Tagore Madhu
-
స్వయం భూ ప్రారంభం
నిఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘స్వయం భూ’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. నిర్మాత ‘ఠాగూర్ మధు’ సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. అలాగే ‘స్వయం భూ’ సినిమాలోని నిఖిల్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘నిఖిల్‌ను ఫెరోషియస్ వారియర్‌గా చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘స్వయం భూ’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ రోజే (ఆగస్టు 18) స్టార్ట్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
అమ్మని ఇష్టపడేవాళ్లు రుద్రుడుని ఇష్టపడతారు
‘‘అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా ఉండేది. తర్వాత అలవాటైంది. ఇప్పటివరకూ దాదాపు 150 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించాను. సినిమాల్లో హీరోగా ఉండటం కంటే రియల్ లైఫ్‌లో హీరోగా ఉండాలనేది నా కోరిక’’ అన్నారు రాఘవా లారెన్స్. కతిరేశన్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా రూపొందిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. నిర్మాత ‘ఠాగూర్’ మధు ‘రుద్రుడు’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్ చెప్పిన విశేషాలు. ► ‘రుద్రుడు’ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. నా ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం ఉన్నట్టే ఇందులోనూ అమ్మానాన్నల గురించి ఓ చక్కని సందేశం ఉంది. ఈ చిత్రంలో ఐటీ ఉద్యోగం చేసే ఒక మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాను. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్‌గా మార్చాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. అమ్మని ఇష్టపడేవాళ్లంతా ‘రుద్రుడు’ మూవీని ఇష్టపడతారు. ► నన్ను కొత్తగా చూపించాలనే కతిరేశన్గారి తపన నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, థ్రిల్, వినోదం, మాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు వంద శాతం చేరువ అవుతాయి. ► ‘ఠాగూర్’ మధుగారు నాకు లక్కీ ప్రొడ్యూసర్. నాపై ఆయనకి చాలా నమ్మకం. మరోసారి ఆ నమ్మకాన్ని ‘రుద్రుడు’ నిలబెట్టుకుంటుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్‌గారు విలన్‌గా చేశారు. నా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఆయన పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘అఖండ’ సినిమా ఫైట్స్ నాకు నచ్చడంతో ఆ మూవీకి పని చేసిన శివ మాస్టర్ని తీసుకున్నాం. ‘రుద్రుడు’లో కథకు తగ్గట్టు యాక్షన్‌ని డిజైన్ చేశారాయన. ప్రస్తుతం ‘చంద్రముఖి 2, జిగర్తాండ 2’ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించి, నిర్మిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. -
‘క్రాక్’ వాయిదా.. మధుపై రవితేజ సీరియస్!
‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’. చాలా రోజుల తర్వాత థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చుద్దామనుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్‌కు శనివారం నిరాశ ఎదురైంది. కరోనాని సైతం లెక్కచేయకుండా ఉదయమే థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ దారుణంగా మోసపోయారు. తమ అభిమాన హీరోని ఈ రోజు బిగ్‌స్రీన్‌పై చూడలేమనే వార్త విని నిరాశలో మునిగిపోయారు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌లను షాకయ్యారు. ఇక మార్నింగ్ షో పోతే పోనిలే.. మాట్నీస్ నుంచి అయినా ఎంజాయ్ చేద్దామకున్న అభిమానులకు.. ఆ అవకాశం కూడా దక్కలేదు. ‘క్రాక్’ సినిమా ఈ రోజు విడుదల కాదంటూ చావు కబురును చల్లగా అందించారు చిత్రబృందం. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది విడుదల అవుతున్న తొలి భారీ సినిమా కావడంతో క్రాక్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కరోనా కాలంగా ఇన్నాళ్ల థియేటర్లకు దూరంగా ఉన్న సినీ అభిమానులు సైతం.. మాస్ మహారాజా సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. దాదాపు 1000 థియేటర్లలో క్రాక్ బొమ్మ కనిపించింది. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ టాక్ రావుడంతో రవితేజ ఫ్యాన్స్ పుల్ హ్యాపీతో థియేటర్లకు వెళ్లారు. ఇక తమ హీరో సినిమాకి పోటీగా ఇప్పట్లో ఏ సినిమాలు లేవని, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అలాంటి సమయంలో అనుకోకుండా సినిమా వాయిదా పడటంతో అభిమానులు మాత్రమే కాదు.. రవితేజ కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాత ఠాగూర్ మధు తీరు పట్ల రవితేజ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందే ఇవన్నీ చూసుకోకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. చిన్న పొరపాటు వల్ల భారీ నష్టాలు వస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందులను తొలగించి సినిమా విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలకు రవితేజ గట్టిగానే సూచించినట్లు తెలుస్తుంది. నిర్మాత మధు డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు పూర్తవకపోవడం వల్లే సినిమా వాయిదా పడినట్లు సమాచారం. అలాగే మధు గతంలో నిర్మించిన చిత్రాలకు సంబందించి డిస్టిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్న డబ్బును అందించలేదని, అందుకే వారంతా కోర్టుకు వెళ్లి సినిమా వాయిదా వేయించారని తెలుస్తోంది. ఏదేమైనా.. నిర్మాత తప్పిదానికి రవితేజ బలి అవుతున్నారని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదా ఎఫెక్ట్.. కలెక్షన్ల మీద పడుతుందని భయపడుతున్నారు. ఈ ఆలస్యం ‘క్రాక్’ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో త్వరలోనే తెలుస్తుంది. -
భగవద్గీత సాక్షిగా..!
వెండితెరపై ‘భగవద్గీత సాక్షిగా’ ప్రమాణం చేసి ఏదో నిజాన్ని చెప్పాలనుకుంటున్నారట సాయిధరమ్ తేజ్. ఇందుకు తగ్గ సన్నాహాలు మొదలైపోయాయని ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపాల్ అనే ఓ కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్ తేజ్. అలాగే దేవ కట్టా డైరెక్ట్ చేయనున్న సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు. -
ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్న రవితేజ
సాక్షి, హైదరాబాద్: గట్టి సూపర్‌హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్’ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ బుధవారం విడుదల చేశారు. సోడా బాటిల్ పట్టుకొని పోలీసు ఆఫీసర్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పోస్టర్లో రవితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిలబడి ఉండటాన్ని చూడొచ్చు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్‌శీను, బలుపు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం క్రాక్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటులు: రవితేజ, శృతిహాసన్, సుమద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాకర్, వంశీ చాగంటి తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాత: బి.మధు, బ్యానర్: సరస్వతి ఫిలింస్ డివిజన్, సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పాటలు: రామజోగయ్య శాస్త్రి -
టఫ్ పోలీస్
రవితేజ పోలీస్ అనగానే ‘విక్రమార్కుడు’ సినిమాలోని టఫ్ పోలీస్ గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పోలీసాఫీసర్‌గా నటించనున్నారు రవితేజ. ఇది రవితేజకు 66వ చిత్రం. గురువారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. సరస్వతి ఫిలింస్ డివిజన్‌పై బి. మధు (ఠాగూర్ మధు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో రవితేజ హీరోగా నటించిన రెండు చిత్రాలకు (డాన్ శీను, బలుపు) దర్శకత్వం వహించిన మలినేని గోపీచంద్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
ఆ అర్హత విశాల్‌కి ఉంది
‘‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్. తనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. పొల్లాచ్చిలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రెక్కీకి వెళ్లినప్పుడు నాకు రూమ్ లేకపోవడంతో విశాల్ తన రూమ్‌కి తీసుకెళ్లి, బెడ్ నాకు ఇచ్చి, నేలపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. పురట్చి దళపతి (విప్లవ సేన నాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకు అర్హత ఉంది’’ అని డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ అన్నారు. విశాల్ హీరోగా, కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటి లక్ష్మీప్రసన్న, ఆడియో సీడీలను క్రిష్ విడుదల చేశారు. ఈ వేడుకలో కొంత మంది రైతులకు విశాల్ ఆర్థిక సాయం చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నాన్న జి.కె.రెడ్డిగారు, అన్నయ్య విక్రమ్ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు గర్వంగా నిలబడి ఉన్నా. ‘పందెంకోడి’ ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను మరో 25 సినిమాలు చేసేలా నా 25వ సినిమా ‘పందెంకోడి 2’ ఉంటుంది. ‘పందెంకోడి 3’ చేయడానికి మళ్లీ 13 ఏళ్లు కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సమర్పకులు ‘ఠాగూర్’ మధుగారు నా తర్వాతి సినిమా నిర్మాత. నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్లో ఒక రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. నాకు థియేటర్ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అన్నారు. ‘‘విశాల్, నా కాంబినేషన్లో ‘పందెంకోడి 3’ కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లింగుస్వామి. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘లగడపాటి’ శ్రీధర్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రచయిత ఆకుల శివ, కథానాయికలు కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పందెం కోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్స్‌ని హీరో ఎలా ఢీ కొన్నాడు అన్నదే కథ. జయాపజయాల నుంచి నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం. డిజిటల్ కంటెంట్‌తో థియేట్రికల్ రెవెన్యూ తగ్గినా డిజిటల్ మార్కెట్లో వచ్చే రెవెన్యూ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విశాల్‌తో తమిళంలో ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నా. నిఖిల్‌తో చేస్తోన్న ‘ముద్ర’ షూటింగ్ పూర్తి కాబోతోంది’’ అన్నారు. -
షూటింగ్ మొదలుకాకుండానే బిజినెస్
విభిన్న చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఇటీవల కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోసారి రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నిఖిల్. తమిళ్లో ఘనవిజయం సాధించిన కనితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముద్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ మొదలవటానికి ముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. స్టార్ మా సంస్థ ఈ సినిమా తెలుగు, హిందీ శాటిలైట్ హక్కులను 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. -
మౌత్ టాక్ బాగుంది... ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు
‘‘హీరో మహేశ్‌గారు, దర్శకుడు మురుగదాస్‌గారితో పాటు మా టీమంతా ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ ‘స్పైడర్’కి పడ్డాం. ప్రేక్షకులకు మంచి సందేశంతో పాటు కొత్త కథను, కొత్తదనంతో కూడిన సినిమాను ఇవ్వాలనుకున్నాం. కొత్తదనమంటే కొంత రిస్క్ తప్పదు. ఆ రిస్క్ తీసుకునే సినిమా చేశాం. ఫస్ట్ రెండు మూడు షోలకు కాస్త మిక్డ్స్ టాక్ వచ్చినా... మెజారిటీ ఆడియన్స్‌కి సినిమా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. మహేశ్‌బాబు హీరోగా ఆయన సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ బుధవారం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ‘స్పైడర్’కి మంచి స్పందన లభిస్తోందంటున్న ‘ఠాగూర్’ మధు చెప్పిన విశేషాలు... ► తమిళంలో మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ వచ్చింది. బహుశా... అక్కడ కొంచెం అంచనాలు తక్కువ ఉండడం కారణమనుకుంటున్నా. కేరళలోనూ మంచి టాక్ వచ్చింది. ‘స్టార్ హీరో అయ్యిండి కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి సినిమా చేయడం మహేశ్ గొప్పతనం’ అని రజనీకాంత్‌గారు అన్నారు. తెలుగులోనూ పలువురు ప్రముఖులు సినిమా బాగుందని చెప్పారు. దర్శకుడు సురేందర్‌రెడ్డిగారు మొదటి రోజే రెండుసార్లు సినిమా చూశానన్నారు. ‘హీరో ఇమేజ్, స్టార్డమ్ పక్కన పెట్టినప్పుడు ఇటువంటి మంచి కథలొస్తాయి. సినిమా అద్భుతంగా ఉంది’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. 90 శాతం మంచి మౌత్‌టాక్‌ను బట్టి వెళ్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు సినిమా బాగుందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో 72 కోట్ల రూపాయలు (గ్రాస్) ‘స్పైడర్’ కలెక్ట్ చేసింది. ► తెలుగు సినిమా పరిధి పెరగాలన్నా, ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నా... భారీ బడ్జెట్‌తో మంచి క్వాలిటీ సినిమాలు తీయక తప్పదు. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. 20, 30 భాషల్లో తెలుగు సినిమాను విడుదల చేయగల కెపాసిటీ ఉంది. తెలుగు సినిమా మార్కెట్ పెంచాలనే ఉద్దేశంతోనే అరబిక్‌లోనూ ‘స్పైడర్’ను రిలీజ్ చేశాం. అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షో కలెక్షన్స్ బాగున్నాయి. -
మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?
- మురుగదాస్ ‘‘హీరో మందు తాగి ఫ్రెండ్స్‌తో సరదాగా అమ్మాయిలను ఏడిపిస్తే... సినిమాలో కామెడీగా ఉండొచ్చు. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తే ట్రాజెడీగా ఉంటుంది. విలన్ అలాంటి పనులు చేస్తే నెగిటివ్ షేడ్స్ అంటారు. మరి, హీరో చేస్తే ఓకేనా? అందుకే నా సినిమాల్లో అలాంటి సీన్స్ అవాయిడ్ చేస్తున్నా. పెద్ద హీరోలకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే... కోట్లాదిమంది వాళ్లను గుడ్డిగా అనుసరిస్తున్నారు. అమ్మను ప్రేమించాలి, మహిళలను గౌరవించాలి... వంటి అంశాలను సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు ప్రభావితమవుతారు. క్రియేటర్లుగా దర్శకులు, హీరోలు బాధ్యతగా నడుచుకోవాలి’’ అన్నారు ఏఆర్ మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. ఈ సినిమా, మహేశ్ గురించి మురుగదాస్‌తో ఇంటర్వ్యూ.. ∙‘స్టాలిన్’ తర్వాత పదేళ్లకు తెలుగులో మీరు చేస్తున్న మూవీ ‘స్పైడర్’... ‘స్టాలిన్’ టైమ్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు నన్ను మహేశ్‌కు పరిచయం చేశారు. అప్పటికే మహేశ్ ‘ఒక్కడు’ చూశా. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన్ను కలసినప్పుడు మీతో సినిమా చేయాలనుందన్నా. సరే అన్నారు. ఇప్పుటికి కుదిరింది. తెలుగులో సూపర్‌స్టార్ అయిన మహేశ్‌ను తమిళ్‌కు పరిచయం చేస్తున్నాననే ఒత్తిడేమైనా? డబ్బింగ్ సినిమాలు, ఇంటర్నెట్ వల్ల మహేశ్ తమిళ ప్రేక్షకులకూ తెలుసు. తమిళంలో మహేశ్‌కు ఇది మొదటి సినిమా కాబట్టి క్యారెక్టర్ బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకున్నా. తెలుగు, తమిళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మోడ్రన్ స్క్రిప్ట్ రెడీ చేశా. అలాగే, మహేశ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశించే హీరోయిజమ్, కమర్షియల్ అంశాలతో స్క్రిప్ట్ రాశా. తమిళంలో మహేశే డబ్బింగ్ చెప్పారు. టీజర్లో డబ్బింగ్ బాగుందంటూ మెసేజ్‌లొస్తున్నాయి. ‘సినిమాకు కథే కావాలి. సందేశాలు అవసరం లేదు’ అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు! కానీ, మీ సిన్మాల్లో ఏదొక సందేశం ఉంటుంది కదా! ఈ ‘స్పైడర్’లోనూ మెసేజ్ ఉందా? ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్... ఎక్కడ చూసినా సందేశాలే. ప్రతి రోజూ ఎవరొకరు ఎక్కడొక చోట సందేశం ఇస్తున్నారు. నేను కూడా మెసేజ్ అంటే ప్రేక్షకులంతా ‘ఇంకో సందేశమా?’ అనుకుంటారు. మనం మెసేజ్ ఇవ్వకున్నా ఫర్వాలేదు. కానీ, డ్రింకింగ్, స్మోకింగ్ వంటి చెడు సందేశాలను పంపకూడదు. మహేశ్‌లాంటి స్టార్ స్క్రీన్‌పై సిగరెట్ తాగితే ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వీరాభిమానులు టెమ్ట్ అవుతారు. అందుకే, నేను అలాంటివి అవాయిడ్ చేస్తున్నా. ‘స్పైడర్’లో మానవత్వం గురించి చెప్పా. ఈ రోజుల్లో ప్రజలంతా త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను హీరోని చేసి, సడన్‌గా జోకర్‌ను చేస్తారు. అన్నా హజారేను హీరో చేస్తారు. ఆ తర్వాత ఆయన సభలో జనాలు కనిపించరు. ఎంత త్వరగా ఇష్టపడుతున్నారో అంతే త్వరగా అయిష్టం పెంచుకుంటున్నారు. మానవత్వం లేనిచోట, ఇతరుల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో తీవ్రవాదం, అవినీతి పెరుగుతాయి ఇందులో అలాంటి మెసేజ్ ఇచ్చా. సినిమాను ఆలస్యంగా తీసినట్టున్నారు? బైలింగ్వల్ అంటే... ‘వన్ మోర్ టేక్’ చేయడమే అనుకున్నా. తెలుగులో ఓ సీన్ తీశాక, వెంటనే తమిళ సీన్ పూర్తవుతుందనుకున్నా. కానీ, స్టార్ట్ చేశాక ‘వన్ మోర్ టేక్’ కాకుండా ‘వన్ మోర్ ఫిల్మ్’ అయ్యింది. డైలాగులు ఉన్నా లేకున్నా ప్రతి ఫ్రేమ్, షాట్‌ను రెండు భాషల్లో తీశాం. దాంతో ఆలస్యమైంది. ∙లేటవుతోంటే మహేశ్ ఏం అనలేదా? ఒక్క మాట కూడా అనలేదు. ‘మీరు 5 సీన్లు తీసేసి, మరో 5 సీన్లు కలుపుదామంటే రెడీ. డేట్స్ ఇస్తా. ఈ షూటింగ్ పూర్తయితేనే నెక్ట్స్ సిన్మాకు వెళ్తా’ అనేవారు. సూపర్‌స్టార్స్ అందరితో వర్క్ చేశా. మహేశ్‌ను ఎవరితోనూ పోల్చలేను. దర్శకులందరూ మహేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా కోరిక. నేనింతవరకు ఆయనలాంటి హీరోను చూడలేదు. మహేశ్ దర్శకుల నటుడు. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే గురించి చెప్పాక నా వర్క్‌లో ఇన్వాల్వ్ కాలేదు. ఇండియాలో మిగతా హీరోలెవరూ ఇంత కోపరేట్ చేస్తారనుకోవడం లేదు. మహేశ్ లేకుండా మరో హీరోతో ‘స్పైడర్’ను ఊహించుకోలేను. ఈ సిన్మా వస్తుందని కూడా అనుకోలేను. మరి, నిర్మాతలు ఏమనేవారు? ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు... డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా సినిమాను ప్రేమించే నిర్మాతలు. నాకు మధుగారు 12 ఏళ్లుగా తెలుసు. ఓసారి మహేశ్‌గారు ‘మధు, ‘తిరుపతి’ ప్రసాద్ (ఎన్వీ ప్రసాద్) అయితే మీకు హ్యాపీనా?’ అనడిగారు. ‘నాకు వాళ్లు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నో ప్రాబ్లమ్’ అన్నా. ముందు అనుకున్న దానికంటే సినిమా గ్రాండ్‌నెస్ పెరిగింది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్లు బెటర్‌గా చేశా. నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు. తెలుగు లిరిక్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. ష్... భయపెట్టడం మాకూ తెలుసు! గ్లింప్స్ ఆఫ్ స్పైడర్: మే 31న (కృష్ణ బర్త్‌డే సందర్భంగా) విడుదల చేశారు. ∙సుమారు కోటిన్నరకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. హైలైట్: సింగిల్ డైలాగ్ లేదు. సినిమా థీమ్‌ను పరిచయం చేసేలా ఓ ఎలక్ట్రానిక్ స్పైడర్‌ను చూపించారు. మహేశ్ ‘ష్...’ అనడం నచ్చింది. స్పైడర్ ఫస్ట్ సింగిల్–‘బూమ్ బూమ్’: ఆగస్టు 2న విడుదల చేశారు. తెలుగు–తమిళ భాషల్లో కలిపి సుమారు 50 లక్షలమంది చూశారు. ∙హైలైట్: హ్యారీస్ జయరాజ్ స్వరపరిచిన పెప్పీ అండ్ మోడ్రన్ ట్యూన్, ‘స్పై..’ అంటూ సాగే లిరిక్స్ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా మహేశ్ కుమార్తె సితార ఈ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్పైడర్ టీజర్: ఆగస్టు 8న విడుదల చేశారు. ∙తెలుగులో 80 లక్షలు, తమిళంలో సుమారు 30 లక్షలకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్... డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్తో కలుపుకుంటే 15 మిలియన్ (కోటిన్నర) వ్యూస్ వచ్చాయి. హైలైట్: ‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, సునామి, నేనూ ఒక భాగమే’ అని డైలాగ్ చెబుతున్న ముసుగు విలన్‌ను పరిచయం చేశారు. అతడికి కౌంటర్‌గా ‘నీలాంటి వాడు ఉన్న ఒక ఊరిలోనే ఇలాంటోడు ఒకడుంటాడు’ అని మహేశ్‌ను గూఢచారిగా పరిచయం చేశారు. ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని మహేశ్ చెప్పిన డైలాగ్, స్టైలిష్ మేకింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘‘తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘స్పైడర్’ను మలయాళంలో, అరబిక్‌లో అనువదిస్తున్నాం. సెప్టెంబర్ 27నే గల్ఫ్ కంట్రీస్‌లో అరబిక్ భాషలో, కేరళలో మలయాళంలో విడుదలవుతుంది’’ -
స్టార్డమ్ ప్రేక్షకులే ఇవ్వాలి!
డైట్ పేరుతో వారంలో ఆరు రోజులు గ్రిల్డ్ చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్ అవీ తింటుంటాను. సండే మాత్రం అమ్మ చేసిన టమాటా పప్పు, అప్పడాలు, ఆవకాయ తింటున్నప్పుడు అమృతంలా ఉంటుంది. ‘ఏరా... ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఎప్పుడూ నేనే వండి పెట్టాలా?’ అని అమ్మ అడుగుతుంటుంది. ‘అమ్మా.. నేను సంపాదించడం మొదలుపెట్టి రెండేళ్లే అయ్యింది. కొద్ది రోజులు అమ్మను చూసుకున్నాననే సంతృప్తి నాకు ఇవ్వు. తమ్ముడు తనకు కావల్సినవి కొనుక్కునే డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఇవ్వు. చిన్నప్పట్నుంచీ నీ మాట, కాలేజీలో లెక్చరర్స్ మాట విన్నా. రేపు పెళ్లైన తర్వాత పెళ్లాం మాట వినాలి కదా. ఇప్పుడైనా కాస్త హ్యాపీగా, ఫ్రీగా ఉండనివ్వు’ అంటుంటా. నాలుగేళ్ల వరకూ పెళ్లి ఆలోచన లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది ఆలోచించడానికి ఇంకా చాలా టైముంది. ‘‘ప్రతి కమర్షియల్ సినిమాలోనూ హీరో ఇంట్రడక్షన్ ఫైట్, సాంగ్, తర్వాత సీన్స్.. అన్నీ కామన్. కొత్తగా ఏం ఉండదు. కానీ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఎలా చూపించగలమనేది మా చేతుల్లో ఉంది. నేను కథ విన్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్లు పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలవుతారా? లేదా అని ఆలోచిస్తా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘విన్నర్’ గత నెల 24న విడుదలైంది. సాయిధరమ్ చెప్పిన సంగతులు... ♦ కథ చెప్పినప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్, హార్స్ జాకీ బ్యాక్‌డ్రాప్ కొత్తగా అనిపించాయి. కానీ, నేను చేయగలనా? లేదా? అని భయపడ్డా. మా దర్శకుడు, ఫైట్ మాస్టర్ కలయాన్ ఇచ్చిన ధైర్యంతో చేశా. చిత్రీకరణలో గుర్రం మీద నుంచి నాలుగుసార్లు కింద పడ్డాను. ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ చేసేవాణ్ణి. కింద పడిన ప్రతిసారీ అమ్మ గుర్తొచ్చేది. నేను ఊహించినట్టు జేబీ (జగపతిబాబు) గారితో నటించిన సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ♦ ‘విన్నర్’ ఇంట్రడక్షన్లో పవన్‌కల్యాణ్‌గారిని గుర్తుచేసేలా ఎర్ర కండువా, చిరంజీవిగారి డైలాగులు.. అన్నీ దర్శకుడి ఆలోచనలే. ‘రేసుగుర్రం’ ఫస్ట్ డే చూశా. ‘నాన్నకు ప్రేమతో’ సెకండ్ డే చూశా. తారక్ నా ఫ్రెండే. నా నిర్మాత బుజ్జిగారు, మా హీరో బన్నీ ‘రేసుగుర్రం’ చేశారు. కథను బట్టే ఆ రెండు సినిమాలు చూడలేదనే డైలాగ్ చెప్పా. ఫలనా సీన్, డైలాగ్ కావాలని ఎప్పుడూ అడగను. నిర్మాతలకు ఇంత బడ్జెట్లో తీయాలని చెప్పను. నిర్మాతలు కథపై ఖర్చు పెడతారు తప్ప నాపై కాదు. ఎప్పుడైనా హీరో కంటే కథే ముఖ్యం. నేను స్టార్ హీరో కాదు, బడ్డింగ్ యాక్టర్‌ని. ♦ వసూళ్లు, రికార్డుల గురించి పెద్దగా ఆలోచించను. నా పనేంటి? ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశామా, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా? అనేంత వరకే. హీరోగా నా రేంజ్ గురించి పట్టించుకోను. రేంజ్, స్టార్డమ్ అనేవి ప్రేక్షకులు ఇవ్వాలి. ‘విన్నర్’ విడుదల తర్వాత మా నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంత మాట్లాడగలుగుతున్నా. లేనిదాన్ని సృష్టించి చెప్పను కదా. ♦ అమ్మ, తమ్ముడు, నవీన్ విజయకృష్ణ (హీరో)... ఈ ముగ్గురూ నా బిగ్గెస్ట్ క్రిటిక్స్. ‘విన్నర్’ ముగ్గురికీ నచ్చింది. డ్యాన్సులు ఇంకొంచెం చేస్తే బాగుండేదని అన్నారు. ప్రేక్షకుల నుంచీ ఈ మాటే వినిపించింది. అమ్మయితే... ‘బాగా చేశావ్. ఇంకా బాగా చెయ్యొచ్చు’ అన్నారు. చిరంజీవిగారు రెండు రోజుల్లో సినిమా చూస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌గారు ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీ. త్వరలో ఆయనకు షో వేస్తా. ♦ ‘నక్షత్రం’లో పావుగంట క్యారెక్టర్ చేశా. నాపై ఓ పాట ఉంటుంది. కథ నచ్చితే ఎటువంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. నందమూరి కల్యాణ్‌రామ్‌గారితో సినిమా డిస్కషన్స్‌కి వచ్చింది. కథ సరిగా కుదరలేదు. వీవీ వినాయక్గారిని రెండు మూడుసార్లు కలిశా. కానీ, కథ, సినిమాల గురించి డిస్కస్ చేయలేదు. బీవీయస్ రవి దర్శకత్వంలో చేయనున్న ‘జవాన్’ చిత్రీకరణ మరో నెలలో ప్రారంభమవుతుంది. ♦ ముగ్గురు మావయ్యలూ నాకు దేవుళ్లతో సమానం. చిన్నప్పట్నుంచీ నన్నో సొంత బిడ్డలా పెంచారు. మావయ్యల దగ్గర చాలా ఫ్రీడమ్ ఉంది. నేను బయట ఎలా ఉంటానో.. వాళ్లతో ఉన్నప్పుడూ అంతే. ♦ ‘ఖైదీ నంబర్ 150’లో ‘రత్తాలు రత్తాలు..’, ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..’ పాటలకు థియేటర్లో డ్యాన్స్ చేశా. స్క్రీన్‌పై చిరంజీవిగారిని చూడడం ఓ పండగ. డ్యాన్సులు అదరగొట్టేశారు. అసలు షష్టిపూర్తి చేసుకున్న మనిషిలా ఉన్నారా! నా దృష్టిలో ఆయన వయసు 50 లోపే. ఇంత వయసు వచ్చినా.. ఆయనలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే కసి కనిపిస్తుంది. చిత్రీకరణలో నిత్య విద్యార్థిలా ఉంటారు. నాలాంటోళ్లకు ఆ కసి, ఆయన ప్రవర్తన ఇన్స్పిరేషన్. -
మహేష్ మూవీ టైటిల్‌పై క్లారిటీ వచ్చిందా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఫస్ట్ లుక్ గాని టైటిల్ లోగో కాని రిలీజ్ కాలేదు. అయితే చాలా టైటిల్స్ సినిమా పేరు ఇదే అంటూ ప్రచారంలోకి వచ్చాయి. చిత్రయూనిట్ మాత్రం ఏ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. తాజాగా మహేష్ మూవీ టైటిల్‌పై ఓ క్లారిటీ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విన్నర్ మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా నిర్మాత పీవీపీ చెప్పిన మాటలు సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది. విన్నర్ వేదిక మీద మాట్లాడిన పీవీపీ ఈ ఏడాది నిర్మాత ఠాగూర్ మధు మూడు చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న విన్నర్, మిస్టర్, సంభవామి యుగే యుగే చిత్రాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇప్పటికే మహేష్ సినిమాకు సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే సమయంలో మహేష్, మురుగదాస్ చిత్ర నిర్మాత సంభవామి యుగే యుగే అనే చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నాడన్న క్లారిటీ రావడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మరిచిపోలేని అనుభవం!
‘‘ ‘అలా ఎలా’ సినిమా హిట్‌తో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటున్న టైమ్‌లో ‘టైగర్’ కథ చెప్పారు ఈ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్. ఇందులో హీరోకు తగ్గ పాత్ర నాది’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ చిత్రంలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ‘‘ఇద్దరు ప్రాణస్నేహితులు, ఓ అమ్మాయి మధ్య సాగే సినిమా ఇది. ఇందులో నా పాత్ర పేరు విష్ణు. స్నేహం, ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్ర నాది. ఈ సినిమా గురించి మొదట సందీప్ కిషన్ నాతో చెప్పాడు. కథ వినగానే ఓకే చెప్పేశాను. అలాగే కెమెరామ్యాన్ ఛోటా కె నాయుడుతో వర్క్ చేయడం మరచిపోలేని అనుభవం. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నా. మహేశ్‌బాబు నా ఫేవరెట్ హీరో. ఆయనే నన్ను ఆ సినిమాకు రికమెండ్ చేశారట. ఆ విషయం దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి కాక ‘సెగ’ డెరైక్టర్ అంజన తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలోనూ నటిస్తున్నా. ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తేనే ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకంటే, ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాల మీదే’’ అన్నారు. -
ఎక్స్ట్రార్డినరీ!
‘‘కథను నమ్మి ఈ సినిమా చేస్తున్నా’’ అని సందీప్ కిషన్ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన హీరోగా రూపొందుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌కపూర్ ఇందులో కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, అగ్ర నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్, ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి. ప్రసాద్, సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఎక్స్ట్రార్డినరీ కథ ఇది. సందీప్‌కిషన్‌ను హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. సాంకేతిక విలువలు గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 14న ‘ఐ’ సినిమాతో పాటు ఫస్ట్ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యమున్న మంచి యాక్షన్ థ్రిల్లర్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: తమన్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కో-డెరైక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు. -
చెర్రీ... బాబాయ్ జట్టు నేను... పెదనాన్న జట్టు
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నట వారసుడు వరుణ్‌తేజ్. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఘనత ఈ యువ హీరోది. వరుణ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తో సాక్షి జరిపిన సంభాషణ. కెమెరా ముందు తొలి అనుభవం ఎలా ఉంది? భయమేసిందండీ. నా అదృష్టం బావుండి ఫస్ట్ మాంటేజస్ షాట్స్ తీశారు. తర్వాత ఫైట్లు తీశారు. నేను ఫైట్లు బాగా చేస్తాను. ఎందుకంటే ముందే కొంత ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత ఓ చిన్న డైలాగ్‌తో యాక్టింగ్ పార్ట్ మొదలైంది. ఫస్ట్ నాలుగు టేకులు తీసుకున్నా. శ్రీకాంత్ అడ్డాల ఎక్స్ప్రెషన్తో సహా నెరేట్ చేసేవారు. అందుకే పోను పోను కేరక్టర్‌లోకి వెళ్లిపోయా. ఇందులో మీ పేరు ముకుందానా? అవును... అయితే సినిమాలో ఆ పేరెక్కడా వినిపించదు. ఓ సన్నివేశంలో ఫామ్‌పై ‘ముకుంద’ అని సైన్ చేస్తాను. ఆ సన్నివేశం తర్వాతే ఆ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే నా పాత్ర కూడా శ్రీకృష్ణుణ్ణి పోలి ఉంటుంది. కృష్ణుడు ఏం చేసినా లోక కల్యాణం కోసమే. అలాగే ఇందులో నేను కూడా. మాటలు తక్కువ. పనులు ఎక్కువ. భావోద్వేగాలను ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయను. నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ, పాత్రకు తగ్గట్టుగా సీరియస్‌గా చేయాల్సొచ్చింది. మెగా ఫ్యాన్స్ మాస్ పాత్రలే ఇష్టపడతారు. ఇందులో ఆలా ఉంటారా? మా ఫ్యామిలీలో ఎవరూ కావాలని మాస్ పాత్రలు చేయలేదు. వచ్చిన పాత్రల్ని ఎంత బాగా చేయొచ్చో అంత బాగా చేసి, మెప్పించారు. ఆటోమేటిగ్గా మాస్ ఇమేజ్ వచ్చింది. నేనూ అదే దారిలో వెళ్తా. ఇంతమంది దర్శకులుండగా శ్రీకాంత్‌నే ఓకే చేయడానికి కారణం? మేం ఆయన్ను ఓకే చేయడం కాదు, ఆయనే నన్ను ఓకే చేశారు. శ్రీకాంత్‌లాంటి డెరైక్టర్ తనకు తానుగా వచ్చి అడగడంతో నాన్న ఓకే చెప్పేశారు. ఓ అగ్ర నిర్మాత నన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే... శ్రీకాంత్‌గారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్‌గారి దగ్గరకెళ్లింది. ఆయన ‘హార్ట్ ఎటాక్’ కథ వినిపించారు. బాగుందనిపించినా కానీ... కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫైనల్ కాలేదు. తర్వాత క్రిష్ ఓ కథ వినిపించారు. మొదటి సినిమానే ఇంత పెద్ద కథా అని భయమేసింది. కథ నచ్చడంతో ‘ఆగస్ట్ 8న షూటింగ్ స్టార్ట్’ అని ట్విట్టర్లో పెట్టాను. అయితే... క్రిష్ ‘గబ్బర్’ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఏదేమైనా ఫస్ట్ కలిసింది శ్రీకాంత్‌గారే కాబట్టి ఆయనకే సినిమా చేయడం న్యాయమని నాన్న ఫీలయ్యారు. ఫస్ట్ నుంచి నటుడవ్వాలనే కోరిక ఉండేదా మీకు? మనసులో ఉండేది. 122 కిలోల బరువుండేవాణ్ణి. అందుకే చెప్పుకునేవాణ్ణి కాదు. మెల్లమెల్లగా 55 కిలోలు తగ్గాను. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ‘మగధీర’ షూటింగ్ అప్పుడు ఫొటోలు దిగితే, అవి చూసి.. ‘నీది ఫొటోజనిక్ ఫేస్... ఇంట్రస్ట్ ఉంటే ట్రై చేయ్’ అని పెదనాన్న అన్నారు. స్వయంగా పెదనాన్నే అనేసరికి నా కోరిక చెప్పేశాను. ఇక, అమ్మానాన్న అయితే, నేనేం చేస్తానన్నా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్ బాగా ఆడతారా? ఇదివరకు లావుగా ఉండేవాణ్ణి కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఆడుతున్నా. ఏడాది బాటు టెన్నిస్ ఆడాను. తర్వాత ఏడాదిన్నర పాటు బ్యాడ్మింటన్ ఆడా. రెండేళ్ల నుంచి వాలీబాల్ ఆడుతున్నా. ‘ముకుంద’లో నేను వాలీబాల్ ప్లేయర్‌ని. ఆ పాత్రకు నా స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉపయోగపడింది. నటనలో మీకెవరు ఇన్స్పిరేషన్? పెదనాన్నే... ఆయన ‘విజేత’ సినిమా చూసి ఏడ్చేవాణ్ణి. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ చిత్రాలు చాలాసార్లు చూశాను. కమల్‌హాసన్ నటనంటే ప్రాణం. హాలీవుడ్లో ఆర్నాల్డ్, తెలుగులో ప్రభాస్ ఫైట్లంటే ఇష్టం. వారిని ప్రేరణగా తీసుకుంటాను తప్ప... ఇమిటేట్ చేయను. పెదనాన్న, బాబాయ్... వీళ్లద్దరిలో ఎవరంటే ఇష్టం? ఇద్దరూ ఇష్టమే. అయితే... పెద్దనాన్నంటే కాస్త ఎక్కువ ఇష్టం. నేనాయన పెట్ని. వీకెండ్లో ఆయన దగ్గరే ఉండేవాణ్ణి. చెర్రీ (రామ్ చరణ్) అన్నయ్య, కల్యాణ్బాబాయ్ ఓ జట్టు. నేను పెదనాన్న జట్టు. మీ ఫ్యామిలీపై వచ్చే రూమర్లు వింటే మీకేమనిపిస్తుంది? కొన్ని రూమర్లు చూస్తే నవ్వొస్తుంటుంది. ఎవరింట్లో సమస్యలుండవ్ చెప్పండి? కూర వండితే ఒకరికి నచ్చుతుంది. ఒకరికి నచ్చదు. మా ఇంట్లో సమస్యలు కూడా అలాంటివే. ‘ఆరంజ్’ టైమ్‌లో నాన్న కాస్త ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశారు. అప్పుడు పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరూ నాన్నకు సపోర్ట్‌గా నిలిచారు. నైట్ పార్టీలకు వెళ్తుంటారా? అలాంటివి నాన్న పోత్సహించరు. ఇదివరకు రెండుమూడు సార్లు పబ్‌లకు వెళ్లా. అక్కడ వీకెండ్స్‌లో అమ్మాయిలు లేకపోతే రానీయరు. అందుకే వెనక్కి వచ్చేశాం. కొంతమందైతే.. ‘నేను ఎవరబ్బాయినో తెలుసా?’ అని ఆర్గ్యూ చేస్తారు. నాకు అలా చెప్పుకోవడం నచ్చదు. అందుకే అలాంటి ప్లేస్‌లకు వెళ్లకూడదనుకున్నా. నైట్ కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. కారు తీసి అలా ఓ రౌండ్ వేసి వస్తుంటా. నెక్ట్స్ సినిమాలు? క్రిష్, పూరీ... ఇద్దరి సినిమాలూ ఓకే చేశా. - బుర్రా నరసింహ -
వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు : చిరంజీవి
‘‘వరుణ్ నా హృదయానికి దగ్గరైన వ్యక్తి. నన్ను డాడీ అని, సురేఖను మమ్మీ అని పిలుస్తుంటాడు. గొప్ప టీమ్‌తో తన తొలి సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో వరుణ్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమ్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం ‘ముకుంద’. పూజా హెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో అల్లు అర్జున్‌కి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ -‘‘లా కోర్సు చేస్తున్న నాగబాబును నేను సినిమా పరిశ్రమకు తీసుకొస్తే, మా నాన్నగారు ఇష్టపడలేదు. కానీ నాగబాబు నటునిగా, నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగాడు. నాగబాబు నటనకి నేను అభిమానిని. నాగబాబు ఏమవ్వాలనుకున్నాడో, అవన్నీ వరుణ్ నెరవేరుస్తాడు. నాతో ‘ఠాగూర్’ తీసిన మధు, అప్పట్నుంచీ ‘ఠాగూర్’ మధు అయిపోయాడు. నల్లమలుపు బుజ్జి కూడా ‘ముకుంద’ బుజ్జి అనిపించుకుంటాడు. శ్రీకాంత్ అరుదైన దర్శకుడు. తెలుగుదనంతో సినిమాలకు ఊపిరి పోస్తున్నాడు’’ అని చెప్పారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, తనను నమ్మి ఈ సినిమా చేయడానికొచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా అనర్గళంగా ప్రసంగించిన వరుణ్ని చూసి చిరంజీవి ముగ్ధులైపోయారు. -
కుర్రాడి ఖలేజా!
సినిమా విడుదల కాకముందే... ఫస్ట్‌లుక్‌తోనే అందరి మెప్పు పొందేశాడు వరుణ్‌తేజ్. ఈ యంగ్ మెగాహీరోని తెరపై ఎప్పుడు చూస్తామా.. అని మెగా ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ‘ముకుందా’ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు తెలిపారు. కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రాలతో ఫీల్‌గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. తన గత చిత్రాలను మించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, మిక్కీ జె.మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 14న విడుదల చేయనున్నామనీ నిర్మాతలు తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘ఎలాంటి అంశాలకూ ప్రభావితం కాకుండా, స్థిరంగా ఉండే కుర్రాడి కథ ఇది. ఈ కుర్రాడి ఖలేజా ఏంటో సినిమాలో చూడాల్సిందే. రూరల్ టౌన్లో జరిగే ప్రేమకథలు, అక్కడి రాజకీయాలు, కుర్రాళ్ల భావోద్వేగాలు... వీటన్నింటినీ సహజంగా చూపించే ప్రయత్నం చేశాం. భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోటలో చిత్రీకరణ జరిపాం. నా గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. నటునిగా వరుణ్ ఖలేజా ఏంటో తెలిపే సినిమా ఇది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ఆ పాటను హైదరాబాద్‌లో సెట్ వేసి తీస్తాం’’ అని చెప్పారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, నాజర్, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, కెమెరా: మణికందన్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్. -
ముకుందగా వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ ‘ముకుంద’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ముకుంద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకుల కితాబులందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే విధంగా ఇందులో వరుణ్‌తేజ్ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్. -
ఫుల్ క్లారిటీ...
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా తెరపై చూడాలని మెగా అభిమానులందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని రోజుల్లోనే వరుణ్ తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అతని తొలి సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైన విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. ఈ నెలాఖరుకి టాకీ పూర్తవుతుందని, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని యూనిట్ సభ్యుల సమాచారం. గోదావరి జిల్లాల్లోని భీమవరం, అమలాపురం... తదితర అందమైన ప్రదేశాల్లో 35 రోజుల పాటు తీసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన ఫుల్ క్లారిటీ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజానికి ఈ సినిమాకు ఇప్పటివరకూ టైటిల్‌ని ఖరారు చేయలేదన్నది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్. -
నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే!
‘‘ఏ నిర్మాత అయినా మూటలతో వస్తాడు కానీ, వీఆర్ కన్నెగంటి మాత్రం మాటలతో వచ్చాడు. నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ వైవిధ్యభరితమైన ప్రేమకథాచిత్రంలో నేను బలరామయ్య పాత్ర పోషిస్తున్నాను’’ అని సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా కన్నెగంటి సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వంటి మహానటులతో పనిచేసిన పరుచూరి వెంకటేశ్వరరావు తమ సినిమాలో నటించటం పట్ల నిర్మాత ఆనందం వెలిబుచ్చారు. నాయకానాయికలను ఎంపిక చేసి, వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు రతన్ కాంబ్లే చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత ఠాగూర్ మధు, నటుడు కృష్ణమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్
హైదరాబాద్: మెగా వంశం నుంచి మరో వారసుడి తెరంగ్రేటంకు రంగం సిద్ధమైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా రంగప్రవేశం చేయనున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రేపు షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాటీవితో పాటు పలు ప్రైవేటు చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయని చెప్పారు. ఒక సినిమా ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. గతేడాది వరుణ్ తేజ్ వెండితెరకు పరిచయం కావాల్సివున్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను లియో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సివుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. -
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో...
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. వరుణ్ నటించే తొలి సినిమా విషయంలో గత కొన్నేళ్లు పలు ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. క్రిష్, శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాథ్... ఇలా పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే... అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ వార్తా రాలేదు. మరో మెగా వారసుని ఆగమనం కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో... ఎట్టకేలకు వరుణ్ తొలి సినిమాకు సంబంధించిన వార్త అధికారికంగా వెలువడింది. వరుణ్‌తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి). మిక్కీ జె.మేయర్ స్వరాలందించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 1 నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం ఉన్న ఏ హీరోకీ తీసిపోని అందం వరుణ్‌తేజ్ సొంతం. ఫస్ట్ లుక్‌తోనే అందరి ప్రశంసలూ అందుకున్నాడు వరుణ్. మరి తొలి సినిమాలో వరుణ్ని శ్రీకాంత్ ఎలా చూపించనున్నాడో, నటుడిగా తొలి అడుగుని ఏ విధంగా వేయించనున్నారో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.