స్టార్‌డమ్ ప్రేక్షకులే ఇవ్వాలి!
డైట్ పేరుతో వారంలో ఆరు రోజులు గ్రిల్డ్ చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్ అవీ తింటుంటాను. సండే మాత్రం అమ్మ చేసిన టమాటా పప్పు, అప్పడాలు, ఆవకాయ తింటున్నప్పుడు అమృతంలా ఉంటుంది. ‘ఏరా... ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఎప్పుడూ నేనే వండి పెట్టాలా?’ అని అమ్మ అడుగుతుంటుంది.
‘అమ్మా.. నేను సంపాదించడం మొదలుపెట్టి రెండేళ్లే అయ్యింది. కొద్ది రోజులు అమ్మను చూసుకున్నాననే సంతృప్తి నాకు ఇవ్వు. తమ్ముడు తనకు కావల్సినవి కొనుక్కునే డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఇవ్వు. చిన్నప్పట్నుంచీ నీ మాట, కాలేజీలో లెక్చరర్స్ మాట విన్నా. రేపు పెళ్లైన తర్వాత పెళ్లాం మాట వినాలి కదా. ఇప్పుడైనా కాస్త హ్యాపీగా, ఫ్రీగా ఉండనివ్వు’ అంటుంటా. నాలుగేళ్ల వరకూ పెళ్లి ఆలోచన లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది ఆలోచించడానికి ఇంకా చాలా టైముంది.
‘‘ప్రతి కమర్షియల్ సినిమాలోనూ హీరో ఇంట్రడక్షన్ ఫైట్, సాంగ్, తర్వాత సీన్స్.. అన్నీ కామన్. కొత్తగా ఏం ఉండదు. కానీ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఎలా చూపించగలమనేది మా చేతుల్లో ఉంది. నేను కథ విన్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్లు పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలవుతారా? లేదా అని ఆలోచిస్తా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘విన్నర్’ గత నెల 24న విడుదలైంది. సాయిధరమ్ చెప్పిన సంగతులు...
♦ కథ చెప్పినప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్, హార్స్ జాకీ బ్యాక్‌డ్రాప్ కొత్తగా అనిపించాయి. కానీ, నేను చేయగలనా? లేదా? అని భయపడ్డా. మా దర్శకుడు, ఫైట్ మాస్టర్ కలయాన్ ఇచ్చిన ధైర్యంతో చేశా. చిత్రీకరణలో గుర్రం మీద నుంచి నాలుగుసార్లు కింద పడ్డాను. ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ చేసేవాణ్ణి. కింద పడిన ప్రతిసారీ అమ్మ గుర్తొచ్చేది. నేను ఊహించినట్టు జేబీ (జగపతిబాబు) గారితో నటించిన సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది.
♦ ‘విన్నర్’ ఇంట్రడక్షన్‌లో పవన్‌కల్యాణ్‌గారిని గుర్తుచేసేలా ఎర్ర కండువా, చిరంజీవిగారి డైలాగులు.. అన్నీ దర్శకుడి ఆలోచనలే. ‘రేసుగుర్రం’ ఫస్ట్ డే చూశా. ‘నాన్నకు ప్రేమతో’ సెకండ్ డే చూశా. తారక్ నా ఫ్రెండే. నా నిర్మాత బుజ్జిగారు, మా హీరో బన్నీ ‘రేసుగుర్రం’ చేశారు. కథను బట్టే ఆ రెండు సినిమాలు చూడలేదనే డైలాగ్ చెప్పా. ఫలనా సీన్, డైలాగ్ కావాలని ఎప్పుడూ అడగను. నిర్మాతలకు ఇంత బడ్జెట్‌లో తీయాలని చెప్పను. నిర్మాతలు కథపై ఖర్చు పెడతారు తప్ప నాపై కాదు. ఎప్పుడైనా హీరో కంటే కథే ముఖ్యం. నేను స్టార్ హీరో కాదు, బడ్డింగ్ యాక్టర్‌ని.
♦ వసూళ్లు, రికార్డుల గురించి పెద్దగా ఆలోచించను. నా పనేంటి? ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేశామా, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా? అనేంత వరకే. హీరోగా నా రేంజ్ గురించి పట్టించుకోను. రేంజ్, స్టార్‌డమ్ అనేవి ప్రేక్షకులు ఇవ్వాలి. ‘విన్నర్’ విడుదల తర్వాత మా నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంత మాట్లాడగలుగుతున్నా. లేనిదాన్ని సృష్టించి చెప్పను కదా.
♦ అమ్మ, తమ్ముడు, నవీన్ విజయకృష్ణ (హీరో)... ఈ ముగ్గురూ నా బిగ్గెస్ట్ క్రిటిక్స్. ‘విన్నర్’ ముగ్గురికీ నచ్చింది. డ్యాన్సులు ఇంకొంచెం చేస్తే బాగుండేదని అన్నారు. ప్రేక్షకుల నుంచీ ఈ మాటే వినిపించింది. అమ్మయితే... ‘బాగా చేశావ్. ఇంకా బాగా చెయ్యొచ్చు’ అన్నారు. చిరంజీవిగారు రెండు రోజుల్లో సినిమా చూస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌గారు ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీ. త్వరలో ఆయనకు షో వేస్తా.
♦ ‘నక్షత్రం’లో పావుగంట క్యారెక్టర్ చేశా. నాపై ఓ పాట ఉంటుంది. కథ నచ్చితే ఎటువంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. నందమూరి కల్యాణ్‌రామ్‌గారితో సినిమా డిస్కషన్స్‌కి వచ్చింది. కథ సరిగా కుదరలేదు. వీవీ వినాయక్‌గారిని రెండు మూడుసార్లు కలిశా. కానీ, కథ, సినిమాల గురించి డిస్కస్ చేయలేదు. బీవీయస్ రవి దర్శకత్వంలో చేయనున్న ‘జవాన్’ చిత్రీకరణ మరో నెలలో ప్రారంభమవుతుంది.
♦ ముగ్గురు మావయ్యలూ నాకు దేవుళ్లతో సమానం. చిన్నప్పట్నుంచీ నన్నో సొంత బిడ్డలా పెంచారు. మావయ్యల దగ్గర చాలా ఫ్రీడమ్ ఉంది. నేను బయట ఎలా ఉంటానో.. వాళ్లతో ఉన్నప్పుడూ అంతే.
♦ ‘ఖైదీ నంబర్ 150’లో ‘రత్తాలు రత్తాలు..’, ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..’ పాటలకు థియేటర్‌లో డ్యాన్స్ చేశా. స్క్రీన్‌పై చిరంజీవిగారిని చూడడం ఓ పండగ. డ్యాన్సులు అదరగొట్టేశారు. అసలు షష్టిపూర్తి చేసుకున్న మనిషిలా ఉన్నారా! నా దృష్టిలో ఆయన వయసు 50 లోపే. ఇంత వయసు వచ్చినా.. ఆయనలో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలనే కసి కనిపిస్తుంది. చిత్రీకరణలో నిత్య విద్యార్థిలా ఉంటారు. నాలాంటోళ్లకు ఆ కసి, ఆయన ప్రవర్తన ఇన్‌స్పిరేషన్.