దర్శక నిర్మాత వారాహి
తమిళ సినిమా: రజనీకాంత్‌కు ఒక న్యాయం, తమకో న్యాయమా అని సెన్సార్‌బోర్డు సభ్యులను ప్రశ్నిస్తున్నారు నటుడు, దర్శక నిర్మాత వారాహి. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం శివ మనసుల పుష్పా. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు పలు కట్స్‌తో పాటు చిత్ర టైటిల్‌నే మార్చమని చెప్పడంతో అవాక్కు అయిన వారాహి సెన్సార్ బోర్డు సభ్యుల తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను రూపొందించిన శివ మనసుల పుష్ప చిత్రం సమకాలీన రాజకీయాలతో కూడిన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర నిడివి గంట 45 నిమిషాలు ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు రెండు గంటల పాటు చర్చించి పలు రాజకీయపరమైన సంభాషణలను, గ్లామర్ సన్నివేశాలను కట్ చేయడంతో తాను వారితో వాగ్వాదం చేశానన్నారు. దీంతో చిత్రాన్ని ఢిల్లీలోని చైర్మన్‌కు పంపారన్నారు. ఆయన చిత్ర టైటిల్‌నే మార్చమని చెప్పారన్నారు.
అసలు టైటిల్ మార్చమని చెప్పడానికి సెన్సార్ సభ్యులెవరని ప్రశ్నించారు. ఇంతకు ముందు శివ మనసుల శక్తి, ఇటీవల ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు వంటి చిత్రాల టైటిల్‌కు అభ్యంతరం చెప్పని సెన్సార్ సభ్యులు తన చిత్రానికి చెప్పడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా తెలుస్తోందన్నారు. అదే విధంగా రజనీకాంత్ చిత్రాలు కూడా పలు రకాల పేర్లతో వచ్చాయన్నారు. వాటికి అభ్యంతరం చెప్పలేదే అని ప్రశ్నించారు. పెద్ద నటులకో న్యాయం, చిన్న నటులకో న్యాయమా మాదిరిగా పక్షపాతం చూపుతున్నట్లు సందేహం కలుగుతోందన్నారు. తన చిత్ర టీజర్‌కు శివ మనసుల పుష్ప అనే టైటిల్ సర్టిఫికెట్ పొందానని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు.
తాను సామాజిక పరమైన సమస్యలపై తరచూ ఫిర్యాదులు చేస్తుంటానని, అందుకే తన చిత్రం విషయంలో రాజకీయ జోక్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా ఉన్నానని, తన చిత్రం టైటిల్ విషయాల్లో సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఫిర్యాదు చేస్తేనే ఈ సమస్యపై సంఘం జోక్యం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. సర్టిఫికెట్ ఇవ్వడం సెన్సార్ బోర్డు బాధ్యత అని, దాన్ని నిలిపివేయడానికి వారికి అధికారం లేదని అన్నారు. శివ మనసుల పుష్ప చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు వారాహి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment