
‘బంగారు బాబు’ కన్నుమూత
కొంత కాలంగా గొంతుకేన్సర్‌తో బాధపడుతున్న వీబీఆర్
ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శక నిర్మాత రాజేంద్రప్రసాద్
అభిమానుల సందర్శనార్థం నేడు ఫిలిం చాంబర్‌కు పార్థివదేహం
వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ (82) సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించింది. దీంతో వారం క్రితం సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. మృతికి సంతాపంగా మంగళవారం ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానాన్ని మూసేస్తున్నట్లు జేఎస్ సూర్యనారాయణ తెలిపారు. ఫిలింనగర్ సొసైటీకి సెలవు ప్రకటించారు.
రారాజులా బతికారు: జగపతిబాబు
తన తండ్రి ఎవరినీ బాధపెట్టకుండా, ఏనాడూ బాధపడకుండా జీవితాంతం రారాజులా బతికారని వీబీఆర్ కుమారుడు, సినీహీరో జగపతిబాబు అన్నారు. తాను జీవితంలో స్థిరపడాలన్న తండ్రి కోరిక నెరవేరిందన్నారు. తన కుమార్తెతోపాటు తన అన్న కుమార్తె పెళ్లి కూడా చూడాలనే ఆశ ఆయనకు ఉండేదని, వారి పెళ్లిళ్లు కుదరడంతో ఆయన ఎంతో సంతోషించారని ఆస్పత్రి వద్ద జగపతిబాబు మీడియాకు తెలిపారు.
తీరని లోటు: కేసీఆర్
వి.బి. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటన్నారు. వీబీ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వీబీ రాజేంద్రప్రసాద్ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, వీబీ మృతిపట్ల చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు...
రాజేంద్రప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని గుడివాడలో 1932 నవంబర్ 4న రాజేంద్రప్రసాద్ జన్మించారు. కాకినాడ ఎస్‌ఆర్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన కుటుంబం నివసించింది. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ అనే నాటకంలో రాజేంద్రప్రసాద్ స్త్రీ పాత్ర పోషించారు. కొద్ది కాలం తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు జగపతిబాబు సినీహీరోకాగా, పెద్ద కుమారుడు రాము, రెండో కుమారుడు యుగంధర్‌కుమార్ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.
ఫిలింనగర్ వెంచర్-2లో నివాసం ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక ఫిలింనగర్ దైవసన్నిధానానికి వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీకి 16 ఏళ్లపాటు సేవలు అందించారు. ఆయన 14 సినిమాలకు దర్శకత్వం వహించారు. దసరాబుల్లోడు సినిమాకు దర్శకత్వం వహించిన వీబీ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2003లో రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతితో ఫిలింనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.