'గోపాల గోపాల'లో పవన్ కల్యాణ్
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తాజా చిత్రం 'గోపాల గోపాల'లో జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే డైలాగులున్నాయి. దైవత్వం నిండిన పాత్రలో పవన్ పేల్చిన మాటల తూటాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పచ్చదళానికి గూబ గుయ్యమనిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని తెలుగు తమ్ముళ్లు మధనపడుతున్నారు. ఈ చిత్రం పొలిటికల్ సెటైర్గా మారిపోయినట్లు కొందరు అంటున్నారు.
పవన్‌కళ్యాణ్ చూపులతో దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే మాటలతో మంట పెట్టాడని సైకిల్ శ్రేణులు లోలోపల గింజుకుంటున్నట్లు సమాచారం. ఈ డైలాగ్స్ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తాయా? మరెవరికి వర్తిస్తాయి? అని సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు ప్రశ్నించారు. పవన్ డైలాగులు టీడీపీ నేతల్లో సెగలు రేపుతున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో పంచ్ ఇస్తోందని పరోక్షంగా చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చారని అంటున్నారు.
* నమ్మించేవాడు నాయకుడు కాదు-నడిపించేవాడు నాయకుడు.
* గెలిచేవాడు నాయకుడు కాదు-గెలిపించేవాడు నాయకుడు.
ఈ డైలాగులు టీడీపీ శ్రేణులను మరీ ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపును ఈ డైలాగ్స్ ప్రశ్నస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పవన్ వల్లే టీడీపీ గెలిచిందని, పవనే లేకపోతే టీడీపీ గెలిచేది కాదనే అర్థంలో డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. కొందరు పవన్ అభిమానులు అదే మాట చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ డైలాగ్స్‌పై టీడీపీ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొకరు ఒక్కోరకంగా స్పందించారు. అతనిని(పవన్) చూసి ఓటేశారనుకోవడం దురదృష్టకరం అని ఓ ప్రేక్షకుడు అన్నారు. పవన్ కల్యాణ్ తన శక్తిని నిరూపించారని, గత ఎన్నికలలో టీడీపిని అధికారంలోకి తీసుకువచ్చారని మరో ప్రేక్షకుడు చెప్పారు. చంద్రబాబు స్వయం కృషి వల్ల అధికారంలోకి వచ్చారని, ఎవరినో చూసి ఆయనకు ఓటువేయవలసిన అవసరంలేదని రాజమండ్రికి చెందిన ఓ ప్రేక్షకురాలు అన్నారు.
మరికొన్ని రాజకీయ డైలాగ్స్:
*కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా
*సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు
* దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని
ఈ డైలాగ్స్ను దృష్టిలోపెట్టుకొని పవన్ అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు విశ్లేషిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీని ముందుండి గెలిపిస్తారంటూ పవన్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. నాయకుడు ఎలా ఉండాలో పేర్కొంటూ పవన్ చెప్పిన డైలాగ్ అతని అంతరార్థాన్ని సూచిస్తోందని అభిమానులే పేర్కొంటున్నారు. తాను నమ్మించి మోసం చేసే వాడిని కాదని, నడిపించి గెలిపించే తత్వం తనదని పవన్ నర్మగర్భంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు.