ఈ తరం కుర్రాడు
చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురి పోలికలూ కలిస్తే వచ్చే రూపం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చదవగానే.. కొంతమంది ముగ్గురి ఫొటోలనూ ఫొటోషాప్‌లో డిజైన్ చేసేసి ఓ రూపం తెచ్చేస్తారు. కానీ.. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ‘వరుణ్ తేజ్’ వైపు ఓ లుక్కేస్తే చాలు. పెదనాన్న, తండ్రి, బాబాయ్‌ల పోలికలు స్పష్టంగా కనిపించేస్తాయ్. ఓ సెలబ్రిటీ కుటుంబం నుంచి పరిచయమయ్యే ఆర్టిస్ట్‌పై ఎన్ని అంచనాలుంటాయో ‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్న వరుణ్‌పై కూడా అన్నే అంచనాలున్నాయి.
ఆ అంచనాలు చేరుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ యువ హీరో. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకూ మిక్కీ జె.మేయర్ అద్భుతమైన స్వరాలందించారు. వచ్చే నెల పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పట్టణ నేపథ్యంలో సాగే చిత్రమనీ, ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు అన్నారు.