nallamalupu srinivas bujji
-
వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు : చిరంజీవి
‘‘వరుణ్ నా హృదయానికి దగ్గరైన వ్యక్తి. నన్ను డాడీ అని, సురేఖను మమ్మీ అని పిలుస్తుంటాడు. గొప్ప టీమ్‌తో తన తొలి సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో వరుణ్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమ్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం ‘ముకుంద’. పూజా హెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో అల్లు అర్జున్‌కి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ -‘‘లా కోర్సు చేస్తున్న నాగబాబును నేను సినిమా పరిశ్రమకు తీసుకొస్తే, మా నాన్నగారు ఇష్టపడలేదు. కానీ నాగబాబు నటునిగా, నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగాడు. నాగబాబు నటనకి నేను అభిమానిని. నాగబాబు ఏమవ్వాలనుకున్నాడో, అవన్నీ వరుణ్ నెరవేరుస్తాడు. నాతో ‘ఠాగూర్’ తీసిన మధు, అప్పట్నుంచీ ‘ఠాగూర్’ మధు అయిపోయాడు. నల్లమలుపు బుజ్జి కూడా ‘ముకుంద’ బుజ్జి అనిపించుకుంటాడు. శ్రీకాంత్ అరుదైన దర్శకుడు. తెలుగుదనంతో సినిమాలకు ఊపిరి పోస్తున్నాడు’’ అని చెప్పారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, తనను నమ్మి ఈ సినిమా చేయడానికొచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా అనర్గళంగా ప్రసంగించిన వరుణ్ని చూసి చిరంజీవి ముగ్ధులైపోయారు. -
ముకుంద మూవీ స్టిల్స్
-
ఈ తరం కుర్రాడు
చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురి పోలికలూ కలిస్తే వచ్చే రూపం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చదవగానే.. కొంతమంది ముగ్గురి ఫొటోలనూ ఫొటోషాప్‌లో డిజైన్ చేసేసి ఓ రూపం తెచ్చేస్తారు. కానీ.. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ‘వరుణ్ తేజ్’ వైపు ఓ లుక్కేస్తే చాలు. పెదనాన్న, తండ్రి, బాబాయ్‌ల పోలికలు స్పష్టంగా కనిపించేస్తాయ్. ఓ సెలబ్రిటీ కుటుంబం నుంచి పరిచయమయ్యే ఆర్టిస్ట్‌పై ఎన్ని అంచనాలుంటాయో ‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్న వరుణ్‌పై కూడా అన్నే అంచనాలున్నాయి. ఆ అంచనాలు చేరుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ యువ హీరో. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకూ మిక్కీ జె.మేయర్ అద్భుతమైన స్వరాలందించారు. వచ్చే నెల పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పట్టణ నేపథ్యంలో సాగే చిత్రమనీ, ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు అన్నారు. -
రేస్‌కు గుర్రం రెడీ
సమ్మర్ బాక్సాఫీస్ రేస్‌లో సత్తా చాటడానికి ‘రేసుగుర్రం’ రెడీ అయ్యింది. అల్లు అర్జున్ పాత్ర చిత్రణే ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. బన్నీ కెరీర్లో గుర్తుండిపోయేలా దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇందులో బన్నీ పాత్ర చిత్రణ అత్యంత శక్తిమంతంగా ఉంటుందట. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.