మరిచిపోలేని అనుభవం!
‘‘ ‘అలా ఎలా’ సినిమా హిట్‌తో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటున్న టైమ్‌లో ‘టైగర్’ కథ చెప్పారు ఈ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్. ఇందులో హీరోకు తగ్గ పాత్ర నాది’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ చిత్రంలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ...
‘‘ఇద్దరు ప్రాణస్నేహితులు, ఓ అమ్మాయి మధ్య సాగే సినిమా ఇది. ఇందులో నా పాత్ర పేరు విష్ణు. స్నేహం, ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్ర నాది. ఈ సినిమా గురించి మొదట సందీప్ కిషన్ నాతో చెప్పాడు. కథ వినగానే ఓకే చెప్పేశాను. అలాగే కెమెరామ్యాన్ ఛోటా కె నాయుడుతో వర్క్ చేయడం మరచిపోలేని అనుభవం. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నా. మహేశ్‌బాబు నా ఫేవరెట్ హీరో.
ఆయనే నన్ను ఆ సినిమాకు రికమెండ్ చేశారట. ఆ విషయం దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి కాక ‘సెగ’ డెరైక్టర్ అంజన తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలోనూ నటిస్తున్నా. ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తేనే ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకంటే, ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాల మీదే’’ అన్నారు.