
పవన్ ఎలాంటి మార్పులూ కోరలేదు!
ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌కల్యాణ్ చేస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హిందీలో పరేశ్‌రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఈ క్రేజీ మల్టీస్టారర్‌కి స్క్రిప్టే ప్రధాన బలం’ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే... మీడియాలో మాత్రం ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి.
పాత్ర పరంగా, తన ఆహార్యం పరంగా దర్శకుడు డాలీకి పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారట. అయితే... తాను సూచించిన మార్పులేమీ డాలీ చేయకపోవడం... పవన్‌కి బాధ కలిగించిందనీ ఏవేవో గాలి వార్తలు వచ్చాయి. సినిమా ప్రారంభమై రోజులు గడుస్తున్నా... మొన్నటి దాకా పవన్ సెట్స్‌కి రాకపోవడానికి కారణం ఇదేనని ఆ గాసిప్ సారాంశం. కానీ, ఈ వార్తలను యూనిట్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి.
పవన్ ఈ సినిమా స్క్రిప్టులో ఎలాంటి మార్పులూ కోరుకోలేదనీ, ‘గోపాల గోపాల’ విషయంలో ఆయన పూర్తి సంతృప్తితో ఉన్నారనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి ఎంత ఉంటుందో పవన్ కల్యాణ్ పాత్ర నిడివి కూడా అంతే ఉంటుందని వారు చెబుతున్నారు.
సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి రాసిన డైలాగులను పవన్, తదితరులు బాగా ఆస్వాదిస్తున్నారట. షూటింగ్ మొదలైన తర్వాత కూడా సెట్స్‌కి రావడానికి పవన్ ఇంత టైమ్ తీసుకోవడానికి... దానికి కారణం కేవలం ఆయన వెన్నునొప్పే అని తెలిసింది. కొన్ని రోజులుగా ఆయన వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు.
ఈ కారణంగానే... తన మాజీ భార్య రేణూ దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ ఆడియో వేడుకకు కూడా అతిథిగా వెళ్లలేకపోయారు పవన్. వెన్నునొప్పి కాస్త తగ్గడంతో ఇప్పుడు ‘గోపాల గోపాల’ షూటింగ్‌లో హుషారుగా పాల్గొంటున్నారని తెలిసింది.