కుర్రాడి ఖలేజా!
సినిమా విడుదల కాకముందే... ఫస్ట్‌లుక్‌తోనే అందరి మెప్పు పొందేశాడు వరుణ్‌తేజ్. ఈ యంగ్ మెగాహీరోని తెరపై ఎప్పుడు చూస్తామా.. అని మెగా ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ‘ముకుందా’ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు తెలిపారు. కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రాలతో ఫీల్‌గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. తన గత చిత్రాలను మించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, మిక్కీ జె.మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 14న విడుదల చేయనున్నామనీ నిర్మాతలు తెలిపారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘ఎలాంటి అంశాలకూ ప్రభావితం కాకుండా, స్థిరంగా ఉండే కుర్రాడి కథ ఇది. ఈ కుర్రాడి ఖలేజా ఏంటో సినిమాలో చూడాల్సిందే. రూరల్ టౌన్‌లో జరిగే ప్రేమకథలు, అక్కడి రాజకీయాలు, కుర్రాళ్ల భావోద్వేగాలు... వీటన్నింటినీ సహజంగా చూపించే ప్రయత్నం చేశాం. భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోటలో చిత్రీకరణ జరిపాం. నా గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను.
నటునిగా వరుణ్ ఖలేజా ఏంటో తెలిపే సినిమా ఇది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ఆ పాటను హైదరాబాద్‌లో సెట్ వేసి తీస్తాం’’ అని చెప్పారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, నాజర్, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, కెమెరా: మణికందన్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్.