వాళ్లిద్దరూ నావాళ్లు!
వాళ్లిద్దరూ నావాళ్లు!
Published Sat, Jan 25 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
తొలిచిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాతోపాటు నటించినా, వారితో తనకు పోటీ ఏమీ లేదని వరుణ్ ధవన్ అంటున్నారు. ‘పోటీ గురించి కూడా మేం ముగ్గురుం మాట్లాడుకుంటుంటాం. అయితే తొలిచిత్రంలో మనతోపాటు నటించిన వారితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు మన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే అవుతారు కాబట్టి పోటీ అనే సమస్యే రాదు. నిజానికి వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధవన్ కొడుకు కూడా అయిన వరుణ్ రెండో సినిమా ‘మై తెరా హీరో’ ట్రయలర్ ఇటీవలే విడుదలయింది. ఈ కొత్త సినిమా ఏమవుతుందో అని తనకంటే వాళ్లే ఎక్కువ మథనపడుతుంటారని చెప్పారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2012లో విడుదలైన ఘనవిజయం సాధించింది.
ఇక అప్పటి నుంచి ఈ ముగ్గురి కెరీర్ దూసుకుపోయింది. ఆలియా తాజాగా నటించిన హైవే, సిద్ధార్థ్ కొత్త సినిమా హసీ తో ఫసీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘సిద్ (సిద్ధార్థ్), ఆలియా సినిమాలు ఫిబ్రవరిలో వస్తున్నాయి. నాది మాత్రం ఏప్రిల్‌లో విడుదలవుతోంది. హసీ తో ఫసీ, హైవే ట్రయలర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ రెంటినీ చూసి తీరాల్సిందే’ అని ఈ 26 ఏళ్ల కుర్రవాడు వివరించాడు. హసీ తో ఫసీ ఫిబ్రవరి ఏడున, హైవే అదే నెల 21న ప్రేక్షకుల ముంగిటికి వస్తున్నాయి. ఇక మై తెరా హీరోకు వరుణ్ తండ్రి డేవిడే దర్శకుడు. నర్గిస్ ఫక్రీ, ఇలియానా ఇందులో హీరోయిన్లుగా కనిపిస్తారు. హైవేలో రణ్‌దీప్ హుడా హీరో కాగా, హసీ తో ఫసీలో సిద్‌కు పరిణీతి చోప్రా జోడీ కడుతోంది. కొత్త సంవత్సరంపై ఈ ముగ్గురు కొత్త నటులు భారీ ఆశలే పెట్టుకున్నట్టు అనిపిస్తోంది కదూ!
Advertisement