Sye Raa Twitter Review | ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది | Sye Raa Narasimha Reddy USA Review - Sakshi
Sakshi News home page

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

Published Wed, Oct 2 2019 6:02 AM | Last Updated on Wed, Oct 2 2019 1:44 PM

Sye Raa Narasimha Reddy Twitter Review - Sakshi

రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నoటాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్‌ చేశారు. . మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సైరా ఎట్టకేలకు వచ్చేసింది. మరి సైరా టాక్‌ ఎలా ఉంది? ట్విటర్‌ ట్రెండింగ్‌ ఏంటి? అన్నది చూద్దాం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తెరపై చూడటానికి కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఎందుకు చెప్పుకున్నారో సైరా చూస్తే అర్థం అవుతుందని సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతూ బ్రిటీష్ వారి ప్రవేశం, వారి ఆగడాల గురించి చెప్తాడు. ఇక నరసింహ రెడ్డి కథలోకి తీసుకెళ్లేందుకు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చిన్న సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్తాడు.  చిరు ఎంట్రీ మాత్రం మెగా అభిమానులను కట్టిపడేస్తుంది  అంటున్నారు. ఇక జాతర సాంగ్ తెరపై చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంత అద్భుతంగా తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయని.. అయితే మధ్యలో వచ్చే ఫైట్స్ కన్నులపండవగా ఉంటాయని అంటున్నారు. నయనతార, తమన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లకు మంచి పాత్రలు లభించాయని అంటున్నారు.

ఇక ఫస్ట్ హాఫ్ ను నిలబెట్టింది ఇంటర్వెల్ సీన్ అని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ సీన్స్ తో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఊపందుకుంటూ వెళ్తుందని.. మొదట్లో నరసింహా రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అవుక రాజు సుదీప్.. తిరిగి చేతులు కలపడానికి వస్తాడు. బ్రిటీష్ వారిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ క్రమంలో వచ్చే సైరా సాంగ్ తెరపై ఇంతకుముందెన్నడు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ పాటను విజువల్ వండర్ గా తెరకెక్కించారని అంటున్నారు.

ఇక నరసింహా రెడ్డిని వెన్నుపోటు పొడిచేది ఎవరు, బ్రిటీష్ వారికి చిక్కిన తమన్నా కథ ఏం అవుతుంది, ఇలాంటి ట్విస్టులెన్నో సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. ఇక చివరి నలభై నిమిషాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని.. ప్రతి ఒక్కరి గుండెను కదిలిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మెగాస్టార్ తన ఎనర్జీ ని చూపించారని, నరసింహా రెడ్డి మాత్రమే కనిపించారని అంటున్నారు. ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాలు చేయడంలో హైలెట్ అని ట్రెండ్ అవుతోంది. తన నటనతో మరోసారి విజృంభించాడని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక గురువుగా నటించిన అమితాబ్ కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా.. ఎంతో ప్రభావం చూపించారని అంటున్నారు. ఇలాంటి సినిమాను నిర్మించిన రామ్ చరణ్‌ను అభినందిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనపడిందని అంటున్నారు.

సాంకేతికంగా ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సురేందర్‌రెడ్డి తనదైన శైలిలో రాసుకున్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ, తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా స్థాయిని పెంచేశాడని, ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడని అంటున్నారు. అమిత్ త్రివేది అందించిన సంగీతం అదిరిపోయిందని, సినిమా విజయం సాధించడంలో అదేంతో దోహదపడిందని అంటున్నారు.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్‌.. ప్రతీ సన్నివేశాన్ని గుండెకు హత్తుకునేలా చేశాడని అంటున్నారు. రత్నవేలు మరోసారి తన పనితనాన్ని చూపించడాని అంటున్నారు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని విభాగాలు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాయని అంటున్నారు. ఓ కొడుకు తన తండ్రి కలను నెరవేర్చడానికి ఎంతో ఖర్చు పెట్టాడని.. దానికి మించి ఔట్ పుట్ ను తీసుకొచ్చి.. తన తండ్రి సినీ జీవితంలో గుర్తుండిపోయే చిత్రాన్ని నిర్మించాడని అంటున్నారు.

చదవండి.. సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement