ఐ ఫీస్ట్‌గా... | Vikram's I to hit screens on January 14 | Sakshi
Sakshi News home page

ఐ ఫీస్ట్‌గా...

Published Tue, Jan 6 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

ఐ ఫీస్ట్‌గా...

ఐ ఫీస్ట్‌గా...

ఎట్టకేలకు ఈ సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ వద్ద పోటీపడే సినిమా పుంజులు ఏమిటన్నది ఒక స్పష్టత వచ్చింది. హిందీ చిత్రం     ‘ఓ మై గాడ్’కు తెలుగు రీమేక్ అయిన మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల... గోపాల’, భారతీయ దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ఐ’ - ఈ రెండూ ఈ పెద్ద పండగకు ప్రేక్షకులను అలరించనున్నాయి. సరిగ్గా పండగ రోజు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శంకర్ దర్శకత్వంలోని ‘ఐ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తున్నామంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మరో పక్క మొన్న ఆదివారమే పాటల విడుదల కార్యక్రమం జరుపుకొన్న ‘గోపాల... గోపాల’ చిత్రం తుది మెరుగులు దిద్దుకొంటూ, సెన్సార్ జరుపుకొనే పనిలో ఉంది. ఆ పనులన్నీ పూర్తి కాగానే, ఈ చిత్రాన్ని పండగ కన్నా ముందే విడుదల చేయాలని శరవేగంతో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాక్సాఫీస్ సమరం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం కాగా, అభిమానులు ఎవరి అంచనాల్లో వారున్నారు.
 
 ఇది ఇలా ఉండగా, ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ మీద దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం. భారీ సెట్లు, గ్రాఫిక్ వర్క్స్ ఉన్న ఈ చిత్రం కోసం ఇంత కష్టపడడం వెనుక కారణాన్ని కూడా దర్శకుడు శంకరే ఇటీవల వివరించారు. ‘‘నేను నా సినిమాలను ఒక దర్శకుడిగానే కాక, ఒక సాధారణ ప్రేక్షకుడిగా కూడా చూస్తుంటా. అందుకే, ఎప్పటికప్పుడు నా కొత్త చిత్రం, నా మునుపటి చిత్రాన్ని అధిగమించాలని భావిస్తుంటా’’ అన్నారాయన. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా ‘రొమాంటిక్ థ్రిల్లర్’ కోవలో ‘ఐ’ సినిమాను ఆయన తీశారు. గతంలో ఆయన ప్రభుదేవాతో ‘ప్రేమికుడు’ (తమిళంలో ‘కాదలన్’) చిత్రం చేసినప్పటికీ అది యువతరం ప్రేమకథా చిత్రం. ఈసారి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే ప్రేమ కథ ఇది.
 
 ‘‘వినోదాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలే రూపొందిస్తానంటూ నా పైన ముద్ర పడింది. కానీ, ఆ ముద్రకు భిన్నమైన చిత్రాలు చేయాలని నేను తపిస్తున్నా. అందులో భాగంగా వస్తున్నదే - ‘ఐ’ చిత్రం’’ అని శంకర్ వివరించారు. అసాధారణమైన వ్యక్తిని కానీ, వార్తను కానీ చూసినప్పుడల్లా అతని వెనుక, లేదంటే ఆ వార్త వెనుక ఉన్న కథేమిటని ఆలోచించే శంకర్ అక్కడ నుంచే తన కథలు పుడతాయని చెబుతుంటారు. మరి, ఈ ‘ఐ’ కథకు స్ఫూర్తి ఏమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఈ కథ ఒక హాలీవుడ్ సినిమాలోని అంశాన్ని తీసుకొని అల్లుకొన్నదనీ, విక్రమ్ చేత వేయించిన భీకరమైన రూపం తాలూకు గెటప్‌కు కూడా అదే స్ఫూర్తి అనీ ఇప్పటికే కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ చిత్రం కోసం హీరో విక్రమ్ మిగిలినవన్నీ పక్కనబెట్టి, పూర్తిగా లీనమైపోయి నటించారట! అందుకే, ఈ దిగ్దర్శకుడు సైతం ‘‘పోషిస్తున్న పాత్ర కోసం విపరీతంగా బరువు పెరగడం, విపరీతంగా బరువు తగ్గడం, కొన్నేళ్ళ తరబడి ఆ పాత్రకే కట్టుబడి ఉండడం లాంటివన్నీ చేసే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి అతి కొద్దిమందిలో తానూ ఒకణ్ణని విక్రమ్ మరోసారి నిరూపించారు’’ అని అభినందనలు కురిపించారు.
 
 కెరీర్ మొదట్లో ‘రేవతి’ అనే పేరుతో నాయికా ప్రధానమైన చిత్రం తీయాలనుకొని, నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బంది పడ్డ శంకర్ ఈసారి ‘ఐ’ చిత్రంలో కథానాయిక పాత్రకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అమీ జాక్సన్ ఆ కీలక పాత్రను పోషిస్తున్నారు. మరి, ట్రైలర్లు చూస్తుంటే, విక్రమ్‌ను ఒకపక్క హీరోగా, అదే సమయంలో మరోపక్క యాంటీ హీరోగా కూడా చూపిస్తూ, కొత్త ప్రయోగం చేస్తున్నారని భావిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో ఇప్పటికే ఒకటి రెండు పాటలూ పదే పదే వినిపిస్తున్నాయి. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వ విలువలు కూడా కలసి, భారీగా రూపొందిన ‘ఐ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సంచలనం సృష్టిస్తుందో తెలుసుకొనేందుకు మరొక్క వారం రోజులు ఆగాలి. ఈలోగా మరిన్ని ‘ఐ’ కబుర్లు మీడియాలో రావడం ఎలాగూ ఖాయం!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement