
జర్మనీలో 'కంచె' వేస్తున్నారు
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ ఎంటర్టైనర్ 'కంచె'. రెండో ప్రపంచయుద్ధ నేపధ్యంలో భారీగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్కు మాత్రమే కాదు. దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగెస్ట్ హిట్గా నిలిచింది కంచె. ఆకట్టుకునే కథా కథనాలతో పాటు టెక్నికల్గా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన కంచె సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కంచె సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఎంతో మంది సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్కు పంపే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కంచె సినిమాను జర్మన్ భాషలోకి అనువదించి అక్కడ కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన సినిమా కావటంతో పాశ్యాత్య దేశాల్లో కూడా కంచె సినిమాకు రీచ్ ఉంటుందని భావిస్తున్నారు. టెక్నికల్గా కూడా అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలతో తెరకెక్కటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కంచె. జర్మన్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.