‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’ | Sakshi Special Interview With Ratnavelu | Sakshi
Sakshi News home page

సైరా కెమెరా

Published Sun, Sep 15 2019 1:26 AM | Last Updated on Sun, Sep 15 2019 12:00 PM

Sakshi Special Interview With Ratnavelu

సింహాలతో సెల్ఫీ దిగాడు రత్నవేలు! ఒక సింహం ‘నరసింహారెడ్డి’. ఇంకో సింహం సురేందర్‌రెడ్డి. మూడో సింహం కూడా కనిపిస్తుంది. ఆ సింహం.. రత్నవేలే! సినిమాటోగ్రాఫర్‌. సరేందర్‌రెడ్డి ‘సైరా’ స్క్రిప్టును.. నరసింహారెడ్డి మెగా గెటప్పును.. రత్నవేలు కెమెరాలోంచి చూడాల్సిందే. మనం చూస్తాం సరే..రెండు వందల ఏళ్ల నాటి కథని ఆయన మైండ్‌ ఏ లెన్స్‌లతో చూసింది!   చదవండి. రత్నవేలుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

 ‘సైరా’లో ఎలా భాగమయ్యారు?
‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ‘సైరా’ సినిమా చేస్తారా? అని రామ్‌చరణ్‌ అడిగారు. అది వాళ్ల నాన్నగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దాని గురించి పది పన్నెండేళ్లుగా చర్చల్లో ఉంది. మీరైతే చాలా ఫాస్ట్‌గా, చాలా క్వాలిటీతో చేస్తారు. మీరు జాయిన్‌ అయితే బావుంటుంది’ అన్నారు రామ్‌ చరణ్‌. నిజానికి ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కమిట్‌ అవ్వాలన్నది నా ఫిలాసఫీ. అప్పటికి  ‘రంగస్థలం’ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ‘ప్రిపరేషన్‌ కోసం కనీసం రెండు నెలలు సమయం కావాలి’ అని చిరంజీవిగారితో అన్నాను. ఒకవైపు ‘రంగస్థలం’ చేస్తూనే సాయంత్రం ప్యాకప్‌ చెప్పాక ‘సైరా’ ని ఎలా షూట్‌ చేయాలా? అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇందులో కొన్ని వందల మంది మనుషులు, గుర్రాలు, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి. అన్నీ అనుకున్న టైమ్‌కి జరగాలి. అలా జరగాలంటే టెక్నికల్‌గా చాలా బలంగా ఉండాలి. ఇద్దరు యాక్టర్స్‌ని ఫ్రేమ్‌లో పెట్టి షూట్‌ చేయడం ఈజీ. కానీ ‘సైరా’లో ఎక్కువగా వందల మంది కనిపిస్తారు. అందుకని హోమ్‌వర్క్‌ చేశాను.

ఈ సినిమాలో చాలెంజింగ్‌ పార్ట్‌?
సినిమా మొత్తం సవాలే. 1840 లలో వాతావరణం ఎలా ఉండేదో మనకు పెద్ద అవగాహన ఉండదు. ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లగలగాలి. లేకపోతే అంతా వృథా అవుతుంది.

ఎలాంటి కెమెరాలు, లెన్స్‌లు వాడారు?
గుర్రాలతో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడం చాలా టఫ్‌. గుర్రాలు 60–70 కి.మీ. వేగంతో పరిగెడతాయి. ఆ సన్నివేశాలను కెమెరాతో బంధించాలంటే అంత వేగంగా కెమెరా పరిగెత్తాలి. సరిగ్గా రాకపోతే మళ్లీ ఆ సన్నివేశం తీయాలంటే రెండు గంటలు శ్రమించాలి. ఒకే టేక్‌లో సీన్‌ని పూర్తిచేయాలి. అందుకే మూవీ ప్రో ఎక్సెల్‌ మౌంట్‌ కెమెరా వాడాం. ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీరించాలనుకున్న వారం ముందే ఆ టెక్నాలజీ హాలీవుడ్‌లో వచ్చింది. ఇంకా హాలీవుడ్‌లో కూడా సినిమాల్లో అంతగా వాడలేదు. ఇంకా బ్లాక్‌ కామ్‌ని ఏటీవి (ఏటీవీ అంటే ఓ వాహనం లాంటిది. వేగంగా సాగే యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు ఈ వాహనంలో కెమెరాని తీసుకెళతారు. కుదుపులకు కెమెరా షేక్‌ కాదు)కి ఏర్పాటు చేశాం.

కొన్ని ఫైట్‌ సీన్లు అలా షూట్‌ చేశాం. అలాగే ‘స్పైడర్‌ క్యామ్‌’ వాడాను. ‘స్పైడర్‌మేన్‌’ సినిమాలకు అది వాడతారు. క్రికెట్‌ మ్యాచుల్లో కూడా గమనించే ఉంటారు. తాడుకి కట్టిన కెమెరా గ్రౌండ్‌లో కిందకీ పైకీ తిరుగుతుంటుంది. అది మోషన్‌ కంట్రోల్‌ కెమెరా. యుద్ధ సన్నివేశాల్లో రెండుగుర్రాలు తలపడతాయి. అప్పుడు ఈ కెమెరాలు వాటి దగ్గర ఉంటే పరికరాలు ధ్వంసమయ్యే అవకాశం ఎక్కువ. టాప్‌ యాంగిల్‌లో నుంచి చూపించడానికి స్పైడర్‌ క్యామ్‌ ఉపయోగపడుతుంది. నాలుగు భారీ క్రేన్లను లొకేషన్‌ చుట్టూ ఏర్పాటు చేశాం. జార్జియాలో షూట్‌ చేసిన సీన్స్‌కి ఇది ఉపయోగించాం. రష్యా నుంచి ఈ పరికరాన్ని తెప్పించాం.

మీరు వాడే వారం ముందే ఆ ‘కెమెరా’ హాలీవుడ్‌కి వచ్చిందన్నారు. మరి.. దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా తెలుసుకున్నారు?
ఏదైనా టెక్నాలజీ మార్కెట్‌లోకి వస్తుంది అని తెలిసినప్పటి నుంచి దాని గురించి స్టడీ చేయడం మొదలుపెడతాను. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి నాకు ఆ అలవాటు ఉంది. ‘1 నేనొక్కడినే’ చిత్రీకరించే సమయంలో 90 శాతం తెలుగు సినిమాలు ఫిల్మ్‌లోనే చిత్రీకరిస్తున్నారు. కానీ మేం ఆ సినిమాను డిజిటల్‌లో షూట్‌ చేశాం. డిజిటల్‌లో ఎలా కనిపిస్తామో? అని చాలా మంది సందేహంలో పడ్డారు. మహేశ్‌బాబు చేస్తున్నారు అనేసరికి అందరికీ నమ్మకం వచ్చేసింది.  

మీ ప్లానింగ్‌ ఎలా ఉంటుంది?
‘సైరా’కు చాలా మంది హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు పని చేశారు. యాక్షన్‌ని గ్రెగ్‌ పొవెల్, లీ వైటేకర్‌ చేశారు. లీ, నేను రజనీకాంత్‌గారి ‘లింగా’ సినిమాకు పని చేశాం. నేను ఉదయం 7 గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టాలంటే అందరూ ఉదయం 4 గంటల నుంచే పనుల్లో దిగాలి. అందుకే నేను ‘సన్‌ సీకర్‌’ అనే యాప్‌ వాడతాను. రేపు ఉదయం 6.45కి సూర్యోదయం అవుతుంది. ఆ సమయానికి అందరూ రెడీగా ఉండాలని ముందే చెబుతాను. అలా ప్లాన్‌ చేసుకునేవాళ్లం.

చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డితో మీకిది మొదటి సినిమా ... ఆయనతో మీ సింక్‌ ఎలా కుదిరింది?
ఈ స్క్రిప్ట్‌ చాలా బావుంది. నేను ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఫొటోగ్రఫీకి స్కోప్‌ ఉందా? లేదా అని మాత్రమే చూడను. సుకుమార్‌తో నేను చేసిన ‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే మనకు పెద్ద స్కోప్‌ లేదు కదా? అని వేరే కెమెరామేన్లు అంగీకరించకపోవచ్చు. కానీ లోతుగా వెళ్తే మనకు స్కోప్‌ దొరుకుతుందని చేశాను. సురేందర్‌ రెడ్డి మొదటిసారి కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మా ఇద్దరికీ మంచి సింక్‌ కుదిరింది. బెస్ట్‌ టెక్నీషియన్స్‌ ఉన్నప్పుడు నాకు ఈ సన్నివేశం ఇలానే ఉండాలి అన్నట్టుండదు. ఎవరి స్పేస్‌ వాళ్లకు ఇచ్చి వాళ్లనుంచి బెస్ట్‌ తీసుకోవడం జరుగుతుంది.

ప్రతీ సీన్‌కి ఒకటికి రెండుసార్లు మాట్లాడుకుని ఏదైతే బావుంటుందో దాన్నే చేశాం.  మొత్తం 250 రోజులు చిత్రీకరించాం. సినిమా రిలీజ్‌ దగ్గర పడుతోంది. ఇప్పుడు చెబుతున్నా.. ‘సైరా’ చిరంజీవిగారి కెరీర్‌లో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్లే సత్తా ఈ సినిమాకు ఉంది టెక్నికల్‌గా, పర్ఫార్మెన్స్‌ పరంగా అన్నీ సరిగ్గా కుదిరాయి. సాధారణంగా ఎక్కువ చేసి చెప్పడం నాకు నచ్చదు. కానీ ఈ సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడు ముంబై, చెన్నై నుంచి చాలా ఫోన్‌లు వచ్చాయి. ఇలాంటి సినిమాను ఒక ఏడాదిలో ఎలా పూర్తి చేశారు? అని అడిగారు.

నైట్‌ ఎఫెక్ట్‌లో ఓ భారీ యుద్ధం ఉందని విన్నాం..
అవును. అది చాలా చాలెంజింగ్‌ వార్‌. సాధారణంగా యుద్ధాలు పగలే జరుగుతుంటాయి. బ్రిటీష్‌ వాళ్లు నరసింహా రెడ్డిని అరెస్ట్‌ చేయాలనే ఉద్దేశంతో నియమాలను అతిక్రమించి రాత్రి అటాక్‌ చేస్తారు. అది చాలా పెద్ద ఫైట్‌. ఇప్పటి వరకూ రాత్రులు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన సినిమాలు తక్కువ. దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. దాదాపు నెల రోజులు నైట్‌ షూట్‌ చేశాం

పగలు తీసి రాత్రి ఎఫెక్ట్‌ ఇచ్చే స్కోప్‌ ఉంది కదా?
చేయొచ్చు. అయితే అది హారర్‌ సినిమాలకు బాగానే ఉంటుంది. ఇది నిజంగా అనిపించాలి. అప్పట్లో కరెంట్‌ ఉండేది కాదు కదా. రాత్రి పూట కాగడాలు పెట్టుకునేవారు. అది నిజంగా అనిపించాలి. ఈ నైట్‌ వార్‌కి గ్రెగ్‌ పొవెల్‌ ఫైట్‌ మాస్టర్‌. ఓ లొకేషన్‌ మొత్తం లైటింగ్‌ చేయాలంటే చాలా లైట్లు పెడతాం. అలా కాకుండా మూన్‌లైట్‌ని సృష్టించాలనుకున్నాను. దానికోసం ఓ సెపరేట్‌ లైటింగ్‌ సృష్టించాం. 200 అడుగుల క్రేనులు మూడు ఏర్పాటు చేశాం. లైట్‌ చుట్టూ సాఫ్ట్‌బాక్స్‌ పెట్టి వేలాడదీశాం. దాంతో మూన్‌లైట్‌ ఎఫెక్ట్‌ వచ్చింది. కిందంతా కాగడా వెలుతురులోనే షూట్‌ చేశాం. చిరంజీవిగారిలాంటి పెద్ద స్టార్‌ హీరోకు కేవలం కాగడా లైట్స్‌తో షూట్‌ చేయడం పెద్ద రిస్క్‌. కలర్‌ సరిగ్గా ఉండదు, నీడలు వస్తాయి అని ఆలోచిస్తారు. అయితే విజువల్‌గా చాలా అద్భుతంగా వచ్చింది. 25 నుంచి 30 రోజులు కోకాపేట్‌లో షూట్‌ చేశాం. ఇంకో విషయం ఏంటంటే అది వానాకాలం. కెమెరా పెట్టి మొత్తం రెడీ చేసుకున్నాక వర్షం పడేది. దానికి తగ్గట్టుగా లైటింగ్‌ చేశాం. ‘నువ్వు హాలీవుడ్‌లో ఉండాల్సివాడివి’ అని గ్రెగ్‌ పొవెల్‌ అభినందించారు.

కేవలం కాగడా వెలుతురుతోనే షూట్‌ చేయడం అంటే చిరంజీవిగారు అంగీకరించారా?
ఎవ్వరికైనా నమ్మకం కలగడం కష్టం. అయితే ఒక్కసారి నమ్మితే ఎవరూ ఆలోచించరు. ఆయన నా ‘రోబో, రంగస్థలం’ సినిమాలు చూశారు. నా ఆలోచనను నమ్మారు.  కొన్నిసార్లు ఉన్న రూల్స్‌ని బద్దలు కొడితేనే కొత్త విషయాలు తెలుస్తాయి. కెమెరా ఐఎస్‌ఓ 800 ఉంటుంది. మేం 2500 ఐఎస్‌ఓ పెట్టి షూట్‌ చేశాం. ఈ సినిమాలో ప్రతీ సీన్‌ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో చాలెంజ్‌లు విసరడమో చేసింది. ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఆలోచించి చిత్రీకరించుకుంటూ వచ్చాం.

∙‘రోబో’, ‘సైరా’.. ఏది కష్టం అనిపించింది?
‘రోబో’ అప్పుడు అదో ప్రయోగం. ఆ స్థాయిలో వచ్చిన సినిమాలు లేవు. అది క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా కష్టంతో కూడుకున్న సినిమా. ‘సైరా’ క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా, శారీరకంగా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా. ఆ సమయానికి అది పెద్దది. ఇప్పుడు ఇది పెద్దది.

మామూలుగా పెద్ద సినిమా అంటే లుక్స్‌ బయటకు రావడం సహజం. ‘సైరా’ లొకేషన్‌ నుంచి ఒక్క ఫొటో కూడా లీక్‌ కాలేదు. ఎలాంటి కేర్‌ తీసుకు న్నారు?
లొకేషన్‌లో సెల్‌ఫోన్‌ అనుమతించలేదు. ఒక బాక్స్‌ ఏర్పాటు చేశాం. మొబైల్‌ ఫోన్‌ని అందులో డిపాజిట్‌ చేసి లోపలకి రావాలి. మెయిన్‌ టెక్నీషియన్స్‌కి మాత్రమే ఫోన్‌లు అనుమతించారు. ఏకాగ్రత దెబ్బ తింటుందని లొకేషన్‌లో ఫోన్‌ వైపు చూడను. లంచ్‌ సమయంలో ఓసారి, సాయంత్రం ప్యాకప్‌ తర్వాత మళ్లీ ఓసారి ఫోన్‌ చూస్తాను.

సినిమా గురించి మాట్లాడేప్పుడు హీరో, దర్శకుడు గురించే తప్ప కెమెరా విభాగం గురించి మాట్లాడే వాళ్లు చాలా తక్కువ. అదేమైనా బాధగా ఉంటుందా?
అది గతంలో. ఇప్పుడు సోషల్‌ మీడియా పెద్ద ప్లస్‌. కెమెరామేన్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. ‘రోబో’  సమయంలో ‘యానిమట్రానిక్స్‌’ అంటే ఎక్కువగా తెలియదు. నేను దాని గురించి చదివి తెలుసుకున్నాను. అయితే మీరన్నట్లు కేవలం, యాక్టర్స్, డైరెక్టర్స్‌ని మాత్రమే అభినందిస్తారు. అప్పుడు టెక్నీషియన్స్‌కి బాధ ఉండటం సహజం. ‘రంగస్థలం’ కోసం రాజమండ్రిలోని మారుమూల ప్రాంతంలో షూటింగ్‌ చేస్తున్నాం. అక్కడో కుండలు తయారు చేసే ఆయన నన్ను చూసిన వెంటనే ‘రత్నవేలు గార్రా’ అన్నాడు. సుకుమార్, వాళ్ల తమ్ముడు అందరూ ‘చూశావా.. నిన్ను ఎలా గుర్తుపడుతున్నారో’ అన్నారు. ఫలానా సినిమాకి ఫలానా కెమెరామేన్‌ అని పేరు తెలియడం కామన్‌. కానీ మనిషి తెలియడం అంటే.. అది కూడా అంత మారుమూల ప్రాంతంలో అంటే.. అది పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించింది.

‘కెమెరామేన్‌గా మాకు రత్నవేలే కావాలి’ అని అడిగే హీరోలు ఉన్నారా?
ఉన్నారు. నేను అందరితో కలసిపోయే టైప్‌  కూడా కాదు. పూర్తి శ్రద్ధతో పని చేస్తాను. రిలీజ్‌కి ముందు కూడా కలర్‌ కరెక్షన్, డీఐ చేస్తూనే ఉంటాం. ఓవర్‌సీస్‌ ప్రింట్స్‌ టైమ్‌కి వెళ్లాయా? లేదా అని చెక్‌ చేస్తూనే ఉంటాను. ‘సినిమాను జాగ్రత్తగా చేస్తున్నాడు. మనల్ని బాగా చూపిస్తాడు’ అనే నమ్మకం నా హీరోలకు కలుగుతుంది. అందుకే నేను కావాలని అడుగుతుంటారు.

అందరూ మీతో చేయాలనుకున్నా అన్నీ చేయడానికి కుదరదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారా?
కొన్ని సార్లు బాధపడతారు. ఓ సినిమా 70 శాతం అయినప్పుడు వేరే సినిమా చేయమని అడుగుతారు. కుదరదు కదా. జనవరి నుంచి డేట్స్‌ కావాలంటారు. చేస్తున్న సినిమా మార్చి వరకూ జరగొచ్చు. ఎవరూ ఊహించలేం. అందుకే ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తుంటాను. ‘రోబో’ తర్వాత నాకు 13 సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. హిందీలో పెద్ద సినిమాకి కూడా అడిగారు. నేను, సుకుమార్‌ మంచి ఫ్రెండ్స్‌. తన కోసం ‘1 నేనొక్కడినే’ చేశాను. ఆ సినిమా కోసం నాది 7 నెలల కాంట్రాక్టే. కానీ సినిమా మీద ప్రేమ, సుక్కు మీద ప్రేమ, మహేశ్‌ అంటే ప్రేమతో రెండేళ్లయినా ఆ సినిమా చేస్తూనే ఉన్నాం. 7 నెలలే కదా అని వేరే సినిమాకి వెళ్లిపోతే అది కరెక్ట్‌ కూడా కాదు.

కెమెరామేన్‌ అంటే సగం దర్శకుడి కిందే లెక్క. భవిష్యత్తులో దర్శకుడు అవుతారా?
7–8 ఏళ్ల క్రితమే డైరెక్షన్‌ కోసం అన్నీ  సెట్‌ చేసుకున్నా. సరిగ్గా అప్పుడు రజనీ సార్‌ ‘రోబో’ కోసం పిలిచారు. సరే..  ‘రంగస్థలం’ తర్వాత చేయాలి అనుకున్నా. చరణ్‌తో ఈ ఆలోచన చెప్పగానే ‘కెమెరామేన్‌గా టాప్‌లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేయండి. తర్వాత డైరెక్షన్‌ చేయొచ్చు’ అన్నారు. అయితే త్వరలోనే నా డైరెక్షన్‌లో సినిమా మొదలుపెడతా. మొత్తం కథ పూర్తయింది.

మీ సినిమాకు మీరే సినిమాటోగ్రఫీ చేస్తారా?
మనమే రెండూ చేస్తే ఏకాగ్రత పెట్టలేం అని కెమెరామేన్‌ నుంచి దర్శకుడిగా మారినవాళ్లు చేయరు. నా స్క్రిప్ట్‌లో మూడ్‌ ఏంటో నాకు తెలుసు. మళ్లీ ఇంకో అతనికి చెప్పి అదంతా టైమ్‌ వేస్ట్‌. సో.. నేనే చేసుకుంటానేమో.

మీ అసిస్టెంట్స్‌  కెమెరామేన్లు అయ్యారా?
ఇప్పటివరకూ 11మంది కెమెరామేన్లు అయ్యారు. ఉదాహరణకు తెలుగులో యువరాజ్, తమిళంలో దినేష్, ప్రేమ్‌కుమార్‌.

ఫైనల్లీ మీ డ్రీమ్‌?
హాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలన్నది నా డ్రీమ్‌. ఐదేళ్ల క్రితం ఓ ఆఫర్, మూడేళ్ళ క్రితం కూడా ఓ సినిమా వచ్చింది. ఒక్క సినిమా చేసి వచ్చేయాలి. నేను హిందీ సినిమా కూడా చేయలేదు. తెలుగు, తమిళంలో చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బాలీవుడ్డే సౌత్‌ సినిమాల్లోకి వస్తుంది కదా.

నెలల తరబడి ఫిల్మ్‌ సెట్లో ఉంటారు. ఫ్యామిలీని మిస్‌ అవుతుంటారు కదా?
ఈ విషయంలో నా భార్యదే క్రెడిట్‌ అంతా. తన సహకారం లేకుండా ఇన్నేసి రోజులు ఇంటికి దూరంగా సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. కొంచెం ఖాళీ దొరికిందంటే చెన్నై వెళ్లిపోతాను. వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేసి భార్య, పిల్లలు, అమ్మతో మాట్లాడతాను. కానీ దగ్గరున్న ఫీల్‌ వేరు కదా. అందుకే సమ్మర్‌ హాలీడేస్‌లో ఫ్యామిలీ అందరం కలసి వెకేషన్‌కు వెళ్లిపోతాం.

మీకెంత మంది పిల్లలు?
ఇద్దరు పిల్లలు. అబ్బాయికి 17 ఏళ్లు. ప్లస్‌ టులోకి వచ్చాడు. అమ్మాయికి పదేళ్లు. చాలా అల్లరి చేస్తుంటుంది. మా వాళ్లు చాలా హ్యాపీ. వాళ్ల క్లాస్‌మేట్స్, టీచర్స్‌ నా గురించి మాట్లాడినా నాతో చెప్పి ఆనందపడుతుంటారు. వాళ్ల ఆనందం చూసి నాకు భలే సంతోషమేస్తుంది. మా అమ్మ కూడా చాలా గర్వపడుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాకు ఈ మధ్యన వచ్చిన అవార్డులు చూసి ఆమె చాలా సంతోషపడ్డారు. మొన్న ‘సాక్షి’ అవార్డు కూడా అందుకున్నాను.

60 ఏళ్లు పైబడిన చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు. యుద్ధ సన్నివేశాలను ఆయన సౌకర్యం కోసం ప్లాన్‌ చేశారా?
నిజానికి చాలా మంది హీరోలకు గుర్రం నడపడం రాదు. కానీ ఆయన ఈ వయసులో కూడా జోష్‌గా గుర్రం నడిపారు. తాడు కట్టి స్టంట్స్‌ చేయించడం ఎందుకు? అని ఆలోచించాం. ఆల్రెడీ యాక్షన్‌ సినిమాలు చేస్తూ చాలా ఏళ్లుగా శరీరం హూనం చేసుకొని ఉన్నారు. అందుకని కష్టపెట్టాలనుకోలేదు. ఆయన మాత్రం ఉత్సాహంగా తాడు కట్టండి నేను చేస్తాను అని ఫైట్‌ మాస్టర్స్‌తో అన్నప్పుడు ఆశ్చర్యపోయాను.

వెంట వెంటనే రెండు దేశభక్తి సినిమాలు  చేయడం ఎలా అనిపిస్తోంది?
‘సైరా’, ‘భారతీయుడు 2’.. రెండూ దేనికదే ప్రత్యేకమైనవి. కంటిన్యూస్‌గా దేశభక్తి సినిమాలు చేయడం బాగానే ఉన్నా.. అర్జెంటుగా ఓ మోడ్రన్‌ సినిమా చేయాలనిపిస్తోంది (నవ్వుతూ).

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement