వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు : చిరంజీవి
‘‘వరుణ్ నా హృదయానికి దగ్గరైన వ్యక్తి. నన్ను డాడీ అని, సురేఖను మమ్మీ అని పిలుస్తుంటాడు. గొప్ప టీమ్‌తో తన తొలి సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో వరుణ్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమ్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం ‘ముకుంద’. పూజా హెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో అల్లు అర్జున్‌కి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ -‘‘లా కోర్సు చేస్తున్న నాగబాబును నేను సినిమా పరిశ్రమకు తీసుకొస్తే, మా నాన్నగారు ఇష్టపడలేదు.
కానీ నాగబాబు నటునిగా, నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగాడు. నాగబాబు నటనకి నేను అభిమానిని. నాగబాబు ఏమవ్వాలనుకున్నాడో, అవన్నీ వరుణ్ నెరవేరుస్తాడు. నాతో ‘ఠాగూర్’ తీసిన మధు, అప్పట్నుంచీ ‘ఠాగూర్’ మధు అయిపోయాడు. నల్లమలుపు బుజ్జి కూడా ‘ముకుంద’ బుజ్జి అనిపించుకుంటాడు. శ్రీకాంత్ అరుదైన దర్శకుడు. తెలుగుదనంతో సినిమాలకు ఊపిరి పోస్తున్నాడు’’ అని చెప్పారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, తనను నమ్మి ఈ సినిమా చేయడానికొచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా అనర్గళంగా ప్రసంగించిన వరుణ్‌ని చూసి చిరంజీవి ముగ్ధులైపోయారు.