ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే! | Srikanth Addala Is A Worried Man | Sakshi
Sakshi News home page

ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే!

Published Fri, Dec 26 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే!

ఆ పాత్రలన్నీ.. నేను చూసిన మనుషులే!

శ్రీకాంత్ అడ్డాల
పెరిగిన వాతావరణాన్నీ, బంధాల్నీ, బాంధవ్యాల్నీ, మంచితనాన్నీ అమితంగా ప్రేమిస్తారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ మమకారం ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి విలువల కోసం పరితపించే ప్రేక్షకునికి శ్రీకాంత్ అడ్డాల సినిమాలు నిజంగా విజువల్ ఫీస్టే. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘ముకుంద’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోందని శ్రీకాంత్ అడ్డాల ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు.
 
నైతిక విలువలకు మీ కథల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దానికి కారణం?
సినిమా బలమైన మాధ్యమం. దాని ద్వారా వినోదాన్ని అందిస్తే చాలదు. జనానికి ఏదో మంచి చెప్పాలి. అది మనసుల్ని మార్చేలా ఉండాలి. అప్పుడే కొంతైనా మనుషుల్లో మార్పు వస్తుంది. అందుకే నా తాపత్రయం.  
 
ఈ సినిమాలో ప్రేక్షకులకు బాగా నచ్చిన అంశం ఏంటనుకుంటున్నారు?
విలువలు. వాటిని కచ్చితంగా జనాలు ప్రేమిస్తారు. ఒక రోజు ఆలస్యమైనా అది జరుగుతుంది.
 
స్నేహితుని కోసం పోరాటం తప్ప... హీరో లక్ష్యం సరిగ్గా ఎలివేట్ కాలేదని కొందరి అభిప్రాయం?

స్నేహితుని కోసం హీరో చేసే పోరాటం కాదిది. అధికార మదంతో మనుషుల్ని పశువులు కన్నా హీనంగా చూస్తున్న ఓ రాజకీయ నాయకునిపై హీరో చేసిన పోరాటం. దానికి స్నేహితుడు ఉత్ప్రేరకం మాత్రమే. మారణాయుధాలతో మనుషుల్ని చంపేవాడి కంటే... తక్కువ చేసి మాట్లాడి, ఇంటలిజెంట్ క్రిమినాలిటీతో మనుషుల్ని చంపేవాడు ప్రమాదకారి. ఇందులో విలన్ అలాంటివాడే. జనాల్లో తమపై తమకు తక్కువ భావాన్ని పెంచి, వాళ్లను బలహీనులుగా మార్చడం విలన్ నైజం. జనాలకు వాళ్ల శక్తిని వాళ్లకు తెలియజేసేదే హీరో పాత్ర. అందుకే... హీరోకు ముకుంద అని పేరు పెట్టా. మానసికంగా బలహీనుడైన అర్జునుడికే కదా ఏరికోరి కృష్ణుడు భగవద్గీత చెప్పింది. ‘మనకు మనం తక్కువ చేసుకోవడం పెద్ద క్రైమ్’ ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా నేను చెప్పింది అదే.  
 
వీధిలో విప్లవ భావాలను వల్లెవేస్తూ తిరిగే ఓ వ్యక్తిని, పాతికేళ్లు చైర్మన్‌గిరిని ఎంజాయ్ చేస్తున్న ఓ బలమైన నాయకుడిపై నిలబెట్టి గెలిపించడం రియల్ లైఫ్‌లో సాధ్యమేనా?

నేను ఇంతకు ముందు చెప్పింది అదే. ఎదుటివాడు బలవంతుడు అనుకోవడంలోనే మన బలహీనత దాగుంటుంది. జనాల్లో చైతన్యం వస్తే ఏదైనా సాధ్యమే. మా ఊరు రేలంగిలో ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్రను పోలిన వ్యక్తి ఒకతను ఉండేవాడు. ఊరి చైర్మన్ ఓసారి జెండా వందనం చేస్తుంటే... ‘ఆ జెండాలోని మూడు రంగులకు అర్థం చెప్పు’ అని అందరి ముందూ అడిగేశాడు. ఆ వ్యక్తినే ప్రేరణగా తీసుకొని ఈ పాత్ర సృష్టించా. ఈ సినిమాలో చాలా పాత్రలు నా జీవితంలో చూసిన మనుషులు, అనుభవాలే.
 
మరి హీరో పాత్రకు ప్రేరణ?
అలాంటి వాళ్లు సమాజంలో కనిపించరు. అది మాత్రం ఊహాజనితమే. ఇందులో హీరో చాలావరకు సీరియస్‌గా కనిపించాడని చాలామంది అంటున్నారు. కానీ ఆ పాత్ర అలాగే ఉండాలి. ఉదాహరణకు ‘శివ’ సినిమా తీసుకోండి. శివ చుట్టూ ఉన్న వాళ్లందరూ కామెడీ చేస్తారు. కానీ... శివ మాత్రం సీరియస్‌గానే ఉంటాడు. శివ కామెడీ చేస్తే... సినిమానే దెబ్బతింటుంది. ఇందులో ముకుంద పాత్ర కూడా అంతే. వరుణ్ భావోద్వేగాలను చక్కగా పలికించాడు. క్రమశిక్షణగా నడుచుకున్నాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు.
 
కథ రీత్యా ఇందులో హీరోకీ హీరోయిన్‌కీ పరిచయం ఉండదు. కానీ డ్యూయెట్లు పెట్టేశారు!
శ్రీకృష్ణుడు, రుక్మిణి ప్రేమకథే ఈ విషయంలో నాకు స్ఫూర్తి. కృష్ణుడు, రుక్మిణి ఒకరినొకరు చూసుకోరు. కానీ ప్రేమించుకుంటారు. ఇటీవల అన్నీ మాటలే తప్ప పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. అసలు మాటలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమ చూపించాలనే తపనతోనే అలా చేశాను.
 
తొలి సినిమా ప్రేమకథ, రెండో సినిమా కుటుంబ కథ, మూడో సినిమా రూరల్ పాలిటిక్స్... మరి నాలుగో సినిమా ఎలా ఉంటుంది?
స్వచ్ఛమైన బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, ప్రేమ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి కుటుంబ కథ చేయబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే 2015లోనే త్వరగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నా.
 
ఆ సినిమా పేరు ‘బ్రహ్మోత్సవం’ అనీ, మహేశ్ అందులో హీరో అని బయట టాక్?
ఆ వివరాలు నేను చెబితే బావుండదు. నా నిర్మాతలు చెప్పాలి.
 
దర్శకునిగా మీకు ప్రేరణ?

దాసరి నారాయణరావుగారు. ఆయన సినిమాలు చూసే స్క్రీన్‌ప్లే అనేది నేర్చుకున్నాను. కుటుంబ విలువలకు మొదట్నుంచీ పెద్ద పీట వేసిన గొప్ప దర్శకుడాయన. ఆయన తర్వాత కె.విశ్వనాథ్,  కె.బాలచందర్, మణిరత్నం... నాకిష్టమైన దర్శకులు.
 
సీతమ్మవాకిట్లో... తో మల్టీస్టారర్ ట్రెండ్‌కి తెరతీశారు. మరో భారీ మల్టీస్టారర్ ఎప్పుడు?
త్వరలోనే. నా నెక్ట్స్ సినిమా తర్వాత మల్టీస్టారరే చేస్తా. ఆ వివరాలు అప్పుడే చెబుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement