
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు.. జగన్‌మోహన్ రెడ్డి, సుచరిత, పెళ్లి కూతురు సంజన రెడ్డి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. కొద్ది రోజలు క్రితం వరకు చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియని స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే రూపొందిస్తున్నారు.
తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ముని మనుమరాలు సంజన రెడ్డి వివాహం చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డితో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి విచ్చేసిన ప్రముఖులకు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరిత స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్, మంత్రి అఖిల ప్రియ, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు విశ్వేశ్వరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉయ్యాలవాడ వారసులు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రంగా నిర్మించాలనుకున్నాము. అప్పట్లో ఈ విషయమై నటులు సుమన్, సాయికుమార్‌లను కూడా సంప్రదించాం. కానీ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితాన్ని సినిమాగా తియ్యటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment