Mukunda
-
ఇప్పుడు బాబాయ్‌తో?
‘ముకుంద’ చిత్రంలో అబ్బాయ్ వరుణ్‌తేజ్‌తో జతకట్టిన గోపికమ్మ పూజా హెగ్డే తాజాగా బాబాయ్ పవన్ కల్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో జతకట్టనున్నారు. ఇప్పటికే కీర్తి సురేశ్ ఓ హీరోయిన్గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే ‘ముకుంద’ తర్వాత హిందీలో ‘మొహెంజోదారో’ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో నటిస్తోంది. ఇకపై తెలుగు సినిమాలపై ఆమె ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నారట. -
ఏ బంధమూ లేదు!
‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుని పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షాపంత్, అంగనారాయ్ కథానాయికలు. మోహన ప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.రాఘవయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని పాత్రల మధ్య ఎటువంటి బంధమూ ఉండదు. ఏ బంధం లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఈ తరహా మూవీ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదు. సరికొత్త కథను యంగ్ టీమ్‌తో కలిసి చేశాం’’ అన్నారు. ‘‘ముకుంద చిత్రం తర్వాత దర్శక-నిర్మాతలు ఈ చిత్రకథ నాకు చెప్పారు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నా’’ అని శైలేష్ అన్నారు. దీక్షాపంత్, అంగనారాయ్, సంగీత దర్శకుడు వెంగీ, కెమెరామ్యాన్ వి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న, పెదనాన్న మెచ్చుకున్నారు!
తొలిసారిగా తెర మీదకు వచ్చి కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా టెన్షన్ సహజమే. ఆ ప్రయత్నం చూసి ఇంట్లోవాళ్ళు ఏమంటారోనన్న భయమూ సహజమే. తొలి చిత్రం ‘ముకుంద’ విషయంలో హీరో వరుణ్తేజ్కూ అదే అనుభవమైంది. కాకపోతే, ‘‘సినిమా చూశాక నాన్న గారు బాగుందన్నారు. కొన్ని కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో నాకు అవి నటుడిగా ఉపయోగపడతాయి’’ అని ఈ యువ హీరో చెప్పారు. మరి, చిరంజీవి ఏమన్నారు? ‘‘పెదనాన్న అయితే నీకిచ్చిన పాత్రకూ, కథకూ తగ్గట్లు బాగా చేశావంటూ ప్రోత్సహించారు’’ అని వరుణ్‌తేజ్ ఇష్టాగోష్ఠిగా చెప్పారు. ‘ముకుంద’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరులతో తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, ‘‘దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల లాగే ఇదీ సహజమైన సినిమా. ఇలాంటి చిత్రాలు చేయడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్నది నా కోరిక’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ‘‘అందరూ కష్టపడి నిజాయతీగా పనిచేయడం వల్లే ఈ చిత్రం విజయవంతమైంది. మొదట మిశ్రమ స్పందన వచ్చినా, క్రమంగా పాజిటివ్ టాక్ స్థిరపడి, ఇప్పటి దాకా దాదాపు 13 - 14 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం సాధించింది’’ అని చెప్పారు. ‘‘రావు రమేశ్ అమ్మ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, తెర మీద మళ్ళీ దొరగారిని (రావు గోపాలరావు) చూసినట్లుంది అంటూ రావు రమేశ్ పాత్ర గురించి పేర్కొనడం మర్చిపోలేని అనుభవం’’ అని శ్రీకాంత్ చెప్పారు. నటులు పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రావు రమేశ్, ఆనంద్, నిర్మాతల్లో ఒకరైన ‘ఠాగూర్’ మధు తదితరులు ఈ విజయోత్సవ సభలో పాల్గొని, తమ అనుభూతులను పంచుకున్నారు. మొత్తానికి, ‘ముకుంద’ అటు హీరోకూ, అటు నటీనటులకూ ఇంట్లో వాళ్ళ నుంచి తగిన ప్రశంసలే తెచ్చిందన్న మాట! -
'ముకుంద' టీంతో సాక్షి చిట్‌చాట్
-
ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే!
♦ శ్రీకాంత్ అడ్డాల పెరిగిన వాతావరణాన్నీ, బంధాల్నీ, బాంధవ్యాల్నీ, మంచితనాన్నీ అమితంగా ప్రేమిస్తారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ మమకారం ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి విలువల కోసం పరితపించే ప్రేక్షకునికి శ్రీకాంత్ అడ్డాల సినిమాలు నిజంగా విజువల్ ఫీస్టే. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘ముకుంద’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోందని శ్రీకాంత్ అడ్డాల ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు. నైతిక విలువలకు మీ కథల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దానికి కారణం? సినిమా బలమైన మాధ్యమం. దాని ద్వారా వినోదాన్ని అందిస్తే చాలదు. జనానికి ఏదో మంచి చెప్పాలి. అది మనసుల్ని మార్చేలా ఉండాలి. అప్పుడే కొంతైనా మనుషుల్లో మార్పు వస్తుంది. అందుకే నా తాపత్రయం. ఈ సినిమాలో ప్రేక్షకులకు బాగా నచ్చిన అంశం ఏంటనుకుంటున్నారు? విలువలు. వాటిని కచ్చితంగా జనాలు ప్రేమిస్తారు. ఒక రోజు ఆలస్యమైనా అది జరుగుతుంది. స్నేహితుని కోసం పోరాటం తప్ప... హీరో లక్ష్యం సరిగ్గా ఎలివేట్ కాలేదని కొందరి అభిప్రాయం? స్నేహితుని కోసం హీరో చేసే పోరాటం కాదిది. అధికార మదంతో మనుషుల్ని పశువులు కన్నా హీనంగా చూస్తున్న ఓ రాజకీయ నాయకునిపై హీరో చేసిన పోరాటం. దానికి స్నేహితుడు ఉత్ప్రేరకం మాత్రమే. మారణాయుధాలతో మనుషుల్ని చంపేవాడి కంటే... తక్కువ చేసి మాట్లాడి, ఇంటలిజెంట్ క్రిమినాలిటీతో మనుషుల్ని చంపేవాడు ప్రమాదకారి. ఇందులో విలన్ అలాంటివాడే. జనాల్లో తమపై తమకు తక్కువ భావాన్ని పెంచి, వాళ్లను బలహీనులుగా మార్చడం విలన్ నైజం. జనాలకు వాళ్ల శక్తిని వాళ్లకు తెలియజేసేదే హీరో పాత్ర. అందుకే... హీరోకు ముకుంద అని పేరు పెట్టా. మానసికంగా బలహీనుడైన అర్జునుడికే కదా ఏరికోరి కృష్ణుడు భగవద్గీత చెప్పింది. ‘మనకు మనం తక్కువ చేసుకోవడం పెద్ద క్రైమ్’ ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా నేను చెప్పింది అదే. వీధిలో విప్లవ భావాలను వల్లెవేస్తూ తిరిగే ఓ వ్యక్తిని, పాతికేళ్లు చైర్మన్‌గిరిని ఎంజాయ్ చేస్తున్న ఓ బలమైన నాయకుడిపై నిలబెట్టి గెలిపించడం రియల్ లైఫ్‌లో సాధ్యమేనా? నేను ఇంతకు ముందు చెప్పింది అదే. ఎదుటివాడు బలవంతుడు అనుకోవడంలోనే మన బలహీనత దాగుంటుంది. జనాల్లో చైతన్యం వస్తే ఏదైనా సాధ్యమే. మా ఊరు రేలంగిలో ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్రను పోలిన వ్యక్తి ఒకతను ఉండేవాడు. ఊరి చైర్మన్ ఓసారి జెండా వందనం చేస్తుంటే... ‘ఆ జెండాలోని మూడు రంగులకు అర్థం చెప్పు’ అని అందరి ముందూ అడిగేశాడు. ఆ వ్యక్తినే ప్రేరణగా తీసుకొని ఈ పాత్ర సృష్టించా. ఈ సినిమాలో చాలా పాత్రలు నా జీవితంలో చూసిన మనుషులు, అనుభవాలే. మరి హీరో పాత్రకు ప్రేరణ? అలాంటి వాళ్లు సమాజంలో కనిపించరు. అది మాత్రం ఊహాజనితమే. ఇందులో హీరో చాలావరకు సీరియస్‌గా కనిపించాడని చాలామంది అంటున్నారు. కానీ ఆ పాత్ర అలాగే ఉండాలి. ఉదాహరణకు ‘శివ’ సినిమా తీసుకోండి. శివ చుట్టూ ఉన్న వాళ్లందరూ కామెడీ చేస్తారు. కానీ... శివ మాత్రం సీరియస్‌గానే ఉంటాడు. శివ కామెడీ చేస్తే... సినిమానే దెబ్బతింటుంది. ఇందులో ముకుంద పాత్ర కూడా అంతే. వరుణ్ భావోద్వేగాలను చక్కగా పలికించాడు. క్రమశిక్షణగా నడుచుకున్నాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. కథ రీత్యా ఇందులో హీరోకీ హీరోయిన్‌కీ పరిచయం ఉండదు. కానీ డ్యూయెట్లు పెట్టేశారు! శ్రీకృష్ణుడు, రుక్మిణి ప్రేమకథే ఈ విషయంలో నాకు స్ఫూర్తి. కృష్ణుడు, రుక్మిణి ఒకరినొకరు చూసుకోరు. కానీ ప్రేమించుకుంటారు. ఇటీవల అన్నీ మాటలే తప్ప పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. అసలు మాటలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమ చూపించాలనే తపనతోనే అలా చేశాను. తొలి సినిమా ప్రేమకథ, రెండో సినిమా కుటుంబ కథ, మూడో సినిమా రూరల్ పాలిటిక్స్... మరి నాలుగో సినిమా ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, ప్రేమ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి కుటుంబ కథ చేయబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే 2015లోనే త్వరగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నా. ఆ సినిమా పేరు ‘బ్రహ్మోత్సవం’ అనీ, మహేశ్ అందులో హీరో అని బయట టాక్? ఆ వివరాలు నేను చెబితే బావుండదు. నా నిర్మాతలు చెప్పాలి. దర్శకునిగా మీకు ప్రేరణ? దాసరి నారాయణరావుగారు. ఆయన సినిమాలు చూసే స్క్రీన్‌ప్లే అనేది నేర్చుకున్నాను. కుటుంబ విలువలకు మొదట్నుంచీ పెద్ద పీట వేసిన గొప్ప దర్శకుడాయన. ఆయన తర్వాత కె.విశ్వనాథ్, కె.బాలచందర్, మణిరత్నం... నాకిష్టమైన దర్శకులు. సీతమ్మవాకిట్లో... తో మల్టీస్టారర్ ట్రెండ్‌కి తెరతీశారు. మరో భారీ మల్టీస్టారర్ ఎప్పుడు? త్వరలోనే. నా నెక్ట్స్ సినిమా తర్వాత మల్టీస్టారరే చేస్తా. ఆ వివరాలు అప్పుడే చెబుతా. -
'ముకుందా' టీంతో సాక్షి చిట్‌చాట్
-
చెర్రీ... బాబాయ్ జట్టు నేను... పెదనాన్న జట్టు
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నట వారసుడు వరుణ్‌తేజ్. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఘనత ఈ యువ హీరోది. వరుణ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తో సాక్షి జరిపిన సంభాషణ. కెమెరా ముందు తొలి అనుభవం ఎలా ఉంది? భయమేసిందండీ. నా అదృష్టం బావుండి ఫస్ట్ మాంటేజస్ షాట్స్ తీశారు. తర్వాత ఫైట్లు తీశారు. నేను ఫైట్లు బాగా చేస్తాను. ఎందుకంటే ముందే కొంత ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత ఓ చిన్న డైలాగ్‌తో యాక్టింగ్ పార్ట్ మొదలైంది. ఫస్ట్ నాలుగు టేకులు తీసుకున్నా. శ్రీకాంత్ అడ్డాల ఎక్స్ప్రెషన్తో సహా నెరేట్ చేసేవారు. అందుకే పోను పోను కేరక్టర్‌లోకి వెళ్లిపోయా. ఇందులో మీ పేరు ముకుందానా? అవును... అయితే సినిమాలో ఆ పేరెక్కడా వినిపించదు. ఓ సన్నివేశంలో ఫామ్‌పై ‘ముకుంద’ అని సైన్ చేస్తాను. ఆ సన్నివేశం తర్వాతే ఆ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే నా పాత్ర కూడా శ్రీకృష్ణుణ్ణి పోలి ఉంటుంది. కృష్ణుడు ఏం చేసినా లోక కల్యాణం కోసమే. అలాగే ఇందులో నేను కూడా. మాటలు తక్కువ. పనులు ఎక్కువ. భావోద్వేగాలను ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయను. నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ, పాత్రకు తగ్గట్టుగా సీరియస్‌గా చేయాల్సొచ్చింది. మెగా ఫ్యాన్స్ మాస్ పాత్రలే ఇష్టపడతారు. ఇందులో ఆలా ఉంటారా? మా ఫ్యామిలీలో ఎవరూ కావాలని మాస్ పాత్రలు చేయలేదు. వచ్చిన పాత్రల్ని ఎంత బాగా చేయొచ్చో అంత బాగా చేసి, మెప్పించారు. ఆటోమేటిగ్గా మాస్ ఇమేజ్ వచ్చింది. నేనూ అదే దారిలో వెళ్తా. ఇంతమంది దర్శకులుండగా శ్రీకాంత్‌నే ఓకే చేయడానికి కారణం? మేం ఆయన్ను ఓకే చేయడం కాదు, ఆయనే నన్ను ఓకే చేశారు. శ్రీకాంత్‌లాంటి డెరైక్టర్ తనకు తానుగా వచ్చి అడగడంతో నాన్న ఓకే చెప్పేశారు. ఓ అగ్ర నిర్మాత నన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే... శ్రీకాంత్‌గారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్‌గారి దగ్గరకెళ్లింది. ఆయన ‘హార్ట్ ఎటాక్’ కథ వినిపించారు. బాగుందనిపించినా కానీ... కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫైనల్ కాలేదు. తర్వాత క్రిష్ ఓ కథ వినిపించారు. మొదటి సినిమానే ఇంత పెద్ద కథా అని భయమేసింది. కథ నచ్చడంతో ‘ఆగస్ట్ 8న షూటింగ్ స్టార్ట్’ అని ట్విట్టర్లో పెట్టాను. అయితే... క్రిష్ ‘గబ్బర్’ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఏదేమైనా ఫస్ట్ కలిసింది శ్రీకాంత్‌గారే కాబట్టి ఆయనకే సినిమా చేయడం న్యాయమని నాన్న ఫీలయ్యారు. ఫస్ట్ నుంచి నటుడవ్వాలనే కోరిక ఉండేదా మీకు? మనసులో ఉండేది. 122 కిలోల బరువుండేవాణ్ణి. అందుకే చెప్పుకునేవాణ్ణి కాదు. మెల్లమెల్లగా 55 కిలోలు తగ్గాను. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ‘మగధీర’ షూటింగ్ అప్పుడు ఫొటోలు దిగితే, అవి చూసి.. ‘నీది ఫొటోజనిక్ ఫేస్... ఇంట్రస్ట్ ఉంటే ట్రై చేయ్’ అని పెదనాన్న అన్నారు. స్వయంగా పెదనాన్నే అనేసరికి నా కోరిక చెప్పేశాను. ఇక, అమ్మానాన్న అయితే, నేనేం చేస్తానన్నా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్ బాగా ఆడతారా? ఇదివరకు లావుగా ఉండేవాణ్ణి కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఆడుతున్నా. ఏడాది బాటు టెన్నిస్ ఆడాను. తర్వాత ఏడాదిన్నర పాటు బ్యాడ్మింటన్ ఆడా. రెండేళ్ల నుంచి వాలీబాల్ ఆడుతున్నా. ‘ముకుంద’లో నేను వాలీబాల్ ప్లేయర్‌ని. ఆ పాత్రకు నా స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉపయోగపడింది. నటనలో మీకెవరు ఇన్స్పిరేషన్? పెదనాన్నే... ఆయన ‘విజేత’ సినిమా చూసి ఏడ్చేవాణ్ణి. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ చిత్రాలు చాలాసార్లు చూశాను. కమల్‌హాసన్ నటనంటే ప్రాణం. హాలీవుడ్లో ఆర్నాల్డ్, తెలుగులో ప్రభాస్ ఫైట్లంటే ఇష్టం. వారిని ప్రేరణగా తీసుకుంటాను తప్ప... ఇమిటేట్ చేయను. పెదనాన్న, బాబాయ్... వీళ్లద్దరిలో ఎవరంటే ఇష్టం? ఇద్దరూ ఇష్టమే. అయితే... పెద్దనాన్నంటే కాస్త ఎక్కువ ఇష్టం. నేనాయన పెట్ని. వీకెండ్లో ఆయన దగ్గరే ఉండేవాణ్ణి. చెర్రీ (రామ్ చరణ్) అన్నయ్య, కల్యాణ్బాబాయ్ ఓ జట్టు. నేను పెదనాన్న జట్టు. మీ ఫ్యామిలీపై వచ్చే రూమర్లు వింటే మీకేమనిపిస్తుంది? కొన్ని రూమర్లు చూస్తే నవ్వొస్తుంటుంది. ఎవరింట్లో సమస్యలుండవ్ చెప్పండి? కూర వండితే ఒకరికి నచ్చుతుంది. ఒకరికి నచ్చదు. మా ఇంట్లో సమస్యలు కూడా అలాంటివే. ‘ఆరంజ్’ టైమ్‌లో నాన్న కాస్త ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశారు. అప్పుడు పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరూ నాన్నకు సపోర్ట్‌గా నిలిచారు. నైట్ పార్టీలకు వెళ్తుంటారా? అలాంటివి నాన్న పోత్సహించరు. ఇదివరకు రెండుమూడు సార్లు పబ్‌లకు వెళ్లా. అక్కడ వీకెండ్స్‌లో అమ్మాయిలు లేకపోతే రానీయరు. అందుకే వెనక్కి వచ్చేశాం. కొంతమందైతే.. ‘నేను ఎవరబ్బాయినో తెలుసా?’ అని ఆర్గ్యూ చేస్తారు. నాకు అలా చెప్పుకోవడం నచ్చదు. అందుకే అలాంటి ప్లేస్‌లకు వెళ్లకూడదనుకున్నా. నైట్ కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. కారు తీసి అలా ఓ రౌండ్ వేసి వస్తుంటా. నెక్ట్స్ సినిమాలు? క్రిష్, పూరీ... ఇద్దరి సినిమాలూ ఓకే చేశా. - బుర్రా నరసింహ -
అరెరే... చంద్రకళా...జారెనా కిందకిలా...
చిరంజీవి ‘మెగా’ కుటుంబం నుంచి మరో వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి రంగం సిద్ధమైంది. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆఖరు ఘట్టంగా ఒక ముఖ్యమైన పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. మిక్కీ జె. మేయర్ స్వరాలకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం కూర్చిన ‘అరెరే... చంద్రకళా... జారెనా కిందకిలా...’ అనే పాటను శనివారం నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. నెమళ్ళతో కూడిన అందమైన సెట్లో రాజు సుందరం ఈ పాటకు నృత్యం సమకూరుస్తున్నారు. ‘‘సోమవారం వరకు ఈ పాట చిత్రీకరణ సాగుతుంది. దాంతో, సినిమా మొత్తం పూర్తయిపోయినట్లే. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తోందనీ, చాలా రోజుల తరువాత సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఈ పాటలు ఉన్నాయంటూ శ్రోతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు పేర్కొన్నారు. ఈ చిత్రంపై దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ‘‘ఇటు పూర్తిగా నగరం కానీ, అటు పూర్తిగా పల్లెటూరు కానీ కాకుండా మధ్యస్థంగా ఉండే పట్నాల్లోని యువతీ యువకుల భావోద్వేగాలు, ఆ వాతావరణం ప్రతిబింబించే కథ ఇది. ఇప్పటి దాకా ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫీల్‌గుడ్ సినిమాలే రూపొందించా. అందుకు భిన్నంగా ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తీశా’’ అని శ్రీకాంత్ వివరించారు. ఆ విశేషాలన్నీ తెరపై చూడడానికి మరొక్క పది రోజులు ఓపిక పట్టాల్సిందే. -
పూరీ దర్శకత్వంలో.. వరుణ్ తేజ్..!
-
ముకుంద ఆడియో లాంచ్
-
కుర్రాడి ఖలేజా!
సినిమా విడుదల కాకముందే... ఫస్ట్‌లుక్‌తోనే అందరి మెప్పు పొందేశాడు వరుణ్‌తేజ్. ఈ యంగ్ మెగాహీరోని తెరపై ఎప్పుడు చూస్తామా.. అని మెగా ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ‘ముకుందా’ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు తెలిపారు. కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రాలతో ఫీల్‌గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. తన గత చిత్రాలను మించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, మిక్కీ జె.మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 14న విడుదల చేయనున్నామనీ నిర్మాతలు తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘ఎలాంటి అంశాలకూ ప్రభావితం కాకుండా, స్థిరంగా ఉండే కుర్రాడి కథ ఇది. ఈ కుర్రాడి ఖలేజా ఏంటో సినిమాలో చూడాల్సిందే. రూరల్ టౌన్లో జరిగే ప్రేమకథలు, అక్కడి రాజకీయాలు, కుర్రాళ్ల భావోద్వేగాలు... వీటన్నింటినీ సహజంగా చూపించే ప్రయత్నం చేశాం. భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోటలో చిత్రీకరణ జరిపాం. నా గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. నటునిగా వరుణ్ ఖలేజా ఏంటో తెలిపే సినిమా ఇది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ఆ పాటను హైదరాబాద్‌లో సెట్ వేసి తీస్తాం’’ అని చెప్పారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, నాజర్, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, కెమెరా: మణికందన్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్. -
ముకుంద మూవీ స్టిల్స్
-
ముకుంద మూవీ న్యూ స్టిల్స్
-
నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం!
సినీనటుడు, మెగా బ్రదర్‌సలో ఒకరైన నాగబాబు కుమారుడు హీరో వరుణ్‌తేజ్ అమలాపురంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఎన్నికల ప్రచారమేంటి? అనుకుంటున్నారా..? అదేం లేదండీ ఆయన నటిస్తున్న ‘ముకుంద’ సినిమా షూటింగ్ అమలాపురంలో శరవేగంగా జరుగుతోంది. దీనిలోని కీలకమైన మున్సిపల్ చైర్మర్ ఎన్నికల సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. వరుణ్‌తేజ్ పట్టణంలోని గారపాటి వీధిలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న సన్నివేశాలను షూట్ చేశారు. లియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. చిత్రంలో ప్రతినాయకునిగా రావు రమేష్, అతని కూతురిగా హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్నారు. కథ ప్రకారం.. హెగ్డే తండ్రి తరఫున ఓట్లు అభ్యర్థిస్తుండగా, అక్కడ వరుణ్‌తేజ్ తారసపడతాడు. అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె కారు ఎక్కే సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. వినాయకచవితి రోజూ షూటింగ్ జరిగింది. నటుడు ప్రకాష్‌రాజ్‌పై సన్నివేశాలను చిత్రీకరించారు. కాపు కల్యాణ మండపం దగ్గర వేసిన భోగిమంట సెట్టింగ్ వద్ద ‘రాజకీయ కాలుష్యం ఈ మంటల్లో కడతేరిపోవాలి’ అంటూ ఆయన డైలాగ్ చెబుతుండగా, సన్నివేశాన్ని చిత్రీకరిం చారు. పిల్లల పార్కు వద్ద కూడా వరుణ్‌తేజ్, ప్రకాష్‌రాజ్‌పై సన్నివేశాలను షూట్ చేశారు. షూటింగ్‌ను తిల కించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. - అమలాపురం టౌన్ -
పెదనాన్నకు ఫస్ట్ లుక్ గిప్ట్ ఇచ్చిన వరుణ్
-
ముకుంద మూవీ స్టిల్స్
-
ఈ తరం కుర్రాడు
చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురి పోలికలూ కలిస్తే వచ్చే రూపం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చదవగానే.. కొంతమంది ముగ్గురి ఫొటోలనూ ఫొటోషాప్‌లో డిజైన్ చేసేసి ఓ రూపం తెచ్చేస్తారు. కానీ.. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ‘వరుణ్ తేజ్’ వైపు ఓ లుక్కేస్తే చాలు. పెదనాన్న, తండ్రి, బాబాయ్‌ల పోలికలు స్పష్టంగా కనిపించేస్తాయ్. ఓ సెలబ్రిటీ కుటుంబం నుంచి పరిచయమయ్యే ఆర్టిస్ట్‌పై ఎన్ని అంచనాలుంటాయో ‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్న వరుణ్‌పై కూడా అన్నే అంచనాలున్నాయి. ఆ అంచనాలు చేరుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ యువ హీరో. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకూ మిక్కీ జె.మేయర్ అద్భుతమైన స్వరాలందించారు. వచ్చే నెల పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పట్టణ నేపథ్యంలో సాగే చిత్రమనీ, ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు అన్నారు. -
ముకుందగా వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ ‘ముకుంద’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ముకుంద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకుల కితాబులందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే విధంగా ఇందులో వరుణ్‌తేజ్ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్.