Gopala Gopala
-
కమల్ నాస్తికుడు... మోహన్‌లాల్ కృష్ణుడు!
కొత్తగా చెప్పేదేముంది? పలు సందర్భాల్లో కమల్‌హాసనే స్వయంగా ‘నేను నాస్తికుణ్ణి’ అని వెల్లడించారు. ఇప్పుడు తెరపై అటువంటి పాత్రలోనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అక్షయ్‌కుమార్ కృష్ణుడిగా, పరేశ్ రావెల్ నాస్తికుడిగా నటించిన హిందీ సినిమా ‘ఓ మై గాడ్’. దీన్నే తెలుగులో ‘గోపాల గోపాల’గా రీమేక్ చేశారు. ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లో కమల్‌హాసన్ రీమేక్ చేయాలనుకుంటున్నారట. కృష్ణుడి పాత్రకు మోహన్‌లాల్‌ను సంప్రదించారట. కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ సంస్థ తమిళ, మలయాళ రీమేక్‌ను నిర్మించçనుందని సమాచారం. మరి, ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా తెలియలేదు. మోహన్‌లాల్ అంగీకరిస్తే వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌కి పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. -
అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కుర్ర హీరోల పోటి పెరగటంతో తన ఏజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథల కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న విక్టరీ హీరో మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు (ఆదివారం) వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ వివరాలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తరువాత వెంకీ సినిమా వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వెంకటేష్ తొలిసారిగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికలో పక్కాగా ఉండాలన్న ఆలోచనతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గోపాల గోపాలా, దృశ్యం లాంటి డిఫరెంట్ మూవీస్ తరువాత మారుతి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేష్. -
మరోసారి పవన్ సినిమా రీమేక్‌లో..!
కన్నడలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరో పవన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సుదీప్. తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు హీరోలుగా తెరకెక్కిన సినిమా గోపాల గోపాల. దేవుడి మీదే కేసు వేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సుదీప్, ఈ సినిమాలో పవన్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా వెంకటేష్ కనిపించిన పాత్రలో విలక్షణ నటుడు ఉపేంద్ర అలరించనున్నాడు. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో హిట్ అయిన గోపాల గోపాల, శాండల్‌వుడ్‌లో కూడా సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
మారుతికే ఓటేసిన వెంకీ
గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నసీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా నడుస్తుండటంతో ఏ తరహా కథతో ఆడియన్స్ ముందుకు రావాలో తేల్చుకోలేక చాలా రోజులుగా కథా చర్చలతోనే కాలం గడుపుతున్నాడు వెంకీ. గతంలో మారుతి దర్శకత్వంలో రాధ పేరుతో ఓ సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. ఆ తరువాత మరికొంత మంది దర్శకులు వెంకటేష్‌కు కథలు వినిపించినా అవేవి సంతృప్తినివ్వకపోవటంతో చాలా రోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇటీవలే భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న మారుతి తాజాగా మరో కథతో వెంకటేష్‌ను సంప్రదించి మెప్పించాడట. ప్రస్తుతం ఆ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు మారుతి. డిసెంబర్ నెలాఖరుకల్లా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు వెంకీ. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల కోలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నయనతార గతంలో వెంకటేష్ సరసన తులసి లాంటి హిట్ సినిమాలో నటించింది. మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
వెంకి కోసం దర్శకుల క్యూ
దృశ్యం లాంటి బిగ్ హిట్ సాదించిన తరువాత కూడా విక్టరీ వెంకటేష్ ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయలేదు. వరుసగా మూడు హిట్స్ సాదించిన ఈ సీనియర్ హీరో నెక్ట్స్ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వెంకీ ఒకే అనాలే గాని వెంటనే సినిమా స్టార్ట్ చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాదించిన మారుతి, ఈ మధ్యే వెంకటేష్‌కు ఓ కథ వినిపించాడు. డైనమైట్ సినిమాతో నిరాశపరిచిన దేవాకట్ట కూడా వెంకటేష్ లీడ్ రోల్లో ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రాంతి మాధవ్ కథను ఓకె చేసిన వెంకీ మరింత డెవలప్ చేయమని చెప్పాడు. వీరితో పాటు రచయితలుగా సక్సెస్ అయిన ఆకుల శివ, వీరుపోట్ల కూడా వెంకీ హీరోగా ఓ మూవీని డైరెక్ట్ చేయటం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. యువ హీరోలు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే వెంకీ డేట్స్ కోసం మాత్రం దర్శకులు క్యూ కడుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, దృశ్యం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు సాదించిన వెంకటేష్‌తో సినిమా చేస్తే మినిమమ్ కలెక్షన్లు గ్యారెంటీ అని నమ్ముతున్నారు మేకర్స్. అంతేకాదు వెంకీ తో సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది కనుక నిర్మాత సమస్య కూడా ఉండదన్న ఆలోచనలో ఉన్నారు దర్శకులు. -
గోపాల గోపాల
-
వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?
‘గోపాల గోపాల’ చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యింది. మామూలుగా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడటం లేదు. అసలు ఇంతకూ వెంకీ ఏం చేస్తున్నట్టు? తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. తాజా సమాచారం ఏమిటంటే, ఆ సమయంలోనే రచయిత ఆకుల శివతో రాబోయే సినిమా స్క్రిప్టు డిస్కషన్లో వెంకటేశ్ పాల్గొన్నారట. ఎలాంటి కథ, ఏ నేపథ్యం, ఎటువంటి పాత్ర లాంటి వివరాలు తెలియలేదు. అయితే, ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపించే వెంకటేశ్, ఈసారి బాగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తనయుడు అర్జున్ రామ్‌నాథ్‌తో కలిసి ఆ గెటప్‌లోనే సందడి చేశారు. ఈ గెడ్డం గెటప్ అంతా ఆ కొత్త సినిమా కోసమే అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఆకుల శివ స్క్రిప్టుతో జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా వెంకీ కొత్త సినిమా మొదల వుతుందనేది ఫిలిమ్‌నగర్ టాక్. దర్శకుడు మారుతినా లేక ఇంకెవరైనా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
గోపాల గోపాల
-
ధనుంజాయ్ తో చిట్‌చాట్..
‘భాజే.. భాజే.. డోలు భాజే...’ ఇటీవలే వచ్చిన గోపాల గోపాల చిత్రంలోని పాపులర్ పాట. విన్న ప్రతి ఒక్కరికి చిత్రంలో పవన్‌కళ్యాణ్‌లా చిందేయాలనిపించేంత ఊపున్న పాట. ఇంత రిథమిక్ పాటను పాడింది ధనుంజయ్ సీపాన. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. సంగీతం మీద మక్కువతో ఎంతో కష్టపడి ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాల పాటలు పాడుతూ అందరి మన్ననలు పొందుతున్న ధనుంజయ్ పరిచయం అతని మాటల్లోనే.. ..సత్య గడేకారి, శ్రీనగర్‌కాలనీ నేను పుట్టింది..పెరిగింది విజయనగరంలోనే. విద్యాభ్యాసం కూడా అక్కడే. వైజాగ్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. చిన్నతనం నుండే సంగీతమన్నా... పాటలన్నా అమితమైన ఇష్టం. అందుకే లక్ష్మీరామ్దాస్గారి దగ్గర త్యాగరాజ సంగీతం నేర్చుకున్నాను. సంగీతంతో అనుబంధం ఆనాటిదే. మా నాన్న భాస్కర్‌రావు, అమ్మ చిన్నమ్మడు నాకు అన్నింట్లో సపోర్ట్‌గా నిలిచారు. లౌక్యంతో బ్రేక్ చదివింది ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అయినా మనసంతా సంగీతం మీదనే ఉండేది. ఆ ఇష్టంతోనే 2010లో హైదరాబాద్‌కు వచ్చేశా. ఇక్కడే ఎంఏ మ్యూజిక్ ఇన్ కర్నాటిక్ ఓకల్ పూర్తి చేశాను. ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌తోపాటు పలు సినిమా పాటలకు కోరస్ పాడాను. నెమ్మదిగా ప్లేబ్యాక్ సింగింగ్ అవకాశాలొచ్చాయి. అయితే నాకు బ్రేక్ వచ్చింది లౌక్యం చిత్రంలోని ‘సూడు.. సూడు’ పాటతోనే. ఆ తరువాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘చిన్నదాన నీకోసం’, ‘భీమవరం బుల్లోడు’, ‘అడా’్డ, ‘రఘువరన్ బి.టెక్’ సినిమాల్లో పాడాను. ఈ ప్రయాణంలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ నాకెంతో సహకారం అందించారు. గోపాల గోపాలలో అవకాశం నా మీద నమ్మకంతో అనూప్‌గారు నన్ను మెదట ‘భాజే.. భాజే’ ట్రాక్ పాడటానికి పిలిచారు. అనంతరం అదే పాటను పలు సింగర్స్‌తో పాడించినా సెట్ అవకపోవడంతో చివరకు నాతోనే పాడించారు. పాట విన్న చిత్ర యూనిట్ బాగా పాడావని అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్రంలో ఈ పాటే హైలెట్ కావడంతో నా ఆనందానికి అవధులు లేవు. టెంపర్ సినిమాలోనూ పాడాను. తెలుగువాళ్లు గర్వపడేలా పాటలను పాడాలనేదే నా ఆకాంక్ష.. -
'గోపాల గోపాల'కు కాసుల వర్షం
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- విక్టరీ వెంకటేశ్ ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాల బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హిందీ చిత్రం ఓ మై గాడ్ కు రీమేక్ గా నిర్మించిన ఈ తెలుగు చిత్రం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే ఈ చిత్రంపై తొలుత మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం మొదటి వారంలో రూ.48 కోట్లకు పైగా వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది. సృజనాత్మక దర్శకుడు శంకర్, హీరో విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ మూవీతో గోపాల గోపాల చిత్ర కలెక్షన్లకు బ్రేక్ పడే అవకాశం ఉందని అంతా భావించారు. కాగా, గోపాల గోపాల మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధారణ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అన్ లిస్ట్ త్రినాథ్ స్పష్టం చేశారు. -
'గోపాల గోపాల'పై మంత్రికి ఫిర్యాదు
హైదరాబాద్ : హైకోర్టు విభజనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని, వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. తెలంగాణ న్యాయవాదుల సంఘం కొత్త సంవత్సర క్యాలెండర్‌ను సచివాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. 'గోపాల గోపాల' సినిమాలో తమకు కించపరిచే సన్నివేశాలున్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ పాటలను వెంకటేశ్‌తో పాడించా...
‘‘ఒక పాట తయారు చేసే ముందు సన్నివేశాన్నీ, హీరో శారీరక భాషనూ దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే, దర్శకుడి అభిరుచికి ప్రాధాన్యం ఇస్తాను. ఫైనల్‌గా నా ఆత్మసంతృప్తి కూడా నాకు ముఖ్యమే’’ అని సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. మనం, లౌక్యం, గోపాల గోపాల... ఇలా వరుస విజయాలతో ‘మోస్ట్ వాంటెడ్’ మ్యూజిక్ డెరైక్టర్ అయ్యారు అనూప్. ఈ సందర్భంగా తన మనోభావాలను పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘తేజ ‘జై’ నుంచి మొదలుపెట్టి ఈ మధ్య విడుదలైన ‘గోపాల గోపాల’ వరకు ఇప్పటివరకు 37 చిత్రాలకు పాటలు స్వరపరిచాను. రీమేక్ చిత్రాలకు పాటలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. మాతృకలో ఉన్న ట్యూన్స్‌ని యథాతథంగా చేయాలా? వేరే ఇవ్వాలా? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది’’ అని చెప్పారు. ‘మనం’ చిత్రానికి పాటలివ్వడం ఓ గొప్ప అనుభూతి అని చెబుతూ -‘‘ఆ చిత్రం పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ డి. సురేశ్‌బాబుకి నచ్చాయి. అలా ‘గోపాల గోపాల’కు పనిచేసే అవకాశం వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో కీ బోర్డ్ ప్లేయర్‌గా చేశాను. అలాగే, సురేశ్‌బాబుగారి అమ్మాయి పెళ్లికి మొత్తం కుటుంబంతో ‘దగ్గుబాటి..’ పాట చేశాను. ఆ పాటలను వెంకటేశ్‌గారితో కూడా పాడించాను’’ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘టెంపర్’కి, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి పాటలు స్వరపరుస్తున్నానని అనూప్ చెప్పారు. అనంతరం బీఏ రాజు చేతుల మీదగా ‘అనూప్‌రూబెన్స్‌డాట్‌కామ్’ ఆవిష్కరణ జరిగింది. -
పవన్‌కల్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నా!
‘‘రీమేక్ చిత్రాలు చేయడం అంత సులువు కాదు. అది కూడా ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయడం అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఒకవేళ సరిగ్గా తీయలేకపోతే విమర్శలు వస్తాయి’’ అని దర్శకుడు కిశోర్‌కుమార్ పార్ధసాని అన్నారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని కిశోర్‌కుమార్ అన్నారు. మరిన్ని విశేషాలను సోమవారం విలేకరులతో చెబుతూ -‘‘వెంకటేశ్, పవన్ కల్యాణ్ సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తులు. అలాంటి వారితో సినిమా చేయడం నా లక్. కృష్ణుడి పాత్ర కాబట్టి, పవన్ కల్యాణ్ చాలా నిష్ఠగా చేశారు. వాస్తవానికి హిందీ చిత్రంలో దేవుడి పాత్ర పరిచయ సన్నివేశం సాదాసీదాగా ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్‌కి ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, పరిచయ సన్నివేశాన్ని భారీగా తీశాం. ఈ చిత్రానికి మరో ప్రధాన హైలైట్ సంభాషణలు. కథానుసారం సాయిమాధవ్ బుర్రా అద్భుతంగా రాశారు. ‘సమర్థులు ఇంట్లో కూర్చుంటే.. అసమర్థులు రాజ్యమేలుతారు..’, ‘ఆలస్యంగా వచ్చినా రావడం మాత్రం పక్కా..’ అని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ రాజకీయాలను ఉద్దేశించినట్లుగా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ, సన్నివేశానుసారమే ఇవి ఉన్నాయి. ఈ చిత్రానికి మరో హైలైట్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు’’ అన్నారు. తదుపరి చిత్రం పవన్ కల్యాణ్‌తో చేయబోతున్నాననీ, ఈ చిత్రం కోసం కథ సిద్ధం చేస్తున్నానని కిశోర్‌కుమార్ తెలిపారు. -
దుమారం రేపుతున్న పవన్‌కల్యాణ్ డైలాగ్స్!
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తాజా చిత్రం 'గోపాల గోపాల'లో జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే డైలాగులున్నాయి. దైవత్వం నిండిన పాత్రలో పవన్ పేల్చిన మాటల తూటాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పచ్చదళానికి గూబ గుయ్యమనిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని తెలుగు తమ్ముళ్లు మధనపడుతున్నారు. ఈ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా మారిపోయినట్లు కొందరు అంటున్నారు. పవన్‌కళ్యాణ్ చూపులతో దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే మాటలతో మంట పెట్టాడని సైకిల్ శ్రేణులు లోలోపల గింజుకుంటున్నట్లు సమాచారం. ఈ డైలాగ్స్ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తాయా? మరెవరికి వర్తిస్తాయి? అని సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు ప్రశ్నించారు. పవన్ డైలాగులు టీడీపీ నేతల్లో సెగలు రేపుతున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో పంచ్ ఇస్తోందని పరోక్షంగా చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చారని అంటున్నారు. * నమ్మించేవాడు నాయకుడు కాదు-నడిపించేవాడు నాయకుడు. * గెలిచేవాడు నాయకుడు కాదు-గెలిపించేవాడు నాయకుడు. ఈ డైలాగులు టీడీపీ శ్రేణులను మరీ ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపును ఈ డైలాగ్స్ ప్రశ్నస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పవన్ వల్లే టీడీపీ గెలిచిందని, పవనే లేకపోతే టీడీపీ గెలిచేది కాదనే అర్థంలో డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. కొందరు పవన్ అభిమానులు అదే మాట చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ డైలాగ్స్‌పై టీడీపీ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొకరు ఒక్కోరకంగా స్పందించారు. అతనిని(పవన్) చూసి ఓటేశారనుకోవడం దురదృష్టకరం అని ఓ ప్రేక్షకుడు అన్నారు. పవన్ కల్యాణ్ తన శక్తిని నిరూపించారని, గత ఎన్నికలలో టీడీపిని అధికారంలోకి తీసుకువచ్చారని మరో ప్రేక్షకుడు చెప్పారు. చంద్రబాబు స్వయం కృషి వల్ల అధికారంలోకి వచ్చారని, ఎవరినో చూసి ఆయనకు ఓటువేయవలసిన అవసరంలేదని రాజమండ్రికి చెందిన ఓ ప్రేక్షకురాలు అన్నారు. మరికొన్ని రాజకీయ డైలాగ్స్: *కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా *సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు * దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని ఈ డైలాగ్స్‌ను దృష్టిలోపెట్టుకొని పవన్ అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు విశ్లేషిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీని ముందుండి గెలిపిస్తారంటూ పవన్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. నాయకుడు ఎలా ఉండాలో పేర్కొంటూ పవన్ చెప్పిన డైలాగ్ అతని అంతరార్థాన్ని సూచిస్తోందని అభిమానులే పేర్కొంటున్నారు. తాను నమ్మించి మోసం చేసే వాడిని కాదని, నడిపించి గెలిపించే తత్వం తనదని పవన్ నర్మగర్భంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు. -
శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను మరోసారి ఆకాశానికెత్తేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ను పొగడ్తల్లో ముంచెత్తే గణేష్ ఈ సారి ఏకంగా దేవుడితో పోల్చాడు. శబరిమలో అయ్యప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప అంటూ గణేష్ సోషల్ మీడియాతో పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటించిన గోపాల గోపాల సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గణేశ్ స్పందించాడు. 'శబరిలో అయ్యప్ప.. శ్రీశైలంలో మల్లప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప. గోపాల గోపాల బ్లాక్ బస్టరప్ప. పూలాభిషేకం నీకే. ప్రణాభిషేకం మీకే. కనకాభిషేకం మీకే. జై భోలో గోపాల గోపాల' అంటూ బండ్ల గణేశ్ పోస్ట్ చేశాడు. -
పొలిటికల్ పంచ్‌ల.. గోపాలుడు..!!
-
‘గోపాల గోపాల’ సినిమా రివ్యూ
తారాగణం: పవన్ కల్యాణ్, వెంకటేశ్, శ్రీయ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, కృష్ణుడు, స్క్రీన్‌ప్లే: భూపతిరాజా, దీపక్‌రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమేరా: జయనన్ విన్సెంట్, కళ: బ్రహ్మ కడలి, యాక్షన్: అలన్ అమీన్, డ్రాగన్ ప్రకాశ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: డి. రామానాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభిరామ్ దగ్గుబాటి, నిర్మాతలు: శరత్ మరార్, డి. సురేశ్‌బాబు, కథనం - దర్శకత్వం: కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ) కొన్ని కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కథలు విన్నప్పటి కన్నా, చూస్తేనే ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాకు వచ్చేసరికి మామూలు కథాంశాన్ని అయినా,తెరపై చూపడంలోని నేర్పును బట్టి ఆసక్తికరంగా మార్చేయవచ్చు. కానీ, ఆ నేర్పే గనక కొరవడితే, ఎంత మంచి కథాంశమైనా, సినిమా హాలు దాకా వచ్చేసరికి చప్పగా తయారవుతుంది. దర్శకుడి సామర్థ్యంతో పాటు అతనికి దక్కిన స్వేచ్ఛ, కథను సన్నివేశాలుగా, పాత్రలను సహజంగా మలుచుకోవడంలో చూపే సత్తా లాంటి అనేక అంశాలన్నీ అందుకు కారణాలే! ముఖ్యంగా, ఒక భాషలో హిట్టయిన కథాంశాన్ని మన భాషలోకి తెచ్చుకున్నప్పుడు ఎక్కడ యథాతథంగా అనుసరించాలి, ఎక్కడ సృజనాత్మకత చూపాలి, మన పాత్రధారులతో ఆ పాత్రల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేయించాలన్నది అనుభవం, ఆలోచనతో చేయాల్సిన పని. పరేశ్ రావల్ నటించిన హిందీ హిట్ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని మనవాళ్ళు తెలుగులోకి ‘గోపాల... గోపాల...’గా తెచ్చిన తీరు చూశాక ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి. కథ ఏమిటంటే... గోపాలరావు (వెంకటేశ్) ఒక మధ్యతరగతి మనిషి. దేవుడి బొమ్మలు, గంగాజలం - ఇలా భక్తి సంబంధమైన సామగ్రి అమ్మే వ్యాపారి. అయితే, విచిత్రంగా అతడికి దేవుడి మీద, పూజా పునస్కారాల మీద నమ్మకం ఉండదు. మానవత్వం మీద, తోటి మనిషికి సాయపడడం మీదే గురి. అతని భార్య మీనాక్షి (శ్రీయ) మహా దైవభక్తురాలు. చిన్నారి కొడుకు మోక్షను కూడా వీర దైవభక్తుడిగా చేస్తుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా సిద్ధేశ్వర మహరాజ్ (పోసాని కృష్ణమురళి) అనే దొంగ స్వామీజీతో గోపాలరావుకు ఘర్షణ ఎదురవుతుంది. దేవుణ్ణి నమ్మనివాడు నాశనమవుతాడంటూ సిద్ధేశ్వర్ శాపనార్థాలు పెడతాడు. ఇంతలో అనుకోకుండా వచ్చిన చిన్న భూకంపంలో ఊరంతా బాగున్నా, గోపాలరావు కొట్టు ధ్వంసమవుతుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళేమో ఈ ప్రకృతి వైపరీత్యం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ బీమా సొమ్ము ఇచ్చేది లేదంటారు. ఆ క్రమంలో తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ గోపాలరావు చివరకు దేవుడి మీద కోర్టులో కేసు వేస్తాడు. దేవుడి పేరు చెబుతూ ఆశ్రమాలు, ఆలయాలు నడుపుతున్న స్వామీజీలకు నోటీసులిస్తాడు. ఆ క్రమంలో మతవాదులు అతనిపై దాడికీ దిగుతారు. ఆ సమయంలో సాక్షాత్తూ దేవుడే (పవన్‌కల్యాణ్) మానవరూపంలో దివి నుంచి భువికి దిగి వస్తాడు. దేవుడిపైనే కేసు వేసిన వ్యవహారం నచ్చక, బంధువులతో పాటు పెళ్ళాం బిడ్డలు కూడా హీరో ఇల్లొదిలి వెళ్ళిపోతారు. అక్కడికి సినిమా ప్రథమార్ధం. ఆ తరువాత సంచలనాత్మకమైన ఈ దేవుడిపై గోపాలరావు కేసు కోర్టులో ఏమైంది? మానవరూపంలో వచ్చి, గోపాలం ఇంటిలోనే దిగిన దేవుడు అతనికి ఏం చెప్పాడు, ఏం చేయించాడు, చివరకు గోపాలరావు జీవితం ఏమైందన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే దేవుడి మీద నమ్మకం కన్నా మానవత్వం మీద నమ్మకం ఎక్కువున్న గోపాలరావు పాత్రలో వెంకటేశ్ పాత్ర పరిధి మేరకు నటించడానికి ప్రయత్నించారు. అయితే, మానవత్వం మిన్న అని వాదించే కొన్ని ఘట్టాల్లో మాత్రమే ఆయన అభినయ ప్రతిభ వెలికి వచ్చింది. దేవుడుగా పవన్ కల్యాణ్ తన మాటలో, నటనలో మార్దవాన్ని మేళవించి, దైవత్వం ఉట్టిపడేలా చేయాలని చూశారు. అలవాటైన హావభావాలకు దూరంగా ఉంటూ కొత్తగా కనిపించారు. ప్రస్తుతం జనంలో ఉన్న క్రేజుతో హాలులో కేరింతలు కొట్టించారు. ఇక, మనిషిలో, ప్రవర్తనలో స్త్రీత్వాన్నీ, వ్యూహరచనలో క్రూరత్వాన్నీ కలగలుపుకొన్న లీలాధర స్వామిగా మిథున్ చక్రవర్తికి ఇది తొలి తెలుగు సినిమా. హిందీ ‘ఓ మై గాడ్’లో పోషించిన పాత్రనే మరింత సమర్థంగా ఆయన అభినయించారు. కొన్ని చిన్న చిన్న హావభావాలను కూడా తన అనుభవంతో తెరపై బాగా పండించారు. వెంకటేశ్ భార్యగా శ్రీయది ప్రాధాన్యం లేని చిన్న పాత్ర. మిగిలిన పాత్రలు, పాత్రధారులు సన్నివేశానికి తగ్గట్లు వచ్చిపోతుంటారు. సాంకేతిక నిపుణుల పనితీరెలా ఉందంటే అసలు ‘కిషన్ వర్సెస్ కన్హయ్య’ అనే నాటకం ఈ చిత్రకథకు మూలం. దాని ఆధారంగా వచ్చిన ‘ఓ మై గాడ్’ హిందీ చిత్రం అధికారిక మాతృక. ఆ స్క్రిప్టును తెలుగుకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు, చేర్పులతో అల్లుకున్నారు. ‘‘వేగం బండిలో కాదు మిత్రమా... దాన్ని నడిపేవాడి నరంలో ఉంటుంది!’’ (వెంకటేశ్‌తో పవన్ కల్యాణ్) లాంటి కొన్ని మెరుపులు డైలాగుల్లో ఉన్నాయి. ‘కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’, ‘సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు’, ‘దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని’ (పవన్ కల్యాణ్) లాంటి రాజకీయ ధ్వనితో కూడిన మాస్ డైలాగులు సన్నివేశం, సందర్భంతో పని లేకుండా అభిమానులకు వీనులవిందు చేస్తాయి. అయితే, చాలాచోట్ల సన్నివేశాల రూపకల్పనలో, డైలాగుల్లో సహజత్వం కన్నా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం తెలుస్తుంటుంది. పిల్లి ఎదురురావడం, బల్లిపాటు, వాస్తు లాంటి మనలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమా మొదట్లో వచ్చే ‘ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు ముఖ్యమంటు...’ పాట ఆలోచింపజేస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో ‘భాజే భాజే...’ అంటూ పవన్ కల్యాణ్ బృందంపై వచ్చే పండగ పాట ప్రేక్షకులతోనూ స్టెప్పులు వేయిస్తుంది. మిగిలిన పాటలు కూడా సందర్భోచితంగా వచ్చినవే అయినా, గుర్తుండేలా సాగవు. సినిమా అనేక చోట్ల నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను పెంచడానికి ఉపకరిస్తుంది. శ్రీయతో, పవన్ కల్యాణ్ మాట్లాడే సన్నివేశం లాంటి చోట్ల ఛాయాగ్రహణ పనితనం కనిపిస్తుంటుంది. సినిమాలో మొదటి పాట లాంటి చోట్ల చకచకా సన్నివేశాన్ని నడిపిన ఎడిటర్, సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ సన్నివేశాలు, వాటిలోని అంశాల తాలూకు అనివార్యత వల్లనేమో ఆ ‘టెంపో’ను చూపలేకపోయారు. పవన్ కల్యాణ్ భువి మీదకు వచ్చే సన్నివేశం, అక్కడి యాక్షన్ ఘట్టం ఇంటర్వెల్‌కు ముందు సినిమాలో ఊపు తెస్తుంది. ఎలా ఉందంటే... ఫస్టాఫ్‌కే కథ, హీరో లక్ష్యం తెలిసిపోతాయి. ఇక, సెకండాఫ్‌లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పడ్డ కష్టం, దేవుడి సాయం, మానవత్వం వర్సెస్ దైవం పేరుతో సాగే వ్యాపారం లాంటి కీలక ఘట్టాలను చూపాలి. కానీ, సరిగ్గా అక్కడకు వచ్చే సరికే కథనం నీరసపడిపోయింది. కోర్టులో వెంకటేశ్ వాదన, ‘బోనులో భగవంతుడు’ టీవీ చర్చాకార్యక్రమం లాంటివి, ఆ మాటకొస్తే చివరాఖరులో గోపాలరావుకూ - గోపాలదేవుడికీ జరిగే సంభాషణ లాంటివి సుదీర్ఘమైన మోనో యాక్షన్ లాగా సాగుతాయి. దాంతో, ప్రేక్షకుడు సహనానికి పరీక్ష ఫీలవుతాడు. నిజానికి, మతం పేరిట, మనిషిలో దేవుడి పట్ల ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటూ సాగుతున్న వ్యాపారమనే పాయింట్‌ను ‘ఓ మై గాడ్’ బాగా చర్చకు పెట్టింది. అదే విషయాన్నే తాజాగా ఆమిర్‌ఖాన్ ‘పీకె’ కూడా మరో కోణంలో సహజంగా, సమర్థంగా చూపెట్టింది. ఆ రెండిటినీ జనం చూసేసిన తరువాత రావడం - ‘గోపాల... గోపాల...’కున్న బలహీనత! ఈ రకమైన ఇతివృత్తానికి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడానికి మాతృకలు ఉపయోగపడినా, ఇప్పటికే చూసేసిన కథాంశంలా ఆనుకొనే ప్రమాదం ఉంది. పైగా, దైవం మీద ప్రేమ కన్నా భయంతో చేసే శుష్క పూజల కన్నా, సాటి మనిషిని ఆదుకోవడమే అసలు దైవత్వమనే పాయింట్‌ను ఇంకా బలంగా చెప్పాల్సింది. మరోపక్క స్వామీజీలు మతం, దైవం పేరుచెప్పి మోసం చేస్తుంటే, గంగాజలమంటూ ట్యాప్ తిప్పి పట్టిన నీళ్ళిచ్చే హీరో చేస్తున్నది మాత్రం ఏమిటనిపిస్తుంది. వెరసి, పాత్రధారులే తప్ప, పాత్రలు కనిపించని ఈ రీమేక్‌కు పండగ సెలవులు, పవన్ కల్యాణ్ క్రేజు కలిసొస్తాయి కానీ, అది ఎన్ని రోజులన్నది దాదాపు రూ. 50 కోట్ల పైచిలుకు ప్రశ్న. - రెంటాల జయదేవ -
'గోపాల గోపాల' థియేటర్‌పై దాడి
హైదరాబాద్: గోపాల గోపాల చిత్రం ప్రదర్శిస్తున థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రేక్షకులు థియేటర్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సినిమాను మధ్యలోనే ఆపివేశారు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో వెంకటేశ్ హీరోగా గోపాల గోపాల సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో గోపాల గోపాల సినిమాపై రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఈ ఈ సినిమాను చిత్రీకరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
హైదరాబాద్ : వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన 'గోపాల గోపాల' చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా ...హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ సినిమా ...శనివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా గతంలోనూ 'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్‌పీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్‌పీ కార్యకర్తలు ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు. -
హీరోలు.. మల్టీ స్టారర్ల బాట పట్టారు..!
-
పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు
గోపాల.. గోపాల ఆడియో విడుదల కార్యక్రమం వద్ద పాస్‌లు ఇవ్వలేదన్న కారణంగా పవన్ కల్యాణ్ అభిమానిపై దాడిచేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి సంబధించిన వీడియో ఫుటేజి ఆధారంగా వీరిని గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో.. కుమారస్వామి, నరేష్ కుమార్, రాకేష్, రంజిత్ అనే నలుగురు ఉన్నారు. వీళ్లు చేసిన దాడిలో కరుణ శ్రీనివాస్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పవన్ స్వయంగా పరామర్శించి, రూ. 50 వేల సాయం కూడా చేశారు. -
గోపాల గోపాలకు 'యు' సర్టిఫికెట్
పవన్ కల్యాణ్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న గోపాల గోపాల సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిసింది. శ్రేయస్ మీడియా ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. గురువారమే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చిన ఈ సినిమా... ఎలాంటి అడ్డంకులు, అభ్యంతరాలు లేకుండా యు సర్టిఫికెట్ పొందిందని శ్రేయస్ మీడియా చెప్పింది. దాంతో ఈ సినిమా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో సినిమా విడుదలకు కూడా ఎలాంటి ఆటంకాలు లేనట్లయింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవడానికి కూడా ఈ సినిమా సిద్ధం అయిపోతోంది. ఎప్పుడు విడుదల చేసేదీ మాత్రం ఇంకా చిత్ర నిర్మాతలు వెల్లడించలేదు. అయితే.. బుక్ మై షో లాంటి సైట్లు మాత్రం పదోతేదీ శనివారం నాడు సినిమా విడుదల అవుతోందని చెబుతూ, ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా మొదలుపెట్టేశాయి. -
గోపాల గోపాల సెన్సార్ వాయిదా
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమా విడుదల తేదీని ఈ నెల 10న గానీ, 11న గానీ అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు బుధవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాలసి ఉంది. అనుకోని కారణాల వల్ల సెన్సార్ వాయిదా పడింది. దాంతో సినిమా 9న విడుదలయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఈ సినిమాకు రేపు అంటే 8వ తేదీన సెన్సార్ జరుగుతుంది. 11, 14 తేదీల మధ్యలో ఏదో ఒక తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో 'గోపాల గోపాల'గా పునర్ నిర్మించిన విషయం తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ పోషించారు. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది. ఇందులోని మూడు పాటలకూ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ పోషించిన దొంగ స్వామీజీ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ పాత్రలో పోసాని కామెడీ బాగా పండించినట్లు చెబుతున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంరేపుతోంది. దీనిని చూసిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. తెలుగులో అత్యధిక హిట్లు వచ్చిన ట్రైలర్‌గా కూడా ఇది నిలిచింది. కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డి.సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మాతలు. -
లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా...
వెంకటేశ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ స్టార్లా కాకుండా ఓ కామన్ మ్యాన్‌లా ఆయన థింకింగ్ ఉంటుంది. జయాపజయాలు, ఇమేజ్‌ల కోణంలో కాకుండా ఓ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన నటించిన ‘గోపాల గోపాల’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన 7 ఆసక్తికరమైన విషయాలు. # ‘గోపాల గోపాల..’ ఇది గాడ్కి సంబంధించిన సినిమా. వినోదం తప్ప ఎక్కడా సందేశాలుండవు. నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారు. # ‘ఓ మై గాడ్’ని తెలుగులో చేద్దామనుకున్నపుడు, దేవుడి పాత్రకు పవన్‌కల్యాణ్ కరెక్ట్ అని మేమంతా అనుకున్నాం. అతను కూడా వెంటనే ఓకే చెప్పారు. అయినా మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నేళ్లకు ఇలా కుదిరింది. # పవన్‌కల్యాణ్‌లో మంచి కామిక్సెన్స్ ఉంది. చాలా ఫెయిర్ పర్సన్. దేవుడి పాత్ర చేయాలంటే చాలా డివైన్‌గా ఉండాలి. అంత ప్యూరిటీ, పాజిటివ్ ఎనర్జీ పవన్‌లో ఉన్నాయి. # నాకు దైవభక్తి ఉంది. కాకపోతే ఒక దేవుణ్ణే కొలవడం అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని నమ్ముతాను. అసలు దేవుడు మనలోనే ఉన్నాడని నమ్ముతా. నేను రీమేక్‌లే చేయాలని నిబంధన పెట్టుకోలేదు. కథ నచ్చడమే నాకు ప్రధానం. # మా అబ్బాయి అర్జున్ రామ్‌నాథ్ స్కూల్‌కి వెళుతున్నాడు. ఈమధ్య నా దగ్గరకు వచ్చి ‘లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాన్నేను. పిల్లలకు ఆధ్యాత్మికత గురించి కూడా కొంచెం, కొంచెం చెబుతూ ఉండాలి. # మనకు ఉన్నంతమంది యంగ్ హీరోలు ఇంకెక్కడా లేరు. అందరూ బాగా చేస్తున్నారు. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ల మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. -
ఐ ఫీస్ట్‌గా...
ఎట్టకేలకు ఈ సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ వద్ద పోటీపడే సినిమా పుంజులు ఏమిటన్నది ఒక స్పష్టత వచ్చింది. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’కు తెలుగు రీమేక్ అయిన మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల... గోపాల’, భారతీయ దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ఐ’ - ఈ రెండూ ఈ పెద్ద పండగకు ప్రేక్షకులను అలరించనున్నాయి. సరిగ్గా పండగ రోజు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శంకర్ దర్శకత్వంలోని ‘ఐ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తున్నామంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మరో పక్క మొన్న ఆదివారమే పాటల విడుదల కార్యక్రమం జరుపుకొన్న ‘గోపాల... గోపాల’ చిత్రం తుది మెరుగులు దిద్దుకొంటూ, సెన్సార్ జరుపుకొనే పనిలో ఉంది. ఆ పనులన్నీ పూర్తి కాగానే, ఈ చిత్రాన్ని పండగ కన్నా ముందే విడుదల చేయాలని శరవేగంతో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాక్సాఫీస్ సమరం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం కాగా, అభిమానులు ఎవరి అంచనాల్లో వారున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ మీద దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం. భారీ సెట్లు, గ్రాఫిక్ వర్క్స్ ఉన్న ఈ చిత్రం కోసం ఇంత కష్టపడడం వెనుక కారణాన్ని కూడా దర్శకుడు శంకరే ఇటీవల వివరించారు. ‘‘నేను నా సినిమాలను ఒక దర్శకుడిగానే కాక, ఒక సాధారణ ప్రేక్షకుడిగా కూడా చూస్తుంటా. అందుకే, ఎప్పటికప్పుడు నా కొత్త చిత్రం, నా మునుపటి చిత్రాన్ని అధిగమించాలని భావిస్తుంటా’’ అన్నారాయన. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా ‘రొమాంటిక్ థ్రిల్లర్’ కోవలో ‘ఐ’ సినిమాను ఆయన తీశారు. గతంలో ఆయన ప్రభుదేవాతో ‘ప్రేమికుడు’ (తమిళంలో ‘కాదలన్’) చిత్రం చేసినప్పటికీ అది యువతరం ప్రేమకథా చిత్రం. ఈసారి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే ప్రేమ కథ ఇది. ‘‘వినోదాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలే రూపొందిస్తానంటూ నా పైన ముద్ర పడింది. కానీ, ఆ ముద్రకు భిన్నమైన చిత్రాలు చేయాలని నేను తపిస్తున్నా. అందులో భాగంగా వస్తున్నదే - ‘ఐ’ చిత్రం’’ అని శంకర్ వివరించారు. అసాధారణమైన వ్యక్తిని కానీ, వార్తను కానీ చూసినప్పుడల్లా అతని వెనుక, లేదంటే ఆ వార్త వెనుక ఉన్న కథేమిటని ఆలోచించే శంకర్ అక్కడ నుంచే తన కథలు పుడతాయని చెబుతుంటారు. మరి, ఈ ‘ఐ’ కథకు స్ఫూర్తి ఏమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఈ కథ ఒక హాలీవుడ్ సినిమాలోని అంశాన్ని తీసుకొని అల్లుకొన్నదనీ, విక్రమ్ చేత వేయించిన భీకరమైన రూపం తాలూకు గెటప్‌కు కూడా అదే స్ఫూర్తి అనీ ఇప్పటికే కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ చిత్రం కోసం హీరో విక్రమ్ మిగిలినవన్నీ పక్కనబెట్టి, పూర్తిగా లీనమైపోయి నటించారట! అందుకే, ఈ దిగ్దర్శకుడు సైతం ‘‘పోషిస్తున్న పాత్ర కోసం విపరీతంగా బరువు పెరగడం, విపరీతంగా బరువు తగ్గడం, కొన్నేళ్ళ తరబడి ఆ పాత్రకే కట్టుబడి ఉండడం లాంటివన్నీ చేసే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి అతి కొద్దిమందిలో తానూ ఒకణ్ణని విక్రమ్ మరోసారి నిరూపించారు’’ అని అభినందనలు కురిపించారు. కెరీర్ మొదట్లో ‘రేవతి’ అనే పేరుతో నాయికా ప్రధానమైన చిత్రం తీయాలనుకొని, నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బంది పడ్డ శంకర్ ఈసారి ‘ఐ’ చిత్రంలో కథానాయిక పాత్రకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అమీ జాక్సన్ ఆ కీలక పాత్రను పోషిస్తున్నారు. మరి, ట్రైలర్లు చూస్తుంటే, విక్రమ్‌ను ఒకపక్క హీరోగా, అదే సమయంలో మరోపక్క యాంటీ హీరోగా కూడా చూపిస్తూ, కొత్త ప్రయోగం చేస్తున్నారని భావిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో ఇప్పటికే ఒకటి రెండు పాటలూ పదే పదే వినిపిస్తున్నాయి. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వ విలువలు కూడా కలసి, భారీగా రూపొందిన ‘ఐ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సంచలనం సృష్టిస్తుందో తెలుసుకొనేందుకు మరొక్క వారం రోజులు ఆగాలి. ఈలోగా మరిన్ని ‘ఐ’ కబుర్లు మీడియాలో రావడం ఎలాగూ ఖాయం! -
శ్రీనివాస్‌ను వ్యక్తిగతంగా కలుస్తా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : గోపాల గోపాల’ సినిమా ఆడియో కార్యక్రమం సందర్భంగా శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం జరిగిన సంఘటనపై హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించాడు. గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీనివాస్‌పై కొందరు యువకులు దాడి చేసి గొంతు కోసిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ స్పందిస్తూ 'నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.ఈ వార్త వినగానే నా మనసు చాలా కలచి వేసింది. అతను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి' అని ట్విట్ చేశాడు. కాగా అభిమానుల భద్రతే తన ప్రాధాన్యత అని పవన్ పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్ఫోన్లో తీసిన ఫొటోలను సేకరించారు.గొంతు కోసిన నిందితుడితో పాటు దాడికి పాల్పడ్డ వారి ఫొటోలను పోలీసులు మీడియాకు సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'
-
ఆ మాటలే నాకు కనువిప్పు : పవన్ కల్యాణ్
‘‘మేమిద్దరం కలిసి ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. అది కూడా ఒక మంచి చిత్రం చేయడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని వెంకటేశ్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కిశోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో డి. సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘గోపాల గోపాల’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇందులో నటించడానికి పవన్ అంగీకరించగానే చాలా సంతోషం అనిపించింది’’ అని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఒకప్పుడు నాకేం అవ్వాలో తెలిసేది కాదు. అమ్మ, అన్నయ్యలు అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు. అన్నయ్య కష్టపడి సినిమాలు చేస్తుంటే నేను యోగా, ధ్యానం చేస్తూ, వాటి గురించే అన్నయ్యకు చెప్పేవాణ్ణి. ‘కష్టపడే అన్నయ్య.., వేళకి అన్నంపెట్టే వదిన ఉంటే ఎవరైనా ఇలానే మాట్లాడతారు’ అని అన్నయ్య అన్నారు. ఆ మాటలే నాకు కనువిప్పు అయ్యాయి. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి.. అలాగని బాధ్యతలను విస్మరించకూడదని తెలుసుకున్నాను. ఆరోజు అన్నయ్యగారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని, తుది శ్వాస వరకు కష్టపడతాను. ‘ఖుషీ’ టైమ్‌లో ‘అన్నా ఒక్క హిట్ ఇవ్వు అన్నా.. రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. చచ్చిపోతున్నాం’ అని అభిమానులు అడిగేవాళ్లు. ఆ ప్రేమకు కదిలిపోయేవాణ్ణి. నేను నాకోసం ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. కానీ, మొట్టమొదటిసారి ‘ఒక్క హిట్ ఇవ్వు. సినిమాల నుంచి వెళ్లిపోతా’ అని కోరాను. హిట్ ఇచ్చాడు. సినిమాల నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ‘ఖుషి’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఎందుకో... రానున్న రోజులన్నీ నాకు కష్టాలే అనే భావన కలిగింది. ఆ వెంటనే.. ఇంకోటి కూడా అనిపించింది. ఏం చేయాలో తెలియక, నా స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం పారిపోవాలనుకున్న నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసి, ఇంతమంది అభిమానం పొందేలా చేసిన ఆ భగవంతుడు చూసుకుంటాడనుకున్నాను. జయాపజయాలు రెండూ ఆ భగవంతుడి చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నది శ్రమ, కృషి. ఆ రెంటినీ బాగా చేస్తాను. సినిమాల్లోకి రాకముందే నాకు వెంకటేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన్ను సోదరుడిలా భావిస్తాను. నేను మామూలుగా ఎవరి ఇంటికీ వెళ్లను. కానీ, వెంకటేశ్‌గారి ఇంటికే వెళతాను. సినిమాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను కలిసే వ్యక్తి వెంకటేశ్‌గారు . మేం ఇద్దరం కలిస్తే, సినిమాల గురించి తక్కువ మాట్లాడతాం. ఆధ్యాత్మికత గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. బహుశా అదే మా ఇద్దరితో ఈ సినిమా చేయించిందేమో’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం కూడా పాల్గొన్నారు. -
'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'
హైదరాబాద్: దేవుడంటే తనకు చాలా భయమని హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నమ్మే దేవుడికి ఆకారం లేదని, నిరాకారుడైన దేవున్ని సంపూర్తిగా నమ్ముతానని వెల్లడించారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన 'గోపాల గోపాల' సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... 'చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు. చదవు పెద్దగా చదవలేదు. ఏమయ్యాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మన్నారు. సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను. ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను. ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. అప్పుడు ఒక్క హిట్ ఇమ్మని దేవుణ్ని కోరుకున్నా. మొట్టమొదటిసారి విజయం కోసం ప్రార్థించా. నా మొర ఆలకించి భగవంతుడు హిట్ ఇచ్చాడు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. చాలా భయంతో ఈ సినిమాలో భగవంతుడి కేరెక్టర్ చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి' అని పవన్ కళ్యాణ్ అన్నారు. -
వెంకటేష్ బ్రదర్ లాంటివాడు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: హీరో వెంకటేష్ తనకు సోదరుడు లాంటి వాడని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన గోపాల గోపాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకటేష్, పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... తాను వ్యక్తిగతంగా కలుసుకునే వ్యక్తుల్లో వెంకటేష్ ఒకరని చెప్పారు. సినిమాల గురించి తాము చాలా తక్కువగా మాట్లాడుకుంటామన్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నారు. ఈ టాపిక్కే తామీ సినిమా చేయడానికి కారణమన్నారు. వెంకటేష్ తో కలిసి చాలాసార్లు సినిమా చేయాలనుకున్నా ఇప్పటికి కుదిరిందన్నారు. చాలా భయంతో భగవంతుడి పాత్ర చేశానని అన్నారు. ఏమైనా పొరపాట్లు చేసివుంటే క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. -
ఆన్లైన్లో ‘భజే.. భజే’ గోపాలం!
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘గోపాల... గోపాల’ రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. వెంకటేశ్‌ను అపర అర్జునుడి లాగా, పవన్ కల్యాణ్‌ను అపర శ్రీకృష్ణావతారంగా రథంపై చూపుతున్న స్టిల్ అందుకు తాజా చేరిక. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలోని ‘భజే భజే...’ అనే పండగ గీతాన్ని ‘లహరి మ్యూజిక్’ సంస్థ జనవరి 1వ తేదీ సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ బాణీలో అనంత శ్రీరామ్ సాహిత్యానికి, యువ గాయకుడు హరిచరణ్ గానం చేసిన ఈ పాటను తెర మీద కూడా అందంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల కథనం. కొన్ని వందల మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాటకు నర్తించిన పవన్ ఈ పాటను ఆస్వాదించడమే కాక, సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా ఫోన్ చేసి, అభినందించారట! మరి, పవన్‌ను అంతగా ఆకట్టుకున్న ఈ పాట రేపు ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి. ఆ లోగా... అధికారికంగా పాటల సీడీని ఆవిష్కరించక ముందే, కీలకమైన పాటల్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచి, ప్రేక్షకులను ఆకర్షించేలా ‘గోపాల గోపాల’ బృందం మార్కెటింగ్ వ్యూహచతురత చూపుతోంది. తాజా కబురు ఏంటంటే... పవన్‌కల్యాణ్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. పవన్ అభిమానులకు కొత్త సంవత్సరంలో నిజంగా తీపి వార్తే! -
గోపాల.. గోపాల మొదటి పాట విడుదల
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' సినిమాలో మొదటి పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసింది. ''ఆరరే ఆలా.. ఆయారే నందలాలా'' అంటూ ఈ పాట మొదలవుతుంది. తర్వాత ప్రధానంగా 'భాజేరే భాజే.. డోల్ భాజే' అంటూ కొనసాగుతుంది. మొదటి మోషన్ పోస్టర్లో అందించిన నేపథ్య సంగీతమే ఇందులో వినపడుతుంది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మోషన్ పోస్టర్ తరహాలోనే ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ఉయ్యాలలో కూర్చున్న వెంకటేశ్, పవన్ కల్యాణ్ బైకు వెనక కూర్చున్న వెంకటేశ్, ఉయ్యాలలో విలాసంగా పవన్ కూర్చుని ఉండగా.. వెంకటేశ్ కూడా వెనకాల అదే తరహాలో నిలుచుండటం తదితర ఫొటోలు ఈ మోషన్ పోస్టర్లో కనిపిస్తాయి. -
సంక్రాంతి బరిలో గోపాల.. గోపాల!
-
'గోపాలా గోపాలా'కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు
-
'గోపాలా గోపాలా'కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు
హైదరాబాద్ : 'పీకే' చిత్రంపై వివాదం ఇంకా కొనసాగుతుంటే... మరోవైపు వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్‌పీ కార్యకర్తలు బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
సరికొత్త లుక్‌లో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన కల్యాణ్ సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. పవన్ అతిథి పాత్రలో నటిస్తున్న'గోపాల గోపాల' సినిమా కోసం బరువు తగ్గినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం పవన్ పాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్నట్టు చెప్పారు. 'పవన్ బరువు తగ్గడాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. పాలు, పండ్లు మాత్రమే తీసుకునేవారు. పిండి, ఆయిల్ పదార్థాలను మానేశారు. పవన్ స్లిమ్‌గా అవడం చూసి సెట్స్‌పై అందరూ ఆశ్చర్యపోయారు' అని ఈ చిత్ర సంబంధిత వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ చిత్రం ఓ మైగాడ్ను తెలుగులో గోపాల గోపాలగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్, శ్రియ నటిస్తుండగా, పవన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పవన్ అభిమానుల కోసం ఈ చిత్రంలో ఆయనపై పాటను చిత్రీకరించారు. వెంకటేశ్‌తో కలసి పవన్ డ్యాన్స్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చకచకా 'గోపాల గోపాల' సినిమా షూటింగ్
పవన్ కల్యాణ్, వెంకటేశ్ నటిస్తున్న 'గోపాల గోపాల' సినిమా విడుదలకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొంత షూటింగ్ మిగిలిపోవడంతో దాన్ని చకచకా పూర్తిచేసే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉంది. హైదరాబాద్‌లో ఈ మిగిలిన షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. వాటిని ఈ షెడ్యూల్లో పూర్తిచేసేస్తారని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు. హిందీలో బాగా హిట్టయిన ఓ మై గాడ్ సినిమా రీమేక్‌గా వెంకటేశ్, పవన్ కల్యాణ్‌లతో గోపాల గోపాల చేస్తున్నారు. వెంకటేశ్ భార్య పాత్రను శ్రియ పోషిస్తోంది. శరత్ మరార్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మిథున్ చక్రవర్తి తొలిసారిగా తెలుగు తెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. -
బైక్ రైడ్‌కి వెళ్ళిన పవన్,వెంకీ?
-
సంక్రాంతి రేసులో గోపాల గోపాల
-
సంక్రాంతి కానుకగా "గోపాల గోపాల"
-
ఆడియో లీల
-
ఈనెల 28న 'గోపాల గోపాల' ఆడియో
-
కాశీలో సందడి చేస్తున్న గోపాల గోపాల టీం
-
గోపాల గోపాల ఫస్ట్‌లుక్ వచ్చేసిందీ!
-
గోపాల గోపాల ఫస్ట్‌లుక్ విడుదల
టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది. యూట్యూబ్‌లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. 'ఓ మైగాడ్' హిందీ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దేవుడిపై కోర్టులో కేసు వేసే హీరో పాత్రలో వెంకటేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్లో పవన్ కల్యాణ్ ఉయ్యాలలో పడుకుని, కళ్లు మూసుకుని చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తుండగా, ఆ వెనక నుంచి వెంకటేశ్ వచ్చి, అచ్చం పవన్ ఇచ్చిన పోజులోనే నిలబడి ఉండగా గోపాల గోపాల అనే టైటిల్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా సింబాలిక్‌గా నెమలి ఈకల డిజైన్ ఉంచారు. మొత్తానికి పవన్, వెంకటేశ్ అభిమానుల ఎదురుచూపులు ఇన్నాళ్లకు ఫలించాయి. -
వెంకీ, పవన్ ఆ పాత్రల్లో ఎలా ఉంటారో
ప్రస్తుతం సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి కారణం.. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కలిసి నటించడమే. మల్టీస్టారర్లు వెంకీకి కొత్తకాదు. పవన్‌కల్యాణ్ మాత్రం మరో హీరోతో కలిసి నటించడం ఇదే ప్రథమం. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. హిందీ చిత్రం ‘ఓ మైగాడ్’... దీనికి మాతృక అనే విషయం తెలిసిందే. ఆ కథలోని కేరక్టరైజేషన్స్ తెలిసిన వారికి... ‘వెంకీ, పవన్ ఆ పాత్రల్లో ఎలా ఉంటారో’ అనే ఆసక్తి...సినిమాపై ఆసక్తి పెంచడానికి మరో కారణమైంది. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ ఈ చిత్రానికి నిర్మాతలు. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాలతో ప్రతిభగల దర్శకునిగా అభినందనలందుకున్న కిషోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలో ‘గోపాల గోపాల’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్లో విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని వారు తెలిపారు. ఈ చిత్రనిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం వస్తున్న కథలకు పూర్తి భిన్నమైన కథాంశమిది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కెరీర్లలో ఈ తరహా పాత్రలు ఇప్పటివరకూ చేయలేదని కచ్చితంగా చెప్పొచ్చు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, అందులోని సంభాషణలు వినోదభరితంగా, ఆలోచింపజేసే రీతిలో, మనసులను మెలిపెట్టే విధంగా ఉంటాయి. దర్శకుడు డాలీ జనరంజకంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, భూపతిరాజా స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని తెలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. -
విడుదలకు ముందే.. రికార్డుల మోత!
-
విడుదలకు ముందే 'గోపాల గోపాల' రికార్డు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నైజాం రైట్స్ కోసం 14 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ ముందుకొచ్చినట్లు తెలిసింది. మిగతా చోట్ల కూడా ఇదే రేంజ్లో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. రిలీజ్ అయిన తరువాత హిట్ టాక్ తెచ్చుకుంటే, ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేఅవకాశం ఉందని సినీవర్గాల అంచనా. టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీస్ మేకింగ్ ఊపందుకుంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్లో ఏదైనా మూవీ హిట్ అయితే చాలు దాని రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. బీ టౌన్లో హిట్ కొట్టిన ఓ మై గాడ్ హిందీ చిత్రాన్ని, ప్రస్తుతం పవన్, వెంకీ కాంబినేషన్లో తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో రీమేక్ చేస్తున్నారు.హిందీలో పరేశ్ రావెల్, అక్షయ్ కుమార్ పోషించిన పాత్రల్ని వెంకటేష్, పవన్ కళ్యాణ్‌లు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రోజుకో హాట్ న్యూస్‌తో అంతకంటే వేగంగా ఈ సినిమా మీడియాలో హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ** -
గురుద్వారాల్లో... వెంకీ ఆధ్యాత్మిక సాధన
ఆ మధ్య ‘దృశ్యం’ చిత్రంతో వాణిజ్య విజయం అందుకున్న హీరో వెంకటేశ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఆ సినిమా షూటింగ్‌కు మధ్య విరామంలో ఆయన ఏం చేస్తున్నారు? సహజంగానే తరువాతి సినిమా స్క్రిప్టు ఖరారు చేసే పనిలో ఉండి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, విచిత్రం ఏమిటంటే - తాజాగా దొరికిన కొద్ది రోజుల విరామంలో వెంకటేశ్ సినిమా వాతావరణానికి దూరంగా ఆధ్యాత్మికంగా గడిపే పనిలో ఉన్నారు. పంజాబ్‌లోని పలువురు ఆధ్యాత్మిక గురువుల ఉపదేశాలను కొద్దికాలంగా పాటిస్తూ వస్తున్న వెంకటేశ్ తాజాగా సిక్కు గురువుల పవిత్ర మందిరాలన్నీ సందర్శిస్తూ, అక్కడ ధ్యానంలో గడుపుతున్నారు. అలా గురుద్వారాలు దర్శించే పని మీదే ఇప్పుడు పంజాబ్‌లో ఉన్నారాయన. నిజానికి, దాదాపు పదిహేనేళ్ళుగా ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న ఆయన భగవాన్ రమణ మహర్షి మార్గాన్ని ప్రధానంగా పాటిస్తుంటారు. రమణ మహర్షి, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్తల బోధనలు తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయని వెంకటేశ్ చెబుతుంటారు. ‘‘జీవితంలో మనం కోరుకునేది, మనకు దక్కేది - పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ‘ప్రేమించుకుందాం రా’ చిత్ర సమయంలో నాకు వరుసగా విజయాలు వచ్చాయి. అయితే, ఆ విజయాలకు నేను పెద్దగా స్పందించ లేదు. ‘అదేమిటి? నేనెందుకు ఆనందంతో తబ్బిబ్బు కావడం లేదు. లోపం ఎక్కడుంది?’ అని ఆలోచనలో పడ్డాను. ఆ సమయంలో నేనెంతో గందరగోళానికి లోనయ్యాను. అప్పుడు నేను ఆధ్యాత్మికత బాట పట్టి, హిమాలయాలకు వెళ్ళాను. అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ సాగుతోంది. ప్రస్తుతం అటు ఆధ్యాత్మిక జీవితాన్నీ, ఇటు మామూలు జీవితాన్నీ సమతూకంతో తీసుకుంటున్నా’’ అని వెంకటేశ్ గతంలో వివరించారు. ‘ఐతే’ ఫక్కీలో... ఏలేటి చంద్రశేఖర్ సినిమా: ఇది ఇలా ఉండగా, ‘గోపాల గోపాల’ తరువాత ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేశ్ తదుపరి చిత్రం ఉంటుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ విషయమై స్పష్టత కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆ వార్త నిరాధారమైనదని తేలింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం చంద్రశేఖర్ ఒక యూత్‌ఫుల్ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త నటీనటులతో, ‘ఐతే’ తరహాలో వినూత్నంగా ఉంటూనే, వినోదం పంచే కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘వారాహీ చలనచిత్రం’ పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు భోగట్టా. -
గోపాలుని పరిచయ గీతం
మసాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్‌కి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, పరిచయ గీతానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు అభిమానులు. ‘గోపాలా గోపాలా’ టీమ్ ప్రస్తుతం అదే పనిమీద ఉంది. ఇటీవలే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌పై పవన్‌కల్యాణ్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ). ఇప్పుడు పరిచయ గీతం చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన లీడ్ సన్నివేశాన్ని మంగళవారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో సుచిత్రా చంద్రబోస్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ తదితరులు ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ పాట చిత్రీకరణలో పవన్‌కల్యాణ్ కూడా పాల్గొంటారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ సన్నాహాలు చేస్తున్నారు. -
అవును... వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు!
ఆ రోజు శ్రీకృష్ట జన్మాష్టమి. అందరూ ఆ పరమాత్మ లీలల్ని స్మరిస్తూ తన్మయత్వంతో ఆడిపాడుతున్నారు. అక్కడ రంగులు జల్లుకుంటూ ఆనందపరవశులయ్యేవారు కొందరైతే... ‘ఉట్టి’ సంబరంలో తలమునకలయ్యేవారు ఇంకొందరు. ఇలాంటి సందర్భంలో ఏకంగా ఆ దేవదేవుడే... ఆ భక్తజనంలో ఒకడిగా మారిపోయి సంబరంలో పాలుపంచుకుంటే... ఆ ఫీల్ ఎలా ఉంటుంది? తెలియని వారి సంగతి ఎలా ఉన్నా... తెర ముందు కూర్చొని చూస్తూ... అన్నీ తెలిసిన ప్రేక్షకుడికి మాత్రం అది నిజంగా తన్మయానందమే. త్వరలో ప్రేక్షకుడు అలాంటి అనుభూతినే పొందబోతు న్నాడు. ‘గోపాల... గోపాల’ సినిమా కోసం కృష్ణాష్టమి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం ధ్రువీకరించారు. ఈ పాటలో ‘గోపాలుడు’ పవన్‌కల్యాణ్‌తో పాటు, ‘గోపాల్రావ్’ పాత్రధారి వెంకటేశ్ కూడా పాల్గొంటారు. ప్రేక్షకులు సంభ్రమానికి లోనయ్యేలా ఈ పాటను చిత్రీకరించనున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ చిత్రం ఈ చిత్రానికి మాతృక అన్న విషయం తెలిసిందే. తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి, జనరంజకంగా దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృకలో లేని ఈ పాటను తెలుగులో చేర్చడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా శ్రీయ నటిస్తున్నారు. ఇక కథలో కీలకమైన పాత్రను అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్ చక్రవర్తి పోషిస్తున్నారు. ఇంకా పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్ మరార్. -
గోపాలడుకి ఐ పోటి ఇస్తుందా...
-
సంక్రాంతి గోపాలుడు
విశ్వంలో పరిణమిల్లే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. అలాంటప్పుడు మానవుల ఈతిబాధలకు కారకుడు దైవం కాక మరెవరు? ఈ ప్రశ్ననే సమాజంపై సంధించాడు ఓ వ్యక్తి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏకంగా దైవం పైనే కేసు బనాయించాడు. మరి దానికి దైవం ఎలా స్పందించాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘గోపాల గోపాల’. దేవుడిపైనే కేసు వేసే గోపాల్రావుగా వెంకటేశ్ నటిస్తుంటే, సాక్షాత్ గోపాలునిగా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. నాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్చక్రవర్తి ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్లో రూపొందిన ‘ఓమైగాడ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథలోని ఆత్మ చెడకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వచ్చే సన్ని వేశాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం వారిద్దరిపైనే హాస్పిటల్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. వెంకటేశ్‌కి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో మధుశాలిని, పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి, కృష్ణుడు, దీక్షాపంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు. -
పవన్ బర్తెడే గిప్ట్గా గోపాలగోపాల ఫస్ట్‌లుక్
-
భక్తుడి దెబ్బకు దేవుడే దిగివస్తే..?
-
తెలుగులోకొచ్చిన లీలాధరుడు
అత్యుత్తమస్థాయి నటులు మాత్రమే చేయగలిగే పాత్రలు కొన్ని ఉంటాయి. అలాంటి పాత్రే... హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో మిథున్ చక్రవర్తి పోషించిన లీలాధర్ స్వామి పాత్ర. శారీరక కదలికల్లో ఓ విధమైన ఆడతనం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడేమో అనిపించేంత ఆడంబరం కనిపిస్తుంది ఆ పాత్రలో. చూపులకు దైవత్వం, అంతర్లీనంగా కన్నింగ్ నేచర్, చిత్రమైన సంభాషణా చాతుర్యం... ఇన్ని ప్రత్యేకలుండే పాత్ర అది. ఆ పాత్రను మిథున్చక్రవర్తి అనితర సాధ్యంగా పోషించారంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్ ‘గోపాల గోపాలా’లో కూడా లీలాధర స్వామి పాత్రకు మిథున్ చక్రవర్తినే తీసుకున్నారు దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ). మాతృకలో పోషించిన పాత్రనే మళ్లీ చేయాలని అడగడంతో, అంగీకారం తెలుపడానికి కాస్త తటపటాయించారట మిథున్. కానీ చిత్ర యూనిట్ కమిట్మెంట్ చూసి, ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ లాంటి సూపర్స్టార్లు కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో మిథున్చక్రవర్తిలాంటి నటి సూపర్‌స్టార్ తోడవ్వడంతో ‘గోపాల గోపాలా’కు మరింత శోభ చేకూరిందని చెప్పాలి. గురువారం మిథున్చక్రవర్తి ఈ సినిమా షూటింగ్‌లోకి ప్రవేశించారు. మిథున్ ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతారట. ఇందుకోసం తెలుగు భాషను శ్రద్ధగా నేర్చుకుంటున్నారాయన. సెట్లో కూడా అందరితో తెలుగులోనే మాట్లాడుతున్నారట. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ: భవేష్ మండాలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
సెంటిమెంట్స్‌ని ఫాలో అవుతున్న టాలీవుడ్
-
అక్టోబర్‌లో గుర్రం ఎక్కుతాడు
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. తన కెరీర్లో ఇప్పటివరకూ పోషించనటువంటి ఓ కొత్త డైమన్షన్ ఉన్న పాత్రను ఆయన ‘గోపాల గోపాల’ చిత్రంలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపైనే ప్రస్తుతం పవర్‌స్టార్ దృష్టి అంతా. ఆహార్యం, వాచకం, హావభావాలు... ఇలా అన్నీ కృష్ణునికి తగ్గట్టు పెక్యులర్‌గా ఉండేలా చూసుకుంటున్నారాయన. అందుకే... ఓ రెండు నెలల పాటు మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితిలో పవన్‌కల్యాణ్ లేరు. అయితే... మరి ‘గబ్బర్‌సింగ్-2’ పరిస్థితేంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమా అటకెక్కినట్టే అని కొన్ని రూమర్లు కూడా వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే... వాటన్నింటినీ చెక్ పెడుతూ... అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్-2’ను సెట్స్‌కి తీసుకురానున్నారు పవన్‌కల్యాణ్. ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించిన తన వర్క్ త్వరితగతిన పూర్తి చేసి, అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్’ అవతారం ఎత్తనున్నారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పవన్‌కల్యాణే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారమ్. అంటే... రానున్న రోజుల్లో పవర్‌స్టార్‌ని రెండు భిన్నమైన కోణాల్లో అభిమానులు చూడబోతున్నారన్నమాట. -
పవన్ ఎలాంటి మార్పులూ కోరలేదు!
ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌కల్యాణ్ చేస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హిందీలో పరేశ్‌రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఈ క్రేజీ మల్టీస్టారర్‌కి స్క్రిప్టే ప్రధాన బలం’ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే... మీడియాలో మాత్రం ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. పాత్ర పరంగా, తన ఆహార్యం పరంగా దర్శకుడు డాలీకి పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారట. అయితే... తాను సూచించిన మార్పులేమీ డాలీ చేయకపోవడం... పవన్‌కి బాధ కలిగించిందనీ ఏవేవో గాలి వార్తలు వచ్చాయి. సినిమా ప్రారంభమై రోజులు గడుస్తున్నా... మొన్నటి దాకా పవన్ సెట్స్‌కి రాకపోవడానికి కారణం ఇదేనని ఆ గాసిప్ సారాంశం. కానీ, ఈ వార్తలను యూనిట్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పవన్ ఈ సినిమా స్క్రిప్టులో ఎలాంటి మార్పులూ కోరుకోలేదనీ, ‘గోపాల గోపాల’ విషయంలో ఆయన పూర్తి సంతృప్తితో ఉన్నారనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి ఎంత ఉంటుందో పవన్ కల్యాణ్ పాత్ర నిడివి కూడా అంతే ఉంటుందని వారు చెబుతున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి రాసిన డైలాగులను పవన్, తదితరులు బాగా ఆస్వాదిస్తున్నారట. షూటింగ్ మొదలైన తర్వాత కూడా సెట్స్‌కి రావడానికి పవన్ ఇంత టైమ్ తీసుకోవడానికి... దానికి కారణం కేవలం ఆయన వెన్నునొప్పే అని తెలిసింది. కొన్ని రోజులుగా ఆయన వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు. ఈ కారణంగానే... తన మాజీ భార్య రేణూ దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ ఆడియో వేడుకకు కూడా అతిథిగా వెళ్లలేకపోయారు పవన్. వెన్నునొప్పి కాస్త తగ్గడంతో ఇప్పుడు ‘గోపాల గోపాల’ షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారని తెలిసింది. -
కృష్ణాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ !
చెన్నై: విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ గురువారం చెన్నైలో వెల్లడించారు. గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడు కీలక భూమిక పోషిస్తాడని.. ఈ నేపథ్యంలో ఆయన జన్మదినమైన కృష్ణాష్టమి రోజున ఆ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్‌ల డైలాగ్‌లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 25 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో గోపాల గోపాల రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్, పరాష్ రావెల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ రోజున గోపాల గోపాల చిత్రం విడుదలకు సిద్దమతుంది. -
పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే
హైదరాబాద్: తన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం 25 నిముషాలు మాత్రమే కనిపిస్తారని ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తాను పవన్ కల్యాణ్‌కి వీరాభిమానినని చెప్పారు. తాను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ కల్యాణ్ నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్‌పై షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలగా నిర్మిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారని చెప్పారు. గోపాల గోపాల చిత్ర హీరో వెంకటేశ్, పవన్ కల్యాణ్‌ల మధ్య చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన అన్నారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్‌ల డైలాగ్‌లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని వెల్లడించారు. 2015 సంక్రాంతి పండగ నాటికి ఈ గోపాల గోపాల చిత్రం విడుదలవుతుందని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. -
కృష్ణావతారంలోకి కల్యాణ్!
ఈ యుగంలో దేవుడొస్తే, ఆయన ఆహార్యం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడైన రాముడిలానా? లేక మురళిని చేతబూని, వక్షస్థలంపై కౌస్తుభంతో ఆనందరూపుడైన కృష్ణునిలానా? రెండూ కాక చరిత్రకారులు చెబుతున్నట్లు ఖడ్గాన్ని చేబూని, గుర్రంపై కల్కిలానా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. ఏ యుగంలోనైనా అప్పటి ప్రజలకు తగ్గట్టుగానే దేవుని రూపాలున్నాయి. దీన్ని బట్టి దేవుడు ఇప్పుడొస్తే.. మనలో ఒకడిగానే వస్తాడు. మనుషుల్లో మనిషిగా మసలుతాడు. ఆ మాటకొస్తే ట్రెండీగా జీన్స్, టీ షర్ట్ వేసుకొని యువతరానికి ప్రతీకలా కనిపిస్తాడు. పైగా.. ‘నా లేటెస్ట్ గెటప్ ఇదే.. ఫేస్బుక్లో పోస్ట్ చేసుకో’ అంటాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇందులో నిజం లేకపోలేదు. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్రను డిజైన్ చేసింది ఈ రీతిగానే. పవర్‌స్టార్ ‘లేటెస్ట్ గాడ్’ పాత్ర చిత్రానికే హైలైట్ అవుతుందని ఆయన సెట్‌కి రాకముందే యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. స్క్రిప్ట్‌లో ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు అలా ఉంది. మొన్నటివరకూ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడపడం వల్ల పవర్‌స్టార్ కాస్త ఛాయ తగ్గారు. దేవుని పాత్ర అంటే.. తేజస్సు అవసరం. అందుకే.. ‘గోపాల గోపాల’ షూటింగ్ మొదలై రోజులు గడుస్తున్నా.. పవన్ మాత్రం సెట్‌కి రాలేదు. మునుపటి రూపం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, హాండ్సమ్గా తయారయ్యారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే... నేడే పవర్‌స్టార్ ‘గోపాల గోపాల’ సెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి 20 నిమిషాలే ఉంటుందని బయట ప్రచారం జరుగుతోంది. కానీ మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి కంటే.. ‘గోపాల గోపాల’లో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. పైగా ఇందులో వెంకటేశ్, పవన్ మధ్య సాగే సంభాషణలు సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తాయట. దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని మాతృకను మరిపించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వెంకటేశ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల తీశారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్. -
కృష్ణుడిగా కనిపించనున్న పవర్ స్టార్
-
వారసుడొచ్చేస్తున్నాడు!
-
'గోపాలా..గోపాలా..' కి త్రివిక్రమ్ మాటలు రాయడం లేదు!
బాలీవుడ్ విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్' చిత్ర రీమేక్ రూపొందుతున్న గోపాలా.. గోపాలా.. చిత్రం వివాదంలో చిక్కుకుంది. గోపాలా..గోపాలా.. చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే గోపాలా..గోపాలా.. చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించడం లేదని.. మీడియాలో వస్తున్న వార్తలన్ని రూమర్లేనని చిత్రానికి సంబంధించిన కొందరు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కృష్ణం వందే జగద్గురుమ్' ద్వారా సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ సంభాషణల రచయితగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నారనే వార్త కొన్ని వెబ్ సైట్స్, టెలివిజన్ చానెల్స్ లో హల్ చల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని సంభాషణలూ సాయిమాధవ్ పూర్తి చేసి, ఇచ్చేశారని గోపాలా..గోపాలా చిత్రానికి సంబంధించిన వర్గాలు స్పష్టం చేశారు. ఈ సినిమాలో పవన్ పాత్ర 30 నిమిషాలే ఉంటుందని కూడా కొన్ని వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. ఆ వార్త కూడా నిజం కాదట. మాతృకలో అక్షయ్ కుమర్ పోషించిన పాత్రకంటే.. రీమేక్ లో పవన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని సమాచారం. వెంకటేశ్ పాత్రకు సమానంగా పవన్ పాత్ర సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానక్ రామ్ గూడాలో శరవేగంగా జరుగుతోంది. హిందీలో పరేశ్ రావెల్ పోషించిన పాత్రను వెంకటేశ్, అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, హీరోయిన్ గా శ్రీయ సరన్ గోపాలా..గోపాలా.. చిత్రంలో నటిస్తున్నారు. గోపాలా..గోపాలా.. చిత్రంలో వెంకటేశ్ తనయుడు అర్జున్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. చిత్ర నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
'గోపాలా..గోపాలా..'లో దగ్గుబాటి అర్జున్?
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నారనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. హిందీలో విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రం ఆధారంగా రూపొందుతున్న 'గోపాలా.. గోపాలా.. చిత్రంలో వెంకటేశ్ కుమారుడిగా అర్జున్ కనిపించబోతున్నారనే రూమర్ వినిపిస్తోంది. వెంకటేశ్ కుమారుడిగా అర్జున్ ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. కొద్ది నిమిషాల పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రానికి పనిచేస్తున్న బృందంలోని సభ్యులు తెలిపారు. ఓ మై గాడ్ చిత్రంలో పరేశ్ రావెల్ పోషించిన పాత్రను వెంకటేశ్, అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. శ్రీయ సరన్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మరార్, సురేశ్ ప్రోడక్షన్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రానికి కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. -
గోపాల... గోపాల ఓ ప్రయోగం
తెలుగు తెరపై మల్టీస్టారర్ల హవా ఊపందుకుంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, మనం’ చిత్రాల తర్వాత మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవానికి సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో వేదికగా నిలిచింది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ హీరోలుగా కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ‘గోపాల... గోపాల’ చిత్రం షూటింగ్ ఘనంగా హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాతలు డి.రామానాయుడు, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, జెమినీ కిరణ్, శ్యాంప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎన్.వి.ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, శానం నాగ అశోక్‌కుమార్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తెలుగుతెరపై ఇప్పటివరకూ రాని ప్రయోగమిది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ పాత్రలు భిన్నంగా ఉంటాయి. నేటి నుంచి చిత్రీకరణ పూర్తయ్యేంతవరకూ నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. అనూప్ రూబెన్స్ స్వరసారథ్యంలో ఇప్పటికే ఓ పాట రికార్డింగ్ పూర్తయింది. మరోవారంలో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫేం సాయిమాధవ్ బుర్రా మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఓ ప్రత్యేక భూమిక పోషిస్తున్నారు. రంగనాథ్, రాళ్లపల్లి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేశ్ శుక్లా, కథనం: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా,దీపక్ రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వీరేన్ తంబిదొరై, భాస్కరరాజు, అభిరామ్. నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్.