
స్టార్ హీరో సినిమా మూడు నెలలు వాయిదా
సౌత్ ఇండస్ట్రీలో సినిమాల వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతోంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు ఇతర సినిమా రిలీజ్ డేట్లు, రాజకీయ పరిస్థితులు కూడా సినిమాల విడుదల తేదీల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల పెద్ద నోట్ల రద్దు కారణంగా చాలా సినిమాలు వాయిదా పడగా.. ఆ తరువాత కూడా వివిధ కారణాల వల్ల సూర్య సింగం 3 పలు మార్లు వాయిదా పడింది.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళ సినిమా ఇరుది సుట్రుకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు ఏకంగా మూడు నెలలు ఆలస్యంగా ఏప్రిల్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
జనవరి బరి నుంచి వాయిదా వేసిన తరువాత వరుసగా యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో గురును సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తమిళ వర్షన్ డైరెక్టర్ చేసిన సుధా కొంగర తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండగా.. వెంకటేష్ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.