ఆన్‌లైన్‌లో ‘భజే.. భజే’ గోపాలం!
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘గోపాల... గోపాల’ రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. వెంకటేశ్‌ను అపర అర్జునుడి లాగా, పవన్ కల్యాణ్‌ను అపర శ్రీకృష్ణావతారంగా రథంపై చూపుతున్న స్టిల్ అందుకు తాజా చేరిక. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలోని ‘భజే భజే...’ అనే పండగ గీతాన్ని ‘లహరి మ్యూజిక్’ సంస్థ జనవరి 1వ తేదీ సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ బాణీలో అనంత శ్రీరామ్ సాహిత్యానికి, యువ గాయకుడు హరిచరణ్ గానం చేసిన ఈ పాటను తెర మీద కూడా అందంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల కథనం.
కొన్ని వందల మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాటకు నర్తించిన పవన్ ఈ పాటను ఆస్వాదించడమే కాక, సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా ఫోన్ చేసి, అభినందించారట! మరి, పవన్‌ను అంతగా ఆకట్టుకున్న ఈ పాట రేపు ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి. ఆ లోగా... అధికారికంగా పాటల సీడీని ఆవిష్కరించక ముందే, కీలకమైన పాటల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, ప్రేక్షకులను ఆకర్షించేలా ‘గోపాల గోపాల’ బృందం మార్కెటింగ్ వ్యూహచతురత చూపుతోంది. తాజా కబురు ఏంటంటే... పవన్‌కల్యాణ్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. పవన్ అభిమానులకు కొత్త సంవత్సరంలో నిజంగా తీపి వార్తే!