Sye Raa Review, Rating {4/5} | Sye Raa Narasimha Reddy Telugu Review | ‘సైరా’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘సైరా’ మూవీ రివ్యూ

Published Wed, Oct 2 2019 12:50 PM | Last Updated on Fri, Oct 18 2019 6:17 PM

Sye Raa Narasimha Reddy Telugu Review, Rating - Sakshi

టైటిల్: సైరా
జానర్: పీరియాడిక్ మూవీ
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
నిర్మాత: రామ్ చరణ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి

రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైరా అందర్నీ మెప్పించిందా లేదా అన్నది చూద్దాం.

కథ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ. 

నటీనటులు
సైరాలో మెగాస్టార్‌ చిరంజీవి కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్‌ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంభీరం ఎక్కడా మిస్‌ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. యాక్షన్‌ సీన్స్‌లో అయితే మెగాస్టార్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్‌ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సీన్స్లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్‌ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. మరణం కాదు ఇది జననం.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్‌ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్‌, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్‌ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్‌లో క్యారెక్టర్‌ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్‌ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది.

ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్‌ బుర్రా  రాశాడు.  సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్‌ అంతగా ఎలివేట్‌ అయిందంటే.. ప్రతీ సీన్‌తో ప్రేక్షకులు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యారంటే జూలియస్‌ ప్యాకియమ్‌ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్‌ చరణ్‌ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్‌, క్యాస్టూమ్‌, ఆర్ట్‌ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి.

బండ కళ్యాణ్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement