మిస్టర్‌ లవ్‌స్టోరీ | varun tej movie mister cinema review | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ లవ్‌స్టోరీ

Published Sat, Apr 15 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

మిస్టర్‌ లవ్‌స్టోరీ

మిస్టర్‌ లవ్‌స్టోరీ

రివ్యూ: మిస్టర్‌
చిత్రం: ‘మిస్టర్‌’
తారాగణం: వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌...
కెమేరా: కేవీ గుహన్‌
కథ: గోపీమోహన్‌
మాటలు: శ్రీధర్‌ సీపాన
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్,  ‘ఠాగూర్‌’ మధు
స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: 14–ఏప్రిల్‌–2017


‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్‌’. వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఇందులో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. సినిమాలో ‘మిస్టర్‌’ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది? ఓ లుక్కేయండి.

కథ: చై (వరుణ్‌ తేజ్‌)ది సిక్స్‌ ఫీట్‌ ప్లస్‌ కటౌట్‌. ఈ కుర్రాడి అసలు పేరు పిచ్చయ్య నాయుడు.. స్పెయిన్‌లో ఉంటున్నాడు కదా, ట్రెండీగా ఉంటుందని ‘చై’ అని పెట్టుకుంటాడు. పేరొక్కటే మారింది గానీ... (ఇండియన్‌) పద్ధతులు, గట్రా కుర్రాడిలో ఉన్నాయండోయ్‌! చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం. ఓ రోజు స్పెయిన్‌ వస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్‌ ప్రియాను పికప్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌ వెళతాడు. ప్రియాను చూడగానే ఫ్లాట్‌. చెప్పేదేముంది? లవ్‌లో పడిపోతాడు. కానీ, ట్విస్ట్‌ ఏంటంటే... ఆ అమ్మాయి ప్రియా కాదు, మీరా (హెబ్బా పటేల్‌). రాంగ్‌ అమ్మాయిని పికప్‌ చేసుకుంటాడు. ఆ విషయం తెలిసే సరికి ఆ అమ్మాయితో లవ్‌లో పడిపోతాడు. మీరాను మిస్‌ చేసుకోకూడదనీ, మిస్సెస్‌ చేసుకోవాలనీ స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అవుతాడు. దాంతో పాప స్పెయిన్‌లో ఉన్నన్ని రోజులూ తమ ఇంట్లో ఉండేలా ప్లాన్‌ చేస్తాడు చై. మీరా క్లోజ్‌గా మూవ్‌ అవుతుంటే తనతో ప్రేమలో పడిందనుకుంటాడు.

కట్‌ చేస్తే... కుర్రాడిలో సంతోషానికి కట్‌ చెబుతూ.. ఆల్రెడీ ఇండియాలో సిద్ధార్థ్‌ (ప్రిన్స్‌)తో లవ్‌లో పడ్డానని మీరా షాకింగ్‌ ట్విస్ట్‌ ఇస్తుంది. అతణ్ణే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాని ఇండియా చెక్కేస్తుంది. పాపం... పస్ట్‌ లవ్‌ ఫ్లాపైన బాధలో చై స్పెయిన్‌లో చక్కర్లు కొడుతుంటాడు. సడన్‌గా మీరాను నుంచి ఫోన్‌... సిద్ధార్థ్‌ హ్యాండిచ్చాడని చెబుతుంది. ఇంకో కుర్రాడైతే ఛాన్స్‌ మళ్లీ రాదని మీరాను బుట్టలో వేసుకోవాలని ప్లానులు, గట్రా వేసేవాడేమో? ‘చై’ మాత్రం మీరా లవ్‌కి హెల్ప్‌ చేయాలని ఇండియా వెళతాడు. ఎందుకంటే... కొంచెం కల్చర్‌ ఉన్న కుర్రాడు, అందరికీ ప్రేమను పంచాలనే గుణం ఉన్నవాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌... మీరాకు హెల్ప్‌ చేసే టైమ్‌లో నచ్చని పెళ్లి చేస్తున్నారని ఇంటినుంచి పారిపోయి వచ్చిన చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి) చైకు పరిచయం అవుతుంది. రాయల వంశానికి చెందిన అమ్మాయి తను. ఆమెను కొందరు అత్యాచారం చేయబోయేతే చై కాపాడతాడు. చంద్రముఖి అతణ్ణి లవ్‌ చేయడం మొదలు పెడుతుంది. ఈలోపు రాయల వంశస్తులు తమ ఇంటి ఆడపిల్లను చై లేవదీసుకుపోయాడనుకుని, చంపేయాలనుకుంటారు. చైని బంధించి, రాజ దర్బారులో మరణ శిక్ష ఖరారు చేస్తారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌.. మనసు మార్చుకుని చంద్రముఖిని చైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు.

ఇప్పుడింకో ట్విస్ట్‌. మీరా కూడా మనసు మార్చుకుంటుంది. చైని లవ్‌ చేయడం మొదలుపెడుతుంది. అతడూ ఆమెను లవ్‌ చేస్తున్నాడని తెలుసుకుంటుంది. దాంతో చంద్రముఖిని సాఫ్ట్‌గా సైడ్‌ చేసి, ‘చై’తో సెటిల్‌ కావాలనుకుంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. ఇద్దరు అమ్మాయిలకూ ఓ కథ ఉన్నట్లే చైకి కూడా ఓ స్టోరీ ఉంది. ఇండియాలో ఉన్న తాతయ్యను కలవడానికి ఈ మనవడు ఇష్టపడడు. తాతయ్య అంటే చైకి ఎందుకు కోపం? తాతయ్యను కలిశాడా? లేదా? ఇద్దరమ్మాయిల్లో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? ‘చై’ను పై లోకాలకు పార్శిల్‌ చేయాలనుకున్న చంద్రముఖి ఫ్యామిలీ ఎందుకు నిర్ణయం మార్చుకుంది? అసలు ‘చై’ బ్యాగ్రౌండ్‌ ఏంటి? అనేవన్నీ చెప్పేస్తే.... సినిమా చూడబోయే ప్రేక్షకులకు థ్రిల్‌ మిస్‌ అవుతుంది.

విశ్లేషణ: మొత్తం ముగ్గురి కథలతో, ఆ కథలతో సంబంధం ఉన్న పాత్రలతో కొత్త డిజైన్‌లో న్యూ అప్రోచ్‌లో స్క్రీన్‌ప్లే అల్లినట్లుగా అనిపిస్తుంది. అందరివీ పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలే. తెరనిండా ఆర్టిస్టులే. వరుణ్‌తేజ్‌  కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్‌ బాగున్నట్లు అనిపిస్తాయి. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. రఘుబాబు ‘ఊపిరి’ స్పూఫ్, దర్శకుడి పాత్రలో పృథ్వీ కామెడీ ట్రాక్, గాంధేయవాదంతో షకలక శంకర్‌లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనికెళ్ల భరణి, నాజర్, మురళీ శర్మ, రమేష్‌ అరవింద్‌ల నటనకు వంక పెట్టలేం. కేవీ గుహన్‌ సినిమాటోగ్రఫీ ఐ–ఫీస్ట్‌గా ఉంటుంది. మిక్కీ జె. మేయర్‌ బాణీల్లో ‘ప్రియ స్వాగతం...’, ‘సయ్యోరే సయ్యోరే...’ క్యాచీగా ఉన్నాయి. ప్రొడక్షన్‌ వేల్యూస్‌లో రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ శ్రీను వైట్ల మార్క్‌ టేకింగ్, కామెడీ టైమింగ్‌తో సాగే కమర్షియల్‌ ఫార్మాట్‌ మూవీ ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement