
ప్రేక్షకులు క్షమించేస్తారని నమ్మా!
వెంకటేశ్ కూడా ఆ క్లబ్‌లో చేరిపోయారు. ఏ క్లబ్ అనుకుంటున్నారా? అదేనండి ‘సింగింగ్ క్లబ్’. ఇప్పుడు స్టార్లు అప్పుడప్పుడు సింగుతున్న విషయం తెలిసిందే. ‘గురు’ సినిమా కోసం వెంకీ కూడా సింగర్ అవతారం ఎత్తేశారు. తన 30 ఏళ్ళ సినీ జీవితంలో ఇప్పటివరకు వెంకీ ఒక్క పాట కూడా పాడలేదు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘గురు’ చిత్రం కోసం కాస్త గొంతు సవరించుకుని ‘జింగిడి.. జింగిడి...’ అంటూ ఓ సాంగ్ పాడేశారు.
ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘‘ముఫ్పై ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నాను. సడన్‌గా సింగింగ్ ఎందుకూ అనుకున్నాను. అయినా పాడటానికి ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి ఆలోచించాను. పదాలు కాస్త అటూ ఇటూ అయినా ప్రేక్షకులు క్షమిస్తారన్న నమ్మకంతో పాడేశాను. లక్కీగా సాంగ్ బాగా వచ్చింది. సాంగ్ షూట్‌ను ఎంజాయ్ చేశాను’’ అని వెంకీ అన్నారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గురు’ చిత్రం హిందీ ‘సాలా కడూస్’కి తమిళ రీమేక్ అయిన ‘ఇరుదు సుట్రు’కి తెలుగు రీమేక్.