వెంకీ బాబూ... బంగారం!
కొందరు కుటుంబ కథలు చేసి మెప్పిస్తారు... మరికొందరు కామెడీ కథల్లో తెరపై భేష్ అనిపిస్తారు... ఇంకొందరు యాక్షన్ కథలతో ఈలలేయిస్తారు. ...కానీ, ఇలాంటి కథలన్నిటిలో పేరు తెచ్చుకోవడమంటే కష్టమే. అలాంటి కష్టాన్ని వెండితెరపై సాధ్యం చేసి, బాక్సాఫీస్‌ను కళకళలాడేలా చేసిన హీరోలు కొందరే. అలాంటి ఘనత సాధించిన సమకాలీన హీరోల్లో ముందుండే పేరు - వెంకటేశ్.... అభిమానుల మాటల్లో ‘విక్టరీ’ వెంకటేశ్... ఒక్కమాటలో హీరో వెంకటేశ్.
ఈ ఏడాది ప్రథమార్ధంలో మలయాళ హిట్ ‘దృశ్యమ్’ రీమేక్‌లో కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించిన వెంకీ... ఇప్పుడు కామెడీ జానర్‌లో కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. యువ దర్శకుడు మారుతి సారథ్యంలో ఎస్. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సినిమా పేరు - ‘బాబూ... బంగారం’ అని ఖరారు చేశారు.
గతంలో ‘లక్ష్మీ’, ‘తులసి’ లాంటి హిట్స్ ఇచ్చిన వెంకటేశ్ - నయనతారల కాంబినేషనే ఇందులోనూ మరోసారి కనువిందు చేయనుంది. నిజానికి, మారుతి దర్శకత్వంలో ‘రాధ’ అనే సినిమా వెంకటేశ్ గతంలో చేయాల్సి ఉంది. అప్పట్లో అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఆ కాంబినేషన్ ఇప్పుడు ఈ కొత్త స్క్రిప్ట్‌తో తెర ముందుకు వచ్చింది. అయితే, ‘‘అప్పట్లో చేసిన ‘రాధ’ స్క్రిప్ట్‌కీ, దీనికీ సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త స్క్రిప్ట్. ఇందులో వెంకటేశ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కనిపిస్తారు.
వినోదం పండించే పోలీసు పాత్ర అది’’ అని చిత్ర యూనిట్‌లోని విశ్వసనీయ వర్గాల భోగట్టా. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి దర్శకుడితో పాటు ఇతర విభాగాల్లోనూ యువ బృందంతో వెంకటేశ్ జట్టు కడుతున్నారు. ఇటీవల కమలహాసన్ సినిమాలన్నిటికీ సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డెరైక్టర్. ప్రసిద్ధ కెమేరామన్ పి.సి. శ్రీరామ్ సహాయకుడు వివేక్ ఛాయాగ్రాహకుడు. ఈ నెల 16 నుంచి ఏకధాటి షెడ్యూల్‌తో హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. రెండు పాటలకు మాత్రం విదేశాలకు వెళ్ళాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇటీవల వెంకటేశ్ కొంత విరామం తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదం పంచే ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఆయన విజయ ప్రస్థానంలో కొత్త మైలురాయి అవుతుందని అభిమానుల నమ్మకం. ఆ నమ్మకం నిజం కావడానికీ, జనం తెరపై వినోదాన్ని ఆస్వాదించడానికీ వచ్చే వేసవి చివర మే నెలాఖరు దాకా ఆగాలి. అందుకు సిద్ధమవుతూ, ఇవాళ బర్త్‌డే జరుపుకొంటున్న బాక్సాఫీస్ బాబూ... బంగారం వెంకటేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కొత్త ప్రాజెక్ట్‌కు ఆల్ ది బెస్ట్!