శివాజి ఒళ్లో కూర్చుని పెరిగాను
దివంగత మహా నటుడు శివాజీగణేశన్ ఒళ్లో కూర్చుని పెరిగిన వాడిని నేను అని విశ్వనటుడు కమలహాసన్ అన్నారు. శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాగా. 2013లో హరిదాసు వంటి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందిన చిత్రాన్ని తెరకెక్కించిన జీఎన్‌ఆర్.కుమరవేలన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న తాజా చిత్రం ఇది. నవ నిర్మాత ఎం.బాలవిశ్వనాథన్ తన విజయ భార్గవి ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వాగా. విక్రమ్‌ప్రభుకు జంటగా నవ నటి రణ్య హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో విలన్‌గా షాజీచౌదరి నటిస్తున్నారు.
ఇతర ముఖ్యపాత్రల్లో కరుణాస్, సత్యన్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, తులసి, విద్యులేఖ, రాజ్‌కపూర్ నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు కమలహాసన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించి తోలి ప్రతిని సీనియర్ దర్శకుడు మహేంద్రన్‌కు అందించారు. కమల్ మాట్లాడుతూ ఇది తన కుటుంబ కార్యక్రమం అని అన్నారు. తాను శివాజీగణేశన్ ఒళ్లో కూర్చొని పెరిగిన వాడినన్నారు.
మూడున్నర, నాలుగేళ్ల వయసున్న తనకు అప్పుడు ఆయన ఎంత గొప్ప నటుడో తెలియదని, ఏడేళ్ల వయసులో స్థానిక నార్త్ బోగ్ రోడ్డులో గల ఆయన ఇంటికి వచ్చే అభిమానులను చూసిన తరువాత అంత మహా నటుడి ఒడిలోనా తాను కూర్చుంది అని ఆశ్చర్యపోయానన్నారు. అయితే శివాజీగణేశన్ ఇంటి గేటులు తన కోసం ఎప్పుడు తెరిచే ఉండేవన్నారు. తాను ఆ ఇంటిలో ఒకడినేనని అలాంటిది ఆ కుటుంబానికి చెందిన వారసుడి చిత్ర కార్యక్రమం జరుగుతుంటే తాను రాకుండా ఉండగలనా? అని అన్నారు.
విక్రమ్‌ప్రభు నటించిన ఈ వాగా చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు జీఎన్‌ఆర్.కుమారవేలన్ మాట్లాడుతూ బార్డర్ సెక్కూరిటీ ఫోర్స్ ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం వాగా అని వివరించారు. అక్కడ పని చేసే సైనికులు ఎదుర్కొనే సమస్యలు, వారి అనుభవాలే చిత్ర కథ అన్నారు. చిత్ర షూటింగ్‌ను కాశ్మీర్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలిలో నిర్విహంచామని తెలిపారు.
ఈ చిత్రం తనకెంత ముఖ్యమో హీరో విక్రమ్‌ప్రభు కెరీర్‌లోను అంత ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కఠిన శ్రమలో చేసిన చిత్రం వాగా అని మంచి ఫలితం ఇస్తుందనే నమ్మకంతో విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు హీరో విక్రమ్‌ప్రభు అన్నారు. రామ్‌కుమార్, ప్రభు, హీరోయిన్ రణ్య, సంగీత దర్శకుడు డి.ఇమాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.