
లేడీ డాన్‌గా వరలక్ష్మి
కబాలి చిత్రం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ దాదాగా మారితే నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కసబా అనే మలయాళ చిత్రం కోసం లేడీ దాదాగా అవతారమెత్తారు. బహు భాషా నటీమణులుగా పేరు తెచ్చుకుంటున్న వారిలో నటి వరలక్ష్మీ ఒకరు. మొదట కల్సా డాన్స్, భరత నాట్యం వంటి నృత్యాల్లో శిక్షణ పొంది ఆ రంగంలో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పోడాపోడీ చిత్రంతో హీరోయిన్‌గా పరచయమయ్యారు. శింబు హీరోగా నటించిన ఆ చిత్రానికి నటి నయనతార ప్రియుడిగా ప్రచారం జరుగుతున్న విఘ్నేశ్‌శివ దర్శకుడు. పోడాపోడి చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా వరలక్ష్మీ మాత్రం మంచి గుర్తింపునే పొందారు. ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన మదగజరాజా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఆర్థిక సమస్యల కారణంగా విడుదలకు నోచుకోలేదు. చిన్న గ్యాప్ తరువాత బాలా దర్శకత్వంలో తారైతప్పట్టై చిత్రంలో నటించారు.
ఆ చిత్రం నిరాశ పరచినా గరగాటకార యువతిగా వరలక్ష్మి నటనకు మాత్రం పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసలు జల్లు కురిసింది. దీంతో వరలక్ష్మీ బహుభాషా నటిగా మారిపోయారు. తమిళం, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మలయాళంలో తొలి చిత్రంతోనే అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటించే లక్కీచాన్స్‌ను అందుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ లేడీ దాదాగా ఫుల్ మాస్ పాత్రలో నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ తారైతప్పట్టై చిత్రంలో తన నటనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు. తదుపరి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మలయాళ దర్శకుడు నితిన్ చెప్పిన కసబా చిత్ర కథ బాగా నచ్చిందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన దాదా యువతిగా నటిస్తున్నానని తెలిపారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్నారని చెప్పారు. ఆయన తన తండ్రి శరత్‌కుమార్‌తో కలిసి పళసీరాజా చిత్రంలో నటించారని, మమ్ముట్టి అంటే తనకు చాలా గౌరవం అని అన్నారు. ప్రస్తుతం తమిళంలో అమ్మాయి అనే హార ర్ కథా చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.అదే విధంగా తమిళం, కన్నడం భాషలలో తెరకెక్కుతున్న నిపుణన్ చిత్రంలో అర్జున్, ప్రసన్నలతో కలిసి నటిస్తున్నానని వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలిపారు.