మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే? | Interview with Director A.R Murugadoss | Sakshi
Sakshi News home page

మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?

Published Tue, Aug 22 2017 11:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?

మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?

- మురుగదాస్‌
‘‘హీరో మందు తాగి ఫ్రెండ్స్‌తో సరదాగా అమ్మాయిలను ఏడిపిస్తే... సినిమాలో కామెడీగా ఉండొచ్చు. కానీ, రియల్‌ లైఫ్‌లో అలా చేస్తే ట్రాజెడీగా ఉంటుంది. విలన్‌ అలాంటి పనులు చేస్తే నెగిటివ్‌ షేడ్స్‌ అంటారు. మరి, హీరో చేస్తే ఓకేనా? అందుకే నా సినిమాల్లో అలాంటి సీన్స్‌ అవాయిడ్‌ చేస్తున్నా. పెద్ద హీరోలకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే... కోట్లాదిమంది వాళ్లను గుడ్డిగా అనుసరిస్తున్నారు. అమ్మను ప్రేమించాలి, మహిళలను గౌరవించాలి... వంటి అంశాలను సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు ప్రభావితమవుతారు. క్రియేటర్లుగా దర్శకులు, హీరోలు బాధ్యతగా నడుచుకోవాలి’’ అన్నారు ఏఆర్‌ మురుగదాస్‌. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్‌’. ఈ సినిమా, మహేశ్‌ గురించి మురుగదాస్‌తో ఇంటర్వ్యూ..

∙‘స్టాలిన్‌’ తర్వాత పదేళ్లకు తెలుగులో మీరు చేస్తున్న మూవీ ‘స్పైడర్‌’...
‘స్టాలిన్‌’ టైమ్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు నన్ను మహేశ్‌కు పరిచయం చేశారు. అప్పటికే మహేశ్‌ ‘ఒక్కడు’ చూశా. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశారు. ఆయన్ను కలసినప్పుడు మీతో సినిమా చేయాలనుందన్నా. సరే అన్నారు. ఇప్పుటికి కుదిరింది.

తెలుగులో సూపర్‌స్టార్‌ అయిన మహేశ్‌ను తమిళ్‌కు పరిచయం చేస్తున్నాననే ఒత్తిడేమైనా?
డబ్బింగ్‌ సినిమాలు, ఇంటర్నెట్‌ వల్ల మహేశ్‌ తమిళ ప్రేక్షకులకూ తెలుసు. తమిళంలో మహేశ్‌కు ఇది మొదటి సినిమా కాబట్టి క్యారెక్టర్‌ బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకున్నా. తెలుగు,  తమిళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మోడ్రన్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశా. అలాగే, మహేశ్‌ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశించే హీరోయిజమ్, కమర్షియల్‌ అంశాలతో స్క్రిప్ట్‌ రాశా. తమిళంలో మహేశే డబ్బింగ్‌ చెప్పారు. టీజర్‌లో డబ్బింగ్‌ బాగుందంటూ మెసేజ్‌లొస్తున్నాయి.

‘సినిమాకు కథే కావాలి. సందేశాలు అవసరం లేదు’ అని ఓ  స్టేట్‌మెంట్‌ ఇచ్చారు! కానీ, మీ సిన్మాల్లో ఏదొక సందేశం ఉంటుంది కదా! ఈ ‘స్పైడర్‌’లోనూ మెసేజ్‌ ఉందా?
ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌... ఎక్కడ చూసినా సందేశాలే. ప్రతి రోజూ ఎవరొకరు ఎక్కడొక చోట సందేశం ఇస్తున్నారు. నేను కూడా మెసేజ్‌ అంటే ప్రేక్షకులంతా ‘ఇంకో సందేశమా?’ అనుకుంటారు. మనం మెసేజ్‌ ఇవ్వకున్నా ఫర్వాలేదు. కానీ, డ్రింకింగ్, స్మోకింగ్‌ వంటి చెడు సందేశాలను పంపకూడదు. మహేశ్‌లాంటి స్టార్‌ స్క్రీన్‌పై సిగరెట్‌ తాగితే ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వీరాభిమానులు టెమ్ట్‌ అవుతారు. అందుకే, నేను అలాంటివి అవాయిడ్‌ చేస్తున్నా. ‘స్పైడర్‌’లో మానవత్వం గురించి చెప్పా. ఈ రోజుల్లో ప్రజలంతా త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను హీరోని చేసి, సడన్‌గా జోకర్‌ను చేస్తారు. అన్నా హజారేను హీరో చేస్తారు. ఆ తర్వాత ఆయన సభలో జనాలు కనిపించరు. ఎంత త్వరగా ఇష్టపడుతున్నారో అంతే త్వరగా అయిష్టం పెంచుకుంటున్నారు. మానవత్వం లేనిచోట, ఇతరుల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో తీవ్రవాదం, అవినీతి పెరుగుతాయి ఇందులో అలాంటి మెసేజ్‌ ఇచ్చా.

సినిమాను ఆలస్యంగా తీసినట్టున్నారు?
బైలింగ్వల్‌ అంటే... ‘వన్‌ మోర్‌ టేక్‌’ చేయడమే అనుకున్నా. తెలుగులో ఓ సీన్‌ తీశాక, వెంటనే తమిళ సీన్‌ పూర్తవుతుందనుకున్నా. కానీ, స్టార్ట్‌ చేశాక ‘వన్‌ మోర్‌ టేక్‌’ కాకుండా ‘వన్‌ మోర్‌ ఫిల్మ్‌’ అయ్యింది. డైలాగులు ఉన్నా లేకున్నా ప్రతి ఫ్రేమ్, షాట్‌ను రెండు భాషల్లో తీశాం. దాంతో ఆలస్యమైంది.

∙లేటవుతోంటే మహేశ్‌ ఏం అనలేదా?
ఒక్క మాట కూడా అనలేదు. ‘మీరు 5 సీన్లు తీసేసి, మరో 5  సీన్లు కలుపుదామంటే రెడీ. డేట్స్‌ ఇస్తా. ఈ షూటింగ్‌ పూర్తయితేనే నెక్ట్స్‌ సిన్మాకు వెళ్తా’ అనేవారు. సూపర్‌స్టార్స్‌ అందరితో వర్క్‌ చేశా. మహేశ్‌ను ఎవరితోనూ పోల్చలేను. దర్శకులందరూ మహేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా కోరిక. నేనింతవరకు ఆయనలాంటి హీరోను చూడలేదు. మహేశ్‌ దర్శకుల నటుడు. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే గురించి చెప్పాక నా వర్క్‌లో ఇన్వాల్వ్‌ కాలేదు. ఇండియాలో మిగతా హీరోలెవరూ ఇంత కోపరేట్‌ చేస్తారనుకోవడం లేదు. మహేశ్‌ లేకుండా మరో హీరోతో ‘స్పైడర్‌’ను ఊహించుకోలేను. ఈ సిన్మా వస్తుందని కూడా అనుకోలేను.

మరి, నిర్మాతలు ఏమనేవారు?
‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు... డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా సినిమాను ప్రేమించే నిర్మాతలు. నాకు మధుగారు 12 ఏళ్లుగా తెలుసు. ఓసారి మహేశ్‌గారు ‘మధు, ‘తిరుపతి’ ప్రసాద్‌ (ఎన్వీ ప్రసాద్‌) అయితే మీకు హ్యాపీనా?’ అనడిగారు. ‘నాకు వాళ్లు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నో ప్రాబ్లమ్‌’ అన్నా. ముందు అనుకున్న దానికంటే సినిమా గ్రాండ్‌నెస్‌ పెరిగింది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్లు బెటర్‌గా చేశా. నిర్మాతలు ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. తెలుగు లిరిక్స్‌ విషయంలో ఎంతో హెల్ప్‌ చేశారు.

ష్‌... భయపెట్టడం మాకూ తెలుసు!
గ్లింప్స్‌ ఆఫ్‌ స్పైడర్‌: మే 31న (కృష్ణ బర్త్‌డే సందర్భంగా) విడుదల చేశారు. ∙సుమారు కోటిన్నరకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు.  హైలైట్‌: సింగిల్‌ డైలాగ్‌ లేదు. సినిమా థీమ్‌ను పరిచయం చేసేలా ఓ ఎలక్ట్రానిక్‌ స్పైడర్‌ను చూపించారు. మహేశ్‌ ‘ష్‌...’ అనడం నచ్చింది.

స్పైడర్‌ ఫస్ట్‌ సింగిల్‌–‘బూమ్‌ బూమ్‌’: ఆగస్టు 2న విడుదల చేశారు.  తెలుగు–తమిళ భాషల్లో కలిపి సుమారు 50 లక్షలమంది  చూశారు. ∙హైలైట్‌:  హ్యారీస్‌ జయరాజ్‌ స్వరపరిచిన పెప్పీ అండ్‌ మోడ్రన్‌ ట్యూన్, ‘స్పై..’ అంటూ సాగే లిరిక్స్‌ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా మహేశ్‌ కుమార్తె సితార ఈ పాట పాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

స్పైడర్‌ టీజర్‌: ఆగస్టు 8న విడుదల చేశారు. ∙తెలుగులో 80 లక్షలు, తమిళంలో సుమారు 30 లక్షలకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌... డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌తో కలుపుకుంటే 15 మిలియన్‌ (కోటిన్నర) వ్యూస్‌ వచ్చాయి.

హైలైట్‌:  ‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్‌ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, సునామి, నేనూ ఒక భాగమే’ అని డైలాగ్‌ చెబుతున్న ముసుగు విలన్‌ను పరిచయం చేశారు. అతడికి కౌంటర్‌గా ‘నీలాంటి వాడు ఉన్న ఒక ఊరిలోనే ఇలాంటోడు ఒకడుంటాడు’ అని మహేశ్‌ను గూఢచారిగా పరిచయం చేశారు. ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని మహేశ్‌ చెప్పిన డైలాగ్, స్టైలిష్‌ మేకింగ్‌ సినిమాపై అంచనాలను పెంచాయి.

‘‘తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘స్పైడర్‌’ను మలయాళంలో,  అరబిక్‌లో అనువదిస్తున్నాం.  సెప్టెంబర్‌ 27నే  గల్ఫ్‌ కంట్రీస్‌లో అరబిక్‌ భాషలో,  కేరళలో మలయాళంలో విడుదలవుతుంది’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement