
గురుద్వారాల్లో... వెంకీ ఆధ్యాత్మిక సాధన
ఆ మధ్య ‘దృశ్యం’ చిత్రంతో వాణిజ్య విజయం అందుకున్న హీరో వెంకటేశ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఆ సినిమా షూటింగ్‌కు మధ్య విరామంలో ఆయన ఏం చేస్తున్నారు? సహజంగానే తరువాతి సినిమా స్క్రిప్టు ఖరారు చేసే పనిలో ఉండి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, విచిత్రం ఏమిటంటే - తాజాగా దొరికిన కొద్ది రోజుల విరామంలో వెంకటేశ్ సినిమా వాతావరణానికి దూరంగా ఆధ్యాత్మికంగా గడిపే పనిలో ఉన్నారు. పంజాబ్‌లోని పలువురు ఆధ్యాత్మిక గురువుల ఉపదేశాలను కొద్దికాలంగా పాటిస్తూ వస్తున్న వెంకటేశ్ తాజాగా సిక్కు గురువుల పవిత్ర మందిరాలన్నీ సందర్శిస్తూ, అక్కడ ధ్యానంలో గడుపుతున్నారు.
అలా గురుద్వారాలు దర్శించే పని మీదే ఇప్పుడు పంజాబ్‌లో ఉన్నారాయన. నిజానికి, దాదాపు పదిహేనేళ్ళుగా ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న ఆయన భగవాన్ రమణ మహర్షి మార్గాన్ని ప్రధానంగా పాటిస్తుంటారు. రమణ మహర్షి, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్తల బోధనలు తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయని వెంకటేశ్ చెబుతుంటారు. ‘‘జీవితంలో మనం కోరుకునేది, మనకు దక్కేది - పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ‘ప్రేమించుకుందాం రా’ చిత్ర సమయంలో నాకు వరుసగా విజయాలు వచ్చాయి.
అయితే, ఆ విజయాలకు నేను పెద్దగా స్పందించ లేదు. ‘అదేమిటి? నేనెందుకు ఆనందంతో తబ్బిబ్బు కావడం లేదు. లోపం ఎక్కడుంది?’ అని ఆలోచనలో పడ్డాను. ఆ సమయంలో నేనెంతో గందరగోళానికి లోనయ్యాను. అప్పుడు నేను ఆధ్యాత్మికత బాట పట్టి, హిమాలయాలకు వెళ్ళాను. అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ సాగుతోంది. ప్రస్తుతం అటు ఆధ్యాత్మిక జీవితాన్నీ, ఇటు మామూలు జీవితాన్నీ సమతూకంతో తీసుకుంటున్నా’’ అని వెంకటేశ్ గతంలో వివరించారు.
‘ఐతే’ ఫక్కీలో... ఏలేటి చంద్రశేఖర్ సినిమా:
ఇది ఇలా ఉండగా, ‘గోపాల గోపాల’ తరువాత ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేశ్ తదుపరి చిత్రం ఉంటుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ విషయమై స్పష్టత కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆ వార్త నిరాధారమైనదని తేలింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం చంద్రశేఖర్ ఒక యూత్‌ఫుల్ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త నటీనటులతో, ‘ఐతే’ తరహాలో వినూత్నంగా ఉంటూనే, వినోదం పంచే కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘వారాహీ చలనచిత్రం’ పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు భోగట్టా.