శ్రీయ అవుట్ వరలక్ష్మి ఇన్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్న మహాకవి రాసిన పాటలోని పల్లవిని గుర్తు చేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు బాల. ఈ జాతీయ ఉత్తమ నటుడు పరదేశి చిత్రం తరువాత తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శశికుమార్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ పాత్రకే నటీమణుల్లో ఆశలు రేకెత్తించి నిరాశ పరుస్తున్నారు. వైవిధ్యంతో కూడిన కథలను తెరకెక్కించే బాలా ఈసారి గరగాట్టాన్ని నేపథ్యంగా ఎంచుకుని చిత్రాన్ని రూపొందించనున్నారు. దీంతో గరగాట్ట నృత్యం బాగా ఆడే హీరోయిన్ బాలాకు అవసరం అయ్యారు.
దీంతో నృత్యంలో ప్రావీణ్యం ఉన్న నటి శ్రీయను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా శ్రీయను కాదని ఆ పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారని తెలిసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కల్సా నృత్యంలో శిక్షణ పొంది పలు నృత్య రూపకాలను ఆడారన్నది గమనార్హం. పోడాపొడి చిత్రం నిరాశ పరచడం, రెండవ చిత్రం మదగజరాజా చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కాకపోవడంతో అలిగి కన్నడ చిత్ర పరిశ్రమ వైపు పరిగెత్తిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు బాలా అవకాశం ఇవ్వడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందట. ఈ చిత్రం కోసం ఇళయరాజా ఆరు రోజుల్లో 12 పాటలను సిద్ధం చేశారు. ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం.