విజన్ ఆఫ్ ది హిస్టరీలో డైరెక్టర్‌గా నా విజన్ ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ ఇలాంటి అంశాలు ఏ కథలో అయినా ఉంటాయి. కానీ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ అంటే ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లాలి. దాన్ని సవాల్‌గా స్వీకరించాను. రాజీవన్‌గారు, రత్నవేలుగారు బాగా వర్క్ చేశారు. సాయిమాధవ్ బుర్రాగారు మంచి డైలాగ్స్ రాశారు. ►ఈ ప్రాజెక్ట్‌లో నేను మూడేళ్లుగా ఉన్నాను. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రెండు ఎపిసోడ్లు పూర్తి చేయడానికి దాదాపు 125 రోజులు పట్టింది. మిగతాదంతా వంద రోజుల్లో పూర్తి చేశాం. ఈ సినిమా నాకు ఒక పుస్తకం. నేనే కాదు ఈ సినిమా కోసం అందరూ రెండున్నరేళ్లు కష్టపడ్డారు. ►యుద్ధ సన్నివేశాల కోసం మాకు దాదాపు రెండొందల గుర్రాలు కావాలి. బ్రిటీషర్ల గెటప్‌లో ఉండే ఆర్టిస్టులు కావాలి. వారందరూ ఇక్కడికి వచ్చే కంటే మేమే జార్జియా వెళ్లొచ్చనుకున్నాం. టెక్నీకాలిటీ కోసమే అక్కడికి వెళ్లాం. నాకు తెలిసి ఈ సినిమా కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి వారసులు మంచోళ్లు. వారిని ఎవరో తప్పుదోవ పట్టించారని అనుకుంటున్నాను. నిజానికి ఈ సినిమా చేసినందుకు చిరంజీవిగారి ఫొటోను వారు ఇంట్లో పెట్టుకోవాలి. ►జార్జియాలో షూటింగ్ కోసం నేను అక్కడ అరవైఐదు రోజులు ఉన్నాను. నలభై రోజుల ముందే అక్కడికి యూనిట్ వచ్చారు. ఒక సిటీ నుంచి అరవై కిలోమీటర్లు వెళ్లి షూటింగ్ చేయాలి. అక్కడ కూడా ఒక ఎడారిలా ఉంటుంది. మనకు వర్షం వస్తే షూటింగ్ ఆగిపోతుంది. కానీ గాలి వల్ల మాకు షూటింగ్ ఆగిపోయింది అక్కడ. అలాంటి లొకేషన్ అది. అక్కడ మేం దాదాపు 40 రోజులు షూటింగ్ చేశాం. అక్కడ చుట్టుపక్కల ఏమీ లేదు. ఇంతమందికి ఇబ్బంది అవుతుందని ఓ సిటీనే నిర్మించారు చరణ్. అంటే 200 గుర్రాలూ 60 రోజులు ఉండాలి. వాటికోసం ఒక షెడ్‌ను ఏర్పాటు చేశారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి పెద్దవారికి వరకు ఒక క్యాబిన్‌ను ఏర్పాటు చేశారు. అందరూ అందులో ఉండాలి. భోజనం చేయడానికి ఒక షెడ్‌ను సిద్ధం చేయించారు. మళ్లీ గాలి రాకుండా కవరేజ్ ఉంటుంది. ఇదంతా చాలా బడ్జెట్‌తో కూడుకున్నది. ఇక్కడి నుంచి 250 మంది సభ్యులు వెళ్లాం. ఇంత మంది విదేశాలు వెళ్లి సినిమా చేయడం హిందీలో కూడా లేదు. అందరి బాగోగులు చూశారు. అదీ రామ్‌చరణ్ అంటే. -
‘వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేస్తా..’
సింహాలతో సెల్ఫీ దిగాడు రత్నవేలు! ఒక సింహం ‘నరసింహారెడ్డి’. ఇంకో సింహం సురేందర్‌రెడ్డి. మూడో సింహం కూడా కనిపిస్తుంది. ఆ సింహం.. రత్నవేలే! సినిమాటోగ్రాఫర్. సరేందర్రెడ్డి ‘సైరా’ స్క్రిప్టును.. నరసింహారెడ్డి మెగా గెటప్పును.. రత్నవేలు కెమెరాలోంచి చూడాల్సిందే. మనం చూస్తాం సరే..రెండు వందల ఏళ్ల నాటి కథని ఆయన మైండ్ ఏ లెన్స్‌లతో చూసింది! చదవండి. రత్నవేలుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘సైరా’లో ఎలా భాగమయ్యారు? ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ‘సైరా’ సినిమా చేస్తారా? అని రామ్‌చరణ్ అడిగారు. అది వాళ్ల నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్. దాని గురించి పది పన్నెండేళ్లుగా చర్చల్లో ఉంది. మీరైతే చాలా ఫాస్ట్‌గా, చాలా క్వాలిటీతో చేస్తారు. మీరు జాయిన్ అయితే బావుంటుంది’ అన్నారు రామ్ చరణ్. నిజానికి ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కమిట్ అవ్వాలన్నది నా ఫిలాసఫీ. అప్పటికి ‘రంగస్థలం’ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ‘ప్రిపరేషన్ కోసం కనీసం రెండు నెలలు సమయం కావాలి’ అని చిరంజీవిగారితో అన్నాను. ఒకవైపు ‘రంగస్థలం’ చేస్తూనే సాయంత్రం ప్యాకప్ చెప్పాక ‘సైరా’ ని ఎలా షూట్ చేయాలా? అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇందులో కొన్ని వందల మంది మనుషులు, గుర్రాలు, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి. అన్నీ అనుకున్న టైమ్‌కి జరగాలి. అలా జరగాలంటే టెక్నికల్‌గా చాలా బలంగా ఉండాలి. ఇద్దరు యాక్టర్స్‌ని ఫ్రేమ్‌లో పెట్టి షూట్ చేయడం ఈజీ. కానీ ‘సైరా’లో ఎక్కువగా వందల మంది కనిపిస్తారు. అందుకని హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమాలో చాలెంజింగ్ పార్ట్? సినిమా మొత్తం సవాలే. 1840 లలో వాతావరణం ఎలా ఉండేదో మనకు పెద్ద అవగాహన ఉండదు. ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లగలగాలి. లేకపోతే అంతా వృథా అవుతుంది. ఎలాంటి కెమెరాలు, లెన్స్‌లు వాడారు? గుర్రాలతో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడం చాలా టఫ్. గుర్రాలు 60–70 కి.మీ. వేగంతో పరిగెడతాయి. ఆ సన్నివేశాలను కెమెరాతో బంధించాలంటే అంత వేగంగా కెమెరా పరిగెత్తాలి. సరిగ్గా రాకపోతే మళ్లీ ఆ సన్నివేశం తీయాలంటే రెండు గంటలు శ్రమించాలి. ఒకే టేక్‌లో సీన్‌ని పూర్తిచేయాలి. అందుకే మూవీ ప్రో ఎక్సెల్ మౌంట్ కెమెరా వాడాం. ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీరించాలనుకున్న వారం ముందే ఆ టెక్నాలజీ హాలీవుడ్లో వచ్చింది. ఇంకా హాలీవుడ్లో కూడా సినిమాల్లో అంతగా వాడలేదు. ఇంకా బ్లాక్ కామ్ని ఏటీవి (ఏటీవీ అంటే ఓ వాహనం లాంటిది. వేగంగా సాగే యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు ఈ వాహనంలో కెమెరాని తీసుకెళతారు. కుదుపులకు కెమెరా షేక్ కాదు)కి ఏర్పాటు చేశాం. కొన్ని ఫైట్ సీన్లు అలా షూట్ చేశాం. అలాగే ‘స్పైడర్ క్యామ్’ వాడాను. ‘స్పైడర్‌మేన్’ సినిమాలకు అది వాడతారు. క్రికెట్ మ్యాచుల్లో కూడా గమనించే ఉంటారు. తాడుకి కట్టిన కెమెరా గ్రౌండ్లో కిందకీ పైకీ తిరుగుతుంటుంది. అది మోషన్ కంట్రోల్ కెమెరా. యుద్ధ సన్నివేశాల్లో రెండుగుర్రాలు తలపడతాయి. అప్పుడు ఈ కెమెరాలు వాటి దగ్గర ఉంటే పరికరాలు ధ్వంసమయ్యే అవకాశం ఎక్కువ. టాప్ యాంగిల్లో నుంచి చూపించడానికి స్పైడర్ క్యామ్ ఉపయోగపడుతుంది. నాలుగు భారీ క్రేన్లను లొకేషన్ చుట్టూ ఏర్పాటు చేశాం. జార్జియాలో షూట్ చేసిన సీన్స్‌కి ఇది ఉపయోగించాం. రష్యా నుంచి ఈ పరికరాన్ని తెప్పించాం. మీరు వాడే వారం ముందే ఆ ‘కెమెరా’ హాలీవుడ్‌కి వచ్చిందన్నారు. మరి.. దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా తెలుసుకున్నారు? ఏదైనా టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది అని తెలిసినప్పటి నుంచి దాని గురించి స్టడీ చేయడం మొదలుపెడతాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఆ అలవాటు ఉంది. ‘1 నేనొక్కడినే’ చిత్రీకరించే సమయంలో 90 శాతం తెలుగు సినిమాలు ఫిల్మ్లోనే చిత్రీకరిస్తున్నారు. కానీ మేం ఆ సినిమాను డిజిటల్లో షూట్ చేశాం. డిజిటల్లో ఎలా కనిపిస్తామో? అని చాలా మంది సందేహంలో పడ్డారు. మహేశ్‌బాబు చేస్తున్నారు అనేసరికి అందరికీ నమ్మకం వచ్చేసింది. మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ‘సైరా’కు చాలా మంది హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేశారు. యాక్షన్‌ని గ్రెగ్ పొవెల్, లీ వైటేకర్ చేశారు. లీ, నేను రజనీకాంత్‌గారి ‘లింగా’ సినిమాకు పని చేశాం. నేను ఉదయం 7 గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టాలంటే అందరూ ఉదయం 4 గంటల నుంచే పనుల్లో దిగాలి. అందుకే నేను ‘సన్ సీకర్’ అనే యాప్ వాడతాను. రేపు ఉదయం 6.45కి సూర్యోదయం అవుతుంది. ఆ సమయానికి అందరూ రెడీగా ఉండాలని ముందే చెబుతాను. అలా ప్లాన్ చేసుకునేవాళ్లం. చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డితో మీకిది మొదటి సినిమా ... ఆయనతో మీ సింక్ ఎలా కుదిరింది? ఈ స్క్రిప్ట్ చాలా బావుంది. నేను ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఫొటోగ్రఫీకి స్కోప్ ఉందా? లేదా అని మాత్రమే చూడను. సుకుమార్‌తో నేను చేసిన ‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే మనకు పెద్ద స్కోప్ లేదు కదా? అని వేరే కెమెరామేన్లు అంగీకరించకపోవచ్చు. కానీ లోతుగా వెళ్తే మనకు స్కోప్ దొరుకుతుందని చేశాను. సురేందర్ రెడ్డి మొదటిసారి కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నప్పుడు నాకు ఈ సన్నివేశం ఇలానే ఉండాలి అన్నట్టుండదు. ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చి వాళ్లనుంచి బెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతీ సీన్‌కి ఒకటికి రెండుసార్లు మాట్లాడుకుని ఏదైతే బావుంటుందో దాన్నే చేశాం. మొత్తం 250 రోజులు చిత్రీకరించాం. సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. ఇప్పుడు చెబుతున్నా.. ‘సైరా’ చిరంజీవిగారి కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్లే సత్తా ఈ సినిమాకు ఉంది టెక్నికల్‌గా, పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ సరిగ్గా కుదిరాయి. సాధారణంగా ఎక్కువ చేసి చెప్పడం నాకు నచ్చదు. కానీ ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు ముంబై, చెన్నై నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. ఇలాంటి సినిమాను ఒక ఏడాదిలో ఎలా పూర్తి చేశారు? అని అడిగారు. నైట్ ఎఫెక్ట్‌లో ఓ భారీ యుద్ధం ఉందని విన్నాం.. అవును. అది చాలా చాలెంజింగ్ వార్. సాధారణంగా యుద్ధాలు పగలే జరుగుతుంటాయి. బ్రిటీష్ వాళ్లు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నియమాలను అతిక్రమించి రాత్రి అటాక్ చేస్తారు. అది చాలా పెద్ద ఫైట్. ఇప్పటి వరకూ రాత్రులు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన సినిమాలు తక్కువ. దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. దాదాపు నెల రోజులు నైట్ షూట్ చేశాం పగలు తీసి రాత్రి ఎఫెక్ట్ ఇచ్చే స్కోప్ ఉంది కదా? చేయొచ్చు. అయితే అది హారర్ సినిమాలకు బాగానే ఉంటుంది. ఇది నిజంగా అనిపించాలి. అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా. రాత్రి పూట కాగడాలు పెట్టుకునేవారు. అది నిజంగా అనిపించాలి. ఈ నైట్ వార్కి గ్రెగ్ పొవెల్ ఫైట్ మాస్టర్. ఓ లొకేషన్ మొత్తం లైటింగ్ చేయాలంటే చాలా లైట్లు పెడతాం. అలా కాకుండా మూన్‌లైట్‌ని సృష్టించాలనుకున్నాను. దానికోసం ఓ సెపరేట్ లైటింగ్ సృష్టించాం. 200 అడుగుల క్రేనులు మూడు ఏర్పాటు చేశాం. లైట్ చుట్టూ సాఫ్ట్బాక్స్ పెట్టి వేలాడదీశాం. దాంతో మూన్లైట్ ఎఫెక్ట్ వచ్చింది. కిందంతా కాగడా వెలుతురులోనే షూట్ చేశాం. చిరంజీవిగారిలాంటి పెద్ద స్టార్ హీరోకు కేవలం కాగడా లైట్స్‌తో షూట్ చేయడం పెద్ద రిస్క్. కలర్ సరిగ్గా ఉండదు, నీడలు వస్తాయి అని ఆలోచిస్తారు. అయితే విజువల్‌గా చాలా అద్భుతంగా వచ్చింది. 25 నుంచి 30 రోజులు కోకాపేట్లో షూట్ చేశాం. ఇంకో విషయం ఏంటంటే అది వానాకాలం. కెమెరా పెట్టి మొత్తం రెడీ చేసుకున్నాక వర్షం పడేది. దానికి తగ్గట్టుగా లైటింగ్ చేశాం. ‘నువ్వు హాలీవుడ్లో ఉండాల్సివాడివి’ అని గ్రెగ్ పొవెల్ అభినందించారు. కేవలం కాగడా వెలుతురుతోనే షూట్ చేయడం అంటే చిరంజీవిగారు అంగీకరించారా? ఎవ్వరికైనా నమ్మకం కలగడం కష్టం. అయితే ఒక్కసారి నమ్మితే ఎవరూ ఆలోచించరు. ఆయన నా ‘రోబో, రంగస్థలం’ సినిమాలు చూశారు. నా ఆలోచనను నమ్మారు. కొన్నిసార్లు ఉన్న రూల్స్‌ని బద్దలు కొడితేనే కొత్త విషయాలు తెలుస్తాయి. కెమెరా ఐఎస్ఓ 800 ఉంటుంది. మేం 2500 ఐఎస్ఓ పెట్టి షూట్ చేశాం. ఈ సినిమాలో ప్రతీ సీన్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో చాలెంజ్‌లు విసరడమో చేసింది. ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఆలోచించి చిత్రీకరించుకుంటూ వచ్చాం. ∙‘రోబో’, ‘సైరా’.. ఏది కష్టం అనిపించింది? ‘రోబో’ అప్పుడు అదో ప్రయోగం. ఆ స్థాయిలో వచ్చిన సినిమాలు లేవు. అది క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా కష్టంతో కూడుకున్న సినిమా. ‘సైరా’ క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా, శారీరకంగా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా. ఆ సమయానికి అది పెద్దది. ఇప్పుడు ఇది పెద్దది. మామూలుగా పెద్ద సినిమా అంటే లుక్స్ బయటకు రావడం సహజం. ‘సైరా’ లొకేషన్ నుంచి ఒక్క ఫొటో కూడా లీక్ కాలేదు. ఎలాంటి కేర్ తీసుకు న్నారు? లొకేషన్లో సెల్‌ఫోన్ అనుమతించలేదు. ఒక బాక్స్ ఏర్పాటు చేశాం. మొబైల్ ఫోన్‌ని అందులో డిపాజిట్ చేసి లోపలకి రావాలి. మెయిన్ టెక్నీషియన్స్‌కి మాత్రమే ఫోన్లు అనుమతించారు. ఏకాగ్రత దెబ్బ తింటుందని లొకేషన్లో ఫోన్ వైపు చూడను. లంచ్ సమయంలో ఓసారి, సాయంత్రం ప్యాకప్ తర్వాత మళ్లీ ఓసారి ఫోన్ చూస్తాను. సినిమా గురించి మాట్లాడేప్పుడు హీరో, దర్శకుడు గురించే తప్ప కెమెరా విభాగం గురించి మాట్లాడే వాళ్లు చాలా తక్కువ. అదేమైనా బాధగా ఉంటుందా? అది గతంలో. ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ప్లస్. కెమెరామేన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ‘రోబో’ సమయంలో ‘యానిమట్రానిక్స్’ అంటే ఎక్కువగా తెలియదు. నేను దాని గురించి చదివి తెలుసుకున్నాను. అయితే మీరన్నట్లు కేవలం, యాక్టర్స్, డైరెక్టర్స్‌ని మాత్రమే అభినందిస్తారు. అప్పుడు టెక్నీషియన్స్‌కి బాధ ఉండటం సహజం. ‘రంగస్థలం’ కోసం రాజమండ్రిలోని మారుమూల ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడో కుండలు తయారు చేసే ఆయన నన్ను చూసిన వెంటనే ‘రత్నవేలు గార్రా’ అన్నాడు. సుకుమార్, వాళ్ల తమ్ముడు అందరూ ‘చూశావా.. నిన్ను ఎలా గుర్తుపడుతున్నారో’ అన్నారు. ఫలానా సినిమాకి ఫలానా కెమెరామేన్ అని పేరు తెలియడం కామన్. కానీ మనిషి తెలియడం అంటే.. అది కూడా అంత మారుమూల ప్రాంతంలో అంటే.. అది పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించింది. ‘కెమెరామేన్‌గా మాకు రత్నవేలే కావాలి’ అని అడిగే హీరోలు ఉన్నారా? ఉన్నారు. నేను అందరితో కలసిపోయే టైప్ కూడా కాదు. పూర్తి శ్రద్ధతో పని చేస్తాను. రిలీజ్‌కి ముందు కూడా కలర్ కరెక్షన్, డీఐ చేస్తూనే ఉంటాం. ఓవర్సీస్ ప్రింట్స్ టైమ్‌కి వెళ్లాయా? లేదా అని చెక్ చేస్తూనే ఉంటాను. ‘సినిమాను జాగ్రత్తగా చేస్తున్నాడు. మనల్ని బాగా చూపిస్తాడు’ అనే నమ్మకం నా హీరోలకు కలుగుతుంది. అందుకే నేను కావాలని అడుగుతుంటారు. అందరూ మీతో చేయాలనుకున్నా అన్నీ చేయడానికి కుదరదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారా? కొన్ని సార్లు బాధపడతారు. ఓ సినిమా 70 శాతం అయినప్పుడు వేరే సినిమా చేయమని అడుగుతారు. కుదరదు కదా. జనవరి నుంచి డేట్స్ కావాలంటారు. చేస్తున్న సినిమా మార్చి వరకూ జరగొచ్చు. ఎవరూ ఊహించలేం. అందుకే ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తుంటాను. ‘రోబో’ తర్వాత నాకు 13 సినిమా ఆఫర్స్ వచ్చాయి. హిందీలో పెద్ద సినిమాకి కూడా అడిగారు. నేను, సుకుమార్ మంచి ఫ్రెండ్స్. తన కోసం ‘1 నేనొక్కడినే’ చేశాను. ఆ సినిమా కోసం నాది 7 నెలల కాంట్రాక్టే. కానీ సినిమా మీద ప్రేమ, సుక్కు మీద ప్రేమ, మహేశ్ అంటే ప్రేమతో రెండేళ్లయినా ఆ సినిమా చేస్తూనే ఉన్నాం. 7 నెలలే కదా అని వేరే సినిమాకి వెళ్లిపోతే అది కరెక్ట్ కూడా కాదు. కెమెరామేన్ అంటే సగం దర్శకుడి కిందే లెక్క. భవిష్యత్తులో దర్శకుడు అవుతారా? 7–8 ఏళ్ల క్రితమే డైరెక్షన్ కోసం అన్నీ సెట్ చేసుకున్నా. సరిగ్గా అప్పుడు రజనీ సార్ ‘రోబో’ కోసం పిలిచారు. సరే.. ‘రంగస్థలం’ తర్వాత చేయాలి అనుకున్నా. చరణ్‌తో ఈ ఆలోచన చెప్పగానే ‘కెమెరామేన్‌గా టాప్‌లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేయండి. తర్వాత డైరెక్షన్ చేయొచ్చు’ అన్నారు. అయితే త్వరలోనే నా డైరెక్షన్లో సినిమా మొదలుపెడతా. మొత్తం కథ పూర్తయింది. మీ సినిమాకు మీరే సినిమాటోగ్రఫీ చేస్తారా? మనమే రెండూ చేస్తే ఏకాగ్రత పెట్టలేం అని కెమెరామేన్ నుంచి దర్శకుడిగా మారినవాళ్లు చేయరు. నా స్క్రిప్ట్‌లో మూడ్ ఏంటో నాకు తెలుసు. మళ్లీ ఇంకో అతనికి చెప్పి అదంతా టైమ్ వేస్ట్. సో.. నేనే చేసుకుంటానేమో. మీ అసిస్టెంట్స్ కెమెరామేన్లు అయ్యారా? ఇప్పటివరకూ 11మంది కెమెరామేన్లు అయ్యారు. ఉదాహరణకు తెలుగులో యువరాజ్, తమిళంలో దినేష్, ప్రేమ్‌కుమార్. ఫైనల్లీ మీ డ్రీమ్? హాలీవుడ్లో ఓ సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ఐదేళ్ల క్రితం ఓ ఆఫర్, మూడేళ్ళ క్రితం కూడా ఓ సినిమా వచ్చింది. ఒక్క సినిమా చేసి వచ్చేయాలి. నేను హిందీ సినిమా కూడా చేయలేదు. తెలుగు, తమిళంలో చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బాలీవుడ్డే సౌత్ సినిమాల్లోకి వస్తుంది కదా. నెలల తరబడి ఫిల్మ్ సెట్లో ఉంటారు. ఫ్యామిలీని మిస్ అవుతుంటారు కదా? ఈ విషయంలో నా భార్యదే క్రెడిట్ అంతా. తన సహకారం లేకుండా ఇన్నేసి రోజులు ఇంటికి దూరంగా సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. కొంచెం ఖాళీ దొరికిందంటే చెన్నై వెళ్లిపోతాను. వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేసి భార్య, పిల్లలు, అమ్మతో మాట్లాడతాను. కానీ దగ్గరున్న ఫీల్ వేరు కదా. అందుకే సమ్మర్ హాలీడేస్‌లో ఫ్యామిలీ అందరం కలసి వెకేషన్‌కు వెళ్లిపోతాం. మీకెంత మంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అబ్బాయికి 17 ఏళ్లు. ప్లస్ టులోకి వచ్చాడు. అమ్మాయికి పదేళ్లు. చాలా అల్లరి చేస్తుంటుంది. మా వాళ్లు చాలా హ్యాపీ. వాళ్ల క్లాస్మేట్స్, టీచర్స్ నా గురించి మాట్లాడినా నాతో చెప్పి ఆనందపడుతుంటారు. వాళ్ల ఆనందం చూసి నాకు భలే సంతోషమేస్తుంది. మా అమ్మ కూడా చాలా గర్వపడుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాకు ఈ మధ్యన వచ్చిన అవార్డులు చూసి ఆమె చాలా సంతోషపడ్డారు. మొన్న ‘సాక్షి’ అవార్డు కూడా అందుకున్నాను. 60 ఏళ్లు పైబడిన చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. యుద్ధ సన్నివేశాలను ఆయన సౌకర్యం కోసం ప్లాన్ చేశారా? నిజానికి చాలా మంది హీరోలకు గుర్రం నడపడం రాదు. కానీ ఆయన ఈ వయసులో కూడా జోష్‌గా గుర్రం నడిపారు. తాడు కట్టి స్టంట్స్ చేయించడం ఎందుకు? అని ఆలోచించాం. ఆల్రెడీ యాక్షన్ సినిమాలు చేస్తూ చాలా ఏళ్లుగా శరీరం హూనం చేసుకొని ఉన్నారు. అందుకని కష్టపెట్టాలనుకోలేదు. ఆయన మాత్రం ఉత్సాహంగా తాడు కట్టండి నేను చేస్తాను అని ఫైట్ మాస్టర్స్‌తో అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. వెంట వెంటనే రెండు దేశభక్తి సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది? ‘సైరా’, ‘భారతీయుడు 2’.. రెండూ దేనికదే ప్రత్యేకమైనవి. కంటిన్యూస్‌గా దేశభక్తి సినిమాలు చేయడం బాగానే ఉన్నా.. అర్జెంటుగా ఓ మోడ్రన్ సినిమా చేయాలనిపిస్తోంది (నవ్వుతూ). – డి.జి. భవాని -
హీరో రాంచరణ్ ఇంటి ముందు ఆందోళన
-
‘కొణిదెల’ కార్యాలయం ఎదుట ఆందోళన
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసి ందే. ఈ నేపథ్యంలోనే ఉయ్యాలవాడకు చెందిన దాదాపు ఏడు కుటుంబాలు లక్ష్మి నేతృత్వంలో ఇక్కడికి చేరుకున్నాయి. తమ కుటుంబసభ్యులకు కొణిదెల ప్రొడక్షన్స్ సభ్యులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఒప్పందం కూడా చేసుకున్నారన్నారు. అయితే శనివారం రాత్రి హీరో రామ్‌చరణ్ మేనేజర్ అభిలాశ్ ఫోన్ చేసి, ఇక్కడికి రావద్దని కథపై తమకెలాంటి హక్కులు లేవని చెప్పడంతో తాము అవాక్కయ్యామన్నారు. తమ నిరసన వ్యక్తం చేసేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. తమ కథను వాడుకోవడమే కాకుండా తమ ఆస్తులను కూడా వాడుకున్నారన్నారు. కథ విషయంలో తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇంటి ముందున్న సామగ్రిని నాశనం చేశారని ఆరోపించారు. మార్చి 11న చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఏడు కుటుంబాలకు చెందిన 22 మందిని పిలిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రామ్‌చరణ్ న్యాయం చేస్తానని మాటిచ్చారని, అయితే మధ్యవర్తులు కొందరు అందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సిబ్బంది వారితో మాట్లాడి తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఆ కుటుంబాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఇదిలా ఉండగా ఈ విషయంలో ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించాయని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సైరా నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి. -
నేను పుట్టుకతోనే ఎరుపు అయినా నాకు..
సినిమా: అలా అనుకుంటే చాలా ప్రమాదకరం అంటోంది నటి తమన్నా. సినీ వర్గాలు ఈ అమ్మడిని మిల్కీబ్యూటీ అని అంటుంటారు. ఈ మార్వాడి బ్యూటీ అంత ఎర్రగా, బుర్రగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నటిగా ఎక్కువ కాలం తన అందాలతోనే నెట్టుకొచ్చిందని చెప్పవచ్చు. తమన్నానే కాదు చాలా మంది హీరోయిన్లదిప్పుడు ఇదే బాట. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లోనూ ఒక రౌండ్ చుట్టేసిన తమన్నా తన మేనందానికి కుర్రకారు పడి చస్తుంటే తనకు మాత్రం ఎరుపు అసలు నచ్చదంటోంది. నలుపు రంగే తనకిష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రభుదేవాతో కలిసి దేవి–2 చిత్రంలోనూ, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న తమన్నా శరీర రంగు గురించి ఏమంటుందో చూద్దాం. శరీర రంగును బట్టి ఒక మనిషి మనస్తత్వం గురించి చెప్పడాన్ని నేను అంగీకరించను. నేను పుట్టుకతోనే ఎరుపు. అయినా నాకు నలుపు రంగు అంటే ఇష్టం. కొన్ని చిత్రాల్లో దర్శకులు నా రంగును తగ్గించుకోమని చెబుతుంటారు. అందుకు నేను ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరిస్తాను. ఇప్పుడు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, దేవి–2 చిత్రాలకు నా ఒరిజినల్ శరీర రంగును తగ్గించుకుని నటిస్తున్నాను. అలా చేయడం గొప్ప అని నేను అనుకోవడం లేదు. సినిమా తనాన్ని బ్రేక్ చేయాలని భావిస్తున్నాను. రంగే అందాన్ని తీర్మానిస్తుందన్న భావాన్ని మానుకోవలసిన కాలం ఇది. మీరు ఇతరుల కంటే అందంగా ఉండవచ్చు. అయితే మనసు క్రూరంగా ఉంటే అది అందం కాదు. రంగును బట్టి మనుషుల్ని లెక్క కడితే అంతకంటే భయంకరం ఇంకోటి ఉండదు. సినిమా విషయానికి వస్తే మేనందం గురించి ప్రశంసించడం కంటే అభినయాన్ని అభినందించడమే నిజమైన అభినందన అవుతుందన్నది నా భావన. -
వీరనారిగా...
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ స్టార్ క్యాస్ట్‌తో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో స్క్రీన్ అంతా ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా మారనుడటం పక్కా. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్గా కనిపించనున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓ ముఖ్య ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ కూడా ఉన్నారట. దాంతో ఈ పాత్రకు టబును సెలెక్ట్ చేసుకున్నారట చిత్ర బృందం. పదేళ్ల గ్యాప్ తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతిలతో నిండిపోయిన ఈ పీరియాడికల్ మూవీలో టబు కూడా జాయిన్ అవ్వడం కచ్చితంగా ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది. -
చాలెంజ్‌కు రెడీ
యాక్టర్‌గా తమ పరిధిని పెంచుకోవాలనుకునే వారు కొత్త చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చాలెంజ్‌లను తీసుకొని తమని తాము ఇంప్రూవ్ చేసుకుంటారు. ‘నేను కూడా అదే కోవకు చెందుతాను’ అంటున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవి సరసన ‘సైరా’ సినిమాలో యాక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర గురించి, అందులోని చాలెంజ్ గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, అమితాబ్ బచ్చన్‌గారు వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ యాక్టర్స్‌తో యాక్ట్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయబోయే పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకోవడానికి, ఆన్లైన్లో చదవడానికి కూడా ఎక్కువ మెటీరియల్ లేదు. చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇది చాలా చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ఇలాంటి చాలెంజ్‌లకు నేను ఎప్పుడూ రెడీ. ఈ క్యారెక్టర్‌ను వీలైనంత రియల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆల్రెడీ నయనతార ఒక హీరోయిన్గా చేస్తున్నారు. -
సైరాకి సై
డాడీ... పెదనాన్న చిరంజీవిని నిహారిక అలానే పిలుస్తారు. మెగా బ్రదర్ తనయ నిహారిక తన పెదనాన్నకు అంత క్లోజ్. చిన్నప్పటి నుంచి ఆయన నటన చూస్తూ పెరిగిన నిహారిక ఇప్పుడు ఏకంగా పెదనాన్న సినిమాలో నటించే అవకాశం కొట్టేశారని టాక్. ముందే వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్ ’తో నటి అయ్యి, ‘ఒక మనసు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు నిహారిక. ఆ సినిమాలో మంచి నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ సినిమా రిలీజయ్యాక అటు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్’ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘సైరా’కి సై అన్నారట. ఇందులో ఓ మంచి రోల్ కొట్టేశారని టాక్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. ఇందులో నయనతార కథానాయిక. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక నటిస్తే ఆమెకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఖాయం. -
రెండో షెడ్యూల్ కోసం మీసం తీసిన నరసింహారెడ్డి!
ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. ఈ సినిమా యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్‌లో పూర్తి చేసింది. మొదట రెండో షెడ్యూల్ ను రాజస్థాన్ లేదా పొలాచ్చిలో జరపాలని అనుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారు. వచ్చేనెల మొదటి వారం నుంచి రెండో షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ పై ఇంకా క్లారిటీ రాలేదు. రెండో షెడ్యూల్లో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. చాలా కాలంగా మీసం, గడ్డంతో కనిపిస్తున్న మెగాస్టార్ తాజాగా క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గెడ్డం, మీసం లేకుండా కనిపించారు. ఈ గెటప్ తోనే చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. -
సైసైరా నరసింహారెడ్డి
కర్నూలు(కల్చరల్) : విప్లవ వీరుడు నరసింహారెడ్డి తెల్ల దొరలకు వ్యతిరేకంగా జరిపిన చారిత్రాత్మక పోరాటాన్ని సై సైరా నరసింహారెడ్డి పేరుతో నాటకంగా రూపొందించామని టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 నంది అవార్డులు పొందిన ప్రముఖ రచయిత, పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకాన్ని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రదర్శించనున్నామని తెలిపారు. సురభి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నాటకం ప్రేక్షకులను అలరింపజేస్తుందన్నారు. ఈ నాటకాన్ని భవిష్యత్తులో 13 జిల్లాలలో ప్రదర్శించనున్నామని తెలిపారు. రాబోయే నంది నాటకోత్సవాల్లో సైతం ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి అంతా సిద్ధం చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న రంగస్థల కళాకారుల సమావేశంలో నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొననున్నారని, ఈ సందర్భంగా రంగస్థల కళాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే నాటక ప్రదర్శనను నాటకాభిమానులు తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకట్టుకున్న రిహార్సల్స్... సైసైరా నరసింహారెడ్డి నాటకానికి సంబంధించిన రిహార్సల్స్ స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులుగా జోరుగా సాగుతున్నాయి. నాటకంలో నరసింహారెడ్డి, తహసీల్దార్ రాఘవాచారి, జాన్‌పీటర్, కాక్రేన్ దొర మధ్య జరిగే సన్నివేశాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. నొస్సం కోటను పేల్చడం, నరసింహారెడ్డి ట్రెజరీపై దాడి చేయడం లాంటి ఆకర్షణీయమైన దృశ్యాలు ఉన్నాయి. దర్శకుడు పత్తి ఓబులయ్య, నాటక రచయిత కులశేఖర్, సంగీత దర్శకుడు రామలింగం, గంగాధర్, సుజాత.. ఈ నాటకాన్ని అత్యంత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. -
ఆ హీరోయిన్ పారితోషికం ఆరు కోట్లా?
ఇది విన్నారా ? హీరోయిన్ నయనతార ఒక చిత్రంలో నటించడానికి ఆరుకోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? నిజమే మరి ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిన హీరోయిన్ లేదు కాబట్టి ఎవరికైనా నమ్మబుద్దికాదు. నయనతార కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా మాలీవుడ్ నుంచి దిగుమతి అయ్యింది. తొలి చిత్రమే ఈమెకు విజయానందాన్ని మిగిల్చింది. ఆ తరువాత ఎప్పుడైతే రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంలో నటించిందో ఇక ఆ తరువాత నయనతార మార్కెట్ సరఫరా పెరిగిపోయింది. గజని, బిల్లా, యారడీ, నీ మోహినీ, బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి చిత్రాల విజయం ఈ బ్యూటీని టాప్ హీరోయిన్ రేంజ్లో కూర్చోబెట్టాయి. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చెవిటి యువతిగా నటించిన పాత్ర, మాయ చిత్రంలో దెయ్యం పాత్రలు ఆమెను లేడీ ఓరియంటెడ్ చిత్రాల కథానాయకిని చేశాయి. నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి అంశాల వివాదాంశంగా మారినా నయనతార మార్కెట్‌కు అవి ఎలాంటి భంగం కలిగించలేదు. ప్రస్తుతం అరం, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తీకేయన్‌కు జంటగా నటించి వేలైక్కారన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని రెండు కోట్ల నుంచి పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం నటిస్తున్న ఇమైకానోడిగళ్ చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో ఉంది. నయనతారకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. శ్రీరామరాజ్యం, సింహా వంటి చిత్రాలు మంచి ఇమేజ్ను కట్టబెట్టాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. చరిత్ర వీరయోధుడి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు, బాలీవుడ్ బిగ్ బీ, శాండిల్‌వుడ్ సుధీప్, కోలీవుడ్ యువ నటుడు విజయ్‌సేతుపతి అంటూ భారతీయ నటీనటుల మేలి కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి నయనతార ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో తెరక్కుతున్న భారీ చిత్రం కావడం, కాల్షీట్స్ అవసరం అవ్వడంతో నయనతార అంతే స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది ఆ చిత్ర వర్గాలకే తెలుసు.